కిడ్నీ వ్యాధులు ఎవరికి ఎక్కువగా వస్తున్నాయో తెలుసా? ఇవీ లక్షణాలు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మోహన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో 13.8 కోట్ల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు లాన్సెట్ జర్నల్ ప్రచురించిన తాజా అధ్యయనంలో తెలిపింది.
కిడ్నీ వ్యాధుల బారినపడడంతో పాటు మరణాల రేటులో చైనా తర్వాత భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 1990 నుంచి 2023 వరకు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా 2023లో, 20 ఏళ్లు పైబడిన 78.8 కోట్ల మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ - దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి)తో బాధపడుతున్నారు. 20 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది కిడ్నీ వ్యాధుల బారినపడ్డారు.
గడచిన మూడు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య రెట్టింపైంది. 1990లో, కిడ్నీ బాధితుల సంఖ్య 37.8 కోట్లుగా ఉంది.
ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ 2023లో14.8 లక్షల మందిని బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గల కారణాల్లో కిడ్నీ వ్యాధులు 9వ స్థానంలో ఉన్నట్లు అధ్యయనం చెబుతోంది.
అదే ఏడాది చైనాలో 1,53,000 మంది, భారత్‌లో 1,24,000 మంది కిడ్నీ వ్యాధులతో మరణించినట్లు లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.

సీకేడీ కేసులు ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో 15.2 కోట్లు ఉన్నాయి. తర్వాత, 13.8 కోట్ల కిడ్నీ వ్యాధి కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆర్థికంగా సమృద్ధిగా ఉన్న, అభివృద్ధి చెందిన దేశాలలో కిడ్నీ రోగుల సంఖ్య తక్కువగా ఉంది.
గత 30 ఏళ్లలో మూత్రపిండాల వ్యాధుల కారణంగా మరణాల రేటు పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది.

ఈ విషయంపై మరిన్ని వివరాల కోసం చెన్నై మెడికల్ కాలేజీలో యూరాలజీ విభాగం మాజీ అధిపతి, తమిళనాడు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కమిషన్ సభ్యులు డాక్టర్ గోపాలకృష్ణన్‌తో బీబీసీ మాట్లాడింది.
"కిడ్నీ ఫెయిల్యూర్ రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి ఆకస్మిక కిడ్నీ ఫెయిల్యూర్, రెండవది దీర్ఘకాలిక కిడ్నీ ఫెయిల్యూర్ . దీనినే మనం దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అని పిలుస్తాం. చాలా మంది ఈ రెండవ రకం వ్యాధితో బాధపడుతున్నారు" అని ఆయన అన్నారు.
మారుతున్న జీవనశైలి వల్లే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని ఆయన చెప్పారు.
"డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం, ఎక్కువ కేలరీలు తీసుకోవడం, తక్కువ శారీరక శ్రమ మూత్రపిండాల వైఫల్యానికి కారణాలు."
మూత్రపిండాల వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఆయన వివరించారు. ఈ లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కోవిధంగా ఉండే అవకాశం ఉందని డాక్టర్ గోపాలకృష్ణన్ చెప్పారు.
లక్షణాలు
- కాళ్ళు, తల వాపు
- మూత్రం తగ్గిపోవడం
- అలసట
- ఆకలి
- వాంతులు
- రక్తహీనత
- నిద్ర విధానాలు మారడం
"ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం కూడా కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణం కావొచ్చు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరిపై ఎక్కువ ప్రభావం?
వ్యవసాయం, నిర్మాణం వంటి బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారిపై ఎక్కువ ప్రభావం పడుతుందని గోపాలకృష్ణన్ అన్నారు.
"హీట్ స్ట్రెస్, క్రానిక్(దీర్ఘకాలిక) డీహైడ్రేషన్, వాయు కాలుష్యం, రసాయనాల వినియోగం వంటి కారణాల వల్ల కిడ్నీ వ్యాధి వస్తుంది. ఎక్కువసేపు ఆరుబయట పనిచేసే వ్యక్తులు నీడలో క్రమం తప్పకుండా విరామం తీసుకుంటూ, స్వచ్ఛమైన నీరు తాగుతుండాలి" అని ఆయన అన్నారు.
గుండె జబ్బులకు, మూత్రపిండాల వ్యాధులకు మధ్య సంబంధం
గుండె జబ్బులతో మరణించడానికి కిడ్నీఫెయిల్యూర్ కూడా ఒక ప్రధాన కారణమని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. దీర్ఘకాలిక కిడ్నీవ్యాధికి మధుమేహం, ఊబకాయం ప్రధాన ప్రమాద కారకాలు.
కిడ్నీ దెబ్బతినడంలో ఐదు దశలు ఉన్నాయి. చాలా మంది 1 నుంచి 3 దశల మధ్యలో ఉంటారు.
క్రానిక్ కిడ్నీ డిసీజ్, గుండె జబ్బులు ముడిపడి ఉన్నాయని గోపాలకృష్ణన్ అంటున్నారు. మూత్రపిండాలు దెబ్బతినే కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.
వయస్సు పెరిగేకొద్దీ ఈ వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుందని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.
ఈ వ్యాధి తీవ్రమైన దశ వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, వయస్సు పెరిగిన కొద్దీ డయాలసిస్, అవయవ మార్పిడి చికిత్సకు అవకాశాలు తగ్గుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం
కిడ్నీ వ్యాధి ఉన్న 30% మందికి తమకు ఆ వ్యాధి ఉన్నట్టు తెలియదని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.
"సగటు ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయని, సరైన ఉష్ణోగ్రతలు లేకపోవడం కూడా కాలక్రమేణా మూత్రపిండాల పనితీరు తగ్గడానికి దారితీస్తుంది" అని ఈ అధ్యయనం పేర్కొంది.
"ప్రతి ఏటా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. బీపీ, షుగర్, మూత్రం, రక్త పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధిని గుర్తించవచ్చు. నిర్దిష్ట వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తపరీక్షలు చేయించుకోవాలి" అని గోపాలకృష్ణన్ సూచిస్తున్నారు.
చికిత్స?
మూత్రపిండ వ్యాధికి రెండు రకాల చికిత్సలు ఉన్నాయి. డయాలసిస్, అవయవ మార్పిడి.
డయాలసిస్ ఖరీదైనది అయినప్పటికీ, ఇప్పుడు చాలా బీమా పాలసీలు దీనిని కవర్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స కూడా అందిస్తున్నారు.
కిడ్నీని ఎవరు దానం చేయవచ్చు?
మూత్రపిండ మార్పిడి విషయానికొస్తే, ఒక వ్యక్తి అవయవ దానం చేయడానికి రెండు పరిస్థితులు మాత్రమే ఉన్నాయని తమిళనాడు అవయవ మార్పిడి కమిషన్ సభ్య కార్యదర్శి రుతువర్ గోపాలకృష్ణన్ అన్నారు.
"కిడ్నీ దానం చేసే వ్యక్తి రోగి కుటుంబ సభ్యుడై ఉండాలి. లేదా రోగికి చాలా సన్నిహితుడై ఉండాలి. ఆ సన్నిహిత సంబంధాన్ని సాక్ష్యాలతో నిరూపించాలి. అప్పుడే వారి కిడ్నీ దానం చేయడానికి అనుమతిస్తారు" అని ఆయన అన్నారు.
ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో, వారి కుటుంబ సభ్యుల సమ్మతితో వారి అవయవాలను మార్పిడి కోసం తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
నివారణ మార్గాలు..
ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం వంటి మూత్రపిండాల వ్యాధిని నివారించే మార్గాలను కూడా గోపాలకృష్ణన్ సూచించారు.
- రోజూ 45 నిమిషాల నడక
- ఊబకాయం రాకుండా చూసుకోవడం
- తక్కువ ఉప్పు, సోడియం తీసుకోవడం
- పొటాషియం అధికంగా తీసుకోవడం
- అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలను నివారించడం
- ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకోవడం
- పొగాకు వినియోగాన్ని ఆపేయడం
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














