విజయవాడ న్యూ ఆటోనగర్‌లో 28 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం: ఎస్పీ

విజయవాడ, మావోయిస్టులు, ఆంధ్రప్రదేశ్
    • రచయిత, అమ‌రేంద్ర యార్ల‌గ‌డ్డ‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విజ‌య‌వాడ న‌గ‌రం మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. న్యూ ఆటోన‌గ‌ర్ ప్రాంతంలోని ఓ భ‌వ‌నంలో ఉన్న 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇంటెలిజెన్స్ నుంచి అందిన స‌మాచారం మేర‌కు వారంద‌రినీ అరెస్టు చేసిన‌ట్టు కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగ‌ర్ నాయుడు మీడియాతో చెప్పారు.

"బెజ‌వాడ‌ను షెల్ట‌ర్ జోన్‌గా చేసుకున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో అక్టోప‌స్‌, ఇంటెలిజెన్స్‌, ఏపీ పోలీసులు జాయింట్‌ ఆప‌రేష‌న్ చేసి మావోయిస్టుల‌ను అరెస్టు చేశాం" అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 మావోయిస్టులు, విజయవాడ, హిడ్మా

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు

హిడ్మా బెటాలియన్ సభ్యులు 19 మంది

ఒక‌వైపు మారేడుమిల్లి అడ‌వుల్లో పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర‌నేత మడావి హిడ్మా చ‌నిపోయారని పోలీసులు ప్ర‌క‌టించిన కొన్ని గంట‌ల త‌ర్వాత‌ పెద్ద‌సంఖ్య‌లో మావోయిస్టులు విజ‌య‌వాలో ప‌ట్టుబ‌డ‌టం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చర్చనీయంగా మారింది.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 21 మంది మ‌హిళ‌లు ఉన్నార‌ని , వారి నుంచి కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని ఎస్పీ విద్యాసాగ‌ర్ నాయుడు మీడియాతో చెప్పారు.

విజయవాడ, మావోయిస్టులు, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, విజయవాడలో 28మంది మావోయిస్టులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.

ప‌ట్టుబ‌డిన వారిలో మావోయిస్టు కేంద్ర క‌మిటీ కార్య‌ద‌ర్శి దేవ్ జీ కి బందోబ‌స్తుగా ఉండే 9 మంది ఉన్నారని, మిగిలిన 19 మందిని హిడ్మా బెటాలియ‌న్ స‌భ్యులుగా గుర్తించామని ఆయ‌న వివ‌రించారు.

వీరంతా చ‌త్తీస్‌గఢ్ నుంచి వ‌చ్చార‌ని ప్రాథ‌మికంగా భావిస్తున్నామ‌ని, విచార‌ణ త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ఎస్పీ చెప్పారు.

విజయవాడ, మావోయిస్టులు, ఆంధ్రప్రదేశ్

‘సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది’

కేవ‌లం విజ‌య‌వాడ‌లోనే కాకుండా ఏలూరు న్యూ గ్రీన్ సిటీ, కాకినాడ‌లోనూ మావోయిస్టుల‌ను అదుపులోకి తీసుకున్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

విజ‌య‌వాడ కాకుండా మిగిలిన రెండుచోట్ల ఎంత‌మందిని అదుపులోకి తీసుకున్నార‌న్న విష‌యంపై పోలీసుల నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

మ‌రోవైపు హిడ్మా ఎన్‌కౌంట‌ర్ విష‌యాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర ల‌డ్డా మీడియాకు వివ‌రించే క్ర‌మంలో, ఏపీలో 32 మంది మావోయిస్టుల‌ను ప‌ట్టుకున్న‌ట్లుగా చెప్పారు.

"నెల నెల‌న్న‌ర‌గా మావోయిస్టులు ఏపీలోకి వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం ఉంది. వారిని ప‌ట్టుకునేందుకు స‌రైన స‌మ‌యం కోసం చూస్తున్నాం" అని వివ‌రించారు.

మావోయిస్టుల సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని, పూర్త‌యిన త‌ర్వాత ఎంత‌మందిని ప‌ట్టుకున్నార‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని ఏపీ పోలీసులు చెబుతున్నారు.

 మావోయిస్టులు, విజయవాడ, హిడ్మా

ఫొటో సోర్స్, UGC

హిడ్మా మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో సీనియర్ నేత మడావి హిడ్మా చనిపోయినట్లు మహేశ్ చంద్ర లడ్డా చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో కొంతకాలంగా ఒత్తిడి పెరుగుతుండటంతో మావోయిస్టులకు చెందిన కొందరు సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్ అరణ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తూ, ఇక్కడ ఉద్యమాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తమకు కచ్చితమైన సమాచారం అందిందని ఆయన తెలిపారు.

మారేడుమిల్లి మండలంలోని అడవుల్లో మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందనీ, ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని, వారిలో మడావి హిడ్మాతోపాటు ఆయన భార్య రాజె కూడా ఉన్నారని లడ్డా వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)