ఇస్లాంలోకి మారిన భారతీయ మహిళ కోసం పాకిస్తానీ పోలీసులు వెతుకుతున్నారు

ఫొటో సోర్స్, Lawyer Ahmad Pasha
- రచయిత, ఏహ్‌తేశామ్ శమీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
నవంబర్ 13 నాటికి వీసా గడువు ముగిసిన తర్వాత భారత్‌కు తిరిగి రాలేకపోయిన మహిళ కోసం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు వెతుకుతున్నారు.
ఆ మహిళ సిక్కు యాత్రికులతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లి, ఆ దేశ పౌరుడిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.
48 ఏళ్ల సిక్కు మహిళ సరబ్‌జీత్ కౌర్ పాకిస్తాన్ పౌరుడు నాసిర్ హుస్సేన్‌ను పెళ్లి చేసుకున్నట్టు షేఖ్‌పురా జిల్లా పోలీసు అధికారి బిలాల్ జఫర్ షేక్ తెలిపారు.
ఆ తర్వాత వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.
విచారణ తర్వాతే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

సరబ్‌జీత్ కౌర్ నవంబరు 4న సిక్కు యాత్రికులతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లారు. మరుసటి రోజు బాబా గురునానక్ జయంతి సందర్భంగా నాన్‌కానా సాహెబ్‌ను దర్శించుకున్నారు.
నవంబరు 7న షేఖ్‌పురా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆమె తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
తాను స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారి నాసిర్ హుస్సేన్ అనే పాకిస్తానీ పౌరుడిని వివాహం చేసుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.
షేఖ్‌పురా యూనియన్ కౌన్సిల్‌లో ఈ వివాహం రిజిస్టర్ అయిందని ఆమె న్యాయవాది అహ్మద్ హసన్ పాషా తెలిపారు.
సరబ్‌జీత్ కౌర్, నాసిర్ హుస్సేన్ ఒకరికొకరు సోషల్ మీడియాలో పరిచయం అయ్యారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Police
ఇస్లాం మతం స్వీకరించిన తర్వాతే పెళ్లి
ఇరుదేశాల అధికారుల ముందు వారి వాంగ్మూలాలను రికార్డ్ చేయడానికి వారిద్దరినీ నవంబర్ 15న తన చాంబర్‌కు పిలిచానని, కానీ వారు రాలేదని, ఇప్పుడు నాసిర్ హుస్సేన్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని న్యాయవాది అహ్మద్ హసన్ పాషా తెలిపారు.
తమపై ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారు భయపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సరబ్‌జీత్ కౌర్ వీసా గడువు ఇంకా పొడిగించలేదని, ఈ విషయంపై తాను లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పాషా తెలిపారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
సరబ్‌జీత్, నాసిర్ హుస్సేన్‌లను వెతకడానికి అధికారుల బృందాన్ని ఫారుఖాబాద్‌కు పంపామని, కానీ అక్కడ ఇల్లు తాళం వేసి ఉందని షేఖ్‌పురా పోలీసులు చెప్పారు.
నాసిర్ హుస్సేన్, ఆయన కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదని చెబుతున్నారు.
షేఖ్‌పురా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు సమర్పించిన పత్రాల ప్రకారం, సరబ్‌జీత్ కౌర్ ఇస్లాం మతంలోకి మారి 'నూర్' అనే పేరు పెట్టుకున్నారు.
ఇస్లాంలోకి మారినట్టు ధ్రువీకరణ పత్రం నవంబర్ 5న జారీ అయింది.
కోర్టుకు సమర్పించిన వివాహ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. నాసిర్ హుస్సేన్ వయస్సు 43 ఏళ్లు. ఆయన కట్నంగా రూ. పది వేలు తీసుకున్నారు.
నాసిర్ హుస్సేన్‌కు ఇప్పటికే వివాహం అయిందని, అయితే రెండో పెళ్లికి అనుమతి తీసుకోవల్సిన అవసరం కూడా లేదని ఆ పత్రంలో ఉంది.

ఫొటో సోర్స్, Pradeep Sharma/BBC
'తొమ్మిదేళ్ల పరిచయం'
సరబ్‌జీత్ భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారని, ఆమెది కపుర్తలా జిల్లా అని, ఇక్కడ కేసు దర్యాప్తు జరుగుతున్నట్టు స్థానిక పోలీసులు చెప్పారు.
2,000 మంది సిక్కు యాత్రికుల బృందంలో ఒకరిగా ఆమె పాకిస్తాన్ వెళ్లారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
యాత్రికులందరూ 10 రోజుల తర్వాత నవంబరు 13న భారత్‌కు తిరిగి వచ్చారు. కానీ, సరబ్‌జీత్ కౌర్ వారి వెంటలేరు.
సరబ్‌జీత్ మతం మార్చుకున్నట్టు నిర్ధరణ కాలేదని, ఆమెకు జనవరి 2024లో పాస్‌పోర్ట్ జారీ అయిందని కపుర్తలా పోలీస్ ఏఎస్‌పీ ధీరేంద్ర వర్మ చెప్పారు.
భారత్‌లో వస్తోన్న మీడియా రిపోర్టుల ప్రకారం, సరబ్‌జీత్ విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఆమె మాజీ భర్త దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇంగ్లండ్‌లో ఉంటున్నారు.
గ్రామ సర్పంచ్ నుంచి దీనిపై తమకు సమాచారం అందిందని కపుర్తలా జిల్లాలోని తల్వండి చౌధరియాం గ్రామ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్ఓ) నిర్మల్ సింగ్ చెప్పారు.
సరబ్‌జీత్ కౌర్ కుటుంబంతో పోలీసులు ఇంకా మాట్లాడలేదని ఆయన అన్నారు.
న్యాయవాది అహ్మద్ హసన్ పాషా బీబీసీకి ఒక వీడియోను షేర్ చేశారు.
తాను విడాకులు తీసుకున్నానని, ఇస్లాం మతంలోకి మారి, నాసిర్ హుస్సేన్‌ను వివాహం చేసుకోవాలని తనంత తానుగా నిర్ణయించుకున్నానని సరబ్‌జీత్ ఆ వీడియోలో చెబుతున్నారు.
నాసిర్ హుస్సేన్ తనకు తొమ్మిది సంవత్సరాలుగా తెలుసన్నారు.
సరబ్‌జీత్, నాసిర్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకునేవారని, ఇద్దరూ వివాహం చేసుకోవాలని ఆరు నెలల కిందటే నిర్ణయించుకున్నారని లాయర్ అహ్మద్ హసన్ పాషా తెలిపారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
పోలీసులు వేధిస్తున్నట్టు ఆరోపణలు
ఈ కేసులో పాకిస్తాన్ పోలీసులు సరబ్‌జీత్‌ను బెదిరించి తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపణలు వచ్చాయి.
జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తన ఇష్టం ప్రకారం నాసిర్ హుస్సేన్‌ను వివాహం చేసుకున్నట్టు సరబ్‌జీత్ చెప్పారు.
"నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను. నా తల్లిదండ్రుల ఇంటి నుంచి మూడు దుస్తులు మాత్రమే తీసుకొచ్చాను. ఇంకేమీ తీసుకురాలేదు" అని ఆమె వీడియోలో చెప్పారు.
"నా పెళ్లిపై పోలీసులు చాలా కోపంగా ఉన్నారు. నవంబరు 5న రాత్రి 9 గంటలకు, పోలీసు అధికారులు బలవంతంగా మా ఇంట్లోకి ప్రవేశించి నన్ను వారితో రమ్మని అడిగారు. నేను నిరాకరించడంతో వారికి కోపమొచ్చింది'' అని సరబ్‌జీత్ తెలిపారు.
తనకు, తన భర్తకు పోలీసు రక్షణ కల్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.
పోలీసులు భారతీయ మహిళను, ఆమె పాకిస్తానీ భర్తను వేధించలేదని బీబీసీ ఉర్దూతో షేఖ్‌పురా పోలీసు ప్రతినిధి రాణా యూనిస్ చెప్పారు.
ఈ విషయంలో ఆమె నుంచి వస్తున్న ఆరోపణలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, వాటితో పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు.
"ఈ విషయం సున్నితమైనది కాబట్టి, అనేక సంస్థలు దీన్ని పరిశీలిస్తున్నాయి. పాకిస్తాన్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














