నాగ సాధువులు ఔరంగజేబు సైన్యంతో పోరాడినప్పుడు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జైదీప్ వసంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(2023లో ప్రచురితమైన ఈ కథనాన్ని రీపోస్ట్ చేస్తున్నాం)
మహాశివరాత్రికి గుజరాత్‌లోని జునాగఢ్‌లో ప్రతీ ఏడాది భవనాథ్ యాత్ర జరుగుతుంది. దీని చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శివ భక్తులంతా యాత్రలో పాల్గొనడం కోసం ఈ క్షేత్రానికి వస్తుంటారు.
కానీ, ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగ సాధువులు. శరీరమంతా విభూది, జడలు కట్టిన జుట్టుతో ఉండే ఈ నాగసాధువులను యాత్రలో సులభంగా గుర్తు పట్టొచ్చు.
కత్తులు, బాణాలు, ఈటెలు, త్రిశూలాలతో నాగసాధువులు కళను ప్రదర్శిస్తారు. ఇది ఈ యాత్రలో కనిపించే మరో ప్రత్యేక అంశం.
వేదాలు, గ్రంథాలను అనుసరించే ఈ నాగ సాధువులు ఒకానొక సమయంలో మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టాల్సి వచ్చింది.
ఔరంగజేబు సైన్యంతో నాగ సాధువులు పోరాడినట్లు, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పరిరక్షిస్తూ బలిదానాలు చేసుకున్నారని చరిత్ర చెబుతోంది.


ఫొటో సోర్స్, Getty Images
ఆది శంకరాచార్య అఖారాల స్థాపన
క్రీ.శ 8వ, 9వ శతాబ్ధాల మధ్య బౌద్ధ ఆరామాలు, విహారాల ప్రభావం క్షీణించడం ప్రారంభమైంది. మరోవైపు ఆది శంకరాచార్యుల కాలంలో అఖారా వ్యవస్థ మొదలైంది.
బద్రీనాథ్, ద్వారక, జగన్నాథపురి, రామేశ్వరంలలో ఆదిశంకరాచార్యులు మఠాలను స్థాపించారు. 10 సన్యాసి శాఖలతో ఆది శంకర దశనమి అనే సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ 10 సన్యాసి శాఖల పేర్లను సన్యాసుల ఇంటిపేర్లుగా వాడతారు.
తొలి నాళ్లలో ప్రధానంగా శైవులు (శివ ఆరాధకులు), వైష్ణవుల (వైరాగి లేదా భైరాగులు, విష్ణువును ఆరాధించేవారు) అఖారాలే ఉండేవి. తర్వాత వీటిలో సిక్కులను కూడా చేర్చారు.
ప్రస్తుతం 13 అఖారాలు ఉన్నాయి. ఇందులోని సాధువుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండొచ్చు.
ప్రతీ అఖారాకు అధిపతిగా మహామండలేశ్వర్ ఉంటారు. ఆయన అఖారా నిర్వహణను చూసుకుంటారు. మహామండలేశ్వర్‌ను తొలుత 'పరమహంస' అని పిలిచేవారని 'దశనమి' చరిత్ర పుస్తకంలో జదునాథ్ సర్కార్ పేర్కొన్నారు.
మహంత్ నాయకత్వంలో ఈ అఖారాల్లో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి.
''అఖారా సంప్రదాయం, సికందర్ దండయాత్ర తర్వాత ప్రారంభమైందని నమ్ముతారు. జదునాథ్ సర్కార్ రాసిన 'దశనమి నాగ సన్యాసిస్' అనే పుస్తకంలో దీనికి సంబంధించిన చాలా సమాచారం దొరుకుతుంది'' అని అలహాబాద్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ హేరంబ్ చతుర్వేది అన్నారు.
అఖారాలో చేరడానికి నాగసాధువులు కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కఠోరమైన సాధనలు చేయాలి.
అఖారాల్లో చేరడం కోసం వారు కనీసం నాలుగైదేళ్లు కృషి చేయాలి. ఇదంతా చేశాక గురువు అనుమతితో కుంభమేళాలో వారు నాగ సాధువులుగా మారుతారు.

ఫొటో సోర్స్, Getty Images
సన్యాసుల సాయుధ సంస్థ
జాన్ నికోల్ ఫాక్వార్, మాంచెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఒక క్రిస్టియన్ పాస్టర్ కూడా. ఆయన రాసిన 'ద ఫైటింగ్ అసెటిక్స్ ఆఫ్ ఇండియా' అనే పరిశోధక పత్రాన్ని 1925లో జాన్ రైలాండ్ లైబ్రరీ ప్రచురించింది.
ఈ థీసిస్ పేపర్‌లో సరస్వతి సన్యాసి శాఖకు చెందిన సన్యాసుల శ్రుతి, స్మృతి పరంపరాది గురించి ఆయన ప్రస్తావించారు.
''అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారు. వారు ప్రతీరోజు ఉదయం గంగ స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగ స్నానానికి వచ్చే సన్యాసులను ఫకీర్లు చంపేవారు. ఇలా చంపడం వారికి ఒక ఆట లాంటిది. విగ్రహారాధన చేసే వారిని చంపడం తప్పేమీ కాదనే భావనలో ఫకీర్లు ఉండేవారు. ముఖ్యంగా స్థానిక ముస్లిం అధికారులు కూడా వారి ప్రవర్తన పట్ల చూసీ చూడట్లుగా వ్యవహరించారు'' అని థీసిస్‌లో రాశారు.
సన్యాసుల మరణాల గురించి మాట్లాడుతూ, దాడి చేసినప్పుడు ఫకీర్లు నిరాయుధులుగా ఉన్నారు కాబట్టి వారిని శిక్షించలేమని అక్బర్ వాదించారు.
ఈ సమయంలోనే వారణాసిలో మధుసూదన్ సరస్వతి అనే సంస్కృత పండితుడు మరణించారు. ఆయన ఎన్నో పుస్తకాలను రాశారు.
బీర్బల్ సలహా మేరకు సన్యాసులతో ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు మధుసూదన్ సరస్వతి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఇందులో బ్రాహ్మణేతరులను కూడా నియమించుకొని వారికి ఫకీర్ల తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.
దీని తర్వాత మధుసూదన్ సరస్వతి, వేలమందితో ఒక సంస్థను నిర్మించారు.
అంతకుముందు అంటే 12, 13వ శతాబ్ధాల్లో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇందులోకి అనుమతించేవారు. తర్వాత కొత్త నియామకాలను చేపట్టి వారితో ఉపవిభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఫాక్వార్ ప్రకారం, ఇదంతా క్రీ.శ 1565 ప్రాంతంలో జరిగి ఉండాలి. ఈ సాధువులు భారీ మొత్తంలో గంజాయి, మద్యాన్ని తాగేవారు.
తర్వాత రామానంద, ఈ సంప్రదాయాలకు భిన్నంగా అన్ని కులాల వారికి ఈ సంస్థల్లో స్థానం కల్పించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఔరంగజేబు ఆదేశాలు
ఈ వ్యవస్థ దాదాపు ఒక దశాబ్దం పాటు కొనసాగింది. ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత కష్టాలు మరింత పెరిగాయి. సైన్యంతో సాధువుల పోరాటం కొనసాగింది. చివరకు 1659లో వారణాసి అధికారులకు అనుకూలంగా ఔరంగజేబు ఒక ఉత్తర్వును జారీ చేశారు. అనవసరంగా హిందువులను ఇబ్బంది పెట్టొద్దని అందులో పేర్కొన్నారు.
చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ రాసిన ''దశనమి నాగ సన్యాసిస్'' అనే పుస్తకంలో ఈ ఉత్తర్వుల గురించి ప్రస్తావించారు. వీటతో పాటు ఔరంగజేబు సైన్యంతో పోరాటం గురించి కూడా వివరించారు.
'జ్ఞానవాపి' యుద్ధం పేరిట కూడా దీని గురించి కొన్ని ప్రస్తావనలు వచ్చాయి. 1664లో నాగ సాధువులు, సుల్తాన్ సైన్యంతో పోరాడారు. ఈ యుద్ధం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సాధువులను 'దశనమి వీర్' అని పిలిచేవారు.
ఈ యుద్ధంలో వారు మీర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీలను వారు ఓడించి విశ్వనాథగఢ్ ప్రతిష్టను కాపాడారు.
చరిత్ర ప్రకారం, నాగసాధువులు ఓడించిన ఆ సుల్తాన్ ఔరంగజేబు అని చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. 'ఎ షార్ట్ స్టోరీ ఆఫ్ ఔరంగజేబు' అనే పుస్తకంలో ఆయన దీని గురించి రాశారు.
''దేవాలయాలు, గురుకులాలు అన్నింటిని కూల్చేయాలంటూ 1669 ఏప్రిల్ 9న సుల్తాన్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. కూల్చేయాల్సిన జాబితాలో సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మథుర ఆలయాలు కూడా ఉన్నాయి'' అని ఆ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శివాజీ మహరాజ్ వల్ల కాశీపై కోపం వచ్చిందా?
1666లో ఛత్రపతి శివాజీ , ఆగ్రా నుంచి రాయ్‌గఢ్‌కు తప్పించుకోవడానికి వారణాసిలోని జాగీర్దార్లు సహాయం చేశారు. శివాజీకి సహాయం చేసినందుకే కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేశారని చెబుతారు.
ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి వారణాసి రాజా జై సింగ్ సహాయం చేశారు.
ఆయన మనుమడు రాజా మాన్ సింగ్ తన పాలన కాలంలో ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించారు. ఇక్కడి కొందరు బ్రాహ్మణులు, ఇస్లామిక్ విద్యలో జోక్యం చేసుకున్నారు.
ధ్వంసం చేసిన మందిరంలోని కొంత భాగాన్ని మసీదు వెనుక గోడగా ఉపయోగించారని మీనాక్షి జైన్ తన పుస్తకం ''ఫ్లైట్ ఆఫ్ డేట్స్ అండ్ రీబర్త్ ఆఫ్ టెంపుల్స్' లో పేర్కొన్నారు. అది ఉన్న ప్రాంతాన్ని బట్టి దాన్ని 'జ్ఞాన్‌వాపి మసీదు' అని పిలుస్తున్నారని ఆమె వెల్లడించారు.
ఛత్రపతి శివాజీకి సహాయం చేసినందుకే బనారస్‌లోని ప్రధాన ఆలయాన్ని ధ్వంసం చేశారని కొంతమంది పండితులు కూడా పేర్కొన్నారు. ఇతర మందిరాలను ఎందుకు ధ్వంసం చేశారనే దానిపై ఎలాంటి వివరణ లేదు.
బనారస్‌లో చదువుకునేందుకు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేవారని కొన్ని జైన రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ విద్యార్థులకు తప్పుడు విద్యను అందిస్తున్నారని భావించిన చక్రవర్తి వాటిని ఆపివేసి,
ఇస్లాం విద్యను అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కచ్ రాణి అత్యాచార ఘటన
ఔరంగజేబుపై వచ్చిన కొన్ని విమర్శలను ప్రముఖ చరిత్రకారుడు డా. విశ్వంభరనాథ్ పాండే తన పుస్తకం "ఇండియన్ కల్చర్ మొఘల్ హెరిటేజ్: ఔరంగజేబ్స్ ఫర్మాన్" పుస్తకంలో వివరించారు.
"ఒకసారి ఔరంగజేబు బెనారస్ సమీపం నుంచి వెళుతున్నాడు. ఆ సమయంలో అతని ఆస్థానంలోని హిందువులు కొందరు గంగాస్నానం, కాశీ విశ్వనాథుని దర్శనం కోసం కుటుంబ సమేతంగా కాశీకి వచ్చారు."
"విశ్వనాథుని దర్శనం తరువాత అంతా ఆలయం నుంచి బయటకు వచ్చారు. కానీ 'కచ్' రాజ్యానికి చెందిన రాణి కనిపించకుండా పోయారు. రాణి కోసం వెతుకుతుండగా, ఆలయంలోని గర్భగుడి దిగువ భాగంలో ఆమె నగ్నంగా పడి కనిపించారు''
ఆ పుస్తకంలో ఇంకా ఇలా ఉంది. "ఈ సంఘటన గురించి ఔరంగజేబుకు తెలియగానే ఆగ్రహానికి గురయ్యాడు. ఇది పాండ్యుల పని అని గ్రహించి, వెంటనే ఆలయాన్ని కూల్చేయాలని ఆదేశించాడు. దోపిడీలు, అత్యాచారాలు జరిగేది దేవుడికి ఆలయం కాబోదు అని ఔరంగజేబు అన్నాడు''
ఔరంగజేబు ఆదేశం వెంటనే అమలు చేశారని విశ్వంభర్ పాండే రాశారు. ఈ విషయం రాణికి తెలియగానే ఈ సంఘటన ఆలయ తప్పిదం కాదని, ఆ తప్పు పాండ్యులదని కచ్ రాణి ఔరంగజేబుకు సందేశం పంపారని పాండే రాశారు.
"ఆలయాన్ని పునర్నిర్మించాలని రాణి కోరారు. కానీ, తన మత విశ్వాసాల కారణంగా ఔరంగజేబు కొత్త ఆలయాన్ని నిర్మించలేకపోయాడు. ఆలయం స్థానంలో మసీదును నిర్మించడం ద్వారా రాణి కోరికను నెరవేర్చాడు" అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
ప్రొఫెసర్ రాజీవ్ ద్వివేదితో సహా చాలా మంది చరిత్రకారులు ఈ సంఘటనతో ఏకీభవిస్తున్నారు.
కానీ పట్టాభి సీతారామయ్య తన పుస్తకంలో పేర్కొన్నట్లుగా, "ఈ సంఘటన ఒక అరుదైన రాతప్రతిపై రాశారు. లఖ్‌నవూకు చెందిన ఒక ప్రముఖ ముల్లా ఆ మాన్యుస్క్రిప్ట్‌ను చదివి తన స్నేహితుడికి ఈ సంఘటనను వివరించాడు. కానీ అతని స్నేహితుడు కథను రాయకముందే మరణించాడు."
ప్రస్తుత ఆలయాన్ని 1735లో మరాఠాల కాలంలో ఇండోర్‌కు చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇక్కడ అహల్యాబాయి విగ్రహం కూడా ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














