షెర్లిన్ చోప్రా: కృత్రిమ రొమ్ములను తొలగించుకున్న నటి, ఏం జరిగింది?

షెర్లిన్ చోప్రా

ఫొటో సోర్స్, sherlynchopra/IG

    • రచయిత, డింకిల్ పోప్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘నా ఛాతీ నుంచి ఈ పెద్ద భారం దిగిపోయింది. ఇవి నా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ (కృత్రిమ రొమ్ములు). ఒక్కోటి 825 గ్రాములు ఉంటుంది. సర్జరీతో వీటిని తొలగించుకున్నాక నాకిప్పుడు చాలా తేలికగా హాయిగా అనిపిస్తోంది. సోషల్ మీడియా మోజులో పడి శరీరాలపై ఎలాంటి ప్రయోగాలు చేయొద్దని నేటి యువతను కోరుతున్నా'

నటి, మోడల్ షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి ఇది.

షెర్లిన్ చోప్రా ఈ మధ్య 'బ్రెస్ట్ ఇంప్లాంట్ రిమూవల్ సర్జరీ' చేయించుకున్నారు. ఆమె తన రొమ్ముల్లో అమర్చిన సిలికాన్ కప్స్ (ఇంప్లాంట్స్)ను తీసేయించారు.

సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఆమె ఈ విషయాన్ని నవంబర్ 16న అందరితో పంచుకున్నారు.

సర్జరీ చేసి తొలగించిన బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌‌ను ఆమె వీడియోలో చూపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌ను తొలగించుకోనున్నట్లు కొన్ని రోజుల కిందటే ఆమె సోషల్ మీడియాలో తెలియజేశారు.

వీటితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు, అందుకే వాటిని తీసేయాలని అనుకుంటున్నట్లు ఆమె పోస్టులో తెలిపారు.

షెర్లిన్ చేసిన తాజా పోస్టును చూసిన తర్వాత చాలామంది ఆమెను అభినందిస్తున్నారు.

ఇంతకీ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎలా తయారు చేస్తారు? ఈ సర్జరీ ఎలా చేస్తారు? ఎంత ఖర్చు అవుతుంది? వంటి వివరాలు చూద్దాం.

బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తొలగించుకున్న తర్వాత షెర్లిన్ చోప్రా వాటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు

ఫొటో సోర్స్, sherlynchopra/IG

ఫొటో క్యాప్షన్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తొలగించుకున్న తర్వాత షెర్లిన్ చోప్రా వాటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు

బ్రెస్ట్ ఇంప్లాంట్ అంటే ఏంటి?

బ్రెస్ట్ ఇంప్లాంట్ అనేది ఒక కాస్మెటిక్ సర్జరీ. రొమ్ముల పరిమాణాన్ని పెంచడానికి, ఆకృతిని మెరుగుపరచడానికి లేదా రొమ్ములు నిండుగా కనిపించడానికి సిలికాన్ లేదా సెలైన్‌తో నిండిన ఈ కృత్రిమ ఇంప్లాంట్‌లను అమరుస్తారు.

అయితే, ఈ రోజుల్లో ఎక్కువగా సిలికాన్‌తో తయారైన ఇంప్లాంట్‌లనే వాడుతున్నారు. ఇవి గుండ్రంగా, జెల్‌తో నిండి ఉంటాయి. వీటికి సాగే గుణం ఉంటుంది. రొమ్ము కింద చిన్న కోత పెట్టి సురక్షితంగా వీటిని ఇంప్లాంట్ చేస్తారు.

గతంలో సెలైన్ నింపిన ఇంప్లాంట్‌లను వాడేవారని, అవి పగిలిపోయే ప్రమాదం ఉండటంతో ఇప్పుడు ఎక్కువగా సిలికాన్ ఇంప్లాంట్‌లనే ఉపయోగిస్తున్నారని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వికాస్ గుప్తా చెప్పారు.

ఆయన లూథియానాలోని ప్రొఫైల్ ఫోర్ట్ క్లినిక్ నడుపుతున్నారు. గత 15 ఏళ్లుగా ఆయన బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీలు చేస్తున్నారు.

'ఇప్పుడంతా సిలికాన్ ఇంప్లాంట్‌లనే రొమ్ముల్లో అమర్చుతున్నారు. ఇవి చాలా సహజంగా కనిపిస్తాయి. సర్జరీ జరిగిందనే విషయం కూడా ఎవరికీ తెలియదు' అని ఆయన అన్నారు.

ఇంప్లాంట్లను ఒకసారి అమర్చిన తర్వాత జీవితాంతం మార్చాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు.

సోషల్ మీడియా ప్రభావంతో గత పదేళ్లలో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీల ట్రెండ్ వేగంగా పెరిగిందని లూథియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ పింకీ పర్గల్ అన్నారు.

'ఇలాంటి కాస్మెటిక్ సర్జరీలు కొత్తేమీ కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటి ట్రెండ్ బాగా పెరిగింది. ఈ కాస్మెటిక్ సర్జరీలన్నీ సామాన్య ప్రజలకు కూడా చేరువయ్యాయి. ముందుకంటే చాలా చౌకగా మారడంతో చాలామంది వీటివైపు ఆకర్షితులవుతున్నారు' అని ఆమె అభిప్రాయపడ్డారు.

Dr. Vikas Gupta,
ఫొటో క్యాప్షన్, డాక్టర్ వికాస్ గుప్తా

బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో రొమ్ము పరిమాణాన్ని ఎంత పెంచవచ్చు?

తనకు అమర్చిన ఒక్కో ఇంప్లాంట్ బరువు 825 గ్రాములు అని షెర్లిన్ చోప్రా చెప్పారు.

కానీ, నిపుణులు బీబీసీతో మాట్లాడుతూ, ఇంప్లాంట్‌ల బరువును గ్రాముల్లో కాకుండా మిల్లీలీటర్లలో కొలుస్తారని చెబుతున్నారు.

భారత్‌లో 350-400 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉన్న ఇంప్లాంట్లను మాత్రమే సిఫార్సు చేస్తారని అంటున్నారు.

''సర్జరీకి ముందు, శరీర సహజ నిర్మాణాన్ని వైద్యులు పరీక్షిస్తారు. దాని ఆధారంగానే తగు మాత్రంలో ఇంప్లాంట్ సైజును సూచిస్తారు. భారతీయ శరీర నిర్మాణం ప్రకారం, 350-400 మిల్లీలీటర్ల కంటే పెద్ద ఇంప్లాంట్లను సిఫార్సు చేయరు'' అని డాక్టర్ వికాస్ చెప్పారు.

వ్యక్తి భుజాల పరిమాణం, చర్మం రకం, ఎత్తు, బరువు, ఇతర శరీర పరమైన నిర్మాణాల ఆధారంగా బ్రెస్ట్ ఇంప్లాంట్ పరిమాణాన్ని నిర్ధరిస్తారని ఆయన తెలిపారు.

డాక్టర్ పింకీ పర్గల్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

భారత్‌లో శిక్షణ లేని చాలామంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇటువంటి కాస్మెటిక్ సర్జరీలు చేస్తున్నారని, అందుకే నిర్దేశించిన వైద్య నియమాల ఉల్లంఘన జరుగుతోందని ఆమె అన్నారు.

‘‘రోగులు కోరుతున్నారని ఏ వైద్య నిపుణుడు కూడా వారు అడిగినంత పరిమాణంలో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అమర్చరు. ముందుగా క్లయింట్‌ను పరీక్షించి, వారి శరీర నిర్మాణం ప్రకారం ఏ సైజు ఇంప్లాంట్ సరిపోతుందో సలహా ఇస్తారు. కానీ, డబ్బు కోసం పనిచేసే, గుర్తింపు లేని ప్రాక్టీషనర్లు కొంతమంది ఉన్నారు. వారు నియమాలు పట్టించుకోకుండా ఇంప్లాంట్లను అమర్చుతున్నారు’’ అని పింకీ అన్నారు.

బ్రెస్ట్ ఇంప్లాంట్స్

ఫొటో సోర్స్, Getty Images

బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎవరికి అవసరం?

రొమ్ముల్లోని లోపాలు, వైకల్యాలను సరిచేయడానికి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ అవసరమని నిపుణులు అంటున్నారు.

మహిళలకు తమ రొమ్ము పరిమాణం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రొమ్ము మార్పిడి కోసం ఈ సర్జరీ నిర్వహిస్తారు.

''చాలామంది దీన్ని కేవలం సౌందర్య చికిత్సగానే చూస్తారు. కానీ సహజంగా రొమ్ములు పూర్తిగా అభివృద్ధి చెందని మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే, సోషల్ మీడియా ప్రభావంతో ఈ సర్జరీ వైపు ఆకర్షితులయ్యేవారు నిజంగా తమకు వీటి అవసరం ఉందా? అనే ప్రశ్న వేసుకోవాలి'' అని డాక్టర్ పింకీ సూచించారు.

ఖర్చు ఎంత? చికిత్సకు ఎంత సమయం తీసుకుంటుంది?

ఈ సర్జరీకి రూ. 50,000 నుంచి రూ. 1,50,000 వరకు ఖర్చు కావొచ్చని డాక్టర్ పింకీ చెప్పారు.

ఇంప్లాంట్ సైజ్, నాణ్యత, డాక్టర్ ఫీజుపై ఈ ఖర్చు ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.

‘‘ఈ సర్జరీకి ఒక రోజు పడుతుంది. సర్జరీ పూర్తయిన తర్వాత డాక్టర్ సలహా మేరకు ఒక నెల పాటు సరైన ఆహారం, జాగ్రత్తలు పాటించాలి.

ఒకసారి అమర్చిన తర్వాత, ఈ ఇంప్లాంట్లు జీవితాంతం ఉంటాయి. అవి చెడిపోవు. కానీ క్లయింట్ తొలగించుకోవాలని భావిస్తే వాటిని సులభంగా తొలగించవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే బ్రెస్ట్ ఇంప్లాంట్లు జీవితకాలం పనిచేస్తాయి’’ అని ఆమె వివరించారు.

షెర్లిన్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షెర్లిన్ చోప్రా

పాలివ్వడంలో ఇబ్బందులు తలెత్తుతాయా?

ఇతర సర్జరీల్లో మాదిరిగానే ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఇందులో కూడా ఉంటుందని డాక్టర్ వికాస్ తెలిపారు.

‘‘దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని, పిల్లలకు పాలివ్వడం ఇబ్బందిగా మారుతుందనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. కానీ, అటువంటి ఇబ్బందులు ఏవీ రావు’’ అని డాక్టర్ వికాస్ స్పష్టం చేశారు.

షెర్లిన్ చోప్రా ఎవరు?

షెర్లిన్ చోప్రా భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ, తెలుగు సినిమాల్లో నటించారు. వయస్సు 38 ఏళ్లు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షెర్లిన్, తన ఇన్‌స్టా బయోలో తనను తాను నటి, సామాజిక కార్యకర్త, నిర్మాత, ఎల్ఎల్‌బీ పట్టభద్రురాలిగా పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)