పొలండ్, రొమేనియా గగనతలంలోకి రష్యా డ్రోన్లు, ‘ఇది యుద్ధ విస్తరణే’ అంటున్న జెలియెన్‌స్కీ

రొమేనియా గగనతలం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రొమేనియా గగనతలంలో రష్యా డ్రోన్‌ను గుర్తించిన ఎఫ్-16 ఎయిర్‌క్రాఫ్ట్
    • రచయిత, ఇయాన్ కాసే, అలెక్స్ బోయిడ్

రష్యా డ్రోన్ తమ గగనతలంలోకి వచ్చి, నిబంధనను ఉల్లంఘించిందని రొమేనియా తెలిపింది.

ఇలాంటి చొరబాటు జరిగినట్లు రిపోర్టు చేసిన రెండో నేటో దేశం రొమేనియా.

అంతకుముందు పోలండ్ సైతం తమ దేశంపై రష్యా డ్రోన్లు చక్కర్లు కొట్టినట్లు రిపోర్టు చేసింది.

శనివారం యుక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని రొమేనియా యుద్ధ విమానాలు గమనిస్తున్న సమయంలో యుక్రెయిన్ దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఒక డ్రోన్‌ను గుర్తించినట్లు రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ చొరబాటు పొరపాటున జరిగింది కాదని, రష్యా యుద్ధాన్ని విస్తరిస్తుందని స్పష్టంగా తెలుస్తుందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియెన్‌స్కీ అంటున్నారు.

అయితే, రొమేనియా ఆరోపణలపై మాస్కో ఇంకా స్పందించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పోలండ్ బుధవారం నాడు తన గగనతలంలోకి ప్రవేశించిన మూడు రష్యా డ్రోన్లను కూల్చేసినట్లు తెలిపింది.

డానుబేలోని యుక్రెయిన్ మౌలిక సదుపాయాలపై రష్యా వైమానిక దాడులు చేసిన తర్వాత యుక్రెయిన్‌తో తమ దేశానికి ఉన్న సరిహద్దును రెండు ఎఫ్-16 జెట్లతో గమనిస్తున్నప్పుడు రష్యా డ్రోన్‌ను గుర్తించినట్లు రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

రాడార్ నుంచి అది అదృశ్యమవ్వడానికి ముందు చిలియా వెచే గ్రామానికి నైరుతి దిశలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ డ్రోన్ కనిపించింది.

అయితే, జనసాంద్రత ఉన్న ప్రాంతాలపై ఇది ఎగరలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

యూరోపియన్ యూనియన్ సభ్య దేశ సార్వభౌమత్వానికి చెందిన మరో ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన ఇదని ఈయూ విదేశాంగ విధానపు అధినేత కాజా కల్లాస్ అన్నారు.

రష్యా డ్రోన్ల విషయంలో పోలండ్ కూడా శనివారం తన ఆందోళనలను వ్యక్తం చేసింది.

''గగనతలంలో పోలండ్, దాని మిత్ర దేశాలు నివారణ చర్యలను ప్రారంభించాయి'' అని ఆ దేశ ప్రధానమంత్రి డోనల్డ్ టస్క్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చెప్పారు.

భూతలంపై ఎయిర్ డిఫెన్ సిస్టమ్‌లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రొమేనియా మ్యాప్

పోలండ్ భూభాగంపై ఉన్న సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవాలనే ఉద్దేశం తమకు లేదని ఈ వారం ప్రారంభంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

తమ నేవిగేషన్ సిస్టమ్‌లు జామ్ అవ్వడంతో ప్రమాదవశాత్తు పోలండ్ గగనతలంలోకి డ్రోన్లు ప్రవేశించినట్లు రష్యా మిత్ర దేశం బెలారస్ చెప్పింది.

పోలండ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌ యూనిట్‌ను పంపినట్లు చెక్ రిపబ్లిక్ ఆదివారం తెలిపింది.

ఈ యూనిట్‌లో మూడు ఎంఐ-171ఎస్ హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రతి హెలికాప్టర్ 24 మంది వరకు వ్యక్తులను తీసుకెళ్లగలదు. వీటిలో పూర్తి స్థాయి యుద్ద పరికరాలు ఉంటాయి.

నేటో తూర్పు వైపు రష్యా చొరబాటుకి స్పందనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెక్ రిపబ్లిక్ రక్షణ మంత్రి జానా సెర్నోకోవా చెప్పారు.

తాజా డ్రోన్ చొరబాటుపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ స్పందించారు.

మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను ఆయన తరచూ అభ్యర్థిస్తున్నారు.

గగనతలాల ఉల్లంఘనపై ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా స్పందించారు.

రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అయితే, నేటో దేశాలు రష్యా నుంచి చమురు కొనడాన్ని నిలిపివేయడం వంటి కొన్ని షరతులను పాటించాలని చెప్పారు.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించింది.

ఈ యుద్ధం ముగింపు కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గత నెలలో అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్‌తో సమావేశమై వచ్చినప్పటి నుంచి యుక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)