తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి, పడగ, ఇలాంటి మొక్కలు ఉంటే పాములు రావా, ఇందులో నిజమెంత?

పాములు, మొక్కలు

ఫొటో సోర్స్, Getty Images/BBC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

'ఈ మొక్క ఉంటే పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి రావు', 'మీ పొలం నుంచి పాములను తరిమికొట్టే మొక్క'... ఇలాంటి హెడ్డింగులు, థంబ్ నైల్స్‌తో సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూస్తుంటాం. అలాగే, రోజువారీ వ్యవహారంలో ఈ మొక్క గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం.

ఈ సందర్భంలో తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి, పడగ, పెద్ద పీడ అనే మొక్కల పేర్లు చెబుతుంటారు. ఇటువంటి మొక్కలు ఉన్న చోటుకి పాములు రావా?

మొగలి, సంపెంగ వంటి మొక్కలుండే చోటుకి పాములొస్తాయని అంటుంటారు కదా... అలాగే తెల్ల ఈశ్వరి, పడగ వంటి మొక్కలుంటే పాములు రావా? అంటే, మొక్కలు పాముల రాక పోకలను నిర్దేశిస్తాయా?

ఈ మాటల్లో నిజమెంత? వీటికి శాస్త్రీయ ఆధారాలేమైనా ఉన్నాయా? అసలు పాములు ఏ ప్రదేశాలకు వస్తాయి? పాములు రాని ప్రదేశాలు ఉంటాయా? జంతు, వృక్షశాస్త్ర నిపుణులు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పాములు, మొక్కలు - నమ్మకాలు, నిజాలు

కొన్ని మొక్కలు పాములు రాకుండా చేయగలవనే నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే, వాటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆంధ్రా యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగంలో వివిధ రకాల వృక్షాలపై పరిశోధనలు చేసే ప్లాంట్ టాక్సానమిస్ట్ (Plant Taxonomist) డాక్టర్ జె. ప్రకాశరావు బీబీసీతో చెప్పారు.

"మేం విద్యార్థులతో లేదా పరిశోధనల కోసం తూర్పు, పడమటి కనుమలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని రకాలైన మొక్కలను చూశాం. వాటిని అక్కడి స్థానికులు పాముల నుంచి రక్షణ కల్పించేవిగా నమ్ముతున్నారు. అవే మొక్కలు మైదాన ప్రాంతాల్లోని ప్రజలు కూడా తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో కూడా పాముల నివారణకు మొక్కలంటూ కొన్ని రకాల మొక్కలను అమ్ముతున్నారు. అయితే, ఈ మొక్కలేవి పాముల నుంచి కాపాడతాయని కానీ, పాములను దగ్గరకు రానివ్వవని కానీ శాస్త్రీయంగా నిరూపితమైనవి కాదు. ఆ కోణంలో వీటిపై పెద్దగా అధ్యయనాలు కూడా జరగలేదు" అన్నారు ప్రకాశరావు.

కాకపోతే కొన్ని రకాల మొక్కలకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాల వలన పాములు ఈ మొక్కలకు భయపడతాయని, దగ్గరకు రావనే ప్రచారాలు జనబహుళ్యంలో ఉన్నాయి. అవి కేవలం ప్రజల నమ్మకంగానే భావించాలని ప్రకాశరావు బీబీసీతో అన్నారు.

తెల్ల ఈశ్వరి మొక్క
ఫొటో క్యాప్షన్, తెల్ల ఈశ్వరి మొక్క

పాముల నివారణిగా ప్రచారంలో ఉన్న మొక్కలు

తెల్ల ఈశ్వరి (Crotalaria verrucosa): ఇది ఒక అడవి మొక్క. ఎక్కువగా ప్రజలు ఈ మొక్కనే పాముల నివారణకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. ఈ మొక్క జాతిలోనే మరో రకం మొక్క నల్ల ఈశ్వరి. ఈ మొక్క కూడా పాముల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్తుంటారు. ఇటీవల తెల్ల ఈశ్వరి మొక్కపై సోషల్ మీడియాలో చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి మొక్కలకు పాములు దూరంగా ఉంటాయని శాస్త్రీయంగా తేలలేదు. ఈ మొక్కలో ఉన్న ఆల్కలాయిడ్స్ (alkaloids) వాసన ఘాటుగా ఉంటుంది.

పాము పడగ మొక్క

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాము పడగ మొక్క

పాము పడగ మొక్క (Polygonum persicaria లేదా Persicaria maculosa): ఈ మొక్క ఆకు మీద 'V' ఆకారపు మచ్చ కనిపిస్తుంది. ముదురు రంగులో ఉంటుంది. ఈ 'V' ఆకారం కొన్ని సార్లు పాము పడగని పోలి ఉంటుంది. దీంతో దీనిని "పాము పడగ గుర్తు" గా చూస్తారు. అందువల్ల ఆ ఆకారం చూసి పాములు దూరంగా ఉంటాయని నమ్ముతారు. ఈ నమ్మకం అంతగా వ్యాప్తి చెందడంతో, కొన్ని నర్సరీలు దీనిని " స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ (snake-repellent plant)" అనే పేరుతో అమ్ముతుంటాయి.

పాము పడగ మొక్క

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ (Sansevieria): ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ స్నేక్ ప్లాంట్. దీనిని పడగ మొక్క అని పిలుస్తుంటారు. దీని ఆకులు పొడవుగా పెరుగుతూ... కత్తిలా పదునుగా ఉంటాయి. దాంతో, పాములు అటువైపు వస్తే వాటి శరీరం తెగిపడుతుందని చెబుతుంటారు. అందుకే ఆ మొక్కలుండే చోటుకి పాములు రావని అంటుంటారు. అయితే, ఈ నమ్మకానికి శాస్త్రీయ ధృవీకరణలు లేవు. కేవలం పేరును ఆధారంగా చేసుకుని జరిగే 'సైకాలజికల్ ప్రొపగండా' అని చెప్పవచ్చు.

పిట్టోస్పోరం (Pittosporum tetraspermum): తూర్పు కనుమల్లో కొంతమంది గిరిజనులు పెంచే ఒక బలమైన వాసన వచ్చే మొక్క ఇది. ఈ మొక్కను కత్తిరించినప్పుడు వెలువడే ఘాటైన వాసన వల్ల కొన్ని చిన్న చిన్న అటవీ జంతువులు, కీటకాలు దూరంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ మొక్కలున్న చోటుకి పాములు కూడా రావడం ఎప్పుడూ చూడలేదని వాళ్ల అనుభవం. ఈ వాసన పాములపై ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న అంశంపై అధ్యయనాలు జరగలేదు.

"అయితే ఈ అన్ని మొక్కలు పాములను దూరంగా ఉంచుతాయనే శాస్త్రీయ ఆధారం లేదు. అంటే, మొక్క ఉన్నంత మాత్రాన ‘ఇక పాములే రావు’ అనేది ఒక మిత్ అంటే ఆధారం లేని నమ్మకం లాంటిదే" అని డాక్టర్ జె. ప్రకాశరావు చెప్పారు.

 ప్లాంట్ టెక్ట్సానమిస్ట్ డాక్టర్ జె. ప్రకాశరావు
ఫొటో క్యాప్షన్, డాక్టర్ జే. ప్రకాశరావు

పాములు మొక్కలకు భయపడతాయా అనే విషయాన్ని ఏయూ జువాలజీ ప్రొఫెసర్ సి.మంజులత దగ్గర బీబీసీ ప్రస్తావించింది.

"పాములకు కంటి చూపు అంత బలంగా ఉండదు. కానీ, వాసన ద్వారా పాము చాలా చురుకుగా స్పందిస్తుంది. కొన్ని మొక్కలలో ఉండే చేదు వాసనని ఇచ్చే అల్కలాయిడ్స్, ఘాటు రసాయనాలు, ఆరెంజ్, నిమ్మ తొక్కల నుంచి వచ్చే వాసనలు పాములకి 'చిరాకు’ గా అనిపిస్తాయి. వాసనలను ప్రత్యేకంగా గుర్తించడానికి పాము నోటి దవడల వెనుక భాగంలో జాకబ్సన్ ఆర్గాన్ ఉంటుంది. ఇది వాసన తెలుసుకునే ఒక సెన్సార్‌లా పని చేస్తుంది" అని వివరించారు.

"అంటే, పాములు నాలుక బయటికి రాసి మళ్లీ లోపలికి తీసుకుంటాయి కదా, అది వాసన చూసేందుకు కాదు, వాసనలో ఉన్న రసాయనాలను సేకరించడానికి. ఏదైనా మొక్క నుంచి బలంగా చేదు, వగరు, ఘాటు వాసనలు వస్తే అక్కడికి పాములు వెళ్లేందుకు ఇష్టపడకపోవచ్చు" అని ప్రొఫెసర్ సి. మంజులత చెప్పారు.

పాములే కాదు, చాలా కీటకాలు కూడా కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే వాసనల కారణంగా ఈ సమీపంలోకి వెళ్లవని ప్రొఫెసర్ మంజులత అన్నారు.

వాతరిణి మొక్క

మరి ఈ మొక్కలు మనుషులకు ప్రమాదం కాదా?

ఇప్పటి వరకు చెప్పుకున్న తెల్ల ఈశ్వరి, పడగ వంటి కొన్ని మొక్కల నుంచి వచ్చే ఘాటు వాసనలు పాములను దూరం ఉంచితే... ఆ వాసనను ఇచ్చే మొక్కలు మనుషులకు ప్రమాదం కాదా? అనే దానిపై స్పందించిన జంతు, వృక్షశాస్త్ర నిపుణులు.. ‘‘ వీటి ఘాటును ఎక్కువగా పీల్చితే తలనొప్పి, వికారం, విరేచనం, కడుపు నొప్పి, వాంతులు... ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అందువలన ఈ మొక్కలను పెంచేవారు వాటిని ఇంటి లోపల లేదా చిన్న పిల్లలు ఉన్న ప్రదేశాల్లో పెట్టకూడదు’’ అని చెప్పారు.

పాములు, మొక్కలు

ఫొటో సోర్స్, Getty Images

పాములు ఎక్కడికి వస్తాయి?

''మొగలి, సంపెంగ మొక్కలున్న చోటుకి పాములు వస్తాయని అంటుంటారు. అక్కడికి మొగలి పువ్వుల కోసమో, సంపెంగ పువ్వుల కోసమో అవి రావు. అవి కొంత సమయం ఉండేందుకు ఆ ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అక్కడికి పాములు వస్తుంటాయి. మొగలి, సంపెంగ మొక్కల వద్దకే కాదు, అలాంటి పరిస్థితులు ఎక్కడున్నా పాములు అక్కడికి వచ్చే అవకాశముంది'' అని ప్రొఫెసర్ సి. మంజులత చెప్పారు

"మొగలి, సంపెంగ మొక్కలుండే చోట గుబురు, చక్కటి నీడ, తడి నేల, చిన్న పురుగులు ఎక్కువగా ఉంటాయి. మొగలి, సంపెంగ మొక్కలుంటే చోట చీకటి ప్రదేశాలు ఏర్పడతాయి. పాములు దాగుండడానికి బాగుంటాయి" అని ఆమె తెలిపారు.

'' వాస్తవానికి, పాములు మొక్కల వాసన కంటే తమ ఆహారమైన ఎలుకలు, బల్లులు ఎక్కడుంటే అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాములు సురక్షితంగా కనిపించే ప్రదేశాలకే ఎక్కువగా ఆకర్షితమవుతాయి" అని ప్రొఫెసర్ మంజులత అన్నారు.

పాము, మొక్కలు
ఫొటో క్యాప్షన్, స్నేక్ ప్లాంట్‌ను చూపిస్తున్న రైతు

పాములు రాకుండా చేయాలంటే...

పాములు ఇళ్ళలోకి, నివాస పరిసరాల్లోకి రావడానికి చాలా కారణాలుంటాయని ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

‘‘పాములు సాధారణంగా 'ఆహారం ఉన్న చోటు', ' ఆహారం ఉండేందుకు అవకాశముండే చోటు'కి వస్తాయి. ఎలుకలు, పిచ్చుకల గూళ్లు, నీటి లీకేజీలు, చెత్త, కట్టెల గుట్టలు ఉంటే పాములు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలుకలు, బల్లులు పాములకు ప్రధాన ఆహారం, అలాగే తడి ప్రదేశాలు పాములకు అనుకూలం’’ అన్నారు.

''అలాగే జామ, మామిడి, నేరేడు, తాటి చెట్లు ఉన్న చోట్ల పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, పాము పళ్లు కోసం రాదు. కింద పడిన పళ్లు కోసం ఎలుకలు వస్తాయి. ఎలుకల కోసం పాములు వస్తుంటాయి'' అని అంటున్నారు ప్రొఫెసర్ మంజులత.

'' చెత్త, పారిశుద్ధ్య లోపం ఉన్న చోట్ల ఎలుకలు, క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి చోట్లకి పాములొచ్చే అవకాశం ఉంటుంది. ఇల్లు, పరిసరాలు పరిశుభ్రత లేకుండా ఏ మొక్క పెట్టినా కూడా పాములు వచ్చే అవకాశం కొట్టిపారేయలేం'' అని చెప్పారు ప్రొఫెసర్ మంజులత.

మొక్క వాసనతో కంటే, చుట్టుపక్కల వాతావరణమే పాములను ఎక్కువగా ఆకర్షిస్తుంది లేదా అక్కడికి రాకుండా చేస్తుంది. అందుకే మొక్క ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉంటే పాములు వచ్చే అవకాశం లేకుండా చేసినట్లే.

పాము

ఫొటో సోర్స్, Getty Images

మొక్కలకు, పాములకు సంబంధం ఉందా?

పాములను నేరుగా ఆకర్షించే ప్రత్యేకమైన మొక్క అంటూ ఏదీ లేదు. అలాగే ఫలానా మొక్క ఉన్నచోటుకి పాములు రావు అనే శాస్త్రీయ ఆధారాలు లేవు.

కానీ, కొన్ని మొక్కల వాతావరణం పాములు ఆకర్షిస్తే, కొన్ని మొక్కల లక్షణాలు పాములను, క్రిమికీటకాలను రానివ్వకపోవచ్చు.

అంతకు మించి ఏ పాముకి, ఏ మొక్కకి సంబంధం లేదని... ఉందనే శాస్త్రీయపరమైన ఆధారలేమీ లేవని డాక్టర్ జె. ప్రకాశరావు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)