రూ.20కోట్లకు పైగా పలికిన ఈ జేబు గడియారానికి, టైటానిక్ ఓడకు ఏమిటి సంబంధం?

టైటానిక్, ప్రమాదం, బంగారం వాచ్, ప్రేమకథ

ఫొటో సోర్స్, BNPS

    • రచయిత, రాస్ మెక్‌కీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టైటానిక్‌ ఓడ ప్రమాదంలో చనిపోయిన సంపన్న ప్రయాణికుడికి చెందిన ఓ జేబు గడియారం ( పాకెట్ వాచ్‌) వేలంలో దాదాపు 20 కోట్ల 9 లక్షలరూపాయలు (1.78మిలియన్ పౌండ్లు) రికార్డు స్థాయి ధర పలికింది.

సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్‌కు ప్రయాణిస్తూ 1912ఏప్రిల్ 14న ఐస్‌బర్గ్‌ను ఢీకొట్టి టైటానిక్ మునిగిపోయిన ప్రమాదంలో 1,500మందికిపైగా మరణించారు. వారిలో ఇసిడోర్ స్ట్రాస్, ఆయన భార్య ఐడా ఉన్నారు.

ప్రమాదం జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన మృతదేహాన్ని అట్లాంటిక్ నుంచి బయటకు తీశారు. ఆయనకు సంబంధించిన వస్తువుల్లో జూల్స్ జుర్గెన్‌సెన్ కంపెనీకి చెందిన 18క్యారెట్ల బంగారు జేబు గడియారం కూడా ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టైటానిక్, ప్రమాదం, బంగారం వాచ్, ప్రేమకథ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టైటానిక్ ప్రమాదంలో ఐసిడార్ స్ట్రాస్, ఆయన భార్య ఐడా చనిపోయారు.

‘తుది శ్వాస దాకా భర్తతోనే’

స్ట్రాస్ కుటుంబం దగ్గర ఆ గడియారం ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని వేలం వేశారు. విల్ట్‌షైర్‌‌‌లోని డివైజెస్‌ ప్రాంతంలో ఉన్న హెన్రీ అల్డ్‌రిడ్జ్ అండ్ సన్ అనే వేలం సంస్థ శనివారం(నవంబరు 21) ఆ గడియారాన్ని వేలంలో విక్రయించింది.

స్ట్రాస్ బవేరియా సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, న్యూయార్క్‌లోని మాసీస్ డిపార్ట్‌మెంట్ స్టోర్ సహ యజమాని.

టైటానిక్ మునిగిపోతున్న రాత్రి, భర్తను వదిలేసి లైఫ్‌బోట్‌ ఎక్కడానికి స్ట్రాస్ భార్య నిరాకరించారని, భర్తతో పాటే చనిపోతానని ఆమె అన్నట్టు చెప్పుకుంటుంటారు.

అయితే ఐడా స్ట్రాస్ మృతదేహం దొరకలేదు.

టైటానిక్, ప్రమాదం, బంగారం వాచ్, ప్రేమకథ

ఫొటో సోర్స్, BNPS

ఫొటో క్యాప్షన్, 1888లో ఐడా తన భర్తకు వాచ్ బహుమతిగా ఇచ్చినట్టు చెప్పుకుంటారు.

టైటానిక్ వస్తువులకు రికార్డు ధరలు

టైటానిక్‌లో ప్రయాణిస్తూ అక్కడి స్టేషనరీపై ఐడా స్ట్రాస్ లేఖ రాసి పోస్టు చేశారు. ఆ లేఖ 11కోట్లకు పైగా (1,00,000పౌండ్లు) ధరకు అమ్ముడుపోయింది.

టైటానిక్ ప్రయాణికుల జాబితాను దాదాపు కోటీ 22లక్షల(1,04,000 పౌండ్లు)కు కొనుగోలు చేశారు. టైటానిక్ ప్రయాణికులను ఆర్ఎమ్ఎస్ కర్పాథియా సిబ్బంది ప్రమాదం నుంచి కాపాడారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు ఆర్ఎమ్ఎస్ కర్పాథియా సిబ్బందికి ఓ గోల్డ్ మెడల్ బహూకరించారు. అది వేలంలో 99 లక్షల16వేలరూపాయల(86,000పౌండ్లు)కు అమ్ముడుపోయింది.

టైటానిక్‌ జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువులు వేలంలో మొత్తం దాదాపు 3కోట్ల 49 లక్షల (3మిలియన్ పౌండ్లు)కు అమ్ముడుపోయాయి.

టైటానిక్, ప్రమాదం, బంగారం వాచ్, ప్రేమకథ

ఫొటో సోర్స్, BNPS

ఫొటో క్యాప్షన్, ఐడా స్ట్రాస్ రాసిన లేఖ

టైటానిక్ మునిగిపోయిన క్షణం దగ్గర ఆగిన వాచ్

పాకెట్ వాచ్ 2:20 గంటల దగ్గర ఆగిపోయింది. ఆ క్షణంలోనే టైటానిక్ సముద్రం అలల్లో మునిగిపోయింది.

ఈ గడియారాన్ని ఐడా స్ట్రాస్ 1888లో తన భర్తకు ఇచ్చిన 43వ పుట్టినరోజు బహుమతిగా భావిస్తారు. వాచ్‌పై స్ట్రాస్ మొదటి అక్షరాలున్నాయి.

ఆ వాచ్‌ను ఆయన కుటుంబానికి అప్పగించారు. తరతరాలుగా అది ఒకరినుంచి మరొకరికి అందింది. ఐసిడార్ ముని మనవడు కెన్నెథ్ హోల్లిస్టర్ స్ట్రాస్ దాన్ని మరమ్మతు చేయించి దాచిపెట్టారు.

టైటానిక్, ప్రమాదం, బంగారం వాచ్, ప్రేమకథ

ఫొటో సోర్స్, BNPS

ఫొటో క్యాప్షన్, వాచ్ రూ.20కోట్లకుపైగా ధర పలికింది

'అద్వితీయ ప్రేమకథ'

గడియారానికి ప్రపంచంలోనే రికార్డు స్థాయి ధర పలకడం టైటానిక్ కథపై ప్రజల్లో ఇప్పటికీ ఉన్న ఆసక్తిని తెలియజేస్తోందని వేలం నిర్వాహకులు ఆండ్రూ అల్‌డ్రిడ్జ్ చెప్పారు.

''పిల్లలు, మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా టైటానిక్‌లో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి, సిబ్బందికి సంబంధించి ఓ కథ ఉంది. 113ఏళ్ల తర్వాత వారికి సంబంధించిన వస్తువులు ఆ కథలు చెబుతున్నాయి'' అని ఆయనన్నారు.

''స్ట్రాస్ దంపతుల ప్రేమ కథ అద్వితీయమైనది. టైటానిక్ మునిగిపోతుంటే తన భర్తను వదిలి వెళ్లడానికి ఐడా నిరాకరించారు. ఇప్పుడు వారి గడియారానికి రికార్డు స్థాయి ధర పలకడం వారి ప్రేమకు దక్కిన గౌరవం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

700మందికిపైగా టైటానిక్ ప్రయాణికులను రక్షించిన స్టీమ్‌షిప్ కర్పాథియా కెప్టెన్‌కు బహూకరించిన గోల్డ్ పాకెట్ వాచ్ గత ఏడాది 18కోట్ల 25లక్షల (1.56మిలియన్ పౌండ్లు) ధరకు అమ్ముడుపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)