అల్ ఫలాహ్ యూనివర్సిటీ: దిల్లీ పేలుళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ సంస్థను ఎవరు నడుపుతున్నారు?

- రచయిత, దిల్ నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ రాజధాని దిల్లీ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధౌజ్ గ్రామ సరిహద్దు మొదలవగానే పోలీసు బారికేడ్లు కనిపిస్తాయి.
ఇక్కడి నుంచి వచ్చి పోయే ప్రతి వాహనాన్ని పదుల సంఖ్యలో సైనికులు తనిఖీ చేస్తున్నారు.
ఎవరిపైనైనా అనుమానం వస్తే డ్రైవర్ ఫోన్ నంబర్‌తో సహా మరిన్ని వివరాలను కూడా నమోదు చేసుకుంటున్నారు.
ఇక్కడి నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో, ప్రధాన రహదారి నుంచి ఒక కిలోమీటరు దూరంలో, అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. 70 ఎకరాలకు పైగా విస్తరించిన దీని చుట్టూ ప్రహరీ గోడ ఉంది.
యూనివర్సిటీ గేటు బయట మోహరించిన భద్రతా సిబ్బంది జర్నలిస్టులను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు.

ఇక్కడ చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. వారు యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళే వ్యక్తులతో మాట్లాడేందుకు మైక్ ముందుకు పెడుతున్నారు. కానీ చాలా మంది స్పందించకుండా వెళ్లిపోతున్నారు.
కొంతమంది జర్నలిస్టులు వారేమైనా మాట్లాడతారేమో అని వారి వెనకాలే వెళుతున్నారు. ఇంత గందరగోళం మధ్య, ఆ వ్యక్తులందరూ మౌనంగా ఉన్నప్పటికీ, వారి ముఖాల్లో సంకోచం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ యూనివర్సిటీని 2014లో స్థాపించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరలో హరియాణా పోలీసులతో కలిసి జమ్మూకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అక్కడ ఒక ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేయడంతో దీనిపేరు వెలుగులోకి వచ్చింది.
నవంబర్10న దిల్లీలో జరిగిన పేలుడు తర్వాత, ఈ విశ్వవిద్యాలయం దర్యాప్తు కేంద్రంగా మారింది.
బుధవారం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, హరియాణా పోలీసులు, జమ్మూకశ్మీర్ పోలీసులు, యూపీ పోలీసు బృందాలు క్యాంపస్‌లో సోదాలు నిర్వహించాయి.

మెకానికల్ ఇంజనీర్ స్థాపించిన వర్సిటీ
హరియాణా శాసనసభలో 2014లో ఆమోదించిన చట్టం ప్రకారం స్థాపించిన ఈ విశ్వవిద్యాలయాన్ని దిల్లీలోని ఓఖ్లా (జామియా నగర్)లో రిజిస్టర్ అయిన అల్-ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. వృత్తిరీత్యా ఇంజనీర్, ప్రొఫెసర్ అయిన జావేద్ అహ్మద్ సిద్ధిఖీ 1995లో రిజిస్టర్ అయిన ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్‌పర్సన్.
అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ 1997లో విద్యా సంస్థలను ఏర్పాటుచేయడం మొదలుపెట్టింది.
ముందుగా ఈ ట్రస్ట్ ఫరీదాబాద్‌లోని ధౌజ్ గ్రామంలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించింది.
ఆ తరువాత ట్రస్ట్ 2006, 2008లో వరుసగా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రౌన్ హిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లను స్థాపించింది.
తరువాత ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2015లో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని గుర్తించింది.
2016లో ఇక్కడ వైద్యతరగతు మొదలయ్యాయి. 2019లో అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు గుర్తింపు లభించింది.
ప్రస్తుతం ఈ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులతో పాటు 2023 నుంచి మెడికల్ సైన్సెస్‌లో పీజీ కోర్సులు కూడా కొనసాగుతున్నాయి. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) గుర్తింపు పొందినట్టు ఈ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ సర్టిఫికేషన్ మోసపూరితమైనదని ఎన్ఏఏసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ యూనివర్సిటీ ప్రతిఏడాది 200 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను చేర్చుకుంటుంది. ప్రస్తుతం1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. పారామెడికల్ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్, అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన జావేద్ అహ్మద్ సిద్ధిఖీ స్వయంగా ఒక ఇంజనీర్.
ఇండోర్‌లోని దేవి అహల్యా బాయి విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్ , ప్రొడక్ట్ డిజైన్‌లో బీటెక్ డిగ్రీని పొందిన డాక్టర్ జావేద్ సిద్ధిఖీ, అల్-ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ , అనేక ఇతర కంపెనీల వ్యవస్థాపకులు.
జావేద్ సిద్ధిఖీ 1996లో అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌ను కూడా స్థాపించారు. ఈ కంపెనీ ద్వారా పెట్టుబడుల్లో మోసం చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది.
2000 సంవత్సరంలో నమోదైన ఈ కేసులో సిద్ధిఖీ మూడేళ్లకు పైగా జైల్లో గడిపారు. 2005లో నిర్దోషిగా విడుదలయ్యారు.
ఆయన జామియా మిలియా ఇస్లామియా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా పాఠాలు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ పేలుడు తర్వాత వార్తల్లోకి..
దిల్లీ లోని ఎర్రకోట ముందు నవంబర్ 10వ తేదీ సాయంత్రం జరిగిన పేలుడును భారత ప్రభుత్వం 'ఉగ్రవాద దాడి'గా పేర్కొంది.
ఈ దర్యాప్తులో అరెస్టైన వారిలో కొందరు అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందినవారు.
జమ్మూకశ్మీర్ పోలీసులు, హరియాణా పోలీసులు అక్టోబర్ చివరిలో చేసిన సంయుక్త ఆపరేషన్‌లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను అరెస్టు చేశారు.
2017లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని మెడికల్ కాలేజీలో ఫిజియాలజీ ఉపాధ్యాయునిగా పనిచేశారు.
"ముజమ్మిల్ షకీల్ ఇచ్చిన సమాచారం మేరకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నాం" అని ఫరీదాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
"ఫరీదాబాద్‌లో జమ్మూకశ్మీర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో పెద్ద మొత్తంలో ఐఈడీ తయారీ సామగ్రి , మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం" అని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేంద్ర కుమార్ నవంబర్ 10న విలేఖరులతో అన్నారు.
డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టును కూడా ఆయన ధృవీకరించారు.
డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సంస్థలు అస్సాల్ట్ రైఫిళ్లు, పిస్టల్స్ సహా మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి.
ఈ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్న మరో డాక్టర్ షాహీన్ సయీద్‌ను కూడా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ పీఆర్ఓ యశ్‌పాల్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2002లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ షాహీన్, యూనివర్సిటీ ఫార్మకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఫరీదాబాద్ పోలీసులు డాక్టర్ షాహీన్ సయీద్ అరెస్టును ధృవీకరించారు.
పోలీసులు, ఏటీఎస్ బృందం తమ ఇంటికి వచ్చి విచారించారని వార్తా సంస్థ పీటీఐకి షాహీన్ సోదరుడు మహ్మద్ షోయబ్ తెలిపారు.
షాహీన్‌పై వచ్చిన ఆరోపణలను తాను నమ్మనని ఆమె తండ్రి అన్నారు .
డాక్టర్ షాహీన్ కొంతకాలం కాన్పూర్‌లో ఉపాధ్యాయినిగా పనిచేశారు. ఈ కేసుకు సంబంధించి కాన్పూర్ పోలీసులు కూడా అనేక మందిని ప్రశ్నించారు.
షాహీన్ జేఎస్ఎమ్ కళాశాలలో బోధించేవారని కాన్పూర్ జాయింట్ సీపీ (లా అండ్ ఆర్డర్) అశుతోష్ కుమార్ తెలిపారు.
ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన కారును డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు డీఎన్ఏ పరీక్షలో నిర్ధరణ అయిందని దిల్లీ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
2017లో ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ ఉమర్ నబీ జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఉమర్ నబీ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు.
సోమవారం రాత్రి పుల్వామాలోని కోయిల్ గ్రామంలోని వారి ఇంటికి ఒక పోలీసు బృందం వెళ్లిందని, ఉమర్ బంధువులను కూడా విచారించారని ఉమర్ నబీ వదిన ముజమ్మిల్ అక్తర్ చెప్పారు.
అయితే, ఈ విషయంలో దర్యాప్తు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
మరోవైపు, అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ఈ ముగ్గురు వైద్యులు కేవలం వృత్తిపరమైన సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
యూనివర్సిటీ ఏమంటోంది?
"మా ఇద్దరు వైద్యులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని మాకు తెలిసింది. ఈ ఇద్దరు వ్యక్తులకు విశ్వవిద్యాలయంతో ఎటువంటి సంబంధం లేదని మేం స్పష్టం చేయాలనుకుంటున్నాం. వారితో మాకు వృత్తిపరమైన సంబంధమే ఉంది" అని అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ భూపిందర్ కౌర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
యూనివర్సిటీకి ఎలాంటి రసాయనాలు లేదా పేలుడు పదార్థాలతో సంబంధం లేదని , దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తుందని విశ్వవిద్యాలయం తెలిపింది.
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన సంఘటనతో సంస్థను అనుసంధానించడం విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని విశ్వవిద్యాలయం ప్రకటనలో పేర్కొంది.
ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ, మెడికల్ కాలేజీ వైపు నుంచి సమాధానంకోసం బీబీసీ ప్రయత్నించింది, కానీ ఎటువంటి స్పందన రాలేదు.

విద్యార్థుల్లో భయం..
ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారు.
వైద్య కోర్సుల విద్యార్థులు చాలా మంది క్యాంపస్‌లోని హాస్టళ్లలో నివసిస్తున్నారు, ఇతర కోర్సుల విద్యార్థులు చుట్టుపక్కల ప్రాంతాలలో లాడ్జీలు లేదా అద్దె గదులలో నివసిస్తున్నారు.
దిల్లీలో జరిగిన కారు పేలుడు నేపథ్యంలో విశ్వవిద్యాలయం దర్యాప్తులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు.
ఈ విశ్వవిద్యాలయం నుంచి పారామెడికల్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే చదువుతున్న ఒక విద్యార్థి(పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) "అరెస్ట్ అయిన డాక్టర్లు మా కాలేజీతో సంబంధం కలిగినవారు. ఈ ఘటన తర్వాత, విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు" అని చెప్పారు.
వైద్య కళాశాలకు అనుబంధంగా 650 పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఈ పరిసర ప్రాంతాలనుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా రోగులు చికిత్స కోసం ఇక్కడికి వస్తారు.
దర్యాప్తు జరుగుతున్నప్పటికీ, రోగులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. కానీ వచ్చేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది.
"ఈ సంఘటన తర్వాత, చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య భారీగా తగ్గింది. ఇప్పుడు మునుపటిలా రావడంలేదు, రోగుల సంఖ్య సగానికి తగ్గింది" అని ఆసుపత్రిలోని మరో సిబ్బంది అన్నారు.
"ఈ విశ్వవిద్యాలయంలో చదివిన తర్వాత, నాకు ఆ సంస్థలోనే ఉద్యోగం వచ్చింది. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తారు, కానీ అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్తరప్రదేశ్ , బీహార్ నుంచి వస్తారు" అని ఉత్తరప్రదేశ్ నివాసి విశ్వాస్ జాన్సన్ అన్నారు.
"ఇక్కడ మె పాఠాలు బాగా చెబుతారు. కానీ పారా-మెడికల్ కోర్సు చదివే విద్యార్థులకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు"అని విశ్వాస్ అంటున్నారు.
విశ్వాస్ కూడా భయపడుతున్నారు.
"క్యాంపస్‌లో భారీగా పోలీసులు ఉన్నారు. విద్యార్థుల్లో భయానక వాతావరణం నెలకొంది. డాక్టర్ షాహినా సయీద్ మాకు పాఠాలు చెప్పారు. నేను కూడా డాక్టర్ ముజమ్మిల్‌ను క్యాంపస్‌లో చాలాసార్లు చూశాను" అని విశ్వాస్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














