దుబయ్ ఎయిర్ షోలో కూలిపోయిన భారత యుద్ధ విమానం తేజస్, పైలట్ మృతి

ఫొటో సోర్స్, Getty Images
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన దుబయ్ ఎయిర్ షోలో భారత్ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోయింది. దుబయ్ ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోయినట్లు భారత వైమానిక దళం ధృవీకరించింది. ఈ ప్రమాదంలో పైలట్ తీవ్రగాయాలతో మరణించినట్టు తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి పీటీఐ ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియో విమానం నేలపైన పడిపోవడం, తరువాత మంటలు, పెద్ద ఎత్తున పొగ కనిపిస్తున్నాయి.
''ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల సమయంలో విమానం కూలిపోయింది'' పీటీఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
''దుబయ్‌లోని రెండో అతిపెద్ద విమానాశ్రయమైన అల్‌మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీగా పొగ ఎగిసింది. ఎయిర్‌పోర్టులో సైరన్లు అదే పనిగా మోగాయి'' అని అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
తేజస్ ప్రత్యేకత ఏమిటి?
సింగిల్ ఇంజిన్ తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఈ విమానం దూరం నుండి శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, శత్రు రాడార్ నుంచి కూడా తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇది సుఖోయ్ యుద్ధ విమానం తరహాలోనే భారీగా ఆయుధాలు, క్షిపణులను మోయగలదు. 2004 నుండి నవీనకరించిన ఎఫ్404-జీఈ-ఐఎన్20 ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను తేజస్‌లో ఉపయోగిస్తున్నారు.
ఇదే ఇంజిన్‌ను మార్క్1ఏ వెర్షన్‌లోనూ వినియోగిస్తారు. అయితే భవిష్యత్తులో తేజస్ మార్క్ 2 మరింత శక్తిమంతమైన జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్ 414 ఐఎన్ ఎస్ 6 ఇంజిన్ ను కలిగి ఉంటుంది. తేజస్ యుద్ధ విమానాలు సుఖోయ్ యుద్ధ విమానాల కంటే తేలికైనవి ఎనిమిది నుండి తొమ్మిది టన్నుల పేలోడ్ ను మోయగలవు. ఇంకా, ఇవి 52,000 అడుగుల ఎత్తులో వేగంగానూ ఎగరగలవు.
గగనతలంలోనే ఇంధనం నింపునే సామర్థ్యం
కీలకమైన కార్యకలాపాల సామర్థ్యం కోసం యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ రాడార్, బియాండ్ విజువల్ రేంజ్ (బివిఆర్) క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, గగనతంలోనే ఇంధనం నింపునే సామర్థ్యం వంటి కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలను కలిగి ఉంది.
ఈ ఏడాది సెప్టెంబర్ లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ 97 తేజస్ విమానాలను కొనుగోలు చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. డెలివరీలు 2027లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
అంతకుముందు 2021లో భారత ప్రభుత్వం 83 తేజస్ విమానాల కోసం హెచ్ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి 2024 లోనే వీటిని అందించాల్సి ఉన్నా యుఎస్ నుండి దిగుమతి చేసుకున్న ఇంజిన్ల కొరత కారణంగా ఇది ఆలస్యం అయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














