ఫోరెన్సిక్‌ సైన్స్: దీన్ని ఎవరు చదవొచ్చు, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి..

ఫోరెన్సిక్ నిపుణులు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు చూస్తుంటారా? వాటిలో ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ సంఘటన స్థలంలో క్లూస్ టీమ్ సేకరించే వెంట్రుకలు, వేలిముద్రలు, గోళ్లలో చిన్న రేణువులు, అలాగే మొబైల్ మెసేజ్‌లు కీలకమైన క్లూగా మారడం, వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి అవే మార్గం కావడం చూస్తుంటాం.

ఈ క్లూస్‌ను సేకరించి, విశ్లేషించేవారు ఫోరెన్సిక్ సైన్స్ అనే రంగంలో నిష్ణాతులై ఉంటారు.

లాజిక్, టెక్నాలజీ, శాస్త్రం అనే మూడు మూలస్తంభాల మధ్య ఈ రంగం విస్తరించి ఉంటుంది.

ఇప్పుడీ రంగంలో కెరీర్ అవకాశాలు, అందుకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల గురించి పరిశీలిద్దాం.

ఈ కెరీర్ ఎవరికి సరిపోతుంది? ఈ రంగంలో ప్రవేశించడానికి అవసరమైన అర్హతలు ఏమిటి? అనే విషయాల గురించి మాట్లాడదాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేర పరిశోధన ప్రక్రియను సరళం చేయడానికి, తీవ్రమైన నేరాలలో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరిగా సేకరించాలని భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ) ఇప్పుడు నిర్దేశిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేర పరిశోధన ప్రక్రియను సరళం చేయడానికి, తీవ్రమైన నేరాలలో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరిగా సేకరించాలని భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ఇప్పుడు నిర్దేశిస్తోంది

ఫోరెన్సిక్ సైన్స్‌లో కెరీర్ స్కోప్ ఎంత?

క్రిమినల్ కేసులు పెరుగుతున్న కొద్దీ ఫోరెన్సిక్ నిపుణుల అవసరం కూడా పెరుగుతోంది.

నేరం జరిగిన ప్రదేశాలలో లభించే ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించే వారే ఫోరెన్సిక్ నిపుణులు. అసలు అక్కడ ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి వారి నివేదికలు-పోలీసులు, న్యాయవాదులు, పరిశోధకులు లేదా న్యాయమూర్తులకు సహాయపడతాయి.

ఫోరెన్సిక్ నిపుణులు ఎక్కడ పని చేయవచ్చంటే...

  • కేంద్ర, రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలలు (సీఎఫ్ఎస్‌ఎల్/ఎఫ్ఎస్ఎల్)
  • నేర పరిశోధన విభాగం (సీఐడీ)
  • ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)
  • సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)
  • పోలీసు శాఖ
  • ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు
  • సైబర్ క్రైమ్ సెల్
  • కోర్టు లేబరేటరీ
  • రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫోరెన్సిక్ సైన్స్ అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్న దేశంలోని ప్రధాన సంస్థలలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ (ముంబయి), బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) ఉన్నాయి.

ఎన్ఎఫ్ఎస్‌యూకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఒక ప్రత్యేక ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అంతేకాకుండా, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. వాటికి కూడా ప్రత్యేక ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫోరెన్సిక్ సైన్స్‌లో ఏమి జరుగుతుంది?

ఫోరెన్సిక్ సైన్స్ అనేది భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), జీవశాస్త్రం (బయాలజీ), కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ శాస్త్ర విభాగాలను కలిపి, నేరాలను పరిశోధించడానికి లేదా కోర్టులో సమర్పించదగిన సాక్ష్యాలను సేకరించడానికి ఉపయోగించే రంగం.

దాని పరిధి చాలా విస్తృతమైనదే అయినప్పటికీ, ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయనే సందేహం మీకు కలిగితే, దానికి సమాధానం...

ఫోరెన్సిక్ బయాలజీ: ఇందులో, డీఎన్ఏ, రక్తం, వెంట్రుకలు వంటి జీవసంబంధమైన ఆధారాలను విశ్లేషిస్తారు.

ఫోరెన్సిక్ కెమిస్ట్రీ: ఇందులో మందులు, రసాయనాలు, పేలుడు పదార్థాలు మొదలైన వాటిని పరీక్షిస్తారు.

ఫోరెన్సిక్ పాథాలజీ: మరణానికి కారణం, మరణించిన సమయాన్ని నిర్ధరించడానికి మృతదేహాలను అధ్యయనం చేస్తారు.

ఫోరెన్సిక్ టాక్సికాలజీ: మానవ శరీరంలో కనిపించే విష పదార్థాలు (టాక్సిన్స్), విషాలు (పాయిజన్స్), డ్రగ్స్‌ను విశ్లేషిస్తారు.

డిజిటల్ ఫోరెన్సిక్స్: ఈ నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాలు, సైబర్ నేరాలను పరిశోధిస్తారు.

ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ: అస్థిపంజరం లేదా అవశేషాలను అధ్యయనం చేయడం ద్వారా, ఆ వ్యక్తి ఎవరనేదీ గుర్తింపు, అలాగే మరణానికి కారణం, మరణ సమయం నిర్ధరిస్తారు.

ఫోరెన్సిక్ ఒడాంటాలజీ: ఇందులో, దంతాలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తారు.

ఫోరెన్సిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫోరెన్సిక్ సైన్స్ ఎవరికి సరైన ఆప్షన్?

ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థులు ఇంటర్మీడియెట్ (12వ తరగతి)లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం/గణితం సబ్జెక్టులు చదివి ఉండాలి. చాలా కాలేజీలు ప్రవేశానికి కనీసం 50 శాతం మార్కులు పొందాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి.

అయితే, ఈ షరతుల కంటే ముఖ్యంగా, ఫోరెన్సిక్ సైన్స్ ఒక విద్యార్థికి సరైన ఎంపిక అవునో కాదో తెలుసుకోవడం ముఖ్యం.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సిమ్రాన్ ఠాకూర్ 2021లో అమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఫోరెన్సిక్ సైన్స్‌లో బీఎస్సీ పట్టా పొందారు. ఆమె అదే విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కూడా పూర్తి చేసి, ప్రస్తుతం అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ చేస్తున్నారు.

సిమ్రాన్ 12వ తరగతిలో జీవశాస్త్రం కూడా ఒక సబ్జెక్టుగా చదివారు. వాస్తవానికి ఆమె మెడిసిన్ చదవాలని కుటుంబసభ్యులు ఆశించారు. కానీ ఆమె ఫోరెన్సిక్ సైన్స్ ఎంచుకున్నారు.

తనకు భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం రెండూ సమానంగా ఇష్టమని సిమ్రాన్ చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం అన్ని రకాల శాస్త్రాలను అధ్యయనం చేయాలనుకోవడం, వాటిని ఎలా అన్వయించాలో అర్థం చేసుకోవాలనే ఆసక్తేనని తెలిపారు.

ఈ కోర్సుకు సరిపోయేలా విద్యార్థికి ఉండాల్సిన ముఖ్య నైపుణ్యాలు ఏమిటని బీబీసీ ఆమెను అడిగింది.

"ముందుగా, మీ పరిశీలనా నైపుణ్యాలపై దృష్టి పెట్టండి. మీరు ఎక్కడికైనా నడుస్తున్నప్పటికీ, మీ కళ్లు, ముక్కు, చెవులు పనిచేస్తుండాలి. ప్రతి మూలలో మీరు ఏమి చూస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. మీరు ఒక విషయాన్ని ఎంత క్షుణ్నంగా గమనిస్తున్నారనేదీ ఫోరెన్సిక్స్‌లో అతి ముఖ్యమైన అంశం'' అని సిమ్రాన్ చెప్పారు.

"రెండవది, ఓపికగా ఉండండి. కొన్నిసార్లు మనం తొందరపడి ఒక నిర్ధరణకు వచ్చేస్తాం. కానీ ఫోరెన్సిక్స్‌లో అలా కాదు. మీరు కష్టపడి పనిచేయాలి. మీకు ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉండాలి. చివరగా, మీకు సమస్య- పరిష్కార నైపుణ్యాలు ఉండాలి" అని సూచించారు.

ఫోరెన్సిక్ నిపుణులు ఏం చేస్తారు...

ఫోరెన్సిక్ సైంటిస్టులు: ప్రయోగశాలలో ఆధారాలను పరిశోధించేవారు.

క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్లు: సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించేవారు.

ఫోరెన్సిక్ టాక్సికాలజిస్టులు: శరీరంలో మందులు లేదా విష పదార్థాల ఉనికిని గుర్తించేవారు.

ఫోరెన్సిక్ డాక్యుమెంట్ నిపుణులు: చేతిరాత, నకిలీ పత్రాలు మొదలైన వాటిని విశ్లేషించేవారు.

సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌లు: డిజిటల్ నేరాలు, హ్యాకింగ్‌కు సంబంధించిన ఆధారాలను అధ్యయనం చేసేవారు.

డీఎన్ఏ ఎనలిస్టులు: అనుమానితులు లేదా బాధితుల డీఎన్ఏ నమూనాలను సరిపోల్చేవారు.

ఫోరెన్సిక్ బాలిస్టిక్స్ ఎక్స్‌పర్ట్‌లు: బుల్లెట్లు, తుపాకులు, మందుగుండు సామగ్రిని అధ్యయనం చేస్తారు.

ప్రభుత్వశాఖల్లో ఫోరెన్సిక్ నిపుణుల ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు...

  • SSC CGL: కేంద్ర విభాగాలలో ఫోరెన్సిక్ నిపుణుల కోసం
  • State PSC: రాష్ట్రాల ప్రభుత్వ ప్రయోగశాలలలో నియామకాల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్
  • UPSC: సీబీఐ లేదా ఐబీలో సైంటిఫిక్ ఆఫీసర్ల నియామకానికి
  • DRDO/ISRO: పరిశోధన ఆధారిత ఫోరెన్సిక్ ఉద్యోగాల కోసం
ఫోరెన్సిక్ నిపుణులు

ఫొటో సోర్స్, Getty Images

కెరీర్‌ గ్రోత్ అవకాశాలు ఎలా ఉంటాయి?

నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో ఫోరెన్సిక్ సైన్సెస్ విభాగం అధిపతి డాక్టర్ విశ్వప్రకాశ్ నాయక్ మాట్లాడుతూ, బీఎస్సీ ఫోరెన్సిక్స్ చదువుతున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక పెద్ద అవకాశం ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రతి సంవత్సరం వచ్చే ఉద్యోగాలేనని చెప్పారు.

"ప్రతి సంవత్సరం 1200-1300 మంది అభ్యర్థులు ఐబీలో చేరుతున్నారు. వాస్తవానికి, 2025లో, ఐబీ దాదాపు 4,000 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నియామకాలను ప్రకటించింది. ఫోరెన్సిక్స్ విద్యార్థులకు అతిపెద్ద ప్రయోజనం వారి పరిశీలన నైపుణ్యాలే" అని ఆయన చెప్పారు.

డాక్టర్ నాయక్ ఇంకా ఏమంటారంటే, ''ఐటీ కంపెనీలలో ఎనలిస్టుల పాత్ర ఉంటుంది. వారు ఫోరెన్సిక్ పని కూడా నిర్వహిస్తారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆహార పరిశ్రమలో కూడా పనిచేస్తారు. ఏదైనా ఆహార పదార్థంలో ఏదైనా కల్తీ జరిగిందని అనుకుందాం. పాలు, స్వీట్లు, జున్ను ఏదైనా కావచ్చు, ఆ కల్తీని గుర్తించేది ఫోరెన్సిక్ నిపుణులే" అని వివరించారు.

ఫోరెన్సిక్‌లో పీహెచ్‌డీ చేస్తే మీకు చాలా అవకాశాలు వస్తాయని సిమ్రాన్ ఠాకూర్ చెబుతున్నారు.

బోధన: విద్యారంగంలోకి వెళ్లవచ్చు. కాలేజీలు, యూనివర్సిటీలలో అధ్యాపకులుగా బోధించవచ్చు.

పరిశోధన: ప్రతి రోజూ నేరాలు పెరుగుతున్నందున, ఆ నేరాలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి, నేర పరిశోధనకు సహాయపడేందుకు కొత్త సాంకేతిక నైపుణ్యాలు అవసరం. వాటిని కనుగొనడానికి పరిశోధనలు నిర్వహించవచ్చు.

డిటెక్టివ్ ఏజెన్సీలు: "డిటెక్టివ్ ఏజెన్సీలలో చేరవచ్చు, న్యాయవాదులకు సహాయం అందిస్తూ పరోక్షంగా దేశసేవ చేయవచ్చు" అని సిమ్రాన్ చెప్పారు.

బ్యాంకింగ్, బీమా: ఎమ్మెస్సీ చేస్తే అనేక అవకాశాలు ఉంటాయని డాక్టర్ నాయక్ చెప్పారు. వేలిముద్రల అధ్యయనం, డాక్యుమెంట్ విశ్లేషణలో మంచి నైపుణ్యం ఉన్నవారు బ్యాంకింగ్, బీమా రంగాలలోకి కూడా ప్రవేశించవచ్చని ఆయన అంటున్నారు.

ల్యాబ్స్: కెమిస్ట్రీలో నైపుణ్యం ఉన్నవారు నీరు, ఆహారం, వాయువులను విశ్లేషించే అనేక ప్రైవేట్ ల్యాబ్‌లలో పనిచేయవచ్చు.

ఐటీ కంపెనీలు: ఐటీలో మంచి నైపుణ్యం ఉన్నవారు ఐటీ కంపెనీల్లో చేరవచ్చు. అక్కడ మంచి వేతన ప్యాకేజీలు పొందే అవకాశం ఉంటుంది.

ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు: ప్రైవేట్ పరిశోధన సంస్థల రంగం కూడా పెద్ద సంఖ్యలో ఫోరెన్సిక్ విద్యార్థులకు ఉద్యోగాలను అందిస్తుంది.

న్యాయసంస్థలు: న్యాయ సంస్థలలో కూడా ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థులకు డిమాండ్ ఉంది. న్యాయవాదులకు అన్ని విభాగాలపై అవగాహన ఉన్నప్పటికీ, వారికి తరచుగా శాస్త్రీయ నివేదికలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు వారికి సహాయం చేస్తారు. న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించడానికి వీలు కల్పిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)