వారణాసి: ఈ సినిమా శకాలు, యుగాల గుండా ప్రయాణిస్తుందా?

వారణాసి, మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి, క్రీస్తు శకం, ఉమ్మడి శకం

ఫొటో సోర్స్, x.com/urstrulyMahesh

    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'వారణాసి' - మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది ఆ సినిమా యూనిట్.

గ్లోబ్‌ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో 3.40 నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియోను ప్రదర్శించారు.

ప్రపంచంతో పాటు కాలాల్లోకి హీరో ప్రయాణించినట్లు ఈ వీడియోలో సంకేతాలిచ్చారు దర్శకుడు రాజమౌళి.

ఇందులో ఆయన 512 CEలో వారణాసిని, 2027 CEలో శాంభవి అనే ఆస్టరాయిడ్ దూసుకు రావడాన్ని చూపించారు. ఆ తర్వాత వనాంచల్ ప్రాంతంలో ఉగ్రభట్టి గుహలో 7200 BCEలో లంకా నగరం గురించి ప్రస్తావించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సాధారణంగా ఏవైనా సంఘటనలు, చరిత్రను, కాలాన్ని ప్రస్తావించినప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని రాయడం చాలా కాలంగా వస్తోంది.

పాఠ్య పుస్తకాల్లో చారిత్రక పరిణామాల గురించి రాసేటప్పుడు క్రీస్తు పుట్టుకకు ముందు, తర్వాత అనే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

అయితే వారణాసి మూవీలో కాలాన్ని ప్రస్తావిస్తూ కొన్ని సీన్లలో సంవత్సరం తర్వాత CE, BCE అని పేర్కొంటారు. CE, BCE అంటే ఏంటి? వీటిని ఎందుకు ఉపయోగిస్తారు?

వారణాసి, మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి, క్రీస్తు శకం, ఉమ్మడి శకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రీస్తు పుట్టిన సంవత్సరం ఆధాారంగా కాలాన్ని గుర్తిస్తున్నారు.

క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం (BC, AD)

కాలాన్ని లెక్కించేటప్పుడు క్రీస్తు పుట్టుకను ప్రామాణికంగా తీసుకోవాలని క్రీస్తు శకం 525వ సంవత్సరంలో క్రైస్తవ సన్యాసి డినోసియుస్ ఎక్సిగుస్ ప్రతిపాదించారు.

జూలియన్, గ్రెగేరియన్ క్యాలెండర్లు ప్రామాణికంగా ఈ విధానం యూరప్ దేశాలతో పాటు ప్రపంచం అంతటా విస్తరించింది. శతాబ్దాలుగా ప్రపంచం దీన్నే ఆచరిస్తోంది.

క్రీస్తు పుట్టక ముందు జరిగిన కాలాన్ని క్రీస్తు పూర్వం (బీసీ) అని, క్రీస్తు పుట్టిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకం (AD)గా గుర్తిస్తున్నారు.

AD అంటే అన్నో డోమిని. ఇది లాటిన్ పదం. దీనికి "ప్రభువు సంవత్సరం" అని అర్థం.

క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని ఒకటిగా మొదలు పెట్టి సంవత్సరాలను లెక్కిస్తున్నారు.

జీసస్ పుట్టక ముందు జరిగిన కాలాన్ని అంటే .. ఏడీ 1 కి ముందు ఏడాదిని బీసీ 1గా మొదలు పెట్టి వెనక్కి లెక్కిస్తున్నారు.

దీని ప్రకారం హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 2500 ఏళ్ల నాటిదని అంచనా వేశారు. అంటే క్రీస్తు పుట్టడానికి 2500 ఏళ్ల కిందటే భారత్‌లోని సింధు నది ప్రాంతంలో నాగరికత ఉంది.

వారణాసి, మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి, క్రీస్తు శకం, ఉమ్మడి శకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోమన్, జూలియన్ క్యాలెండర్లను సంస్కరించి పోప్ గ్రెగరీ13 గ్రెగేరియన్ క్యాలెండర్ తయారు చేశారు.

ఉమ్మడి శకం, ఉమ్మడి శకానికి ముందు( CE, BCE)

క్రీస్తు పుట్టుకకు ముడి పెట్టి శకాన్ని లెక్కించడాన్ని వ్యతిరేకిస్తున్నవారు, లౌకికవాదులు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకానికి బదులు సీఈ, బీసీఈలను వాడుకలోకి తీసుకువచ్చారని 'వరల్డ్ హిస్టరీ డాట్ ఆర్గ్' కథనం తెలిపింది.

CE అంటే కామన్ ఎరా అంటే ఉమ్మడి శకం. ఇక BCE అంటే బిఫోర్ కామన్ ఎరా-ఉమ్మడి శకానికి ముందు.

ఉమ్మడి శకానికి ముందున్న కాలం గురించి చెప్పేటప్పుడు BCEని ఉపయోగిస్తున్నారు.

ఈ రెంటిని ఉపయోగించడం 1700 తొలి నాళ్లలో మొదలైంది. యూదు విద్యావేత్తలు ఈ రెంటినీ వందేళ్ల కిందటి నుంచే ఉపయోగిస్తున్నారు.

20వ శతాబ్దం మొదటి నుంచి CE, BCE వాడకం విస్తృతమైంది.

సైన్స్‌తో పాటు మేథోపరమైన అంశాల్లో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకానికి బదులు సీఈ, బీసీఈని ఉపయోగిస్తున్నారని 'టైమ్ అండ్ డేట్ డాట్ కామ్' వెబ్‌సైట్ తెలిపింది.

వారణాసి, మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి, క్రీస్తు శకం, ఉమ్మడి శకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూదు రచయితలు తమ రచనల్లో క్రీస్తు శకానికి బదులు ఉమ్మడి శకాన్ని ఉపయోగిస్తున్నారు.

CE/BCEని ఎందుకు ఉపయోగిస్తున్నారు?

సీఈ, బీసీఈని ఉపయోగించడం వెనుక ఉన్న కారణం మతపరమైన సమానత్వమేనని చరిత్రకారులు చెబుతున్నారు.

గ్రెగేరియన్ క్యాలెండర్ క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా తయారైందని, దీనికి ప్రత్యామ్నాయంగా లౌకిక భావనతోనే బీసీ, ఏడీకి బదులుగా సీఈ / బీసీఈని తీసుకొచ్చారని రచయిత సాయి పాపినేని చెప్పారు.

ఇందులో ముఖ్యంగా అన్నో డొమినీ అనేది క్రీస్తు పుట్టిన సంవత్సరం అనే దాన్ని సూచిస్తోంది.

యూదు విద్యావేత్తలు వందేళ్ల కిందటి నుంచే బీసీఈ, సీఈని ఉపయోగిస్తున్నారు. వాళ్లు వాడటం మొదలైన తర్వాత వాటికి ఆమోదం పెరిగింది.

వారణాసి, మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి, క్రీస్తు శకం, ఉమ్మడి శకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉమ్మడి యుగానికి పూర్వమే హరప్పా నగరం ఉనికిలో ఉంది.

మార్పుపై వ్యతిరేకత

అయితే ఉమ్మడి శకానికి ముందు / ఉమ్మడి శకం అనే కాలమానానికి అంతర్జాతీయంగా ఆమోదం లేదు.

1980ల నుంచే సీఈ, బీసీఈ అనేవి విస్తృతంగా వాడుకలో ఉన్నా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేవే ఉపయోగిస్తున్నారు.

2002లో బ్రిటన్‌ పాఠ్యాంశాలలో మార్పు చేసినప్పుడు బీసీ, ఏడీ అనే దానికి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది.

2011లో ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. పాఠ్య పుస్తకాల్లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే వాటిని తొలగిస్తారని మీడియాలో కథనాలు రావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

సీఈ, బీసీఈ అనే పదాలను తీసుకురావడం క్రీస్తును చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నమని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు.

గ్రెగేరియన్ క్యాలెండర్ క్రీస్తు జననం ఆధారంగా ఏర్పాటైందని, దీన్ని ప్రస్తుతం ప్రపంచం అంతా ఆమోదించిందని, అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయాల్ని తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయాలనే వాదన ఉందని హిస్టరీ మాజీ లెక్చరర్ నాగరాజు బీబీసీతో చెప్పారు.

చాలా కాలంగా స్థిరపడిపోయిన దాన్ని తొలగించి కొత్తవి తీసుకురావడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని మరి కొందరు వాదిస్తున్నారు.

"ఈ మార్పులు అనవసరం. ఎందుకంటే మీరు ఏడీ అని రాసినా, సీఈ అని రాసినా అవి క్రీస్తు జీవితంతో ముడిపడి ఉన్నాయి" అని మాజీ బిషప్ ఆఫ్ రోచెస్టర్ డాక్టర్ మైఖేల్ నజీర్ అలీ చెప్పారు.

వారణాసి, మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి, క్రీస్తు శకం, ఉమ్మడి శకం

ఫొటో సోర్స్, x.com/urstrulyMahesh/Screen grab

ఫొటో క్యాప్షన్, 'వారణాసి' చిత్రంలో ఉమ్మడి శకానికి పూర్వం 7200 అనే కాలాన్ని ప్రస్తావించారు.

ఏది ఉపయోగిస్తున్నారు?

రచయితలు, చరిత్రకారులు ఇప్పటికీ ఒకే వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. జర్నలిస్టులు తమ రచనల్లో బీసీ, ఏడీని ఉపయోగిస్తున్నారు.

సాంకేతిక అంశాలు, మేథోపరమైన అంశాల్లో బీసీఈ, సీఈ అనే వాటిని ఉపయోగిస్తున్నారు.

దేన్ని ఉపయోగించాలనే దానిపై రెండు వైపులా బలమైన వాదనలు ఉన్నాయి. అందుకే రచయితలు, కాలమిస్టులు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకుంటున్నారు.

ఇందులో ఏది రాసినా బీసీ అనేది సంవత్సరానికి తర్వాత, ఏడీ అనేది సంవత్సరానికి ముందు వాడాలి. ఉదాహరణకు 1100 BC, AD 1066 అని రాయాలి.

అయితే, బీసీఈ, సీఈ- అనే పదాలలో ఏదైనాసరే సంవత్సరం తర్వాతనే వాడాలి.

ఉదాహరణకు... 1600 BCE, 1700 CE

"వారణాసి చిత్రం హిందూ మైథాలజీకి సంబంధించినది. ఇందులో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తారని రాజమౌళి చెప్పారు. అందుకే ఇందులో ఉమ్మడి శకం, ఉమ్మడి శకానికి ముందు అనేవి ఉపయోగించి ఉంటారు" అని ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్న సుధాకర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)