రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా రూపొందించిన డ్రాఫ్ట్ ప్లాన్ లీక్, అందులో ఏముంది?

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, యూరప్ డిజిటల్ ఎడిటర్

అమెరికా, రష్యా శాంతి ప్రణాళిక డ్రాఫ్ట్(ముసాయిదా) లీకైంది. యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న తూర్పు యుక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌లోని కొన్ని ప్రాంతాల నియంత్రణను రష్యాకు వదులుకోవాల్సి ఉంటుందని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

తాజా ప్రణాళికల ప్రకారం, యుక్రెయిన్ తన సైనికుల సంఖ్యను 6 లక్షలకు కుదించాల్సి ఉంటుంది.

మరి ప్రణాళికలోని మిగిలిన విషయాల సంగతేంటి? దాని నుంచి ఎక్కువ లబ్ధి పొందుతోంది ఎవరు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Marharyta Fal/Frontliner/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ప్రణాళికలో 28 ప్రధాన పాయింట్లు ఉన్నాయి

ముఖ్యమైన అంశాలేంటి?

ఈ ప్రణాళికలో 28 ప్రధాన అంశాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు యుక్రెయిన్‌కు అంగీకార యోగ్యంగా ఉండొచ్చు. మిగిలిన వాటి విషయంలో అస్పష్టత ఉంది.

యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ధ్రువీకరిస్తారు. యుక్రెయిన్‌కు పటిష్ట భద్రతా హామీలతో పాటు రష్యా, యుక్రెయిన్, యూరప్ మధ్య ''సమగ్రమైన దురాక్రమణ రహిత ఒప్పందం'' ఉంటుంది. అలాగే, వంద రోజుల్లో యుక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.

ఒకవేళ యుక్రెయిన్‌పై రష్యా మళ్లీ దాడికి దిగితే, "సమన్వయంతో బలమైన సైనిక ప్రతిస్పందన"తో పాటు రష్యాపై ఆంక్షలు విధించడం, ఒప్పందం రద్దు వంటివి ప్రతిపాదనలు ఉన్నాయి.

ప్రస్తుతం యుక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉండడంతో ఎన్నికలు జరపడం సాధ్యం కాకపోయినప్పటికీ, శాంతి ఒప్పందం కుదిరితే ఎన్నికలు జరిగే అవకాశముంది.

అయితే, యుక్రెయిన్‌కు భద్రతా హామీలు ఎవరిస్తారు? అవి ఎంత పటిష్టంగా ఉంటాయి? అనే దానిపై సమగ్ర వివరాలు లేవు. యుక్రెయిన్‌పై దాడి చేస్తే అందరిపై దాడిచేసినట్టేనన్న నాటో తరహా ఆర్టికల్ 5తో పోలిస్తే ఇది బలహీనంగా ఉంది. ఒప్పందంపై సంతకం చేయాలంటే హామీలు మరింత స్పష్టంగా ఉండాలని యుక్రెయిన్ కోరవచ్చు.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ శాంతి ప్రణాళిక డ్రాఫ్ట్ లీకైంది.

యుక్రెయిన్ భూభాగాన్ని అప్పగించడం, సాయుధ బలగాలను తగ్గించడం

ఆక్రమణలో లేని తమ సొంత భూభాగాన్ని యుక్రెయిన్ అప్పగించడం, సాయుధ బలగాలను తగ్గించడం వంటివి వివాదాస్పద ప్రతిపాదనల్లో కొన్ని .

''డొంటెస్క్ ప్రాంతంలోని కొంత భాగం నుంచి యుక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలి. అలా బలగాలను యుక్రెయిన్ ఉపసంహరించుకున్న ప్రాంతాన్ని తటస్థ నిరాయుధీకృత బఫర్ జోన్‌గా భావిస్తారు. అంతర్జాతీయంగా ఇది రష్యాకు చెందిన ప్రాంతంగా గుర్తిస్తారు. అయితే, ఈ నిరాయుధీకృత జోన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించకూడదు''

''ఫోర్ట్రెస్ బెల్ట్'' నగరాలుగా పిలిచే స్లోవ్‌యాన్స్క్, క్రమాటోర్స్క్, డ్రుజ్‌కివ్‌కాలను డొంటెస్క్‌లో కీలకమైన నగరాలుగా భావిస్తారు. 2,50,000 మందికిపైగా యుక్రెయిన్లు నివసించే ప్రాంతమిది. దీన్ని అప్పగించేందుకు ఎక్కువ మంది యుక్రేనియన్లు ఒప్పుకోరు. పోక్రోవ్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా సంవత్సరానికి పైగా ప్రయత్నించింది. అలాంటి కీలకమైన ప్రాంతాలను ఎలాంటి పోరాటం లేకుండా అప్పగించడానికి యుక్రెయిన్ అంగీకరించకపోవచ్చు.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తూర్పు యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల నియంత్రణను యుక్రెయిన్ వదులుకోవాలని లీకైన డ్రాఫ్ట్‌లో ఉంది.

''భద్రతా బలగాలను 6 లక్షలకు కుదించడం''

గత జనవరి అంచనాల ప్రకారం, యుక్రెయిన్ మిలిటరీ సిబ్బంది సంఖ్య 8 లక్షల 80 వేలు. 2022లో రష్యా యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి ప్రారంభించినప్పుడు 2,50,000 మంది ఉండేవారు.

పరిస్థితులు శాంతియుతంగా ఉన్నప్పుడు 6,00,000 మంది సైనికులు ఉండడం అంగీకరించగలిగే విషయమే అయినప్పటికీ, ఈ నియంత్రణ యుక్రెయిన్ సార్వభౌమత్వంపై ప్రభావం చూపొచ్చు. అయితే, యుక్రెయిన్‌కు 6,00,000 మంది సైన్యం ఉండడాన్ని రష్యా కూడా చాలా పెద్ద సంఖ్యగా భావించవచ్చు.

''క్రిమియా, లుహాన్స్క్, డొంటెస్క్‌ రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయని, అమెరికా కూడా అలాగే గుర్తిస్తుంది" అని కూడా ఈ ప్రణాళికలో ప్రతిపాదన ఉంది.

మరో విధంగా చెప్పాలంటే.. రష్యా నియంత్రణను యుక్రెయిన్ కానీ, ఇతర దేశాలు కానీ చట్టప్రకారం గుర్తించాల్సిన అవసరం లేదు. అంగీకరించాల్సిన అవసరం లేదు.

దక్షిణ ప్రాంతాలైన ఖేర్సన్, జపోరిజ్‌జియా అలాగే ఉంటాయి. యుక్రెయిన్‌లో మిగిలిన ఆక్రమిత ప్రాంతాలను రష్యా విడిచిపెట్టాలి.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ నాటోలో చేరబోదని, ఈయూలో చేరుతుందని డ్రాఫ్ట్‌లో ఉంది.

యుక్రెయిన్ ఈయూతో ఉంటుంది కానీ, నాటోతో కాదు..

యుక్రెయిన్ వ్యూహాత్మక భవిష్యత్తుపై ఈ డ్రాఫ్ట్ ప్లాన్ కొన్ని కీలకమైన హామీలను ప్రతిపాదిస్తోంది.

''నాటోలో ఎప్పటికీ చేరనని రాజ్యాంగాన్ని సవరించచేందుకు యుక్రెయిన్ అంగీకరిస్తుంది. యుక్రెయిన్‌ను భవిష్యత్తులో చేర్చుకోబోమని నాటో ఓ నిబంధన చేరుస్తుంది."

''యూరోపియన్ యూనియన్ సభ్యత్వానికి యుక్రెయిన్‌కు అర్హత ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు యూరోపియన్ మార్కెట్లతో తాత్కాలికంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.''

యుక్రెయిన్ నాటోలో చేరే అవకాశం తక్కువ. యుక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వంపై ఇటీవలి నెలల్లో రష్యా కాస్త మెతకవైఖరితో ఉంది. 27 యూరోప్ దేశాల అభిప్రాయాలను పట్టించుకోకుండా యుక్రెయిన్‌కు యూరప్ మార్కెట్లతో లావాదేవీలకు యాక్సెస్ కల్పించేలా ఈ డ్రాఫ్ట్‌లో ప్రతిపాదనలు ఉన్నాయి.

అయితే.. ఈయూ, నాటో రెండింటిలో చేరడం యుక్రెయిన్ రాజ్యాంగ పరిధిలోని అంశమని, ఏ కూటమిలో చేరాలనుకోవడం సహా తమ దేశ సార్వభౌమత్వంపై ఎలాంటి పరిమితులను ఒప్పుకోబోమని ఐక్యరాజ్యసమితిలో యుక్రెయిన్ ప్రతినిధి క్రిస్టినా హయోవ్యషిన్ చెప్పారు.

యుక్రెయిన్‌లో బలగాలు మోహరించబోమని నాటో అంగీకరించడం, పోలండ్‌లో యూరోపియన్ ఫైటర్ జెట్‌లు ఉంచడం ప్రణాళిల్లోని ప్రతిపాదనల్లో మరికొన్ని.

అణ్వస్త్ర రహిత దేశంగా ఉండడానికి కూడా యుక్రెయిన్ కట్టుబడి ఉండాలి.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షలు దశలవారీగా ఎత్తేయడం డ్రాఫ్ట్‌లోని కొన్ని పాయింట్లలో ఒకటి.

రష్యాను ఏకాకిగా ఉంచకుండా చర్యలు

"రష్యాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి విలీనం చేయడం" ద్వారా రష్యాను అంతర్జాతీయంగా ఒంటరిని చేయకుండా చర్యలు చేపట్టడం, జీ8 గ్రూప్‌లోకి తిరిగి ఆహ్వానించడం వంటి అనేక పాయింట్లు ఉన్నాయి.

అయితే, ప్రస్తుతానికి ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యాను జీ7 నుంచి బహిష్కరించారు. ఆరేళ్ల తర్వాత రష్యాను తిరిగి తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు, కానీ అది సాధ్యం కాలేదు.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్తంభింపజేసిన రష్యా ఆస్తులను యుక్రెయిన్ పునర్నిర్మాణానికి ఉపయోగించాలి.

స్తంభింపజేసిన రష్యా ఆస్తుల సంగతేంటి?

స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్లో 100 బిలియన్ డాలర్లను అమెరికా నేతృత్వంలో సాగే యుక్రెయిన్ పునర్నిర్మాణంపై వెచ్చించాలని ముసాయిదాలో ప్రతిపాదన ఉంది. లాభాల్లో అమెరికా 50 శాతం తీసుకుంటుంది. పునర్నిర్మాణంపై యూరప్ 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.

ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, యుక్రెయిన్ ఖనిజాల ఒప్పందంలానే ఇది ఉంది. అమెరికాకు ఇది ఆర్థికంగా లాభదాయకం. ఈ ప్రణాళిక వల్ల యూరోపియన్ యూనియన్‌కు ఎలాంటి లాభం లేదు.

యుక్రెయిన్ పునర్నిర్మాణానికి 524 బిలియన్ డాలర్లు లేదా 506 బిలియన్ పౌండ్లు ఖర్చవుతాయని ఈ ఏడాది ప్రారంభంలో భావించారు.

స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్లో 200 బిలియన్ పౌండ్లు బెల్జియంలోని యూరోక్లియర్ వద్ద ఉన్నాయి. కీవ్‌కు ఆర్థికంగా, సైనికపరంగా నిధులు అందించేందుకు ఈ డబ్బు ఉపయోగించాలని ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ ప్రణాళిక వేస్తోంది.

స్తంభింపజేసిన ఆస్తుల్లో మిగిలినవి ''అమెరికా-రష్యా ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్''‌లోకి వెళ్తాయి, తన డబ్బు కొంత తిరిగొచ్చే అవకాశంగా రష్యా దీనిని భావించినప్పటికీ, అమెరికాకూ దీంతో ప్రయోజనముంది.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ ఆయుధ సామర్థ్యంపై పరిమితి పెట్టలేదు.

ప్రణాళికలో ఏం లేదు?

యుక్రెయిన్ ఆయుధ సామర్థ్యంపైనా, యుక్రెయిన్ సైన్యానికి కావాల్సిన ఆయుధాలపైనా ఈ ప్రణాళిక ఎలాంటి పరిమితులు విధించలేదని చాలామంది అభిప్రాయపడ్డారు.

అయితే, యుక్రెయిన్ మాస్కో లేదా సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై క్షిపణి ప్రయోగిస్తే భద్రతా హామీ రద్దవుతుందన్న నిబంధన ఉంది.

యుక్రెయిన్ ఇప్పటికే అభివృద్ధి చేసుకుంటున్న ఫ్లమింగో, లాంగ్ నెప్ట్యూన్ వంటి దీర్ఘ శ్రేణి క్షిపణులపై ఎలాంటి పరిమితులూ లేవు.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సైన్యం 6 లక్షలకు పరిమితమవ్వాలని డ్రాఫ్ట్‌లో ఉంది.

ఇదేనా కచ్చితమైన శాంతి ప్రణాళిక?

ఈ ప్రణాళికను వీలైనంత వేగంగా అంగీకరించేలా చేయాలని అమెరికా భావిస్తోందని, యుక్రెయిన్‌కు థాంక్స్ గివింగ్ వీక్ తర్వాతి వారం వరకు సమయం ఇచ్చినట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

ఇది యుద్ధాన్ని ముగించేందుకు సాధ్యమైన ప్రతిపాదనల జాబితా అని డ్రాఫ్ట్ రూపకల్పనలో భాగమైన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు.

కొన్ని విషయాల్లో ఇంకా స్పష్టత లేదు. గురువారం(నవంబరు 20)అమెరికా వెబ్‌సైట్లలో లీకైన కొన్ని వివరాలు ఇప్పుడు కనిపించడం లేదు.

తాము ఇంకా ప్రణాళికను పూర్తిస్థాయిలో చూడలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ, యూరోపియన్ యూనియన్ చెప్పాయి.

రష్యా, యుక్రెయిన్, పుతిన్, శాంతి ప్రణాళిక, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముసాయిదా ప్రణాళిక రష్యాకు అనుకూలంగా ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.

పుతిన్ కోరుకున్నట్టే ముసాయిదా ఉందా?

రష్యా ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రెవ్ మూడురోజులు పాటు ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్‌తో ఈ ప్రణాళికపై చర్చించారని, అందుకే ఇది మాస్కోకు అనుకూలంగా ఉందని కొందరు భావిస్తున్నారు. ఇది శాంతి ఒప్పందానికి పునాది కావొచ్చని పుతిన్ చెప్పారు.

డీ మిలిటరైజ్‌డ్ జోన్‌లో అయినా యుక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు ఇవ్వడాన్ని రష్యాకు అత్యంత అనుకూలంగా ఉన్న సంకేతంలా భావిస్తున్నారు. అయితే, రష్యా ఇప్పటికే ఖేర్సన్, జపోరిజియాలను తన భూభాగాలుగా రాజ్యాంగంలో చేర్చుకుంది. ఇప్పుడా ప్రాంతాలను ఫ్రీజ్ చేయడం రష్యాకు కష్టమైన విషయం.

రష్యాపై ఆంక్షలు దశలువారీగా, ఒకదాని తర్వాత ఒకటి ఎత్తివేయాలన్నది ముసాయిదాలో ఉన్న ప్రతిపాదనల్లో ఒకటి. ఇది చాలా ఆలస్యంగా జరిగే ప్రక్రియలా మాస్కో భావించవచ్చు.

యుద్ధంలో భాగమైన వారందరికీ క్షమాభిక్ష పెట్టడం మాస్కోకు అంగీకారమవుతుంది గానీ యుక్రెయిన్, యూరప్ దేశాలకు కాదు.

ఈ ప్రణాళికలో చాలా విషయాలు పుతిన్‌కు అంగీకారయోగ్యమని, అయితే నాటోకు సంబంధించిన విషయాలు సహా కొన్నింటిలో అస్పష్టత ఉందని నిపుణులు అంటున్నారు.

యుద్ధానికి ఏది కారణమని చెప్పామో.. దానిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం శాంతి ఒప్పందానికి ఉందని రష్యా చెబుతూ వస్తోంది. తూర్పు యూరప్‌కు నాటో విస్తరణ నిలిపివేయాలన్నది రష్యా డిమాండ్. ఇది ముసాయిదాలో ఉంది.

యుక్రెయిన్‌లో రష్యా మాట్లాడే వారిపై వివక్ష ఉందని రష్యా చేసే ఆరోపణలకు ముసాయిదాలోని ఇతర 28 పాయింట్లలో చోటు కల్పించారు, కానీ వాటిని సమర్థించలేదు.

రెండు దేశాలు వివక్షాపూరిత చర్యలను పక్కనపెట్టాలి. యుక్రెయిన్, రష్యా మీడియా హక్కులకు హామీ ఇవ్వాలి.

యూరప్‌లో అతిపెద్దదైన ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి చేసే కరెంటును రష్యా, యుక్రెయిన్ సమానంగా పంచుకోవాలనే ప్రతిపాదన ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)