కొణిదెల ఉపాసన: అమ్మాయిల పెళ్లి, పిల్లలు, కెరీర్ విషయంలో ఈమె చేసిన వ్యాఖ్యలపై చర్చ ఏంటి ?

కొణిదెల ఉపాసన, రామ్ చరణ్ భార్య, అపోలో, సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Facebook/ Upasana Konidela

ఫొటో క్యాప్షన్, 2012లో పెళ్లి చేసుకున్న రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది. త్వరలో కవల పిల్లలకు జన్మనిస్తున్నట్లు ఉపాసన తెలిపారు.
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"సామాజిక ఒత్తిడికి లొంగకుండా, ఒక స్త్రీ ప్రేమ వివాహం చేసుకోవడం తప్పా? సరైన భాగస్వామి దొరికే వరకు ఆమె వేచి ఉండటం తప్పా? పరిస్థితుల ఆధారంగా పిల్లలను ఎప్పుడు కనాలి అని ఆమె ఎంచుకోవడం తప్పా?

పెళ్లి లేదా త్వరగా పిల్లలను కనడం గురించి మాత్రమే ఆలోచించకుండా, ఒక స్త్రీ తన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, తన కెరీర్‌పై దృష్టి పెట్టడం తప్పా?"

ఇవీ అపోలో సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన తనను విమర్శిస్తున్న వారికి సంధించిన ప్రశ్నలు.

మహిళలు, కెరీర్, పెళ్లి, ఎగ్స్ ఫ్రీజింగ్‌ (అండాలను భద్రపరచుకోవడం)పై ఉపాసన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఆమె స్పందించారు.

ఇంతకీ, ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలేంటి? మహిళలు, పెళ్లి పై ఆమె అభిప్రాయాలేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొణిదెల ఉపాసన, రామ్ చరణ్ భార్య, అపోలో, సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Facebook/ Upasana Konidela

ఫొటో క్యాప్షన్, మహిళలు కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని అర్థమవుతోందని, ఇది 'కొత్త ప్రగతిశీల భారతదేశం' అని ఉపాసన అభిప్రాయపడ్డారు.

ఐఐటీ విద్యార్థులతో ఉపాసన

హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. ఈ క్రమంలో యువతలో పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు చెబుతూ, ఆమె ఎక్స్‌ లో ఒక పోస్టు పెట్టారు.

'ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు?' అని ఐఐటీ విద్యార్థులను ప్రశ్నించగా, చేతులెత్తిన వారిలో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారని, అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారని ఉపాసన చెప్పారు.

దీన్నిబట్టి మహిళలు కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని అర్థమవుతోందని, ఇది 'కొత్త ప్రగతిశీల భారతదేశం' అంటూ ఉపాసన అభివర్ణించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్టు చేశారామె.

వీడియోలో ఉపాసన మాట్లాడుతూ "మహిళలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ ఏంటంటే అండాలను భద్రపరచుకోవడం. ఎందుకంటే, అప్పుడు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పిల్లల్ని కనాలనేది ఎంచుకోవచ్చు. మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాంతంత్య్రం ఉంటుందో అప్పుడు నిర్ణయించుకోవచ్చు. ఈరోజు నేను నా సొంత కాళ్లపై నిలబడ్డాను. నేను నా కోసం జీవిస్తున్నాను. ఈ ఆర్థిక భద్రతే నాలో ఆత్మవిశ్వాసం నింపింది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా తోడ్పడింది'' అని ఆమె అన్నారు.

"30 ఏళ్లు వచ్చేసరికి మీ లక్ష్యాలతో సిద్ధంగా ఉండండి. మీ కెరీర్ మార్గాన్ని ఎంచుకోండి. మీ జీవితంలో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రిలేషన్‌షిప్ పరంగా ఎంత సంపాదించుకోవాలనేది ముందే ఊహించుకోండి. మీరు మీ గోల్, విజన్ విషయంలో స్పష్టంగా ఉంటే మిమ్మల్నెవరూ ఆపలేరు'' అని ఆమె విద్యార్థులతో అన్నారు.

నాణ్యమైన అండాలను నిల్వ ఉంచుకోవడానికి సహాయపడేదే 'ఎగ్ ఫ్రీజింగ్' ప్రక్రియ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీజ్ చేసిన అండాలను ఉపయోగించి గర్భం దాల్చవచ్చు.

అయితే, ఉపాసన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆమె పోస్టును ట్యాగ్ చేస్తూ పలువురు నెటిజన్లు స్పందించారు.

జోహో వ్యవస్థాపకులు శ్రీధర్, సోషల్ మీడియా, ఉపాసన కొణిదెల

ఫొటో సోర్స్, X/svembu

ఫొటో క్యాప్షన్, జోహో సహవ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు

విధిని నిర్వర్తించాల్సిందే: జోహో వ్యవస్థాపకులు శ్రీధర్

ఉపాసన పోస్టుపై జోహో సహ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఎక్స్ పోస్టులో స్పందించారు.

''నేను కలిసే యువ పారిశ్రామికవేత్తలకు అబ్బాయిలైనా, అమ్మాయిలైనా 20లలో పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని సలహా ఇస్తాను. వాయిదా వేయొద్దని చెబుతాను. వారు సమాజం, తమ పూర్వీకుల కోసం ఈ (జనాభా) విధిని నిర్వర్తించాల్సిందే. ఇవన్నీ కొంచెం పాతకాలపు మాటల్లా అనిపించవచ్చు. కానీ, ఇవి మళ్లీ ప్రజలలో ప్రతిధ్వనిస్తాయని నమ్ముతున్నాను'' అని శ్రీధర్ చెప్పారు.

అయితే, శ్రీధర్ పోస్టుపై కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు.

మహిళ, కెరీర్, ఎగ్స్ ఫ్రీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సంతానం అన్నది స్త్రీ ఒంటరిగా మోసే భారం కాదు: జర్నలిస్ట్ వసుధ

ఎన్డీటీవీ జర్నలిస్ట్ వసుధ వేణుగోపాల్ ఉపాసనకు మద్దతుగా స్పందించారు. ఆమె పోస్టును రీట్వీట్ చేశారు. మహిళల పెళ్లి, కెరీర్ గురించి తన అభిప్రాయాలను ఒక పోస్టులో పంచుకున్నారు వసుధ.

''మహిళల్లారా, మీకు సరైన సమయం అనిపించినప్పుడు వివాహం చేసుకోండి. ప్రపంచం, సమాజం లేదా మరెవరైనా మిమ్మల్ని అందులోకి నెట్టివేస్తున్నారని చేసుకోవద్దు. మీ కెరీర్ ముఖ్యం. ఆర్థిక స్వాతంత్ర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీకు నిజమైన ఆప్షన్లను ఇస్తుంది. జీవితాన్ని చాలా మెరుగుపరుస్తుంది. గుర్తుంచుకోండి, జనాభా అనేది మీరు మాత్రమే మోయాల్సిన భారం కాదు'' అని ఆమె అన్నారు.

మహిళాసాధికారత విషయంలో ఉపాసన అభిప్రాయాలను తప్పుగా అర్థం చేసుకున్నారని రచయిత శ్రీధర్ బెవరా కూడా అభిప్రాయపడ్డారు.

''మహిళలు తమకు ఏది సరైందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చే మార్గాలను ఎంచుకోవాలని, వారికి సాధికారత కల్పించే వాటిని స్వీకరించాలని ప్రోత్సహించడమే అక్కడ ఉపాసన ప్రాధాన్యత'' అని ఆయన 'ఎక్స్‌' పోస్టులో తెలిపారు.

వివాహం, కెరీర్; మహిళలు, కొణిదెల ఉపాసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'వివాహం మీ కెరీర్‌ను ఆపదు'

పెళ్లి అనేది కెరీర్‌ను ఆపబోదని 'డాక్టర్ గుంజన్ దేశ్‌పాండే' అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

'ఎక్స్' అకౌంట్ ప్రొఫైల్‌లో నేత్రవైద్యురాలిగా చెప్పుకున్న గుంజన్, ఉపాసన పోస్టుకు స్పందిస్తూ "నాకు 23 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. 27 ఏళ్ల వయసులో రెసిడెన్సీ పూర్తి చేశాను. 28 ఏళ్ల వయసులో నా మొదటి బిడ్డకు జన్మనిచ్చా. 29 ఏళ్ల వయసులో ఆలిండియా కొలీజియం ఆఫ్ ఆప్తాల్మాలజీ (గ్లాకోమా) ఫెలోషిప్ పూర్తి చేశాను. 30 ఏళ్ల వయసులో నా రెండవ బిడ్డకు జన్మనిచ్చాను. 33 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ ఫెలోషిప్ పూర్తి చేశాను. 36 ఏళ్ల వయసులో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో చేరాను. వివాహం మీ కెరీర్‌ను ఆపదు'' అని చెప్పారు.

ఉపాసన అభిప్రాయంతో విభేదిస్తున్నట్లు 'డాక్టర్ సునీత సాయమ్మ' పేరుతో ఎక్స్ అకౌంట్‌ ఉన్న మరో యూజర్ చెప్పారు.

''స్త్రీలకు అండాలను భద్రపరచుకోవడం అనేది ఇన్సూరెన్స్ కాదు. స్త్రీ అలా భద్రపరిచినప్పటికీ, ఇది విజయవంతమైన పిండంగా మారుతుందని, విజయవంతమైన గర్భధారణ జరుగుతుందనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు'' అని అభిప్రాయపడ్డారు.

''కెరీర్ కోసం వ్యక్తిగత సంబంధాలను హోల్డ్‌లో ఉంచకూడదు. కెరీర్‌లో ముందుకు సాగడానికి జీవితమంతా ఉంది. మాతృత్వాన్ని అనుభవించడానికి పరిమిత సమయం మాత్రమే ఉంటుంది'' అని సునీత సాయమ్మ చెప్పారు.

సోషల్ మీడియాలో ఇలా భిన్నాభిప్రాయాలు రావడంతో ఉపాసన బదులిస్తూ, మరో పోస్టు పెట్టారు.

కొణిదెల ఉపాసన, రామ్ చరణ్ భార్య, అపోలో, సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Facebook/ Upasana Konidela

ఫొటో క్యాప్షన్, మహిళలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకువచ్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని ఉపాసన అన్నారు.

'అది నా హక్కు'

"నా పోస్టుపై ఆరోగ్యకర చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నా. స్పందించిన వారికి థ్యాంక్స్" అంటూ ఉపాసన పలు ప్రశ్నలు సంధించారు.

'ఫ్యాక్ట్ చెక్' పేరిట తన వివాహం, సంతానానికి సంబంధించిన ప్రణాళికలను ఆమె వెల్లడించారు.

"సరైన భాగస్వామి ఎదురయ్యే వరకూ అమ్మాయి వేచి చూడటం తప్పా?', 'పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా? స్త్రీ తన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, తన కెరీర్‌పై దృష్టి పెట్టడం తప్పా?" అంటూ నెటిజన్లకు పలు ప్రశ్నలు వేశారు ఉపాసన.

"27 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నా. వ్యక్తిగత, ఆరోగ్య కారణాల వల్ల 29 ఏళ్ల వయసులో నా ఎగ్స్ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నా. 36వ ఏట ఓ బిడ్డకు జన్మనిచ్చా. ప్రస్తుతం నాకు 39 సంవత్సరాలు, త్వరలో కవలలకు జన్మనివ్వబోతున్నా. వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యమిచ్చానో కెరీర్ నిర్మాణానికి అంతే ఇచ్చాను. నా దృష్టిలో పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. కానీ, అవి ఎప్పుడు జరగాలో నిర్ణయించుకున్నా. అది నాకు ప్రత్యేకంగా లభించిన హక్కు (ప్రివిలెజ్) కాదు.. నా హక్కు" అని చెప్పారు.

మరింతమంది మహిళలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకువచ్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని ఉపాసన పిలుపునిచ్చారు.

ఎగ్ ఫ్రీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ ఎగ్ ఫ్రీజింగ్?

నాణ్యమైన అండాలను నిల్వ ఉంచుకోవడానికి సహాయపడేదే 'ఎగ్ ఫ్రీజింగ్' ప్రక్రియ.

ఎగ్ ఫ్రీజింగ్ కోసం, రుతుస్రావం అయిన మొదటి రోజు నుంచి మహిళకు కొన్ని ఇంజెక్షన్లు ఇస్తారు. వేర్వేరు ఇంజెక్షన్లు పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు కొనసాగుతాయి. దీనివల్ల పది నుంచి పదిహేను అండాలు వృద్ధి చెందుతాయని అంచనా. అయితే, ఇది ఒక్కొక్క మహిళలో ఒక్కోలా ఉండవచ్చు. అండాలు తగినంత పరిపక్వం చెందాక, మరొక ఇంజెక్షన్ ఇస్తారు.

సరిగా ముప్పై అయిదు గంటల తరువాత, ఈ అండాలను సోనోగ్రఫీ సహాయంతో బయటకు తీసి, మైక్రోస్కోప్ క్రింద పరీక్షించి, ఆపై ఫ్రీజ్ చేస్తారు.

ఈ ఘనీభవించిన అండాలు చాలా కాలం నిల్వ ఉంటాయి. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు, వాటి చుట్టూ ఉన్న ఐసును కరిగించి, స్పెర్మ్‌తో కలిపితే పిండం ఏర్పడుతుంది.

''కెరీర్ లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యంగా గర్భధారణను కోరుకునేవారు అండాలను ఫ్రీజ్ చేయవచ్చు. దీనివల్ల అండాల సంఖ్య, నాణ్యత పడిపోకుండా కాపాడుకోవచ్చు'' అని డాక్టర్ శిల్పా చిట్నీస్-జోషి గతంలో బీబీసీతో చెప్పారు.

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీజ్ చేసిన అండాలను ఉపయోగించి గర్భం దాల్చవచ్చు.

ఇదే కాకుండా, పిండాన్ని కూడా ఫ్రీజ్ చేయవచ్చు. దీన్ని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు.

ఎగ్ ఫ్రీజింగ్ ఖరీదైన వ్యవహారమే. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. దీనికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది కచ్చితంగా పాటించాలి.

ఎగ్ ఫ్రీజింగ్ చేసే ముందు భాగస్వాముల అంగీకారమే కాకుండా, ఆ మహిళ తల్లిదండ్రుల అంగీకారం కూడా కావాలి. ఈ ప్రక్రియపై వారికి పూర్తి అవగాహన కల్పించాలి.

గర్భధారణకు స్త్రీ వయసు చాలా ముఖ్యం. ఆలస్యం అవుతుందనుకుంటే, 'యాంటీ-ములేరియన్ హార్మోన్' (ఏఎంహెచ్) పరీక్ష చేయించుకుని, ఎగ్ ఫ్రీజింగ్ లేదా ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు.

గర్భం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

లేటు వయసులో గర్భం దాలిస్తే సమస్యలొస్తాయా?

కొంత వయసు దాటాక స్త్రీలు బిడ్డలను కనడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్ శైలజ చందు గతంలో బీబీసీతో చెప్పారు.

35- 40 సంవత్సరాలు దాటిన మహిళలు గర్భం దాల్చినపుడు.. తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశముందన్నారు.

గర్భం దాల్చబోయే ముందు, గర్భంతో ఉన్నపుడు, కాన్పు సమయంలో.. ఇలా ప్రతి దశలోనూ సమస్యలు తలెత్తుతాయని చెప్పారామె.

అంతే కాకుండా, వయసు పెరిగే కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుంటాయి కనుక, కృతిమ పద్ధతుల వైపు దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపారు డాక్టర్ శైలజ.

అయితే, కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలతో పోలిస్తే, వయసు మీరిన మహిళలు గర్భం దాల్చినపుడు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఆమె చెప్పారు.

'' తల్లి వయసు పెరిగే కొద్దీ క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ ఉన్న బిడ్డను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాతికేళ్ల యువతి గర్భం దాల్చితే ఆ ప్రమాదం 1,250 మందిలో ఒకరికి ఉంటుంది. అదే 40 ఏళ్ల మహిళ గర్భం దాల్చితే ఆ రిస్క్ 100 మందిలో ఒకరికి ఉంటుంది. అంటే 1,250 మంది పాతికేళ్ల యువతుల్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్‌ ఉన్న బిడ్డ కలిగే అవకాశం వుంటే, నలభై యేళ్లు దాటిన 100 మంది స్త్రీలలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ బిడ్డ పుట్టే అవకాశముంది'' అని డాక్టర్ శైలజా చందు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)