దుబయ్‌లో తేజస్ క్రాష్‌తో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ఎవరు?

వింగ్ కమాండర్, తేజస్, సుఖోయ్, యుద్దవిమానం

ఫొటో సోర్స్, @Suryakiran_IAF

నవంబరు 21న దుబయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయి పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మరణించారు.

దుబయ్‌లోని అల్ మఖ్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, స్థానిక సమయం మధ్యాహ్నం 2:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

టేకాఫ్ అయిన వెంటనే తేజస్ కింద పడిపోవడం, దాని నుంచి మంటలు రావడం వీడియోలో కనిపిస్తోంది.

పైలట్ నమాన్ష్ స్యాల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందినవారు.

"దుబయ్ ఎయిర్ షోలో జరిగిన తేజస్ విమాన ప్రమాదంలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన నమాన్ష్ స్యాల్ మరణించిన వార్త చాలా బాధ కలిగించింది" అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

"దేశం అంకితభావం కలిగిన, ధైర్యవంతుడైన పైలట్‌ను కోల్పోయింది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. స్యాల్‌ పరాక్రమానికి, దేశ సేవ పట్ల ఆయన అంకితభావానికి నా హృదయపూర్వక నివాళి'' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం ప్రకటన చేసింది.

"శుక్రవారం(నవంబరు 21) దుబయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తేజస్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబానికి భారత వైమానిక దళం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. వారికి అండగా ఉంటుంది. ప్రమాద కారణాన్ని గుర్తించేందుకు విచారణ నిర్వహిస్తాం" అని పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిర్ షో వీడియో కోసం వెతుకుతున్న తండ్రి

"శుక్రవారం సాయంత్రం 4 గంటలకు, నేను యూట్యూబ్‌లో ఎయిర్ షో వీడియో కోసం వెతుకుతున్నా. అప్పుడు నాకు విమాన ప్రమాదం గురించి ఒక వార్త కనిపించింది. వెంటనే, నా కోడలికి ఫోన్ చేశాను. ఆమె కూడా వింగ్ కమాండర్. ఏమైందో తెలుసుకోమన్నా. అంతలోనే ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు మా ఇంటికి వచ్చారు. ఏదో జరిగిందని నాకు అర్ధమైంది" అని ఆయన తండ్రి జగన్నాథ్ స్కాల్ అన్నారు.

జగన్నాథ్ స్యాల్ ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, జగన్నాథ్ స్యాల్, ఆయన భార్య వీణా స్యాల్ ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరులో.. వాళ్లబ్బాయి నమాన్ష్ ఇంట్లో ఉన్నారు.

తన మనవరాలు ఆర్య స్యాల్‌ను చూసుకోవడానికి రెండు వారాల కిందట కాంగ్రాలోని తమ గ్రామం నుంచి కోయంబత్తూర్‌కు వచ్చినట్లు ఆయన ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు. నమాన్ష్ భార్య కోల్‌కతాలో శిక్షణ పొందుతున్నారు.

2009లో ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోర్సు) క్లియర్ చేసి, నమాన్ష్ డిఫెన్స్‌లో చేరారు. నమాన్ష్ బాగా చదివేవాడని ఆయన తండ్రి చెప్పారు.

"మాకు సమాచారం ఇచ్చేందుకు వచ్చిన వైమానిక దళ అధికారులు మృతదేహం ఎప్పుడు వస్తుందనే నిర్దిష్ట సమయం చెప్పలేదు. అయితే, మిగిలిన ప్రక్రియలను పూర్తి చేయడానికి రెండు రోజులు సమయం పడుతుందని చెప్పారు'' అని నమాన్ష్ తండ్రి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

వింగ్ కమాండర్, తేజస్, సుఖోయ్, యుద్దవిమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింగిల్ ఇంజిన్ తేజస్

నమాన్ష్‌కు ప్రముఖుల నివాళులు

"దుబయ్ ఎయిర్ షోలో జరిగిన తేజస్ విమాన ప్రమాదంలో హిమాచల్‌లోని వీరభూమి కాంగ్రా జిల్లాకు చెందిన నమాన్ష్ స్యాల్ మరణించారనే వార్త చాలా బాధాకరం" అని హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ ఎంపీ, బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ పోస్ట్ చేశారు.

ఈ ప్రమాదంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.

"దుబయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా ధైర్యవంతుడైన భారత వైమానిక దళ పైలట్‌ను కోల్పోవడం తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ఆయన కుటుంబానికి అండగా ఉంటుంది" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

తేజస్ విమానం కూలిపోవడంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్, భారత సాయుధ దళాల అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

వింగ్ కమాండర్, తేజస్, సుఖోయ్, యుద్ద విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2004 నుంచి తేజస్‌లో అప్‌గ్రేడ్ అయిన ఇంజిన్లు వాడుతున్నారు.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్

సింగిల్ ఇంజిన్ తేజస్ యుద్ధ విమానాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది.

ఈ విమానం దూరం నుంచి శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. అలాగే శత్రు రాడార్ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. భారీ సుఖోయ్ లాగానే ఇది కూడా అంతే సంఖ్యలో ఆయుధాలు, క్షిపణులను మోసుకెళ్లగలదు.

2004 నుంచి అప్‌గ్రేడ్ చేసిన ఎఫ్404-జీఈ-ఐఎన్20 ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను తేజస్ ఉపయోగిస్తోంది. తేజస్ మార్క్ 1 వేరియంట్ ప్రస్తుతం ఎఫ్404 ఐఎన్20 ఇంజిన్‌ను ఉపయోగిస్తోంది.

మార్క్ 1ఎ వెర్షన్‌లో కూడా ఇదే ఇంజిన్‌ను ఉపయోగిస్తారు. భవిష్యత్తులో తేజస్ మార్క్ 2 మరింత శక్తివంతమైన జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్414 ఐఎన్ఎస్6 ఇంజిన్‌తో ఉంటుంది.

తేజస్ యుద్ధ విమానాలు సుఖోయ్ యుద్ధ విమానాల కంటే తేలికైనవి. ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల పేలోడ్‌ను మోయగలవు. ఇవి 52,000 అడుగుల ఎత్తు వరకూ ఎగురుతాయి.

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, భారత రక్షణ మంత్రిత్వ శాఖ 97 తేజస్ విమానాలను కొనుగోలు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2027లో డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

2021 ప్రారంభంలో, భారత ప్రభుత్వం 83 తేజస్ విమానాల కోసం హెచ్ఏఎల్‌తో ఒప్పందంపై సంతకం చేసింది. 2024లో ఇవి అందాల్సి ఉంది. కానీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఇంజిన్ల కొరత కారణంగా ఇది ఆలస్యమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)