సింధ్: పాకిస్తాన్‌లోని ఈ ప్రాంతం భారత్‌లో భాగం కావొచ్చని రాజ్‌నాథ్ సింగ్ ఎందుకన్నారు?

పాకిస్తాన్, సింధ్, హిందువులు, సింధు లోయ నాగరికత, రాజ్‌నాథ్‌సింగ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

సింధ్ ప్రావిన్స్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. దానిని 'విస్తరణవాద ఆలోచన'గా అభివర్ణించింది.

‘‘ఇది రెచ్చగొట్టేలా, వక్రీకరించేలా ఉన్న ప్రకటన’’ అని పాకిస్తాన్ విమర్శించింది.

"సింధ్ భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికతాకోణంలో చూస్తే, ఇది ఎప్పుడూ భారత్‌లో భాగంగానే ఉంటుంది" అని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం (నవంబరు 23న) అన్నారు.

"సరిహద్దులు మారవచ్చు, ఏమో ఎవరికి తెలుసు, రేపు సింధ్ మళ్ళీ భారత్‌లో భాగం కావొచ్చు" అని ఆయన అన్నారు.

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సింధ్‌లోనే కాదు, మొత్తం భారత్‌లో హిందువులు సింధు నదిని పవిత్రంగా భావిస్తారని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు.

1947 విభజన తర్వాత సింధ్ పాకిస్తాన్‌లో భాగమైంది. అప్పుడు వలసల్లో లక్షలాది హిందూ సింధీ కుటుంబాలు అక్కడి నుండి వచ్చి భారత్‌లో స్థిరపడ్డాయి.

ఎల్‌.కె. అడ్వాణీ తన బాల్యాన్ని సింధ్‌లో గడిపారు. ఆయన కుటుంబం భారత్ వలస వచ్చి స్థిరపడింది. 2005లో ఆయన సింధ్‌ను సందర్శించారు. అక్కడినుంచి కరాచీ వెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్, సింధ్, హిందువులు, సింధు లోయ నాగరికత, రాజ్‌నాథ్‌సింగ్

ఫొటో సోర్స్, Muhammed Semih Ugurlu/Anadolu Agency via Getty Images

ఫొటో క్యాప్షన్, సింధ్ ప్రావిన్సుకు గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది.

విభజన సమయంలో పాకిస్తాన్‌లో భాగమైన సింధ్

బ్రిటిష్ ఇండియాలో, సింధ్ ప్రాంతం బొంబాయి ప్రావిన్స్ పరిధిలోకి వచ్చింది.

విభజన తర్వాత భారత్ ఎంచుకున్న జాతీయ గీతంలో కూడా సింధ్ పేరు ఉంటుంది.

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, సింధ్‌కు ప్రస్తుతం భారత్‌లో తూర్పున గుజరాత్, రాజస్థాన్, వాయువ్య దిశలో బలూచిస్తాన్, ఈశాన్య దిశలో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులుగా ఉన్నాయి.

ఈ ప్రాంతం సింధు డెల్టాలో ఉంది. ఈ నది పేరుతోనే సింధ్ అనే పేరు వచ్చింది.

సింధ్ ప్రభుత్వ మానవ హక్కుల కమిషన్ ప్రకారం, ఈ ప్రావిన్స్‌లో 30 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 5 కోట్ల 5 లక్షల జనాభా ఉంది.

సింధ్ ప్రావిన్స్ మొత్తం వైశాల్యం 1 లక్షా 40 వేల చదరపు కిలోమీటర్లు.

2017 జనాభా లెక్కల ప్రకారం , ఈ ప్రావిన్స్‌లో ముస్లిం జనాభా 91.3 శాతం, హిందూ జనాభా 6.5 శాతం ఉంది. సింధ్‌లోని ఉమర్‌కోట్ జిల్లా ఇప్పటికీ హిందువులు ఎక్కువున్న జిల్లా.

బీబీసీ ఉర్దూ నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో స్థిరపడిన హిందువులలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు.

పాకిస్తాన్, సింధ్, హిందువులు, సింధు లోయ నాగరికత, రాజ్‌నాథ్‌సింగ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మొహెంజోదారో సింధులోయ నాగరికతలో భాగంగా ఉంది.

సింధు లోయ నాగరికత

ప్రస్తుత సింధ్ ప్రావిన్స్‌ను పురాతన భారతదేశంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా భావిస్తారు. పురాతన సింధు లోయ నాగరికత సింధు నది ఒడ్డున అభివృద్ధి చెందింది.

మొహెంజోదారోను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పట్టణంగా భావిస్తారు. సింధు నది ఒడ్డున ఉన్న దాదాపు 4వేల సంవత్సరాల పురాతనమైన ఈ నగరాన్ని గత శతాబ్దంలో గుర్తించారు.

మొహెంజొదారో శిథిలాలను 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.

బ్రిటానికా ప్రకారం, సింధ్‌ను అరబ్బులు క్రీస్తుశకం 711లో జయించారు. 16,17వ శతాబ్దాలలో మొఘలులు (1591–1700) , తర్వాత అనేక స్వతంత్ర సింధీ రాజవంశాలు పాలించాయి.

మొఘల్ చక్రవర్తి అక్బర్ 1542 వసంవత్సరంలో సింధ్‌లోని ఉమర్‌కోట్ కోటలో జన్మించారు.

ఈ ప్రాంతాన్ని 1843 లో బ్రిటిష్ వారు ఆక్రమించారు.

ఇక్కడి సింధీ హిందూ కుటుంబాలు వ్యాపారం, ఆర్థిక రంగాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి, కానీ విభజన తరువాత వలసల సమయంలో, చాలా కుటుంబాలు భారత్ లేదా ఇతర దేశాలకు వలసపోయాయి.

సింధు నది చాలా కాలంగా సంపన్న ప్రాంతంగా ఉంది. పత్తి సాగుకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంత రాజధాని కరాచీ ఇప్పటికీ పాకిస్తాన్ ప్రధాన పారిశ్రామిక కేంద్రాలలో ఒకటి.

పాకిస్తాన్, సింధ్, హిందువులు, సింధు లోయ నాగరికత, రాజ్‌నాథ్‌సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మక్లీ నెక్రోపోలిస్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.

సింధ్ సాంస్కృతిక కేంద్రంగా ఉన్న మక్లీ నెక్రోపోలిస్

సాంస్కృతికంగా ఇది చాలా సంపన్నప్రాంతం. ఇక్కడ అనేక పురాతన ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది.

కరాచీ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్లీ హిల్ నెక్రోపోలిస్‌లో అనేక పురాతన సమాధులు ఉన్నాయి.

యునెస్కో వెబ్‌సైట్ ప్రకారం, పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లోని ఠట్టా సమీపంలో ఉన్న మక్లీ నెక్రోపోలిస్, ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రత్యేకమైన స్మశానవాటికలలో ఒకటి.

ఇక్కడ సాధువులు, కవులు, ప్రభువులు, గవర్నర్లు, యువరాజులు, చక్రవర్తులు, రాణుల సమాధులు, స్మారకచిహ్నాలున్నాయి.

ఠట్టాలోని మక్లీలో ఉన్న ఈ చారిత్రక కట్టడాలు దాదాపు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఐదు లక్షల సమాధులున్నాయి.

ఇక్కడి నిర్మాణ శైలి ముస్లిం, హిందూ, పర్షియన్, మొఘల్, గుజరాతీ ప్రభావాల మిశ్రమంగా కనిపిస్తుంది. ఈ సమాధులు ముఖ్యంగా వాటి బ్లూ టైల్స్, శిల్పాలు, అందమైన చేతి రాతకు, అద్భుతమైన రేఖాగణిత నమూనాలకు ఫేమస్. ఒకప్పుడు ఇక్కడ విలసిల్లిన శక్తివంతమైన నాగరికతలోని సృజనాత్మకత, ఆధ్యాత్మికతలను ఇవి ప్రతిబింబిస్తాయి.

14 వ,17వ శతాబ్దాల మధ్య ఠట్టా ప్రాంతం విద్య, కళలు, సాంస్కృతిక రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. సింధ్ ప్రాంతం సాంస్కృతిక వారసత్వాన్ని రూపొందించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది.

పాకిస్తాన్, సింధ్, హిందువులు, సింధు లోయ నాగరికత, రాజ్‌నాథ్‌సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరిహద్దులు మారవచ్చని, తర్వాతిరోజుల్లో సింధ్ భారత్‌లో భాగం కావొచ్చని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.

మతమార్పిడి వివాదాలు

హిందూమత స్థలాలపై దాడులు, మత మార్పిడులకు సంబంధించి కూడా సింధ్ ప్రావిన్స్ వార్తల్లో ఉంటోంది.

సింధ్‌లోని హిందూ, క్రైస్తవ కుటుంబాలను బలవంతంగా మతం మారుస్తున్నారని 2021లో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ ఆరోపించారు .

పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ కూడా తన నివేదికలలో ఒకదానిలో సింధ్‌లో హిందూ బాలికలను బలవంతంగా మతంమార్చుతున్నట్టు తెలిపింది.

పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ను తిరిగి పంపించకపోతే హిందూమత ప్రదేశాలు, ఇళ్లపై దాడి చేస్తామని 2023లో బెదిరింపులు వచ్చాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)