కాంత మూవీ రివ్యూ: ఆనాటి రోజులకు తీసుకువెళ్లిన ఈ సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Insta/dqsalmaan
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ సినిమా కాంత థియేటర్‌లోకి వచ్చింది. ట్రైలర్ చూసిన తరువాత ఇదో క్లాసిక్ డ్రామా అనే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇది 1950 నాటి మద్రాస్ సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతో సాగే కథ. ప్రారంభంలోనే ఒక ముసుగు మనిషి చేతిలోని రివాల్వర్ పేలుతుంది. క్రైం ఆధారిత కథగా లీడ్ ఇచ్చిన తరువాత అసలు విషయం మొదలవుతుంది.

ఈగో సమస్యలు
అయ్యా (సముద్రఖని) సీనియర్ దర్శకుడు. కెరీర్ చివరి దశలో ఉన్నాడు. గతంలో ప్రారంభించిన శాంత అనే సినిమా ఆగిపోయింది. అది ఆయన తల్లికథ. దాన్ని పూర్తి చేయమని మోడ్రన్ స్టూడియో నిర్మాత అడుగుతాడు.
హీరో ఎవరో కాదు అయ్యా చేరదీసి స్టార్‌ని చేసిన టి.కె. మహదేవన్ (దుల్కర్‌సల్మాన్). వాళ్లిద్దరి మధ్య ఇగో సమస్యల వల్ల ఆ సినిమా ఆగిపోయి ఉంటుంది.
ఫస్ట్ డే షూటింగ్‌లోనే ఇద్దరూ మాట్లాడుకోరు. సినిమా పేరుని కాంతగా హీరో మారుస్తాడు. కొత్త హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) దర్శకుడికి ఒకరకంగా పెంపుడు కూతురు. షూటింగ్‌లో ఆయన మాటే వింటుంది.
షూటింగ్ క్రమంలో కుమారి హీరో ప్రేమలో పడుతుంది. ఇది అయ్యాకి ఇష్టంలేదు. షూటింగ్ చివరి దశలో ఉన్నపుడు ఒక రాత్రి ఆ స్టూడియోలో హత్య జరుగుతుంది.
ఇన్‌స్పెక్టర్ ఫోనిక్స్ (రానా) ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? అసలు హంతకుడు ఎవరు? ఇదంతా మిగతా కథ.

ఫొటో సోర్స్, dqswayfarerfilms
త్యాగరాజ భాగవతార్‌తో పోలిక ఉందా?
ఈ సినిమా 1940 నాటి తమిళ సూపర్‌స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని వార్తల్లో నిలిచింది. త్యాగరాజ సినిమా మద్రాస్‌లో 3 ఏళ్లు ఆడిన రికార్డ్ ఉంది. ఆ సినిమా పేరు హరిదాసు (1944). బ్రాడ్‌వేలో ఆడింది.
లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్ట్ హత్యకేసులో ఎంకె మూడేళ్లు జైల్లో ఉన్నాడు. కత్తిపోట్లకి గురైన లక్ష్మీకాంతన్ గాయాలతోనే పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదుచేసి ఆస్పత్రిలో చనిపోయారు. ఎంకే త్యాగరాజుపై ఆ జర్నలిస్టు అసభ్యంగా వార్తలు రాసి బెదిరించాడనే ఆరోపణ ఉంది.
కాంత సినిమాలో హీరో కింది స్థాయి నుంచి నట చక్రవర్తిగా ఎదుగుతాడు. తర్వాత, ఒక హత్యకేసులో ఇరుక్కుంటాడు. ఇది తప్ప ఇంకే రకంగా ఎంకే త్యాగరాజ భాగవతార్ కథతో పోలిక లేదు.

ఫొటో సోర్స్, dqswayfarerfilms
డిటెక్టివ్ నవలలా...
కాంత మొదటి 15 నిమిషాలు స్క్రీన్ మీద ఒక అద్భుతమైన సినిమా చూస్తున్న ఫీల్‌ని ఇస్తుంది. తరువాత మెల్లగా గ్రాఫ్ పడిపోతుంది. ఇంటర్వెల్‌కి ఇచ్చిన జర్క్‌తో సెకండాఫ్ బాగుంటుందనే ఆశ కలుగుతుంది. రానా రాకతో వేగం మొదలంతుంది. అయితే ఆ దర్యాప్తు నాలుగు గోడల మధ్య సుదీర్ఘంగా సాగడంతో విసుగు మొదలవుతుంది. దీనికి కారణం 2 గంటల 43 నిమిషాల నిడివి.
సినిమాని ఒక వింటేజ్ క్లాసిక్‌గా మార్చడానికి కొత్త దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తీసుకున్న శ్రద్ధ, కథ, కథనంలో చూపలేకపోయాడు. ప్రధాన పాత్రల మధ్య ఎందుకంత గ్యాప్ వచ్చిందో ఎస్టాబ్లిష్ కాలేదు. తనవల్ల పైకి వచ్చిన శిష్యుడిని సముద్రఖని ద్వేషించడానికి సరైన రీజన్ లేదు.
తన గురువు దర్శకత్వాన్ని వ్యతిరేకిస్తూ షూటింగ్‌లో మార్పులు చేసే హీరో అసలు ఆ సినిమాని ఎందుకు ఒప్పుకున్నట్టు? వీళ్ల మధ్య నలిగిపోతూ, అయ్యాకి ఇష్టం ఉండదని తెలిసి కూడా హీరో ప్రేమలో చిక్కుకున్న కుమారి పాత్ర చిత్రణ కూడా అయోమయంగా ఉంది.
సెకండాఫ్‌లో వచ్చే ఇన్వెస్టిగేషన్ పాత డిటెక్టివ్ నవలలని గుర్తుకు తెస్తుంది. అగాధక్రిస్టి, కొమ్మూరి సాంబశివరావు చాలా రాశారు. ఒక హత్య జరుగుతుంది. అనుమానితులంతా అక్కడే ఉంటారు. చివరికి ఊహకు అందని వ్యక్తి నేరం చేసి ఉంటాడు.

ఫొటో సోర్స్, dqswayfarerfilms
తల పగలగొట్టుకునే సీన్..
నిడివి, సాగదీతని భరిస్తే ఇదొక మంచి ఎమోషనల్ డ్రామా మిక్స్‌డ్ విత్ క్రైం. దుల్కర్‌సల్మాన్ కెరీర్‌లో నిలిచిపోతుంది. అద్దం ముందు తల పగలగొట్టుకునే సీన్ ఒక్కటి చాలు, ఆయన జాతీయ అవార్డుకి అర్హుడని. క్యారెక్టర్ కనపడుతుంది తప్ప దుల్కర్ కాదు.
తెలుగు సినిమాల్లో భాగ్యశ్రీని తలా తోకాలేని పాత్రల్లో చూశాం. మంచి దర్శకుడి చేతిలో పడితే ఒక నటి ప్రతిభ ఎంత ఉందో తెలుస్తుంది. కళ్లతోనే నటించారు. మాటలో కాకుండా కదలికల్లోనే సంఘర్షణ చూపించారు.
సముద్రఖని గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. వెనకటి గురుదత్‌ని గుర్తుచేశాడు. శిష్యుడిపైన ప్రేమ, కోపం బాడీలాంగ్వేజ్‌లోనే పలికించారు.

ఫొటో సోర్స్, dqswayfarerfilms
కళాత్మకంగా, కవిత్వంలా...
ఇన్‌స్పెక్టర్ పాత్రని రానా సునాయాసంగా చేశాడు. సెకండాఫ్ అంతా ఆయన సందడే. సినిమా స్లోగా ఉంది అని ఆయనకో డైలాగ్ ఉంది. ప్రేక్షకుడి అభిప్రాయం కూడా అదే.
ప్రత్యేకంగా చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. డానీ సాంచెజ్ లోపెజ్ పనితనం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఎక్కువగా క్లోజప్ షాట్స్ ఉన్నాయి. లైటింగ్, మధ్యలో వచ్చే బ్లాక్ అండ్ వైట్ సీన్స్ మనల్ని గతంలోకి తీసుకెళతాయి.
కొత్త ప్లాట్‌ని ఎంచుకున్న దర్శకుడు కథలోని కీలకమైన సంఘర్షణని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయలేక పోయాడు. అయితే ప్రతి సీన్‌లోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది. ఫ్రేమ్‌లో కనపడే చిన్న ఆర్టిస్టులు కూడా పర్‌ఫెక్ట్‌గా పాత్రలో ఇమిడిపోయి కనిపిస్తారు.
ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. కళా దర్శకుడు మనల్ని 1950లోకి తీసుకెళ్లిపోయాడు. పాటలు ఆకట్టుకోవు కానీ బీజీఎం బాగుంది.
గతంలో మణిరత్నం 'ఇద్దరు' అనే బయోపిక్ తీశారు. కాంత చూస్తే అది గుర్తుకు వచ్చింది. ప్రతి ఫ్రేమ్ కళాత్మకంగా, కవిత్వంలా ఉంటుంది. అయితే కథనం నత్తనడక.
కమర్షియల్‌గా ఏ మేరకు చెప్పలేం కానీ, ఇలాంటి సినిమాలు రెగ్యులర్‌గా రావు. సినిమా ప్రేమికులంతా తప్పక చూడాల్సిన సినిమా.

ఫొటో సోర్స్, dqswayfarerfilms
ప్లస్ పాయింట్స్
1) దుల్కర్, సముద్రఖని, భాగ్యశ్రీ, రానా పోటాపోటీ నటన
2) కెమెరా పనితనం
3) ప్రొడక్షన్ డిజైనింగ్
మైనస్ పాయింట్స్
1) నిడివి
2) బలం లేని కథా కథనాలు
ఫైనల్‌గా కాంత ఒక వింటేజ్ క్లాసిక్. అందరికీ నచ్చకపోవచ్చు.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















