అమెరికాలో విరుచుకుపడిన టోర్నడోలు, 40 మంది మృతి

ఫొటో సోర్స్, Missouri State Trooper
- రచయిత, బ్రాండన్ డ్రెనన్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలోని దక్షిణ, మధ్య పశ్చిమ ప్రాంతాలను టోర్నడోలు అతలాకుతలం చేశాయి. ఈ ఘటనల్లో దాదాపు 40 మంది మరణించారు.
టోర్నడోల ధాటికి మిస్సోరీ ఎక్కువగా ప్రభావితమైంది, అక్కడ 12 మంది మరణించారు.
టెక్సస్, కాన్సాస్‌లలో బలమైన గాలుల కారణంగా దుమ్ము తుపానులు సంభవించాయి, దీని వల్ల కారు ప్రమాదాలు జరిగాయి, ఈ ఘటనల్లో 12 మంది మరణించారు.
వాతావరణం సరిగ్గా లేకపోవడంతో దీని ప్రభావం అమెరికాలోని దాదాపు 10 కోట్ల మందికి పైగా ప్రజలపై పడింది.
ఒక్లహోమాలో దాదాపు 150 కార్చిచ్చులు చెలరేగాయి, దీంతో అక్కడ మరిన్ని మరణాలు సంభవించాయి. అర్కాన్సాస్, అలబామా, మిస్సిస్సిప్పీలలో కూడా చాలా మంది మృతి చెందారు.


వరద హెచ్చరికలు
టెక్సస్, లూసియానా, అలబామా, అర్కాన్సాస్, టేనస్సీ, మిస్సిస్సిప్పీ, జార్జియా, కెంటుకీ, నార్త్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.
పవర్‌అవుటేజ్‌యూఎస్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం 3,20,000 మందికి పైగా ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అర్కాన్సాస్, జార్జియా, ఒక్లహోమాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
నష్టం భారీగా ఉందని, వందలాది ఇళ్లు, పాఠశాలలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మిస్సోరీ గవర్నర్ మైక్ కెహో చెప్పారు.
అక్కడి బట్లర్ కౌంటీలో టోర్నడో ఒక ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిందని, ఇంటి లోపల ఉన్న వ్యక్తి చనిపోయారని స్థానిక వ్యక్తి కరోనర్ జిమ్ అకర్స్ తెలిపారు.
"మొత్తం ధ్వంసమైంది. ఇల్లు తల్లకిందులైంది. మేం గోడలపై నుంచి నడవాల్సి వచ్చింది" అని కరోనర్ అన్నారు.

ఫొటో సోర్స్, Nick Oxford
లక్షా 70 వేల ఎకరాలకు కార్చిచ్చు..
ఒక్లహోమాలో గంటకు 133 కి.మీ. వేగంతో వీచిన బలమైన గాలుల కారణంగా దాదాపు 150 కార్చిచ్చులు వ్యాపించాయి. ఈ శక్తిమంతమైన గాలులు పెద్ద పెద్ద ట్రక్కులను కూడా కిందపడేశాయి.
ఒక్లహోమా స్టేట్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ప్రకారం, మంటలు లేదా బలమైన గాలుల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటలు 1,70,000 ఎకరాల భూభాగాన్ని తగలబెట్టాయి. గవర్నర్ కెవిన్ స్టిట్‌కు చెందిన ఒక ఫామ్‌హౌస్‌తో సహా దాదాపు 300 భవనాలను టోర్నడోలు ధ్వంసం చేశాయి.
కాన్సాస్‌లో దుమ్ము తుఫాను 55 కి పైగా వాహనాలను బలంగా తాకింది, దీని ఫలితంగా ఎనిమిది మంది మరణించారు. టెక్సస్‌లో దుమ్ము తుఫాను కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో 38 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో కూడా టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. మిస్సిస్సిప్పీలో టోర్నడోల ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
అలబామాలో 82 ఏళ్ల మహిళతో సహా, ముగ్గురు మరణించారు.
అర్కాన్సాస్‌లో అధికారులు ముగ్గురు మరణాలను ధ్రువీకరించారు, 29 మంది గాయపడ్డారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తుపాను బాధితులకు సాయమందించేందుకు నేషనల్ గార్డ్(జాతీయ భద్రతా దళాలు)ను అర్కాన్సాస్‌కు పంపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
"ఈ భయంకరమైన తుపానుల వల్ల ప్రభావితమైన ప్రతిఒక్కరి కోసం ప్రార్థించడంలో మెలానియాతో, నాతో పాటు కలసిరండి!" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














