సీసీటీవీ హ్యాక్: ఆసుపత్రిలో మహిళలకు ఇంజెక్షన్లు వేసే దృశ్యాలను దొంగిలించి అమ్ముకుంటున్న సైబర్ ముఠాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శర్లీన్ మోలన్, గోపాల్ కటేషియా, రాక్సీ గగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గుజరాత్‌లో ఒక మెటర్నిటీ హాస్పిటల్ నుంచి దొంగలించిన సీసీటీవీ వీడియోలను సైబర్ ముఠాలు టెలీగ్రామ్‌లో అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు చాలా కామన్ అయిన నేటి రోజుల్లో ఇలాంటి ఘటనలు వ్యక్తుల గోప్యత, భద్రతపై అనుమానాలు, ఆందోళనలకు కారణమవుతున్నాయి.
ఇదే తరహాలో ఈ ఏడాది ప్రారంభంలో యూట్యూబ్‌లో దర్శనమిచ్చిన ఈ వీడియోలపై గుజరాత్ పోలీసులను మీడియా అప్రమత్తం చేసింది.
యూట్యూబ్‌లో ఉన్న కొన్ని వీడియోల్లో ఒక నగరంలోని మెటర్నిటీ హాస్పిటల్‌లో గర్భిణీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం, నడుము కింద భాగంలో ఇంజెక్షన్లు వేయించుకోవడం కనిపించింది.
ఈ వీడియోల్లో ఉన్న లింక్ ప్రేక్షకులను, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను కొనుగోలు చేసేలా టెలిగ్రామ్ చానళ్లకు మళ్లించింది.
వైద్యుల భద్రత కోసం ఈ కెమెరాలను ఇన్‌స్టాల్ చేసినట్లు హాస్పిటల్ డైరెక్టర్ ఒకరు బీబీసీకి చెప్పారు.

వీడియోల్లోని మహిళల గుర్తింపును కాపాడేందుకు ఆ నగరాన్ని, ఆస్పత్రి పేరును బీబీసీ పేర్కొనడం లేదు.
అయితే, దీనిపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
దేశవ్యాప్తంగా కనీసం 50 వేల సీసీటీవీల ఫుటేజీని హ్యాకర్లు దొంగలించి, ఇంటర్నెట్‌లో అమ్మకానికి పెట్టిన భారీ సైబర్ క్రైమ్ రాకెట్‌ను తమ ఇన్వెస్టిగేషన్ బట్టబయలు చేసిందని పోలీసులు చెప్పారు.
సీసీటీవీలు భారత్‌లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సర్వసాధారణంగా మారాయి.
మాల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు, స్కూళ్లు, ప్రైవేట్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, ప్రజల ఇళ్లల్లో కూడా వీటిని ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
సీసీటీవీ భద్రతను పెంచుతున్నప్పటికీ, వాటిని సరిగ్గా ఇన్‌స్టాల్ చేయకపోయినా లేదా సిస్టమ్‌లను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోయినా అవి గోప్యతకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
దేశంలో తరచూ కెమెరాలను ఎలాంటి సైబర్ సెక్యూరిటీ శిక్షణ లేని సిబ్బందే నిర్వహిస్తున్నారు. దేశీయంగా తయారైన కొన్ని మోడళ్లు తేలిగ్గా హ్యాకింగ్‌కు గురయ్యేలా ఉంటున్నట్లు కూడా రిపోర్టులు వస్తున్నాయి.
2018లో బెంగళూరులో ఒక టెక్ ఉద్యోగి తన వెబ్‌క్యాప్ హ్యాక్ అయిందని చెప్పారు. తన ప్రైవేట్ వీడియోలు ఎవరికీ షేర్ చేయొద్దని కోరగా, అందుకు డబ్బులు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేసినట్లు తెలిపారు.
2023లో ఒక యూట్యూబర్ తన ప్రైవేట్ వీడియోలు వైరల్‌గా మారిన తర్వాత తన ఇంట్లోని సీసీటీవీ హ్యాక్ అయిందని గుర్తించారు.
భద్రతా, డేటా ఉల్లంఘనలు ఉన్న సప్లయర్ల నుంచి సీసీటీవీలను కొనుగోలు చేయొద్దని గత ఏడాదే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే, సీసీటీవీ కెమెరాల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు కొత్త నిబంధనలను కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ, ఇలాంటి హ్యాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా విస్తరించిన ఇలాంటి వ్యక్తుల నెట్‌వర్క్‌ను తాము గుర్తించామని గుజరాత్ పోలీసులు చెప్పారు.
''అనేక రాష్ట్రాల్లోని ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసులు, వ్యక్తుల బెడ్‌రూమ్‌లకు చెందిన సీసీటీవీ సిస్టమ్‌లను లేదా వీడియో నిఘా వ్యవస్థలను వారు హ్యాక్ చేస్తున్నారు'' అని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ హెడ్ లవీనా సిన్హా రిపోర్టర్లతో అన్నారు.
దీనిపై గుజరాత్ సైబర్ క్రైమ్ ఉన్నతాధికారి హార్దిక్ మకడియా మాట్లాడుతూ..''రూ.800 నుంచి రూ.2000కు ఈ వీడియోలు అమ్ముడుపోయాయి. సబ్‌స్క్రిప్షన్ ద్వారా లైవ్ సీసీటీవీ ఫీడ్‌ను టెలిగ్రామ్ చానళ్లు ఆఫర్ చేస్తున్నాయి'' అని తెలిపారు.
చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వాటిల్లో మహిళా పేషెంట్ల గోప్యతను ఉల్లంఘించడం, అశ్లీల విషయాలను ప్రచురించడం, వాయిరిజం (ఇతరుల ప్రైవేట్ కార్యకలాపాలను చూసి లైంగిక ఆనందాన్ని పొందేస్థితి), సైబర్ టెర్రరిజానికి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి.
టెలిగ్రామ్, యూట్యూబ్ చానళ్లను తాము సంప్రదించామని పోలీసులు తెలిపారు. ఈ వీడియోలను తొలగించినట్లు చెప్పారు.
ఫిబ్రవరి నుంచి పోలీసులు ఈ కేసులో 8మందిని అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు మహారాష్ట్ర వారు కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్, గుజరాత్, దిల్లీ, ఉత్తరాఖండ్‌కు చెందిన వారు.
ఈ కేసు కోర్టులో నడుస్తుండగా, నిందితులు జ్యుడీషియన్ కస్టడీలో ఉన్నారు.
ముగ్గురు నిందితుల తరఫు న్యాయవాది యష్ కోష్టి ఈ ఆరోపణలను ఖండించారు. వీరు హ్యాకర్లు లేదా సైబర్ నేరగాళ్లు కాదని, ఈ ఉల్లంఘనను వేరెవరో చేశారని అన్నారు.
సరిగ్గా మెయింటెయిన్ చేయని, బలహీనమైన సీసీటీవీ వ్యవస్థలు, హోమ్ నెట్‌వర్క్‌లు సులభంగా లక్ష్యంగా మారతాయని, వాటిని కచ్చితంగా సేఫ్‌గా మార్చాలని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ రితేశ్ భాటియా సూచించారు.
''వైర్‌లెస్ సీసీటీవీ సిస్టమ్‌లు మీరు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఎక్కడి నుంచైనా ఫుటేజీని చూసేందుకు సాయపడతాయి. కానీ, ఒక్కసారి సిస్టమ్ అనేది వెబ్‌కు అనుసంధానమైతే, వాటి ఐపీ అడ్రస్‌లను, డీఫాల్ట్ పాస్‌వర్డ్‌ను డీకోడ్ చేయడం హ్యాకర్లకు చాలా తేలిక. వారు సిస్టమ్‌లోకి ఎంటర్ అయితే, లైవ్ ఫుటేజీని చూడగలరు, రికార్డు చేయగలరు. వాటిని డౌన్‌లోడ్ కూడా చేసుకోగలరు. అలాగే, సిస్టమ్‌ను షట్‌డౌన్ చేయగలరు'' అని భాటియా అన్నారు.
నిఘా వ్యవస్థలను సురక్షితంగా మార్చుకునేందుకు ఒక మార్గం ఐపీ అడ్రెస్‌లను, డీఫాల్ట్ పాస్‌వర్డ్‌ను మార్చడమేనని ఆయన అన్నారు.
లెటర్లు నెంబర్లు, సింబల్స్‌తో కూడిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను వాడాలని, అది డిక్షనరీలో కూడా దొరకకూడదని భాటియా అన్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణుడి చేత క్రమం తప్పకుండా చెకింగ్స్ నిర్వహించాలని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీసీటీవీ తయారీదారులు కూడా దీనికి బాధ్యత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ''సిగరెట్ ప్యాకెట్లపై ఉండే హెచ్చరికల మాదిరి, సీసీటీవీ తయారీదారులు కూడా వారి ప్యాకేజింగ్‌పైన డీఫాల్ట్ పాస్‌వర్డ్‌లను స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌గా మార్చుకోవాలని యూజర్లకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయాలి'' అని రితేశ్ భాటియా సూచించారు.
హ్యాక్ అయిన చాలా సీసీటీవీలకు డీఫాల్ట్ పాస్‌వర్డు అంటే Admin123 వంటివి ఉన్నట్లు హార్దిక్ మకడియా బీబీసీకి చెప్పారు.
హ్యాకర్లు బ్రూట్ ఫోర్స్ పద్ధతిని (వేల కొద్ది లెటర్-నెంబర్ పాస్‌వర్డ్ కాంబినేషన్లను సృష్టించేందుకు పలు ప్రోగ్రామ్‌లను వాడటం) వాడుతూ ఈ సిస్టమ్‌లను హ్యాక్ చేస్తున్నారని, వీడియోలను యాక్సెస్ చేస్తున్నారనీ మకడియా తెలిపారు.
దేశంలో సీసీటీవీలు సర్వసాధారణమైపోయాయని, తరచూ ఎలాంటి అనుమతి లేకుండా వీటిని ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు మహిళల, పిల్లల హక్కుల కేంద్రం ‘మజ్లిస్’కు చెందిన ఆడ్రీ డీమెల్లో అన్నారు. సంస్థలు ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాల్లో సీసీటీవీ వ్యవస్థలను సరిగ్గా సెక్యూర్ చేయాలని ఆమె సూచించారు.
మహిళలకు పరీక్షలు నిర్వహించే, ఇంజెక్షన్ ఇచ్చే గదుల్లో సీసీటీవీలను తప్పుడు ఆరోపణల నుంచి వైద్యులను కాపాడేందుకు ఏర్పాటు చేసినట్లు హ్యాకింగ్ బారిన పడిన ఆస్పత్రుల్లోని ఒక ఆస్పత్రి డైరెక్టర్ బీబీసీకి చెప్పారు. సెన్సిటివ్ ఏరియాల నుంచి కెమెరాలను తొలగించినట్లు తెలిపారు.
అయితే, ఏ ఆస్పత్రి కానీ, ఏ పేషెంట్ కానీ ముందుకు వచ్చి దీనిపై ఫిర్యాదు చేయలేదని గుజరాత్ పోలీసులు బీబీసీకి చెప్పారు. చివరికి ఒక పోలీసు ఆఫీసరే దీనిపై ఫిర్యాదు చేశారు.
‘‘మహిళా రోగులు వారి గుర్తింపు బయటపడుతుందేమోనని భయపడుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధంగా లేరు’’ అని ఆ అధికారి తెలిపారు.
''లైంగిక కోణం దీనిలో ఇమిడి ఉన్నప్పుడు, బాధితురాలు మరోసారి బాధితురాలిగా మారుతుంది. ఎందుకంటే, భారతీయ సమాజం పితృస్వామ్య స్వభావంతో ఉంది. మహిళలు తమ హక్కుల గురించి గట్టిగా మాట్లాడాలని కోరుకుంటే, నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి.. మనం ఒక సమాజంగా తొలుత ఈ నేరం విషయంలో మహిళలను అవమానపర్చడం, నిందించడం ఆపాలి'' అని డీమెల్లో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














