కులగణన: సామాజిక సమస్యలకు పరిష్కారమా? శతాబ్దాల వివక్షకు మరింత బలమా - దీని చుట్టూ వాదనలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో కులగణన అంటే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి సంబంధించినది మాత్రమే కాదు.
ఎంతమంది ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నారు? ఎవరు పొందలేకపోతున్నారు అన్నది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
దేశంలో తదుపరి జనగణన 2027లో జరగనుంది. జనాభాతోపాటు దాదాపు వందేళ్ల తర్వాత తొలిసారి అన్ని కులాలను లెక్కించనున్నారు. దేశంలో కులవ్యవస్థ అనేది రాజ్యాలు, సామ్రాజ్యాలు, భావజాలాల కంటే ఎంతో ముందు నుంచి కొనసాగుతూ వస్తోంది.
కులగణన విషయంలో దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన విముఖతకు, ప్రతిపక్షాల డిమాండ్లకు ఈ నిర్ణయంతో తెరపడే అవకాశం ఉంది. కనీసం మూడు రాష్ట్రాలు సొంతంగా సర్వేలతో ఈ ప్రక్రియలో ముందువరుసలో నిలిచాయి.
2011లో అనధికారికంగా సేకరించిన డాటా ప్రకారం భారతదేశంలో సుమారు 46 లక్షల కులాలు ఉన్నట్లు రికార్డయింది.

‘పురోగతికి కులం ఒక అడ్డుగోడ’
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎవరు నిజంగా లబ్ధి పొందుతున్నారు? ఎవరు పొందలేకపోయారు? అనే స్పష్టమైన వివరాలను కుల గణన వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
దీనిద్వారా, సంక్షేమంపై చేసే ఖర్చును నిజంగా అవసరమైన వారికి అందేలా చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు, విద్య వంటి వాటిల్లో కోటాలను పక్కా ఆధారాలతో మళ్లీ లెక్కించడానికి వీలవుతుందని చెబుతున్నారు.
సామాజిక కార్యకర్త ఆనంద్ తేల్‌తుంబ్డే రాసిన కొత్త పుస్తకం 'ది క్యాస్ట్ కాన్ సెన్సస్'లో కులగణన గురించి కొన్ని హెచ్చరికలు చేశారు.
వివక్షపూరిత కుల వ్యవస్థను నిర్మూలించాల్సిన ప్రస్తుత తరుణంలో ఈ కులగణన దాన్ని మరింత నాటుకుపోయేలా చేస్తుందని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఆయన చేసిన ఈ వాదన, మెరుగైన డాటా ఉంటే న్యాయబద్ధమైన విధానాల రూపకల్పన సాధ్యమవుతుందన్న అభిప్రాయాలకు విరుద్ధంగా ఉంది.
"కులాలు అనేవి పురోగతి ప్రక్రియకు ఏ రకంగానూ మంచివి కావు. మూల స్వభావాన్నిబట్టి చూస్తే కులం అనేది ఎప్పుడూ ఆధిక్యతను ప్రదర్శించే భావన. దీన్ని కొలవలేం'' అని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
కులమతాలకు అతీతంగా పోరాడటమే కారణమా?
కులగణన అనేది వలసవాదం నాటి ఆలోచనగా తేల్‌తుంబ్డే పరిగణిస్తున్నారు. బ్రిటిష్ పాలకులు 1871లో కులగణన ప్రారంభించారు.
''కుల, మతాలకు అతీతంగా 1857లో భారతీయులు ఐక్యంగా బ్రిటిష్ వారిపై పోరాడారు. ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో కులగణన మొదలుపెట్టారు. తమ అధికారాన్ని, నియంత్రణను నిలుపుకోవడానికి దీన్నొక సాధనంగా మార్చుకున్నారు'' అని తేల్‌తుంబ్డే తన పుస్తకంలో రాశారు.
1871 నుంచి 1931 మధ్య ఆరుసార్లు కులగణన జరిగింది. 1931లో జరిగినదే భారత్‌లో పూర్తిస్థాయిలో చేసిన చివరి కులగణన.
"ప్రతీ లెక్కింపు కులాన్ని నమోదు చేయడమే కాకుండా దాన్ని మరింత బలోపేతం చేసింది'' అని తేల్‌తుంబ్డే అభిప్రాయపడ్డారు.
సామాజిక న్యాయం పేరిట స్వతంత్ర భారతం ఈ కులవ్యవస్థను కాపాడుకుందని ఆయన రాశారు. ‘‘సామాజిక న్యాయానికి నిజంగా అవసరమైనది ప్రజలందరి సామర్థ్యాలను పెంపొందించడం. ఈ ప్రధాన బాధ్యత నుంచి స్వతంత్ర భారతం తప్పించుకుంది’’ అని పేర్కొన్నారు.
కులగణన అనేది అసమానతను రూపుమాపడానికి బదులుగా దాన్నొక అధికారిక రికార్డుగా పదిలపరుస్తుందని తేల్‌తుంబ్డే భావిస్తున్నారు.
నిజమైన సామాజిక మార్పును తీసుకురావడానికి బదులుగా ఎవరికి ఎంత దక్కిందనే లెక్కలు, వాటాలకే దీన్ని రాజకీయ నాయకులు పరిమితం చేస్తారని ఆయన అంటున్నారు.
‘‘రాజకీయ పార్టీలు ప్రయోజనం పొందుతాయి’’
కులగణన కోసం వస్తున్న డిమాండ్‌ను మరిన్ని రిజర్వేషన్ల కోసం ఒక ఒత్తిడిగా తేల్‌తుంబ్డే చూస్తున్నారు. మెజారిటీ ప్రజలు పేదరికంలోకి జారిపోయి, ప్రభుత్వ సాయంపై ఆధారపడుతున్నారని ఆయన అంటున్నారు. దాదాపు 80 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు ఉచిత రేషన్లపై ఆధారపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో అత్యంత అణగారిన వర్గాలైన దళితులు, ఆదివాసీల కోసం తొలుత రిజర్వేషన్లు తీసుకొచ్చారు. కానీ, ఆ తర్వాత ఓబీసీల వంటి అంతగా వెనుకబడని వర్గాలు తమకు కూడా రిజర్వేషన్లలో భాగం కావాలని కోరడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత రిజర్వేషన్లలో కుల ఆధారిత కోటాలు కావాలని, ఉన్నవాటిని పెంచాలంటూ డిమాండ్లు పెరిగాయి.
ఈ లెక్కింపు కులాలను చట్టబద్ధం చేస్తుందని తేల్‌తుంబ్డే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ డేటాను ఉపయోగించి కోటాలను మళ్లీ మార్చడానికి లేదా కులాల మధ్య ఉన్న అంతరాలు, కోపాలను ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు.
'కులాన్ని సంస్కరించలేం, దాన్ని నాశనం చేయాలి' అనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాటలను గుర్తు చేస్తూ 'కులాన్ని మేనేజ్ చేయడం కాదు దాన్ని నిర్మూలించాలి' అని తేల్‌తుంబ్డే భావిస్తున్నారు.
అయితే ఇది ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదని, కుల వ్యవస్థ బాధితులు కూడా కులాన్ని రక్షించడానికే చూస్తున్నారని తేల్‌తుంబ్డే అన్నారు. రాబోయే కులగణన, అసమానతలను బయటపెట్టకుండా, దాన్ని మరింత శక్తిమంతంగా మారుస్తుందన్నది ఆయన వాదన.

ఫొటో సోర్స్, Fairfax Media via Getty Images
‘‘సర్వేలతోనే అంతా మారుతుందా?’’
చాలామంది విశ్లేషకులు, తేల్‌తుంబ్డే అభిప్రాయంతో ఏకీభవించట్లేదు. వారు కులగణనను సామాజిక న్యాయాన్ని అందించడానికి అవసరమైన సాధనంగా చూస్తున్నారు.
కులగణన చేపట్టకపోవడాన్ని స్వతంత్ర భారతంలో జరిగిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటిగా సామాజికవేత్త సతీశ్ దేశ్‌పాండే, ఆర్థికవేత్త మేరీ ఇ జాన్ అభివర్ణించారు.
ఈ రోజుల్లో కులం అనేది కేవలం భారత్‌లో దిగువ కులాలైన దళితులు, ఆదివాసీలకే భారంగా మారిందని వారు 'ద పాలిటిక్స్ ఆఫ్ నాట్ కౌంటింగ్ క్యాస్ట్' అనే పరిశోధనా పత్రంలో రాశారు.
ఈ వర్గాల వారే తరచుగా అధికారిక పత్రాల ద్వారా తమ గుర్తింపును నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నారని అందులో పేర్కొన్నారు.
కులాలకు సంబంధించిన అధికారిక, నమ్మదగిన డేటా లేకపోతే ఎవరికి ప్రయోజనం దక్కుతుంది? ఎవరు నష్టపోతున్నారు? అనే రెండు విషయాలు అస్పష్టంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
తాజా కుల గణన లేకపోతే, వలస కాలం నాటి కాలంచెల్లిన డాటా మీద ఆధారపడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ చర్యలు గుడ్డిగా పని చేస్తాయని డెమోగ్రాఫర్ సొనాల్డే దేశాయ్ నాతో అన్నారు.
"సర్వేలు, గణనలు సామాజిక వాస్తవాన్ని మార్చగలిగితే మనకు ఇంకా సామాజిక విధానాలతో ఏం పని. ఉదాహరణకు, గృహహింసను ఆపడానికి సర్వేలు, గణనలు సరిపోతాయని అనుకుంటే మనం సింపుల్‌గా భార్యలను కొట్టేవారు సిగ్గుపడేలా చేయడానికి సర్వేల్లో ఆ ప్రశ్నలు అడిగితే సరిపోతుంది. కానీ, అలా ప్రశ్నలు అడిగితే గృహహింస ఆగుతుందా? ఇది అంతే. 1931 నుంచి జనాభా లెక్కల్లో కులం గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. మరి కుల సమీకరణాలు ఆగిపోయాయా?'' అని ఆమె ప్రశ్నించారు.
‘‘కులం మాత్రమే కొలమానం కాదు’’
కులగణన అనేది కులం గుర్తింపును మరింత బలోపేతం చేస్తుందనే తేల్‌తుంబ్డే వాదనతో రాజకీయ శాస్త్రవేత్త సుధా పాయ్ ఏకీభవించారు.
అయితే సంక్షేమం, ఎన్నికల వ్యూహాల ద్వారా ఇప్పటికే కులాన్ని రాజకీయం చేశారు కాబట్టి కులగణన అనివార్యంగా మారిందని ఆమె అంటున్నారు.
"ప్రతి కులసమూహంలోని ఆదాయ స్థాయిలను కూడా సేకరిస్తే కుల గణన ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఈ డాటాను ఉపయోగించి ప్రతీ కులంలో నిజంగా అర్హులైన వారికి ఉపయోగపడేలా, వారు ఉన్నత స్థానానికి ఎదగడానికి అవసరమైన విద్య, ఉద్యోగాలువంటి వాటిల్లో అవకాశాలు కల్పించవచ్చు.
వనరుల పంపిణీకి కులాన్ని మాత్రమే కొలమానంగా వాడటం నుంచి పాలసీ నిర్ణయాల్లో కులం, ఆదాయం రెండింటినీ ఉపయోగించే విధంగా మార్పులు జరగాలి'' అని ఆమె అన్నారు.
కులాలను లెక్కించడం, ఆ డేటాను అర్థం చేసుకోవడం అనేది సవాళ్లతో కూడుకున్నదని విశ్లేషకులు హెచ్చరించారు.
"1931 నుంచి ఈ శతాబ్ద కాలంలో భారత్ చాలా మారింది. అప్పట్లో పేద, అణగారిన వర్గాలుగా గుర్తింపు పొందిన కులాలు ఆ పేదరికం నుంచి బయటపడి ఉండొచ్చు. కొత్త దుర్బల సమూహాలు పుట్టుకొచ్చి ఉండొచ్చు. మనం గనుక ఈ కులగణన ప్రక్రియను నిజాయతీగా చేయాలనుకుంటే, సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులను రీషఫుల్ చేయకుండా సాధ్యం కాదు" అని ప్రొఫెసర్ దేశాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఉపకులాలను ఎలా వర్గీకరిస్తారు?
డాటా సేకరణలో మరో సమస్య కూడా ఉంది. కులాల్లో చాలా ఉపకులాలు ఉంటాయి. వాటిని సరైన రీతిలో వర్గీకరించడం చుట్టూ సమస్యలు వస్తాయి. ఉపకులాలుగా వర్గీకరించడం లక్ష్యం ఏంటంటే, పెద్ద కుల సమూహాలను చిన్నవిగా విభజించడం ద్వారా, వాటిలో అత్యంత వెనుకబడిన వారికి కోటాలు, ప్రయోజనాల్లో సరైన వాటా అందేలా చూడటం.
తేల్‌తుంబ్డే ఇప్పటికీ తన వాదననే సమర్థించుకుంటున్నారు. లెక్కలు వేస్తూ పోవడం ద్వారా కులవ్యవస్థను సరిదిద్దలేమని ఆయన అంటున్నారు.
‘‘మీ జీవితమంతా మీరు లెక్కపెడుతూనే ఉంటారు. కానీ, కుల సమస్యమాత్రం తీరిపోదు. కాబట్టి ఈ లెక్కింపుతో వచ్చే ప్రయోజనం ఏంటి? నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కానీ, వాటిని అందించే మార్గం ఇదైతే కాదు’’ అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














