ఎర్రకోట సమీపంలో పేలుడుపై కేంద్ర కేబినేట్ తీర్మానం, ఏం చెప్పిందంటే..

ashvini vaishnav

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

దిల్లీ పేలుడును ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం చెప్పారు.

"2025 నవంబర్ 10వ తేదీ సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడుకు కారణమైన ఉగ్రవాద ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై మంత్రివర్గం తీవ్ర విచారం వ్యక్తం చేసింది" అని అశ్విని వైష్ణవ్ అన్నారు.

ఈ మేరకు విడుదలైన ప్రకటనలో.. "2025 నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ద్వారా దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద ఘటనను దేశం చూసింది. ఈ పేలుడు ఫలితంగా అనేక మంది మరణించారు, గాయపడ్డారు. ఈ ఘటనలో బాధితులకు మంత్రివర్గం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది''

"ఈ సంఘటనను సత్వరమే, వృత్తినిబద్ధతతో దర్యాప్తు చేయాలని, తద్వారా నేరస్థులు, వారి వెనుకున్న వ్యక్తులను గుర్తించి ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని మంత్రివర్గం ఆదేశించింది".

ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీలో పేలుడు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ఉన్నారు.

ఎవ్వరినీ వదిలిపెట్టం: ప్రధాని నరేంద్ర మోదీ

కాగా ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

‘దిల్లీలో పేలుడు వెనక ఉన్నవారిని వదిలిపెట్టబోం, బాధ్యులను చట్టం ముందు నిలబెడతాం' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

భూటాన్ పర్యటనలో ఉన్న మోదీ మాట్లాడుతూ "నేను బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను. దిల్లీలో జరిగిన దారుణ సంఘటన అందరినీ తీవ్రంగా బాధించింది. బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకున్నాను. దేశం మొత్తం వారికి మద్దతుగా ఉంటుంది. నేను రాత్రి నుంచి అన్ని దర్యాప్తు సంస్థలతో మాట్లాడుతున్నా. మా దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై లోతుగా దృష్టి సారిస్తాయి" అని అన్నారు.

ఎర్రకోట మెట్రో స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి 'దిల్లీ డిఫెన్స్ డైలాగ్' కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.

"దేశంలోని అగ్ర సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని మా పౌరులకు హామీ ఇస్తున్నా" అని అన్నారు.

దర్యాప్తు వివరాలను త్వరలో వెల్లడిస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

మంగళవారం, ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)తో సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.

"ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉపా, పేలుడు పదార్థాల నిరోధక చట్టం, బీఎన్ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది" అని నార్త్ దిల్లీ డీసీపీ రాజా బందియా అన్నారు.

దర్యాప్తు కొనసాగుతోందని,ఆధారాలను సేకరిస్తున్నామని అన్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బందియా చెప్పారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌, దిల్లీలో పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంఘటన స్థలం నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారి మొహమ్మద్ వాహిద్ చెప్పారు.

'ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలు'

"సంఘటన స్థలం నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపుతున్నాం. ఆ తర్వాతే మాకు మరింత సమాచారం తెలుస్తుంది. నమూనాలను పరీక్షించిన తర్వాతే మేం ఒక నిర్ణయానికి రాగలం" అని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారి మొహమ్మద్ వాహిద్ మీడియాతో చెప్పారు.

మరోవైపు, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం వారి పౌరులకు భద్రతా హెచ్చరిక జారీ చేసింది.

దిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లవద్దని, జనసమూహాన్ని నివారించాలని అమెరికా రాయబార కార్యాలయం వారి పౌరులకు సూచించింది.

"2025 నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక కారు పేలిపోయింది. చాలామంది చనిపోయినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది. పేలుడుకు కారణం ఇంకా తెలియనప్పటికీ, భారత ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది" అని రాయబార కార్యాలయం పేర్కొంది.

దీంతో పాటు, అప్‌డేట్స్ కోసం స్థానిక మీడియాను చూస్తూ ఉండాలని, చుట్టూ ఉన్న వాతావరణం గురించి తెలుసుకోవాలని సూచించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎర్రకోట మెట్రోస్టేషన్, దిల్లీలో పేలుడు

ఫొటో సోర్స్, Reuters

ఎర్రకోట మెట్రోస్టేషన్ మూసివేత

ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఎర్రకోట(లాల్ ఖిలా) మెట్రోస్టేషన్ మూసివేసినట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తెలిపింది.

"భద్రతా కారణాల దృష్ట్యా లాల్ ఖిలా మెట్రో స్టేషన్ మూసివేశాం. మిగతా స్టేషన్లన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయి" అని డీఎంఆర్‌సీ 'ఎక్స్' పోస్టులో తెలిపింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై ఆరా తీశారు.

పేలుడు, కుటుంబ సభ్యులు, దిల్లీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పేలుడులో మరణించిన వారిలో ఒకరి కుటుంబ సభ్యులు.

బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి?

పేలుడులో గాయపడిన వారిని కలవడానికి తమకు అనుమతి ఇవ్వలేదని వారి బంధువులు బీబీసీతో చెప్పారు.

క్షతగాత్రులలో సఫాన్ అనే వ్యక్తి ఉన్నారు. బాధితులందరికి సరైన చికిత్స అందేవరకు బంధువులను అనుమతించలేమని ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ చెబుతోందని సఫాన్ బంధువు తాజుద్దీన్ చెప్పారు.

"మాలాంటి మరికొందరు గాయపడిన వారి బంధువులను కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు" అని ఆయన చెప్పారు.

పేలుడు చాలా శక్తిమంతంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

రాజ్‌ధర్ పాండే అనే స్థానికుడు మాట్లాడుతూ ''మా మేడపైనుంచి మంటలను చూశాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామని కిందికి దిగి వచ్చాం. చాలా గట్టిగా పేలుడు శబ్దం వినిపించింది. బిల్డింగ్ కిటికీలు కదిలిపోయాయి. మా ఇల్లు గురుద్వారా దగ్గర ఉంది'' అని ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు.

''పేలుడు జరిగినప్పుడు నేను షాపులో ఉన్నాను. హఠాత్తుగా భారీ పేలుడు జరిగింది. అలాంటి శబ్దం నేనిప్పటివరకూ వినలేదు. పేలుడు శబ్దం వినగానే నేను మూడుసార్లు పడిపోయాను. తర్వాత చుట్టుపక్కల ఉన్న అందరూ పరిగెత్తడం ప్రారంభించారు'' అని వలీ ఉర్ రహమాన్ అనే మరో స్థానిక షాపు యజమాని ఏఎన్ఐకు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)