యుక్రెయిన్ కొంత భూభాగం రష్యాకు వదులుకోక తప్పదా, ట్రంప్-జెలియెన్‌ స్కీ భేటీలో ఏం జరగబోతోంది?

ట్రంప్ జెలియెన్‌ స్కీ భేటీ

ఫొటో సోర్స్, Ludovic Marin/Pool via REUTERS

    • రచయిత, ఫ్రాంక్ గార్డనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీని 'నియంత' అని సంబోధించారు.

జెలియెన్‌స్కీని కారణంగా, మూడో ప్రపంచ యుద్ధం అంచులకు ఈ ప్రపంచం వెళ్లే ప్రమాదం ఉందని కూడా అన్నారు.

ఫిబ్రవరి 28న, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు ఓవల్ ఆఫీసులో జెలియెన్‌స్కీకి ఆతిథ్యం ఇచ్చిన సమయంలో, ఆయనపట్ల చాలా కఠినమైన వైఖరిని అవలంబించారు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఆగాలని జెలియెన్‌స్కీ కోరుకోవడం లేదని విమర్శించారు.

అమెరికా సాయం అందకపోతే, యుక్రెయిన్‌ను రష్యాకు వదులుకోవాల్సి వచ్చేదని ట్రంప్ అన్నారు.

అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు దాదాపు 6 నెలల తర్వాత, జెలియెన్‌స్కీ, ట్రంప్ తిరిగి కలుసుకోబోతున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్ట్జ్ సహా అనేక మంది యూరోపియన్ దేశాల పెద్దలు జెలియెన్‌స్కీకి మద్దతు ఇవ్వడానికి వైట్‌‌హౌస్‌కు వస్తున్నారు.

ఆగస్టు15న, అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన సమావేశం అసంపూర్ణంగా ముగిసిన తర్వాత, దీనిని పుతిన్ విజయంగా రష్యన్ మీడియా అభివర్ణించింది.

ఎందుకంటే సమావేశం తర్వాత, ట్రంప్ తన సొంత సోషల్ మీడియా సైట్ ట్రూత్‌లో, ''రష్యా, యుక్రెయిన్ మధ్య భయంకరమైన యుద్ధాన్ని ముగించడానికి ఉత్తమ మార్గం కేవలం ఎక్కువ కాలం నడవని కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే కాకుండా నేరుగా శాంతి ఒప్పందాన్ని చేసుకోవాలి" అని చెప్పారు.

పుతిన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించడంలో విఫలమైన ట్రంప్, ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి జెలియెన్‌స్కీపై ఒత్తిడి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

యుక్రెయిన్ భవిష్యత్తు, యూరప్ భద్రత దృష్ట్యా, సోమవారం జరిగే ట్రంప్-జెలియెన్‌స్కీ సమావేశం ట్రంప్-పుతిన్ మధ్య జరిగిన సమావేశం కంటే మరింత కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ, యూరోపియన్ నాయకులతో ట్రంప్ సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్రమోదీతో సహా అనేక దేశాల నాయకులతో ఫోన్‌లో మాట్లాడారని క్రెమ్లిన్ తెలిపింది.

అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశం ఫలితాలను పుతిన్ వారికి తెలిపారు.

మోదీతో పాటు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రెహ్మాన్ ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జెలియన్ స్కీ వెనకబడ్డారా?

జెలియన్ స్కీ, అమెరికా

ఫొటో సోర్స్, Omer Messinger/Getty Images

పుతిన్-ట్రంప్ సమావేశం అంచనాలకు తగ్గట్టుగా జరగలేదు. కాల్పుల విరమణ లేదు, ఆంక్షలు లేవు, ప్రధాన ప్రకటనలు లేవు.

తెర వెనుక ఉన్న రెండు పెద్ద అణ్వాయుధ శక్తులు (యుఎస్, రష్యా) యూరప్, యుక్రెయిన్ ప్రయోజనాలకు విరుద్ధంగా రాజీ ఒప్పందానికి రాబోతున్నాయా?

యుక్రెయిన్, దాని యూరోపియన్ మిత్రదేశాలు దీనిని ఆపగలిగితే, అటువంటి ఒప్పందం జరగకుండా ఆపొచ్చు.

ఫిబ్రవరిలో జెలియెన్‌స్కీకి జరిగింది పునరావృతం కాకుండా ఆపడానికి కీర్ స్టార్మర్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్ట్జ్ ఇంకా కొందరు యూరప్ లీడర్లు వాషింగ్టన్‌లో ఉన్నారు.

యుక్రెయిన్ ప్రత్యక్షంగా పాల్గొనని శాంతి ఒప్పందం లేదని, ఏ ఒప్పందం చేసుకున్నా, యుక్రెయిన్‌కు బలమైన భద్రతా హామీ ఉండాలని ఈ నాయకులు ప్రయత్నించడం ఖాయం.

అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపడం లక్ష్యంగా అలాస్కాలో జరిగిన ట్రంప్-పుతిన్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది.

శాంతి ఒప్పందం విషయంలో పుతిన్ పట్ల ట్రంప్ చూపిన మెతక వైఖరి ఈ శాంతి ఒప్పందాన్ని ప్రభావితం చేయకూడదని యూరోపియన్ నాయకులు కూడా కోరుకుంటున్నారు.

ఇక్కడే కీర్ స్టార్మర్ దౌత్య నైపుణ్యాలు ఉపయోగపడే అవకాశం ఉంది. స్టార్మర్‌ను ట్రంప్ ఇష్టపడతారు. ఆయన మాటలను ట్రంప్ జాగ్రత్తగా వింటారు.

పైగా వచ్చే నెలలో ట్రంప్ బ్రిటన్‌ స్టేట్ విజిట్‌కు కూడా వెళ్లబోతున్నారు.

ట్రంప్‌కు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అంటే కూడా ఇష్టం. ఆయనను ట్రంప్ సన్నిహితుడిగా కూడా చెబుతారు.

అయితే, ఈ సమయంలో వాషింగ్టన్‌లో ఉన్న మరో పెద్ద యూరప్ నేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ అంటే ట్రంప్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. ఇటీవల, పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలని ఫ్రాన్స్ చేసిన ప్రకటనపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే, యుద్ధాన్ని ఆపడానికి యుక్రెయిన్ కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఉర్షులా వాన్ డెర్‌, వోలోదిమిర్ జెలియన్ స్కీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్షులా వాన్ డెర్‌తో యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్ స్కీ

అంతర్జాతీయ సరిహద్దులను ఒత్తిడి చేసి మార్చలేమని యూరోపియన్ నాయకులు పదే పదే అంటున్నారు. జెలియెన్‌స్కీ కూడా తన భూమిని రష్యాకు వదులుకునేది లేదని పదేపదే చెబుతున్నారు.

కానీ, పుతిన్ వేరే ఏదో కోరుకుంటున్నారు. ఆయన మొత్తం డాన్‌బాస్‌ను ఆక్రమించాలనుకుంటున్నారు. అందులో 85 శాతం ఇప్పుడు రష్యా ఆక్రమించింది. క్రైమియాను యుక్రెయిన్‌కు తిరిగి ఇచ్చే ఉద్దేశం కూడా ఆయనకు లేదు.

యుక్రెయిన్ విజయం అంటే కోల్పోయిన భూమిని తిరిగి పొందడంకాదని ఎస్టోనియా మాజీ ప్రధాన మంత్రి, యూరప్‌కు చెందిన అగ్ర దౌత్యవేత్త కయా కాలిస్ నాతో అన్నారు.

యుక్రెయిన్, రష్యా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్, రష్యా రెండూ చాలా నష్టపోయాయి. యుక్రెయిన్‌లో కొంత భాగాన్ని రష్యా ఆక్రమించింది.

శాంతి ఒప్పందంపై సందేహాలు

యుక్రెయిన్ తన భూమిలో కొంత భాగాన్ని బదులుగా భద్రతా హామీని పొందే ప్రతిపాదనపై అమెరికా, రష్యా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. దీని తర్వాత భవిష్యత్తులో దాని భూభాగంలో ఏ భాగాన్ని రష్యాకు ఇవ్వాల్సిన అవసరం లేదు.

కానీ దీనిపై కూడా సందేహాలు ఉన్నాయి. తన భూమిని కాపాడుకోవడానికి వేలాది మంది సైనికులను త్యాగం చేసిన యుక్రెయిన్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా? మొత్తం డొనెట్స్క్‌ను రష్యాకు అప్పగిస్తే, భవిష్యత్తులో అది యుక్రెయిన్ భద్రతను ప్రభావితం చేయదా?

యుక్రెయిన్ తరపున రష్యా మీద పోరాడటానికి వేలమంది సైనికులను పంపుతామని యూరప్ ఒకప్పుడు హామీ ఇచ్చింది. కానీ ఆ ప్రణాళిక ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్‌లో ఉంది.

ఇప్పుడు విషయం యుక్రెయిన్ భూమి, ఆకాశాన్ని సురక్షితమైనది మార్చడం వైపు మళ్లింది. అలాగే, యుక్రెయిన్ తన సైన్యాన్ని పునర్నిర్మించడంలో సహాయం చేస్తామని యూరప్ చెబుతోంది.

ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి నెలకొల్పినప్పటికీ, దీనిని ఇప్పటికీ ప్రమాదకరమైన భూభాగమే అనాల్సి వస్తుంది.

నేను ఒక సైనిక నిపుణుడితో మాట్లాడినప్పుడు, శాంతి ఒప్పందం తర్వాత కూడా పుతిన్ అంతటితో ఆగరని ఆయన అభిప్రాయపడ్డారు. పుతిన్ తన సైన్యాన్ని పునర్నిర్మిస్తారు. ఆయన కొత్త ఆయుధాలను తయారు చేస్తారు.

రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో యుక్రెయిన్‌లోని మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి సరిపడా ఆయుధాలను తయారు చేస్తూనే ఉంటారని ఆ నిపుణుడు నాతో అన్నారు.

కాబట్టి, ఇది జరిగితే, యుక్రెయిన్ వైపు సాగుతున్న రష్యన్ సైన్యంపై శక్తివంతమైన ఎఫ్-35 విమానం నుంచి మొదటి క్షిపణి ప్రయోగం కూడా జరగొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)