పాకిస్తాన్: పదమూడేళ్ల హిందూ బాలిక ‘బలవంతపు మత మార్పిడి’ కేసులో మలుపు... ఆమె ఏం చెప్పిందంటే

13 ఏళ్ల హిందూ బాలిక 'బలవంతపు మత మార్పిడి' కేసులో ట్విస్ట్
    • రచయిత, రియాజ్ సుహైల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సులో 13 ఏళ్ల హిందూ బాలికను బలవంతంగా మతం మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆ బాలికను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించమని స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అయితే, కోర్టు ముందు ఆ బాలిక తనపై ఎవరి బలవంతమూ లేదని, తాను ఇష్టపూర్వకంగానే మతం మారినట్లు చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లైంది. మరోవైపు బాలిక తండ్రి మాత్రం తన కుమార్తెను కొందరు ఎత్తుకువెళ్లి, బలవంతంగా మతం మార్చారని ఆరోపిస్తున్నారు.

ఉత్తర సింధ్ ప్రాంతంలో కాశ్మోర్ కంధ్‌కోట్‌లోని తంగ్వానీ తహసీల్ సివిల్ కోర్టు ముందు బుధవారం హాజరైన ఆ బాలిక వాంగ్మూలం ఇచ్చింది.

తన ఇష్టపూర్వకంగానే భార్చోండీ దర్గాకు వెళ్లి మతం మార్చుకున్నానని, తన పేరును కూడా ఉమ్మే హీనాగా మార్చుకున్నానని ఆ బాలిక చెప్పింది. మతం మార్చుకోమని తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని ఆమె తెలిపింది.

అయితే, బాలికకు ఇంకా మైనార్టీ తీరలేదని బాలిక తల్లిదండ్రుల తరఫు న్యాయవాది అబ్దుల్ గనీ కోర్టుకు తెలియజేశారు. బాలికపై అత్యాచారం జరిగిందా, లేదా అన్నది నిర్ధారించేందుకు ఓ మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

సింధు ప్రావిన్సులో 18 ఏళ్లలోపు వారు పెళ్లి చేసుకోవడంపై నిషేధం ఉంది. ఒకవేళ 18 ఏళ్ల లోపు వారు పెళ్లి చేసుకున్నా, అలా చేసుకునేవారికి సహకరించినా వారిపై కేసు నమోదు చేయొచ్చు.

బాల్య వివాహాల నిరోధక చట్టం నిబంధనల కారణంగా ఆ బాలికకు వివాహ ధ్రువీకరణ పత్రం రాలేదని, అందుకే తాము మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరామని అబ్దుల్ గనీ అన్నారు.

మైనర్లను అపహరించడం ‘ఉగ్రవాద నిరోధక చట్టం’లోని సెక్షన్ 364 కిందకు వస్తుందని, అందుకే ‘ఉగ్రవాద నిరోధక కోర్టు’కు ఈ కేసును బదిలీ చేయాలని కోరామని కూడా ఆయన చెప్పారు.

కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి ముందు ఆ బాలిక తన తల్లిదండ్రులతో ఏకాంతంగా మాట్లాడిందని భర్చోండీ పీర్ తరఫు న్యాయవాది సయీద్ అహ్మద్ చెప్పారు. భర్చోండీకి వెళ్లి, తనకు ఇస్లామిక్ విద్యను అభ్యసించాలని ఉందని ఆ బాలిక చెప్పిందని ఆయన అన్నారు.

ఆ బాలికను ఆమె కోరిక ప్రకారం భర్చోండీకి పంపించాలని కోర్టును తాము కోరినట్లు సయీద్ వివరించారు.

అయితే, కోర్టు మాత్రం ఈ కేసులో పోలీసుల విచారణ పూర్తయ్యే వరకు బాలికను బాలల సంరక్షణ కేంద్రంలోనే ఉంచాలని ఆదేశించింది.

house

‘తెల్ల కారులో వచ్చి కిడ్నాప్’

మార్చి 9న సాయంత్రం నాలుగు గంటలకు ఆ బాలిక అపహరణకు గురైందంటూ ఆమె తండ్రి తఖ్త్ మల్... తంగ్వానీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తెల్ల కారు తమ ఇంటి ముందు వచ్చి ఆగిందని... ఆ కారులో ముశ్తాక్, భోరల్ అనే వ్యక్తులతోపాటు మొత్తంగా ఐదుగురు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారు తుపాకీతో అందరినీ బెదిరించారని, తమ కూతురికి ముశ్తాక్‌తో పెళ్లి చేయబోతున్నట్లు చెప్పారని ఆయన ఫిర్యాదులో వివరించారు.

తన కూతురిని బలవంతంగా పెళ్లి చేసుకునేందుకే ఆ అపహరణ జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కేసు నమోదైన తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో భర్చోండీ పీర్‌ ఓ మంచంపై కూర్చొని ఉండగా, సదరు బాలిక నేలపై కూర్చొని కనిపించింది. చుట్టూ జనం నిల్చొని ఉన్నారు. వారంతా మగవాళ్లే.

పీర్ మతపరమైన వచనాలను చదువుతుంటే, ఆ బాలిక చాలా చిన్న గొంతుతో తిరిగి వాటిని పలుకుతూ ఉంది. ఆ తర్వాత పీర్ ఆ బాలిక చుట్టూ కరెన్సీ నోట్లను తిప్పి, తన అనుచరులకు ఇచ్చారు.

మంగళవారం ఆ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఆమెను భర్చోండీ పీర్ అనుచరులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, ఆమె తల్లిదండ్రులు లేని కారణంగా కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఆ బాలికను శిథిలావస్థలో ఉన్న ఓ సేఫ్ హౌజ్‌లో ఉంచారు. భర్చోండీ దర్గాకు వచ్చే భక్తులు అక్కడ ఉండటం, ఆ బాలికకు భోజనం ఇస్తుండటం వంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బాలిక తల్లిదండ్రులు ఆమెను కలిసేందుకు అక్కడి వెళ్లినా, వారిని అందుకు అనుమతించలేదని వార్తలు వచ్చాయి.

ఈ వీడియోలన్నింటిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ బాలికను బలవంతంగా మతం మార్చారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు సుఖ్‌దేవ్ ఆరోపించారు.

ఈ విషయంపై తాను స్వయంగా దృష్టి సారించానని, రాష్ట్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి శేహలా రజాతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.

కంధ్‌కోట్‌లోని హిందూ వర్గంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా బాలిక అపహరణ, బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.

సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయమైన తర్వాత, మూడు రోజుల క్రితం ఆ బాలిక ఇంటికి నిప్పు అంటుకుంది. రాత్రి రెండు గంటల సమయంలో నలుగురు వచ్చి తమను బెదిరించారని, బాలిక తండ్రిని ఈ విషయమై మీడియాతో మాట్లాడొద్దని హెచ్చరించారని బాలికకు సోదరుడి వరుసయ్యే శహ్జాద్ బీబీసీతో చెప్పారు.

అక్కడున్న ఎండు గడ్డికి వాళ్లు నిప్పుపెట్టారని, దీంతో ఇంటికి కూడా మంటలు వ్యాపించాయని చెప్పారు. బాలిక తండ్రి టీ, బిస్కెట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారు ఉన్నది కూడా అద్దె ఇల్లేనని వివరించారు.

ఈ ఘటన తర్వాత అక్కడ పోలీసులు ఓ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)