ఆంధ్రప్రదేశ్: ఉప్పాడ వద్ద అలలు పెద్ద ఎత్తున ఎందుకు ఎగసి పడతాయి, అక్కడ తీరం కోతకు గురవడానికి కారణమేంటి?

ఉప్పాడ తీరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, సముద్ర తీరం కోతకు గురవ్వడంతో దెబ్బతిన్న ఇళ్లు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

తుపాన్లు వస్తే కొన్నిచోట్ల ఊరులోకి, ఇళ్లలోకి నీరు చేరుతుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడలో మాత్రం ఇళ్లే సముద్రంలోకి చేరుతాయి. ఈ విషయాన్ని పలు పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇటీవల వచ్చిన మొంథా తుపాను ధాటికి కూడా ఉప్పాడలోని కొన్ని ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి.

1989 నుంచి 2018 వరకు ఉప్పాడ తీరం ఏటా సగటున 1.23 మీటర్ల చొప్పున కోతకు గురవుతూ వచ్చింది. ఫలితంగా 126.7 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని 2019లో ఇంటర్నేషనల్ జియోసింథటిక్స్ సొసైటీ ప్రచురించిన షోర్‌లైన్ ఎవల్యూషన్ ఎలాంగ్ ఉప్పాడ కోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (Shoreline Evolution along Uppada Coast in Andhra Pradesh అనే పరిశోధన పత్రంలో పేర్కొంది. దీనిని ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సమర్పించింది.

ఏపీలో 1053 కిలోమీటర్ల (కొత్తగా జరిగిన రీ వెరిఫికేషన్ ప్రకారం) పొడవైన తీరప్రాంతం ఉండగా... ఉప్పాడ తీరమే తరచూ ఎందుకు కోతకు గురవుతోంది?

ఒక్కో తుపానుకి కొన్ని ఇళ్ల చొప్పున సముద్రం లాక్కుపోతుంటే... స్థానికులేమంటున్నారు?

కోతకు కారణాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు? చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఉప్పాడ రోడ్డుపైకి ఎగసిపడుతున్న అలలు

ఉప్పాడ ఎక్కడుంది? ఎలా ఉంటుంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ ఉంది. ఇదొక మత్స్యకార గ్రామం. ఈ గ్రామం కాకినాడ జిల్లా కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్లు, కాకినాడ పోర్టుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

బంగాళాఖాతం తీరప్రాంత గ్రామమైన ఉప్పాడ ఓ మేజర్ పంచాయతీ.

ఉప్పాడ అంటే.. మత్స్యకారులతో పాటు అందమైన జాంధానీ చీరలు, చేనేత వృత్తి నైపుణ్యం, ఎగసిపడే అలలతో సముద్ర తీరం గుర్తుకొస్తాయి. ప్రస్తుతం ఉప్పాడ గురించి చెప్పేందుకు ఎన్ని విశేషాలున్నా... భవిష్యత్తులో ఈ ఊరే ఉండదనే ఆందోళన స్థానికుల్లో నెలకొని ఉంది.

వర్షాలు, తుపాన్లు వచ్చిన ప్రతిసారీ సముద్రం గ్రామంలోకి చొచ్చుకురావడం, కొన్ని ఇళ్లను తనతో పాటు తీసుకుపోవడం జరుగుతూనే ఉంది. రెండు, మూడు దశాబ్దాలుగా ఉప్పాడలోని వందల ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయని స్థానికులు చెబుతున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, 12వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. 3,190 ఇళ్లుండేవి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. కానీ, ఈ ఒకటిన్నర దశాబ్ద కాలంలో చాలా ఇళ్లు, కొన్ని హెక్టార్ల భూమి సముద్రంలో కలిసిపోయింది.

ఇక మా వంతే.. ఉప్పాడ వాసులు

2023లో బీబీసీ ఆ గ్రామానికి వెళ్లినప్పటికి... 2025 మొంథా తుపాను సమయంలో వెళ్లినప్పటికీ చూస్తే ఉప్పాడ గ్రామం పరిమాణం తగ్గిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

అప్పట్లో కనిపించిన ఇళ్లు ఇప్పుడు తీరంలో కనిపించలేదు. మరికొన్ని ఇళ్లు సగం కొట్టుకుపోయాయి. మరో తుపాను వస్తే పూర్తిగా కొట్టుకుపోయేట్లుగా ఉన్నాయి.

అయితే, తీరానికి 10 నుంచి 20 మీటర్ల దూరంలోని ఇళ్లలో నివాసం ఉంటున్న మత్స్యకార కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. మరో తుపాను వస్తే తమ ఇళ్లు ఏమవుతాయోనన్న ఆందోళనలో ఉన్నారు.

"ఇప్పుడు ఏ తుపాను వచ్చినా, వర్షం వచ్చినా సముద్రంలో కలిసిపోయేది మా ఇళ్లే. ఈ సారి మా వంతే" అని కోతకు గురైన తీరానికి 20 మీటర్ల దూరంలో నివాసముంటున్న కృష్ణ, దుర్గ బీబీసీతో చెప్పారు.

"ఆ తీరానికి గట్టుకట్టి మమ్మల్ని కాపాడండి" అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

పెద్ద పెద్ద అలలు వచ్చి తాకుతుండడంతో ఎప్పుడు తమ ఇళ్లు కూలిపోతాయోనని స్థానికులు నిత్యం భయపడుతూ బతుకుతున్నారు.

"ఈ ఇల్లు వదిలి పెట్టి మరో ఇంటికి మారాలంటే కనీసం రూ. 5 వేలు అద్దె కట్టాలి. అది మా వల్ల అయ్యే పనికాదు. అందుకే ఈ ఇంట్లోనే ఉంటున్నాం'' అని అక్కడ నివసిస్తున్న మత్స్యకారుడు ప్రసాద్ బీబీసీతో అన్నారు.

 కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, సముద్రంలో కలిసిపోయిన ఇల్లు

ఉప్పాడ కోతకు కారణమేంటి?

ఏపీలో 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉండగా... ఉప్పాడ తీరమే తరచూ ఎందుకు కోతకు గురవుతోంది?

ఈ అంశంపై ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్లు కె.సత్యనారాయణ రెడ్డి, ఏ.యుగంధరరావులతో బీబీసీ మాట్లాడింది.

ఉప్పాడ తీరం తరచూ కోతకు గురవ్వడానికి కాకినాడ తీరం సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్ ప్రధాన కారణమని జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.సత్యనారాయణ రెడ్డి బీబీసీతో చెప్పారు.

"సముద్రం మధ్యలో ఏర్పడే ఇసుక దిబ్బను బ్యారియర్ స్పిట్ అంటారు. దీనినే మనం హోప్ ఐలాండ్ అంటున్నాం. ఈ ఐలాండ్ వద్దకు వచ్చే అలలు ఒక చోట చేరి... బలంగా ఉప్పాడ తీరాన్ని ఢీ కొడుతుండటంతో ఉప్పాడ ఎక్కువగా కోతకు గురవుతోంది. సహజంగానైనా, కృతిమంగానైనా తీరానికి చేరుకునే అలలను డిస్టర్బ్ చేస్తే అవి తీరాల కోతకు కారణమవుతాయి" అని ప్రొఫెసర్ కె. సత్యనారాయణ రెడ్డి అన్నారు.

 కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్

ఏమిటీ హోప్ ఐలాండ్?

కాకినాడ పోర్టుకి సహజ రక్షణ కవచంగా ఉండే హోప్ ఐలాండ్ ఉప్పాడ కోతకు ఎలా కారణమవుతుందో తెలుసుకోవాలంటే హోప్ ఐలాండ్ ఏర్పాటు నుంచి తెలుసుకోవాలి.

ఉప్పాడ తీరానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్ వలన ఉప్పాడ తీరం ఎందుకు కోతకు గురవుతుందో జియాలజీ ప్రొఫెసర్ ఎ. యుగంధరరావు వివరించారు.

"కాకినాడ హోప్ ఐలాండ్ అంటే.. గోదావరి నది తీసుకొచ్చే ఇసుక, మట్టి సముద్రంలో నెమ్మదిగా పేరుకుపోయి సహజంగా ఏర్పడిన ఒక శాండ్-బార్. గోదావరి నుంచి వచ్చే భారీ పరిమాణంలో ఇసుక, మట్టి (సిల్ట్) ప్రవాహాలు అలల దిశను అనుసరించి ఒక పక్కకే చేరతాయి.

ఈ ప్రక్రియ కొన్ని శతాబ్దాల పాటు క్రమంగా జరుగుతూ ఆ ఇసుక, మట్టి ఎత్తు పెరుగుతూ పెరుగుతూ చివరకు ఒక పొడవైన, వంపుగా ఉన్న ద్వీపంగా మారాయి.

ఇది పూర్తిగా నది తీసుకెళ్లే సెడిమెంట్ (మట్టి, ఇసుక, చిన్న రాళ్లు, చెట్ల అవశేషాలు) తో సముద్ర అలల పరస్పర చర్య వల్ల ఏర్పడిన సహజ నిర్మాణం" అని ఆయన చెప్పారు.

 కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఉప్పాడ తీరం

ఈ ఐలాండ్ కాకినాడ వద్దే ఎందుకు ఏర్పడింది?

హోప్ ఐలాండ్ కాకినాడ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే పడవపై అరగంట నుంచి 45 నిముషాల సమయం పడుతుంది.

హోప్ ఐలాండ్ కాకినాడకు సమీపంలోనే ఎందుకు ఏర్పడిందో జియాలజీ ప్రొఫెసర్ యుగంధర్ రావు వివరించే ప్రయత్నం చేశారు.

"ఈ హోప్ ఐలాండ్ ఏర్పాడేందుకు కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న అలల దిశ, సముద్ర ప్రవాహాల స్వభావం, గోదావరి నది నుంచి వచ్చే సెడిమెంట్ పరిమాణం కారణమయ్యాయి.

ఈ తీరప్రాంతంలో అలలు ఎక్కువగా నైరుతి దిశ నుంచి వచ్చి సెడిమెంట్‌ని ఒక కోణంలో తోసుకుంటూ వస్తాయి. ఆ సెడిమెంట్‌కు ఆసరాగా లేదా దానిని అడ్డుకుని నిలిచే ప్రదేశం కాకినాడ తీరం.

గోదావరి నది ప్రతి ఏటా లక్షల టన్నుల ఇసుక, మట్టి సముద్రంలోకి తీసుకొస్తుంటుంది. ఆ సెడిమెంట్ అలల దిశతో కలిసి కాకినాడ తీరం వైపు వస్తుంది. కానీ, అది తీరానికి చేరే 8 కి.మీ ముందుగానే ప్రవాహ వేగం తగ్గే "సెడిమెంట్ స్టేబుల్ పాయింట్" ఉంటుంది.

ఎక్కడైతే నీటి లోతు, అలల కోణం, ప్రవాహ వేగం, పీడనం తక్కువగా ఉండే స్థలం ఉంటే అదే స్టేబుల్ పాయింట్. హోప్ ఐలాండ్ స్థానం సరిగ్గా అలాంటిదే. దాంతో అక్కడ ఇసుక క్రమంగా పేరుకుపోయి...పెద్ద ఇసుక దిబ్బగా మారి... ఆపై చిన్న ద్వీపంగా ఏర్పడింది."

 కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఉప్పాడ రోడ్డు పరిస్థితి

ఉప్పాడ కోతకి ఎలా కారణం?

కాకినాడ తీరం హోప్ ఐలాండ్ కి 8 కిలోమీటర్లు దూరంగా ఉన్నట్లే...హోప్ ఐలాండ్ ఉప్పాడకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్ ఉప్పాడని ఎలా కోతకి గురిచేస్తోంది?

"సముద్రంలో కాకినాడ తీరానికి చేరాల్సిన అలలను హోప్ ఐలాండ్ అడ్డుకుని.. వాటి దిశని మార్చేస్తుంది. అలా దిశమారిన అలలు ఒక దానితో ఒకటి కలుస్తూ... బలంగా మారతాయి.

దీనినే కన్వర్జెన్స్ అంటారు. ఇలా కన్వర్జ్ అయిన అలలు సముద్రపు లోతు తక్కువగా ఉండి వంగినట్లు ఉండే ప్రాంతాలవైపు వెళ్తాయి.

అలాంటి ప్రాంతమే ఉప్పాడ. దాంతో కాస్త వంపుగా, ఓపెన్‌గా ఉండే ఉప్పాడ తీరమే అలలకు.. సహజంగా అందుబాటులో ఉన్న మొదటి ప్రదేశం.

హోప్ ఐలాండ్‌ని తాకిన అలల శక్తి రెట్టింపై ఉప్పాడ తీరాన్ని తాకడంతో.. ఉప్పాడ ఎక్కువ కోతకు గురి అవుతోంది" అని యుగంధర్ రావు తెలిపారు.

అదే సమయంలో అలలతో పాటు వచ్చే ఇసుక హోప్ ఐలాండ్ వద్ద బ్లాక్ అయిపోయి, ఉప్పాడకి చేరాల్సిన ఇసుక సరఫరా తగ్గుతుంది.

"ఉప్పాడ తీరం వైపు తగినంత ఇసుక సరఫరా ఉండదు. అంటే కోతకు గురై ఇసుక సముద్రంలోకి జారిపోతుంది కానీ.. కొత్త ఇసుకతో రికవరీ జరగడం లేదు.

అందుకే, అక్కడ భూమి వేగంగా సముద్రంలో కలిసిపోతోంది" అని ఆయన చెబుతున్నారు.

 కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్

ఈ కోతని ఆపే మార్గం ఉందా?

సముద్రపు కోతని ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆపలేమని, అయితే దానిని తగ్గించే మార్గాలు ఉన్నాయని ప్రొఫెసర్ కె. సత్యనారాయణ రెడ్డి చెప్పారు.

"బ్రేక్‌వాటర్లు, గ్రోయిన్లు, సీ వాల్స్ వంటి ఇంజినీరింగ్ నిర్మాణాలతో పాటు తరచూ తీరంలో ఇసుక నింపడం వంటివి చేయాలి. మానవ జోక్యం లేకుండా సెడిమెంట్ ప్రవాహాలు తిరిగి సహజ మార్గంలో చేరే పద్దతులు పాటించాలి.

ఉప్పాడ తీరప్రాంత కోతని ఆపేందుకు ప్రయత్నాలు చేయకపోతే... భవిష్యత్తులో ఈ కోత భారీగా పెరిగే అవకాశముంది. అలాగే తీర ప్రాంతాల్లో నిర్మాణాలు కొంత తగ్గించాలి" అని ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)