యురేనియం పరిశోధన, తవ్వకాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు, ఇకపై ఇవ్వదు - కేటీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KTR
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పరిశోధన, తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, భవిష్యత్‌లో ఇవ్వబోదని మంత్రి కే తారక రామారావు శాసనమండలిలో ప్రకటించారు.
గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో భయాందోళనలు ఉన్న మాట వాస్తవమేనని ఆయనన్నారు.
యురేనియం విషయంలో కొంత మంది రాజకీయ నాయకులు అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
"నిజానికి యురేనియం తవ్వకాల విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇస్తే... ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏఎండీ పనులు చేస్తోంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు" అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/KTR
కేటీఆర్ ఇంకా ఏమన్నారు?
హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది మొక్కలు నాటుతున్నాం.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 16.12.2009 నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 127 ద్వారా నల్లమల అటవీ ప్రాంతంలో 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు అనుమతి ఇచ్చింది.
మైనింగ్‌లో రెండు దశలు ఉంటాయి. మొదటి దశ అన్వేషణ... అంటే అసలు ఖనిజం ఉందో లేదో పరిశీలించడం. యురేనియం అన్వేషణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఈ పరిశోధన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
రెండోది మైనింగ్... దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం ఉందని భావించినా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసేందుకు అనుమతి ఇవ్వదు.
యురేనియంను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు. ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సందర్భంలో అనుమతులు ఇచ్చాయో తెలియదు.
చెర్నోబిల్ దుర్ఘటన కారణంగా అణువిద్యుత్ అనగానే ఆందోళనలు కలగడం సహజం. కానీ ప్రజలకు హాని చేసే చర్యలు చేపట్టాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు.
స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డుకు ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. అటవీ మంత్రి ఉపాధ్యక్షుడిగా ఉంటారు. 2016లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్న వైల్డ్ లైఫ్ బోర్డు ఉపాధ్యక్షుడి హోదాలో యురేనియం తవ్వకాలు, పరిశోధనలను వ్యతిరేకిస్తూ అనుమతులు ఇవ్వలేదు. అందుకు సంబంధించిన మినిట్స్ మా దగ్గర ఉన్నాయి.
సున్నిత విషయాల్లో రాజకీయ నాయకులు, మీడియా బాధ్యతాయుతంగా వ్యహరించాలి.
ఇవి కూడా చదవండి.
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- అమెరికా గూఢచర్యం: ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలు సీక్రెట్ ఏజెంట్స్‌గా ఎలా పని చేశాయి... గుట్టు విప్పిన సిఐఏ
- నన్నపనేని రాజకుమారి దళిత ఎస్సైని దూషించారనే కేసుపై ఏమంటున్నారు... వైసీపీ ఏం చెబుతోంది?
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








