‘చిరుతలు తినేయడానికా మేం పిల్లల్ని కనేది’ అని ఇక్కడి ప్రజలు ఎందుకు అంటున్నారు?

- రచయిత, గణేష్ పోల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- "ఈ రోజు నా చిన్నారి చనిపోయింది, రేపు ఇంకొకరి బిడ్డ బలవుతుంది.. '' ఇది చిరుత దాడిలో చనిపోయిన శివాన్య తల్లి దివ్య బొంబే ఆవేదన.
- ''మా పిల్లలను చిరుతలు తినడానికి మేము కనడం లేదు''.. ఇది చిరుత దాడితో మరణించిన సిద్ధార్థ్ తల్లి అక్షద కేదారి ఆగ్రహం.
- "నేను సైకిల్ మీద స్కూల్‌కి వెళ్తున్నా, ఒక చిరుతపులి నన్ను చూసింది. నేను ఒంటరిగా ఉన్నా, భయమేసింది".. ఇది ఆరాధ్య పచ్పుతే ఆందోళన.
- "మా ఇంటి పక్కనే చెరకుతోట ఉంది. నాకు రాత్రిపూట మూత్ర విసర్జన చేయాలనిపిస్తే, బయట బాత్రూమ్‌కు వెళ్లాలి. కానీ నాకు భయంగా ఉంది".. ఇది హౌసా ముట్కే భయం.
పుణె జిల్లాలోని జున్నార్ ప్రాంతాన్ని 'బీబీసీ మరాఠీ' సందర్శించినప్పుడు, చిరుతపులి భయంతో తాము ఎలా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామో అక్కడి ప్రజలు చెప్పిన మాటలివి.


గత రెండు దశాబ్దాలుగా స్థానిక చెరకు తోటల్లో పుట్టి, అడవి ముఖం ఎప్పుడూ చూడని చిరుతలు ఇప్పుడు జున్నార్ ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఫలితంగా గత రెండు సంవత్సరాలలో పుణె జిల్లాలోని జున్నార్ ఫారెస్టు డివిజన్ పరిధిలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 26 వేలకంటే ఎక్కువ పశువులు బలి అయ్యాయి.
సాధారణంగా దీపావళి తర్వాత పశ్చిమ మహారాష్ట్రలో చెరకు కోత ప్రారంభమవుతుంది. చిరుత పులులకు నివాసంగా ఉన్న చెరకు తోటలు మైదానంగా మారతాయి.
దీంతో ఇక్కడి చిరుతలు ఆవాసం, ఆహారం కోసం వెతుకుతాయి. ప్రతి సంవత్సరం చెరకు కోత సీజన్ ముగిసిన తర్వాత, ఇక్కడ ప్రజలకు, చిరుతలకు మధ్య సంఘర్షణ తీవ్రమవుతోంది.
చిరుతల సంఖ్య పెరుగుతుండటంపైనే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మేము ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు చిరుతపులుల కదలికలు కనిపించాయి.
ఈ కథనం రిపోర్టు చేయడానికి నారాయణగావ్ నుంచి జున్నార్‌కు వెళ్తున్నప్పుడు, సుమారు రాత్రి 10 నుంచి 10:30 గంటల సమయంలో రోడ్డు దాటుతూ ఓ చిరుతపులి కనిపించింది.
‘రోజూ ఏదొక చోట చిరుత దాడి...’
ఈ సంవత్సరం దీపావళి సెలవులకు పుణె నుంచి శిరూర్ తాలూకాలోని పింపర్‌ఖేడ్ గ్రామానికి వచ్చిన చిన్నారి శివాన్య చిరుతపులి దాడిలో మరణించింది.
బొంబే కుటుంబానికి వారి ఇంటి పక్కనే పొలం ఉంది. పట్టపగలు, వారి ఇంటికి దాదాపు 500 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది.
"ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చాలా పెరిగాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరుగుతోంది. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ. ఇంతకుముందు, శివాన్య తండ్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఒక చిరుతపులి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వారం కిందటే ఒక చిరుత మా ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఒకవేళ అది నేరుగా ఇంట్లోకి వచ్చి ఉంటే, మేము ఏమి చేయగలిగేవాళ్లం?" అని దివ్యా బొంబే అన్నారు.
‘‘ఈ బాధ మా జీవితాంతం మాతోనే ఉంటుంది. ఆమె వస్తువులన్నీ ఇంట్లోనే ఉన్నాయి. నేను ఏది చూసినా, అది ఆమె జ్ఞాపకాలను గుర్తుకుతెస్తుంది" అని కూతరు శివాన్య మరణాన్ని తలచుకుంటూ దివ్య చెప్పారు.
ఈ సంవత్సరం వర్షాకాలం ముగియగానే, చిరుతలు శిరూర్, జున్నార్ తాలూకాలలో దాడిచేసి ముగ్గురు పిల్లలను, ఒక వృద్ధురాలిని చంపేశాయి.
జున్నార్ తాలూకాలోని కుమ్‌షేట్‌కు చెందిన కేదారి కుటుంబంలో ఒక చిన్నారిని చిరుతపులి చంపేయడంతో, ఆమె కుటుంబం భయంతో ఇంటిని వదిలేసి వేరేచోటకు వెళ్లిపోయింది.
"చిరుతలు మనుషుల ప్రాణాలను తీయడం మొదలుపెట్టాయి. ఈ రోజు మా బిడ్డ చనిపోయింది. రేపు వేరొకరి బిడ్డ పోవచ్చు. ఎవరి మనిషి చనిపోతే వారికే ఆ బాధ తెలుస్తుంది. ప్రభుత్వం దీని గురించి పట్టించుకుంటుందో లేదో?" అంటూ అక్షద కేదారి రోదించారు. చిరుత దాడిలో చనిపోయిన సిద్ధార్థ్‌కు ఆమె తల్లి.
జున్నార్ ఫారెస్టు డివిజన్ పరిధిలో చిరుతలు వెయ్యికి పైగా నివసిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, కచ్చితంగా ఎన్ని ఉన్నాయనేదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

ఆనకట్టలు, చెరకు తోటలే చిరుతలకు ఆవాసాలు...
1960లో మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి పుణె జిల్లాలో మొత్తం 5 ప్రధాన ఆనకట్టలు నిర్మితమయ్యాయి.
సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో రైతులు చెరకు సాగు ప్రారంభించారు. క్రమక్రమంగా ఆ పంట విస్తీర్ణం పెరిగింది. బహుశా చిరుతలు ఆహారం కోసం అడవి నుంచి బయటకు రావడం కూడా అప్పుడే ప్రారంభమై ఉండవచ్చని వన్యప్రాణి పరిశోధకులు చెబుతున్నారు.
ముంబయికి చెందిన వన్యప్రాణి పరిశోధకుడు నికిత్ సుర్వే మాట్లాడుతూ, "జున్నార్ అటవీ ప్రాంతంలోని చిరుతలు చెరకు తోటలను తమ ఆవాసంగా గుర్తించాయి. దీనితో పాటు, వాటికి అక్కడ పుష్కలంగా ఆహారం కూడా లభిస్తోంది. కుక్కలు, పిల్లులు, రైతుల మేకలు, గొర్రెలు, దూడలను వేటాడి తింటూ ఇక్కడే నివాసం ఉంటున్నాయి. శాస్త్రీయ కారణాన్ని పరిశీలిస్తే, ఈ ప్రాంతంలో చిరుతపులులకు అనువైన ఆవాసం, తగిన ఆహారం దొరుకుతోంది. అందుకే వాటి కదలికలు పెరుగుతున్నాయి'' అని చెప్పారు.

అటవీ శాఖ ఏం చేస్తోంది...
చిరుతలు-మానవుల సంఘర్షణను నివారించడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. గ్రామాలు, ఆవాస ప్రాంతాలలో అటవీశాఖ బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అలాగే, ప్రజల డిమాండ్ మేరకు బోనులు ఏర్పాటుచేసి తరచుగా చిరుతలను బంధిస్తున్నారు.
బీబీసీ మరాఠీతో శిరూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నీల్‌కాంత్ గవానే మాట్లాడుతూ, "తెల్లవారుజాము, రాత్రిపూటలను చిరుతలు యాక్టివ్‌గా ఉండే సమయాలుగా పరిగణిస్తారు. అప్పుడే అవి వేటాడేందుకు బయటకు వస్తాయి. అలాంటి సమయాల్లో అటవీ శాఖ ప్రత్యేక గస్తీ బృందాలను గ్రామాలకు పంపుతోంది. ఆ సమయంలో గ్రామస్థులు, రైతులు, ఆవు పాలు పితికే వ్యక్తులకు చిరుతపులి గురించి అవగాహన కల్పిస్తున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఈ సమస్య జున్నార్‌కే పరిమితం కాదు...
చిరుతలు-మనుషుల మధ్య ఘర్షణ జున్నార్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు ఈ సమస్య మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది.
ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారు? అని ప్రజలు అడుగుతున్నారు.
గతంలో చిరుతపులి దాడులు జున్నార్, అంబేగావ్ తాలూకాలకే పరిమితమయ్యాయి. అయితే, ఇప్పుడు చిరుతల సంఖ్య పెరుగుతోంది. చెరకు సాగు కూడా పెద్ద ఎత్తున పెరిగింది. దీని కారణంగా, చిరుతపులి దాడుల సమస్య కూడా జున్నార్ వెలుపల ఉన్న శిరూర్, దౌండ్, కొంతవరకు బారామతి, ఇందాపూర్ ప్రాంతాల వరకూ విస్తరించింది.
పుణె జిల్లాతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా చిరుత-మానవ సంఘర్షణ పెరిగింది.
ఈ సమస్య గురించి వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)లో వన్యప్రాణి పరిశోధకుడు కుమార్ అంకిత్ మాట్లాడుతూ, ''గత మూడు దశాబ్దాలుగా చెరకు సాగు విస్తరణ వల్ల చిరుతలు నివసించడానికి, వాటి పిల్లలను పెంచుకోవడానికి, అవి సురక్షితంగా జీవించడానికి కొత్త ప్రదేశాలు లభించాయి. చెరకు కోత సమయంలో వాటి పిల్లల కదలికలు పెరుగుతాయి. అప్పుడే అవి మనుషుల దగ్గరగా వస్తాయి'' అని వివరించారు.
డబ్ల్యూఐఐకి చెందిన మరో ప్రొఫెసర్ బిలాల్ హబీబ్ కూడా చాలా సంవత్సరాలుగా మహారాష్ట్రలోని వన్యప్రాణులకు సంబంధించి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, గత ఐదేళ్లలో పులుల దాడులకు మహారాష్ట్రలో 200 మందికిపైగా మరణిస్తే, వాటిలో అధిక భాగం విదర్భ ప్రాంతంలోనే జరిగాయి.
చిరుతపులుల సంఖ్య అదుపు తప్పుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రయత్నాలు సరిపోవని బాధితులు అంటున్నారు.
శివాన్య తండ్రి శైలేశ్ బొంబే మాట్లాడుతూ, "మేము చాలాసార్లు అధికారులకు సమాచారం ఇచ్చాం. ఇటీవల మా గ్రామంలో జరిగిన సంఘటన ఏడోదో, ఎనిమిదోదో. ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారు, పరామర్శిస్తారు, వెళ్లిపోతారు. కానీ ఏమీ జరగదు. రైతుల జీవితం ఇంత అలుసైపోయిందా? ఇది కుక్కచావుతో సమానం. కనీసం కుక్కలైనా బాగున్నాయి, వాటికి ప్రత్యేక గదులు ఉన్నాయి. మేము పట్టపగలు కూడా భయపడుతూ బతుకుతున్నాం'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
చిరుతపులిని వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్-Iలో చేర్చారు. ఇది దానికి అత్యున్నత రక్షిత జాతి హోదాను ఇస్తుంది.

ఫొటో సోర్స్, DIO, Pune
చిరుతపులి కనిపిస్తే చంపేయండి: అటవీ మంత్రి గణేశ్ నాయక్
మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి గణేశ్ నాయక్ నవంబర్ 12వ తేదీన శిరూర్ తాలూకాలోని జంబుత్ వద్ద మాట్లాడుతూ, గ్రామాల్లో తరచుగా దాడి చేసే అనుమానిత చిరుతపులి కనిపిస్తే చంపేయండి అని ఆదేశించారు.
"చిరుతపులులు గ్రామాల్లో వీధి కుక్కల మాదిరిగానే సంచరిస్తున్నాయి. కాబట్టి, వాటి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.
చిరుతపులుల సంతాన నియంత్రణకు స్టెరిలైజేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి నాయక్ వెల్లడించారు. అడవుల పరిసరాల్లో వెదురు నాటడం ద్వారా చిరుతపులులను నిలువరించవచ్చా అనే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.
కుమార్ అంకిత్ 'బీబీసీ మరాఠీ'తో మాట్లాడుతూ, 2014 నుంచి చిరుతపులి-మానవ సంఘర్షణ క్రమంగా పెరుగుతోందని చెప్పారు.
''ఈ ప్రాంతంలో చిరుతపులుల సాంద్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఆరు నుంచి ఏడు వరకూ చిరుతలు కనిపిస్తాయి'' అని వివరించారు.
"చిరుతపులుల సంతతిని సమర్థవంతంగా నియంత్రించకపోతే, రాబోయే రోజుల్లో ప్రజల మనసుల్లో భయం పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో, చిరుత దాడులు కూడా గణనీయంగా పెరగవచ్చు. కాబట్టి, ఈ సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, పరిష్కరించాలి" అని కుమార్ అంకిత్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














