కల్మేగీ తుపాను: ఫిలిప్పీన్స్ అతలాకుతలం,114మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
పిలిప్పీన్స్‌ను అతాలకుతలం చేసి, 114మంది ప్రాణాలు తీసి, మధ్య వియత్నాం వైపు దూసుకుపోయిన కల్మేగీ తుపాను తీరాన్ని తాకింది.
వియత్నాం ఆన్‌లైన్ పత్రిక విఎన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం కల్మేగీ తుపాను తీరాన్ని తాకింది. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది.
పెనుగాలుల ధాటికి ప్రధాన రహదారులపై చెట్లు పడిపోయాయి. క్వై నాన్ ప్రాంతంలోని హోటళ్లలో కిటికీలు పగిలిపోయాయి.
"తుపాను డాక్ లాక్ గియా లై ప్రావిన్సులలో తీరాన్ని తాకింది" అని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పెనుగాలుల వీస్తుండంటంతో తీరప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. తుపాను ప్రభావంతో సముద్రపు అలలు 8మీటర్లు (26 అడుగులు) ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని వియత్నాం వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది సంభవించిన తుపాన్లలో కల్మేగీ చాలా తీవ్రమైనది. ఇప్పటికే గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న దేశానికి ఈ తుపాను మరింత నష్టం తీసుకువచ్చే ప్రమాదం ఏర్పడింది.
తుపాను ప్రభావంతో 6 విమానాశ్రాయలలో కార్యకలాపాలు నిలిపివేశారు.
వియత్నాం ఉప ప్రధానమంత్రి ట్రాన్ హాంగ్ హా ఈ తుపానును "అసాధారణమైనది"గా పేర్కొన్నారు. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


ఫొటో సోర్స్, EPA/Shutterstock
జాతీయ విపత్తు
ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని 'జాతీయ విపత్తుగా' ప్రకటించారు. దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గురువారం ఈ ప్రకటన చేశారు.'' ఈ స్థాయి నష్టం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితికి సంకేతం" అని తెలిపారు.
తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సెబూ దీవిలో 71 మంది మృతి చెందారు. మరో 127 మంది గల్లంతయ్యారు. 82 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. అయితే జాతీయ పౌర రక్షణ కార్యాలయం విడుదల చేసిన మృతుల జాబితాలో మరో 28 మరణాలను పేర్కొనలేదని ప్రావిన్షియల్ అధికారులు తెలిపారని ఏఎఫ్‌పీ తెలిపింది.
అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, కల్మేగి తుపాను వల్ల ఇప్పటికే సంభవించిన నష్టానికి తోడు ఈ వారాంతంలో దేశాన్ని తాకుతుందని భావించే మరొక తుపాన్ ఉవాన్ ను అంచనా వేసి ఈ జాతీయ విపత్తు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'జాతీయ విపత్తు' అంటే ప్రభావిత ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం, జీవనోపాధి వ్యవస్థలు దెబ్బతినడం, ప్రజల సాధారణ జీవనానికి అంతరాయం ఏర్పడిన పరిస్థితి అని ఫిలిప్పీన్స్ అధికారులు వివరించారు.
ఈ ప్రకటనతో ప్రభుత్వ సంస్థలకు అత్యవసర నిధులను వినియోగించే అధికారం లభిస్తుంది. అవసరమైన సరుకులు, సేవలను వేగంగా కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది.
తుపాను కారణంగా ఫిలిప్పీన్స్‌లో ఎక్కువ మంది నీటిలో మునిగిపోవడం వల్ల మృతి చెందారని నివేదికలు వెల్లడించాయి. బురదతో కూడిన నీటి ప్రవాహాలు కొండచరియల నుండి పట్టణాలపైకి దూసుకెళ్లి, పట్టణాలు, గ్రామాలను ముంచేశాయి.
సెబూ దీవిలోని నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక చిన్న భవనాలు కొట్టుకుపోయాయి. వరద నీరు తగ్గిన తరువాత చూస్తే ఇళ్లు మొత్తం బురదలో కూరుకుపోయి కనిపిస్తున్నాయి. స్థానిక అధికారులు ఈ విధ్వంసాన్ని ''ఊహాతీత ఉత్పాతం'' అని పేర్కొన్నారు. తుపాను తగ్గడంతో ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
మండౌ నగరానికి చెందిన వ్యాపారి జెల్-అన్ మొయిరా సర్వాస్ బీబీసీతో మాట్లాడుతూ ''ఇంట్లోకి వరదనీరు వచ్చింది. చూస్తుండగానే నిమిషాల్లో నడుం లోతు నీళ్లువచ్చేశాయి. దీంతో కొంత ఆహారం, ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రమే తీసుకుని కుటుంబంతో బయటపడ్డాం'' అని చెప్పారు.
"ఇప్పుడు వర్షం ఆగిపోయింది, సూర్యుడు కనిపిస్తున్నాడు. కానీ మా ఇళ్లన్నీ మట్టితో నిండిపోయాయి, లోపల ఉన్న ప్రతిదీ పాడైపోయింది. ఎక్కడి నుంచి శుభ్రం చేయాలో తెలియడం లేదు.ఇంటిని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి," అని ఆవేదన వ్యక్తం చేశారు.
పాతిక లక్షలమంది ప్రజలు నివసించే సెబూలో తుపాను కారణంగా 4లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. సెబూ దక్షిణ ప్రాంతంలో సహాయక చర్యలకోసం వెళ్లిన మిలటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు.
''సెబూలోని నదులన్నీ పొంగిపొర్లాయి. అత్యవసర సిబ్బంది కూడా దీనిని అంచనా వేయలేకపోయారు. ఇప్పటిదాకా నేను ఇలాంటి తుపానును చూడలేదు'' అని 19 ఏళ్ల కార్లోస్ లానాస్ అనే స్వచ్ఛంద సేవకుడు బీబీసీకి చెప్పారు.
తుపాను కల్మేగిని స్థానికంగా టినో అని పిలుస్తున్నారు. భారీ తుపాన్లకు పేరుమోసిన ఫిలిప్పీన్స్‌ను కల్మేగి ఈ ఏడాది తాకిన తుపాన్లలో 20వది. సెప్టెంబర్ చివర్లో వచ్చిన సూపర్ తుపాను రగాసా (నాండో), దాని వెంటనే బువాలోయ్ తుపాన్లు వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














