ఐ బొమ్మ రవి గురించి పోలీసులు ఏం చెప్పారంటే..

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల నిర్వాహకులు ఇమంది రవిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
కొత్తగా విడుదలైన సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేసి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఆయన్ను అరెస్టు చేశామని చెప్పారు.
"మొత్తం 21వేల సినిమాలు వెబ్‌సైట్ల నిర్వాహకుల వద్ద ఉన్నట్లు గుర్తించాం. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ మొదలుకుని ఈ మధ్యనే విడుదలైన ఓజీ వరకు... భారతీయ భాషలకు చెందిన ఎన్నో సినిమాలు వారి వద్ద ఉన్నాయి" అని చెప్పారు సజ్జనార్.
సినిమా విడుదలైన రోజు సాయంత్రానికే పైరసీ చేసి అప్‌లోడ్ చేస్తున్నారని గుర్తించామన్నారు.
ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లను డౌన్ చేయించామని హైదరాబాద్ పోలీసులు చెప్పారు.


తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు..
కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నారంటూ ఆగస్టు 30న తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ పైరసీ సెల్ నుంచి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇవి కాకుండా వేర్వేరుగా ఐటీ, కాపీరైట్ యాక్ట్ కింద మరికొన్ని కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులో ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల నిర్వాహకులు ఇమంది రవిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సజ్జనార్ వెల్లడించారు.
రవిని తాజాగా అరెస్టు చేయగా, ఆయనకు సహకరించిన దుద్దెళ్ల శివాజీ, సుశర్ల ప్రశాంత్‌ను గతంలోనే అరెస్టు చేశారు పోలీసులు.

ఎవరీ "ఐ బొమ్మ" రవి?
ఇమంది రవిది విశాఖపట్నం, వయసు 39 ఏళ్లు అని పోలీసులు చెబుతున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి, కొన్ని కోర్సులు చేశారు.
రవి అరెస్టు తర్వాత ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వివిధ పేర్లతో తిరుగుతున్నారని పోలీసులు గుర్తించారు.
ఆయన నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి స్వాధీనం చేసుకున్నారు.
ప్రహ్లాద్ కుమార్ వెల్లెల సన్నాఫ్ నర్సింహ వెల్లెల పేరుతో మహారాష్ట్ర నుంచి వీటిని తీసుకున్నట్టుగా ఉందని సజ్జనార్ చెప్పారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్టు విభాగం నుంచి డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు.
రవిని నవంబరు 15న అరెస్టు చేసినట్లు మీడియాకు చెప్పారు సజ్జనార్.

రూ.మూడు కోట్లు సీజ్ చేశామన్న సజ్జనార్
రవి వద్ద కరీబియన్ దీవులకు చెందిన సెయింట్స్ కీట్స్ అండ్ నెవిస్ దేశం సిటిజన్‌షిప్ ఉన్నట్లు విచారణ సమయంలో పోలీసులు గుర్తించారు.
గతంలోనే భారత్ పౌరసత్వం వదలుకున్న రవి, ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉంటున్నారు.
ఇప్పటివరకు ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల నిర్వహణ ద్వారా రవి రూ.20 కోట్లు సంపాదించినట్టు చెబుతున్నారు పోలీసులు. వీటిలో రూ.3కోట్లు సీజ్ చేశామని సజ్జనార్ చెప్పారు.
అయితే, భారత్‌కు ఇప్పుడే వచ్చారా? లేదా కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నారా?, ఈ మధ్యనే వస్తే ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నలకు పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.
ఇమంది రవి కేసులో అంతర్జాతీయ వ్యవహారాలు ఉన్నందున మరింత విచారణ కోసం సీబీఐ, ఈడీకు లేఖలు రాస్తామన్నారు.
"ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఆయన్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అడుగుతాం. ఆ తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి" అని సజ్జనార్ చెప్పారు.
ఇమంది రవి గురించి ఆయన తండ్రి అప్పారావు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.
"నాకు, నా కుమారుడు రవికి మాటల్లేవు. తప్పుడు మార్గంలో వెళ్లాడని దూరం పెట్టాను. 15 ఏళ్ల కిందటే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయాడు" అని చెప్పారు.
రవిని పోలీసులు మీడియా ముందు హాజరుపరచలేదు. జ్యుడీషియల్ రిమాండులో ఉండటంతో రవి వివరణ ఇవ్వలేకపోతున్నాం.

ఒక వెబ్‌సైట్ మూసేస్తే మరోటి..
ఐబొమ్మ వెబ్‌సైట్ ఒక యూఆర్ఎల్‌ను బ్లాక్ చేస్తే, మిర్రర్ వెబ్‌సైట్ తయారు చేసి తీసుకువస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అలా ఇప్పటివరకు 65 మిర్రర్ వెబ్‌సైట్లు తీసుకువచ్చినట్టు గుర్తించామని సజ్జనార్ చెప్పారు. అలాగే మొత్తంగా 110 డొమైన్లు ఉన్నాయని తెలిపారు.
"రవి అనే వ్యక్తి బాగా తెలివైనవారు. మాస్టర్ మైండ్. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం కలిగింది" అని చెప్పారు.
రవిని పూర్తిగా సాంకేతిక ఆధారాల ఆధారంగా అరెస్టు చేసినట్టు చెప్పారు పోలీసులు. ఆయన కదలికలపై మీడియాలో వస్తున్న కథనాలేవీ నమ్మొద్దన్నారు.
కేసు విచారణ మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై స్పష్టత కూడా లేదని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ దారా కవిత వివరించారు.
''రవిని అరెస్టు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. వెబ్ సర్వర్ల నిర్వాహకులతో సమావేశమయ్యాం. చాలామంది నుంచి సహకారం లభించలేదు. అయినప్పటికీ ఆయన కదలికలకు సంబంధించి టెక్నికల్ సమాచారం సేకరించి అరెస్టు చేశాం'' అని చెప్పారు.

పైరసీ ఎలా చేస్తున్నారంటే..
పోలీసుల ప్రాథమిక విచారణలో రవి ఒక్కరే భారత్ నుంచి ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నట్టు తేలింది.
ఆయా సైట్లకు అడ్మిన్లు చాలా మంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారు వేర్వేరు దేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పారు దారా కవిత.
''విచారణ మరింత ముందుకు సాగితే వివరాలు బయటకు వస్తాయి. రవికి ఎంత మంది సహకరిస్తున్నారు? భారత్‌లో ఇంకా ఎవరైనా అడ్మిన్లు ఉన్నారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది" అని చెప్పారామె.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపంలోని రెయిన్ బో విస్టాస్‌లోని ఇంటి నుంచి రవిని అరెస్టు చేశారు. ఆ సందర్భంలో అక్కడ హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు మాత్రమే దొరికినట్టుగా చెబుతున్నారు.
ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల ప్రధాన సర్వర్లు నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
రవికి ఎవరెవరు సహకరించారనే విషయంలోనూ లోతుగా విచారణ చేస్తామని వివరించారు పోలీసులు.

గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో ఆదాయం
సినిమాలను పైరసీ చేయడం, వాటిని అప్‌లోడ్ చేయడం.. ఇదొక్కటే వైబ్‌సైట్ల నిర్వాహకుల పని కాదని పోలీసులు చెబుతున్నారు.
ఆయా వెబ్‌సైట్లలోకి వెళ్లినప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం అడుగుతున్నాయని గుర్తించారు.
"మాకున్న సమాచారం ప్రకారం, ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల సబ్‌స్క్రైబర్ల నుంచి దాదాపు 50 లక్షల మంది డేటాను రవి సేకరించారు" అని సజ్జనార్ చెప్పారు.
వాటిని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు సహా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు.
ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల నుంచి నేరుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు జరుగుతున్నాయని, ప్రజలు వాటిని ఆడేలా సర్వర్లు రీ-డైరెక్ట్ చేస్తున్నాయని పోలీసులు వీడియోలు ప్రదర్శించి వివరించారు.
కేవలం పైరసీ మాత్రమే కాదని, బెట్టింగ్ యాప్స్ కారణంగా అమాయకులు మోసపోయి, డబ్బులు పోగొట్టుకుని చనిపోతున్న సందర్భాలున్నాయని సజ్జనార్ చెప్పారు.
పైరసీ మాటున వ్యక్తిగత డేటా చోరీకి గురవుతోందని, దాన్ని ప్రజలు గుర్తించాలని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు.
"ఫ్రీగా వస్తోందని పైరసీ సినిమాలు చూస్తున్నారు. కానీ, దానివల్ల మీ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతోంది. దానివల్ల ప్రజలే నష్టపోతున్నారు" అని చెప్పారాయన.
మరోవైపు పోలీసుల కృషిని నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు అభినందించారు. అలాగే సినిమాలు విడుదల చేస్తున్న సర్వర్ల విషయంలో కొన్ని లోపాలు గుర్తించామని, వాటిని సరిదిద్దుతున్నామని నిర్మాత సురేశ్ బాబు చెప్పారు.

పోలీసులను హెచ్చరించి..
ఐబొమ్మ వెబ్‌సైట్‌లో కొన్ని నెలల కిందట ఒక ప్రకటన వచ్చింది.
"ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేం ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం" అంటూ ఓ మెసేజ్ పెట్టారు నిర్వాహకులు. దాన్ని సవాలుగా తీసుకుని రవిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు, 'ఐబొమ్మ' రవి అరెస్టు అయ్యారనే ప్రచారం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా కొందరు పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు. ఈ విషయంలో సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"సినిమాలు పైరసీ చేయడం, డేటా సేకరించడం.. ఇవన్నీ అక్రమం. ఇవేమీ పట్టించుకోకుండా మీమ్స్ వంటివి పెడుతున్నారు. అలాంటి వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం" అని హెచ్చరించారు సజ్జనార్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














