మూవీ రివ్యూ: 12ఏ రైల్వే కాలనీతో అల్లరి నరేశ్ ‘థ్రిల్’ చేశాడా?

ఫొటో సోర్స్, https://www.instagram.com
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
చాలా కాలంగా వరుస ఫ్లాపులతో డీలాపడిన అల్లరి నరేశ్ 12 ఏ రైల్వే కాలనీ సినిమాతో థియేటర్‌లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లరి నరేశ్‌కు హిట్ కొరత తీర్చిందా? థ్రిల్లర్ కాన్సెప్ట్ పనిచేసిందా?


ఫొటో సోర్స్, https://x.com/SS_Screens/status/
కథ ఏంటంటే...
హీరో అల్లరి నరేశ్ ముగ్గురు స్నేహితులతో (వైవా హర్ష, గెటప్ శీను, సద్దాం) బీర్లు తాగుతూ అల్లరిచిల్లరగా వుంటాడు. అతనో అనాథ. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టిల్లు అనే నాయకుడికి అనుచరుడిగా పని చేస్తుంటాడు.
ఎదురింట్లో ఉన్న హీరోయిన్ ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ని ప్రేమిస్తూ వుంటాడు. కానీ ఆమె పట్టించుకోదు. కథ ఇలా సాగుతూ వుండగా ఇంటర్వెల్ టైమ్‌కి రెండు మర్డర్లు జరుగుతాయి. సెకండాఫ్ అంతా ఈ కేసులో ఇరుక్కున్న హీరో ఎలా బయట పడ్డాడు, అసలు హంతకులెవరు? ఇది మిగతా కథ.
క్రైమ్ థ్రిల్లర్లకి, మర్డర్ మిస్టరీలకి ఒక ప్రత్యేకమైన శైలి వుంటుంది. ఇంటర్వెల్ వరకు అసలు ఈ సినిమా ఏంటో అర్థం కాదు. సెకెండాఫ్‌లో అయినా చిక్కుముడులు విడిపోతాయా? అంటే అదీ లేదు. ఫైనల్‌గా ఇది దెయ్యాల సినిమానా? క్షుద్రపూజల కథా? ఇన్వెస్ట్‌గేటివ్ థ్రిల్లరా? ఏమీ అర్థం కాకుండా ప్రేక్షకుడు జుత్తు పీక్కోవాల్సి వుంటుంది.

ఫొటో సోర్స్, https://www.facebook.com/photo/
ప్రీ రిలీజ్ ప్రకటనలకు తగ్గట్టే ఉందా?
కథ ఏం రాసుకున్నారో, ఏం తీసారో దర్శకుడికైనా తెలుసా అనేది సందేహమే. ఒక్క పాత్ర కూడా రిజిస్టర్ కాదు. తలాతోకా లేకుండా వచ్చి మాట్లాడుతూ వెళ్తుంటాయి. హీరో స్నేహితులు డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఫస్టాఫ్‌లో నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూ వుంటారు. అవి ప్రేక్షకుల్ని నవ్విస్తాయి అనుకోవడమే దరిద్రమైన టేస్ట్.
రెండు గంటల ఐదు నిమిషాల నిడివి కూడా సహనానికి పరీక్ష పెట్టిందంటే ఈ కథలో ఏముందని నరేశ్ ఒప్పుకున్నాడో ఆశ్చర్యం. ఒకప్పుడు అల్లరి నరేశ్ సినిమాలకి ప్రత్యేక అభిమానులు వుండేవారు. రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరో గ్యాప్‌ని పూర్తి చేసాడు.
ఆయన సినిమాల్లో పెద్దగా కథ వుండకపోయినా , ఎపిసోడ్ కామెడీ నవ్వించేది. అయితే యూట్యూబ్‌లో బోలెడు కామెడీ స్కిట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నరేశ్ సినిమాలకి ప్రేక్షకులు దూరమయ్యారు. కామెడీ నుంచి బయటికొచ్చి భిన్నమైన సబ్జెక్టులు తీసుకున్నా, ఆయనపై ఉన్న కామెడీ ముద్ర వల్ల అవి ఆడలేదు.
ఇప్పుడు రైల్వే కాలనీతో థ్రిల్లర్‌లోకి వచ్చాడు. స్క్రీన్‌ప్లే అదిరిపోయిందని ప్రీ రిలీజ్‌లో ప్రకటించారు. ట్రైలర్ కూడా కొంచెం ఆశలు కల్పించింది.
అయితే రొడ్డ కొట్టుడు హీరో ఇంట్రో సాంగ్, హీరోయిన్‌తో లవ్‌సాంగ్ , అరిగిపోయిన విలనీ, ఎపుడూ సీరియస్‌గా వుండే హీరోయిన్, కుళ్లు జోకుల ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ కలిసి ప్రేక్షకుడికి హారర్ చూపించారు.

ఫొటో సోర్స్, https://www.instagram.com/p/DQTUAEpARcd/
సాయికుమార్ ఎంట్రీతో..
సెకండాఫ్‌లో వచ్చిన సాయికుమార్‌తో అయినా వేగం పెరుగుతుందని అనుకుంటే, గంభీరమైన డైలాగ్‌లు తప్ప, చేసిన దర్యాప్తు ఏమీలేదు. హత్యలకి మోటివ్ తెలిసినపుడు , దర్శక రచయితలు కనీసం పాతకాలం డిటెక్టివ్ పుస్తకాలైనా చదివి వుంటే బావుండేది అనిపిస్తుంది.
మర్డర్ మిస్టరీలకి కథ, కథనాలే ముఖ్యం. ఒక్కో చిక్కుముడి విప్పుతున్నప్పుడు ప్రేక్షకుడు థ్రిల్‌కి గురి అవుతాడు. రైటింగ్ బలహీనమైతే ప్రేక్షకుడు ఫోన్ చూసుకుంటాడు.
చివర్లో కుందన్‌బాగ్ (హైదరాబాద్) హాంటెడ్ హౌస్ ఈ కథకి ప్రేరణ అన్నట్టు చూపారు. అసలు కథలోకి రాకుండా గంటసేపు అనవసర సన్నివేశాలు చూపించి , ఇంటర్వెల్‌లో బ్రేక్ అని షాక్ ఇస్తే ప్రేక్షకుడు రివర్స్ షాక్ ఇస్తాడు.

ఫొటో సోర్స్, https://x.com/SS_Screens/status
బలాబలాలేంటి..
ప్లస్ పాయింట్స్ః
ఏమీ లేవు
మైనస్ పాయింట్స్ః
లెక్క కట్టలేం
టీవీ సీరియల్‌కి ఎక్కువ, సినిమాకి తక్కువగా వున్న రైల్వేకాలనీని చూస్తే అయ్యో అల్లరి నరేశ్ అనిపిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














