ఐ బొమ్మ రవి: సోషల్ మీడియాలో ఆయనకు ఎందుకంత మద్దతు? ఆయన నేరాలు రుజువైతే శిక్షలు ఏంటి?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసి ఆయన దగ్గర్నుంచి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకుని విశ్లేషించగా.. కీలక విషయాలు తెలిశాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
"రవి వద్ద 21వేల సినిమాలు, 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డాటా ఉంది" అని సజ్జనార్ చెప్పారు.
రవి అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో చర్చ
ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత ఆయన చుట్టూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది.
పైరసీ, డాటా చోరీ, కాపీ రైట్ వంటి నేరాలకు రవి పాల్పడినట్టు పోలీసులు చెబుతుండగా, చిత్రంగా అదే సమయంలో ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.

నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అదీ సినిమా పైరసీ, డాటా చోరీ వంటి నేరాలకు పాల్పడ్డాడని చెబుతున్న ఇమంది రవికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెట్టడం ఇప్పుడు పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో " సపోర్టు రవి, వియ్ సపోర్టు రవి" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రవి అరెస్టు విషయాలను సజ్జనార్ వెల్లడించిన తర్వాత.. ఆ వివరాలతో బీబీసీ ఒక వీడియో చేసింది.
ఆ వీడియో కింద సైతం రవికి మద్దతుగా పెట్టిన కామెంట్లే ఎక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తెరపైకి టికెట్, పాప్ కార్న్ రేట్లు
నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే, ఇలా పాజిటివ్ కామెంట్లు రావడం, పోస్టులు పెట్టడంపై సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది.
సినిమా పైరసీని సమర్థించడం లేదని చెబుతూనే, సినిమా టికెట్ రేట్ల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు.
సినిమా టికెట్ల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయని, సినిమా విడుదలైన రెండు వారాలపాటు రేట్లు పెంచడం కారణంగా థియేటర్లకు వెళ్లి చూడటం భారంగా ఉంటోందని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు యూజర్లు.
ఇక థియేటర్ కు వెళ్లినప్పుడు అక్కడ పాప్ కార్న్ రేట్లు, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయనేది నెటిజన్ల నుంచి వస్తున్న వాదన.
సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే, ప్రజలు పైరసీవైపు వెళ్లే పరిస్థితి ఉండదు కదా.. అని వాదిస్తున్నవారూ ఉన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుని మొదటి రెండు వారాలపాటు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే పాప్‌కార్న్ రేట్ల విషయంలోనూ జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయినప్పటికీ, పాప్‌కార్న్, బెవరేజస్ లూజ్ సేల్స్ పేరుతో రూ.150 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు సినీ ప్రేక్షకులు.
‘రూ.30 ఉండే పాప్ కార్న్ రూ.700 వరకు అమ్ముతుంటే, సినిమాలు ఏ విధంగా చూసేది’ అని ప్రభాకర్ చౌటి అనే వ్యక్తి ట్విటర్(ఎక్స్)లో ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

టికెట్ రేట్లపై ఇండస్ట్రీ స్పందన
ఇదే విషయంపై సోమవారం మీడియా సమావేశంలో సినీ ప్రముఖులని ప్రశ్నించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ విషయంపై వారు స్పందించకుండానే మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
అయితే, సినిమా టికెట్ల రేట్లు అందుబాటులో ఉండాలనేది మా అభిప్రాయం కూడా అని బీబీసీతో చెప్పారు నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు.
"సినిమా టికెట్ల రేట్లు తగ్గించడానికి మావంతుగా ఎఫ్‌డీసీ తరఫున ప్రయత్నిస్తాం. టికెట్ల రేట్ల విషయంలో అందరితో మాట్లాడి అభిప్రాయం తీసుకుంటాం. టికెట్ రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేమూ కోరుకుంటున్నాం" అని చెప్పారు దిల్ రాజు.
సినిమా టికెట్ రేట్లను చూపిస్తూ పైరసీ సినిమాలు చూస్తామని చెప్పడం ఏ మాత్రం సహేతుకంకాదని రాజు అన్నారు.

మీమ్స్ పై సీరియస్
మరోవైపు, రవికి మద్దతుగా మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు కొందరు యూజర్లు. శివాజీ సినిమాలో.. రజనీకాంత్ అరెస్టు అయ్యాక పోలీసులు కొడుతున్న సీన్‌ను స్పూఫ్ చేసి.. రవిని కొట్టలేమంటూ చెబుతున్నట్లుగా మీమ్స్ చేసి పెట్టారు కొందరు సోషల్ మీడియా యూజర్లు.
ఇలాంటి మీమ్స్ పోలీసుల దృష్టికి వెళ్లాయి.
మీమ్స్, సోషల్ మీడియాలో రవికి మద్దతుగా పోస్టులు పెట్టడాన్ని స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు.
"అతను సినిమాలు పైరసీ చేసి ఉచితంగా మీకు చూపిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ, వెబ్‌సైట్ల ద్వారా మీ వ్యక్తిగత డాటాను తీసుకోవడంతో సైబర్ క్రైమ్స్, ఏదో ఒక క్రైమ్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది" అని చెప్పారు.
సమాచారం అంతా డాటా వెబ్‌లో ఉంటుందని, సైబర్ నేరగాళ్లు డాటా వాడుకునే అవకాశం ఉందంటూ హెచ్చరించారు సజ్జనార్.

సినీ ప్రముఖులు ఏమంటున్నారంటే..
రవి అరెస్టుపై సినీ ప్రముఖులు స్పందించారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమ ఎంతో నష్టపోతోందని చెప్పారు.
"నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఎలా హానికరమో, పైరసీ సినిమాలు అదే స్థాయిలో హానికరం. ఉచితంగా సినిమాలు చూస్తున్నామని జనం భావిస్తున్నారు. కానీ, దాని చాటున వ్యక్తిగత డాటాను వారు సేకరిస్తున్నారు. ఈ విషయం గుర్తించాలి" అని బీబీసీతో చెప్పారు నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు.
ఐబొమ్మ రవి సినిమా పైరసీ కాపీలను వెబ్‌సైట్లలో పెడుతున్నాడనీ, వేరొకరి సొత్తును చోరీ చేస్తున్నాడనీ అన్నారాయన. ఈ విషయంలో అతనేమీ రాబిన్ హుడ్ కాదని అభిప్రాయపడ్డారు.
తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ పైరసీ సెల్ నుంచి సినిమా పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లుగా చెప్పారు నిర్మాత దిల్ రాజు.
"ప్రతి సినిమాకు ఎంతో కష్టం ఉంటుంది. దాన్ని ఇల్లీగల్‌గా చూడటం మానేసి మూడు వారాల తర్వాతనో, నాలుగు వారాల తర్వాతనో ఓటీటీలో కూడా చూడొచ్చు" అని దిల్ రాజు చెప్పారు.
లైట్‌మెన్ నుంచి థియేటర్ బయట వాచ్‌మెన్ వరకు ఎంతోమంది సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నారని నటుడు చిరంజీవి అన్నారు. అలాంటివారి శ్రమను దోచుకోవడం సరికాదని చెప్పారు.
ఐబొమ్మ రవి అరెస్టు సినిమా సూపర్ హిట్ సీన్‌లా ఉందని దర్శకుడు రాజమౌళి అన్నారు. తనను పట్టుకోలేరని ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకులు పెట్టిన పోస్టును ప్రస్తావించారు.
వారు సవాల్ చేస్తే, పోలీసులు చాలెంజింగ్‌గా తీసుకుని రవిని అరెస్టు చేశారని అన్నారు రాజమౌళి.
‘‘ఏదీ ఉచితంగా రాదు. సినిమాలు ఉచితంగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. వెబ్‌సైట్ల నిర్వాహకులకు డబ్బును ప్రజలే ఇస్తున్నారు. పర్సనల్ డాటాను విక్రయించడం ద్వారా ఇస్తున్నారు. పేరు, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు ఇవ్వడం ద్వారా వాటిని నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు’’ అని అన్నారు రాజమౌళి.
సినిమా పరిశ్రమకంటే కూడా ప్రజలే ఎక్కువ నష్టపోతున్నారని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి నేరాలకు శిక్షేంటి?
రవిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై బీఎన్ఎస్, ఐటీ, కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
వీటి కింద నేరం రుజువైతే ఉల్లంఘన తీవ్రతనుబట్టి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాలు పడే అవకాశం ఉంది.
ఇమంది రవిపై ఐటీ యాక్టులోని 66సీ, 66ఇ కింద కేసులు పెట్టారు పోలీసులు. భారత న్యాయ సంహితలోని 318(4) ఆర్/డబ్ల్యూ 3(5), కాపీ రైట్ యాక్టు 63, 65 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మోసపూరితంగా వేరొకరి ఐడెంటిటీని దొంగిలించడం.. డిజిటల్ సిగ్నేచర్, పాస్‌వర్డ్, ఇతరత్రా ముఖ్యమైన ఐడీలు దొంగిలించారనే అభియోగాలపై ఐటీ యాక్టులోని 66సీ సెక్షన్ కింద కేసు పెడతారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఇ అనేది గోప్యతకు సంబంధించినది. ఎవరైనా వ్యక్తి అనుమతి లేకుండా వారి ప్రైవేటు ఫోటోలు తీసుకోవడం, వేరొకరికి పంపించడం ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు.
దీనికింద నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2లక్షల వరకు జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.
బీఎన్ఎస్ చట్టంలోని 318(4) సెక్షన్ మోసానికి సంబంధించినది. తప్పుడు పద్ధతుల్లో వ్యక్తులను ప్రభావితం చేసి వారి ఆస్తిని తీసుకుని ఎవరికైనా అప్పగించడం ఈ నేరం కిందకు వస్తుంది.
318(4) సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
కాపీరైట్ చట్టం సెక్షన్ 63 ఉల్లంఘించినట్లుగా నేరం రుజువైతే కనిష్ఠంగా ఆరు నెలలు, గరిష్ఠంగా మూడేళ్ల వరకు జరిమానాతో కలిపి శిక్ష పడే అవకాశం ఉంది.
ఇక ఇదే చట్టంలోని సెక్షన్ 65 కింద నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు, జరిమానా పడే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














