‘మంత్ర శక్తుల’ కోసం శరీర భాగాల అమ్మకం.. ‘బీబీసీ ఐ’ పరిశోధనలో బయటపడిన వాస్తవాలు - సియెర్రా లియోన్‌లో ఘోరాలు

బ్లాక్ మ్యాజిక్, శరీర భాగాలు, మంత్రశక్తులు, సియెర్రా లియోన్
    • రచయిత, టైసన్ కాన్‌టెక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సియెర్రా లియోన్‌లో తాంత్రిక పూజలతో సంబంధం ఉందని భావించే హత్యలు చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. సియెర్రా లియోన్‌లో తాంత్రిక పూజల కోసం శరీర భాగాలను ఉపయోగిస్తారని.. ఇందుకోసం పిల్లలతో పాటు అన్ని వయసుల వారినీ అపహరించి శరీరభాగాలు అక్రమంగా అమ్ముతారన్న ఆరోపణలున్నాయి. ఈ శరీర భాగాల అక్రమ వ్యాపారం వెనుక ఉన్నవారిపై ‘బీబీసీ ఐ ’ నిఘాపెట్టింది.

(హెచ్చరిక: ఇందులో కలవరపెట్టే విషయాలున్నాయి)

సుమారు నాలుగేళ్ల కిందట 11ఏళ్ల బాలుడిని మంత్రశక్తుల కోసం చంపేశారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ శిక్షించకపోవడంపై ఆ బాలుడి తల్లి చాలా ఆవేదన చెందుతున్నారు.

''నేనెంత బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేను. వాళ్లు నా కొడుకును చంపేశారు. ఇప్పుడందరూ మౌనంగా ఉన్నారు. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు'' అని సల్లే కలోఖ్ బీబీసీ ఆఫ్రికాతో చెప్పారు.

కళ్లు, ఒక భుజం సహా కీలక అవయవాలు లేకుండా తన కొడుకు పపయో మృతదేహాన్ని ఎలా గుర్తించామో చెబుతూ ఆమె ఆవేదన చెందారు.

చేపలు అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లిన ఆ అబ్బాయి తిరిగి రాలేదని కుటుంబీకులు చెప్పారు.

బాలుడి కోసం కుటుంబం రెండు వారాలు వెతికింది. చివరకు ఒక బావి అడుగున దారుణమైన స్థితిలో బాలుడి మృతదేహం కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్లాక్ మ్యాజిక్, శరీర భాగాలు, మంత్రశక్తులు, సియెర్రా లియోన్
ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోని పేద దేశాల్లో సియెర్రా లియోన్ ఒకటి.

డబ్బు, అధికారం కోసం శరీర భాగాలతో పూజలు

‘‘జాగ్రత్తగా ఉండాలని మా పిల్లలకు ఎప్పుడూ చెబుతూ ఉంటాం. ఏదైనా అమ్మడానికి వెళ్లినప్పుడు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. అపరిచిత వ్యక్తుల నుంచి బహుమతులు తీసుకోవద్దు. ఈ దేశంలో ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి'' అని కలోఖ్ చెప్పారు.

ఈ హత్య సెంట్రల్ సియెర్రా లియోన్‌లోని నా సొంత పట్టణం మకేనీలో జరిగింది. ఈ హత్య నన్ను వెంటాడుతోంది. ఇక్కడ తరచూ బ్లాక్ మేజిక్ లేదా జూజూ పేరుతో జరిగే ఇలాంటి హత్యల గురించి వింటుంటాం. కానీ వాటిపై ఎప్పుడూ సరైన విచారణ జరగదు.

పపయో కేసులో పోలీసులు కనీసం అది ‘పూజల కోసం జరిగిన హత్య’ అని కూడా ధ్రువీకరించలేదు.

తమ దగ్గర పూజలు చేయించుకునే క్లయింట్లకు డబ్బు, అధికారం వస్తాయని జూజూ చేసేవారు హామీ ఇస్తారు. మనిషి శరీర భాగాలు మంత్రాలను శక్తివంతం చేస్తాయని నమ్మి ఆ క్లయింట్లు వారికి డబ్బులిస్తారు.

బ్లాక్ మ్యాజిక్, శరీర భాగాలు, మంత్రశక్తులు, సియెర్రా లియోన్
ఫొటో క్యాప్షన్, వాటర్‌లూలో అనుమానితుడి ఇంటిపై పోలీసులు దాడులు చేశారు.

మూఢనమ్మకాలు

ఈ కేసుల్లోఆధారాలు సేకరించడానికి కావాల్సిన సౌకర్యాలు అధికారులకు ఉండడం లేదు. 89 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే ఒక పాథాలజిస్ట్ ఉన్నారు. నిందితులను పట్టుకోవడానికి కావాల్సిన ఆధారాలు సేకరించడం అసాధ్యమవుతోంది.

సియెర్రా లియోన్‌లో అనేకమందికి మూఢ నమ్మకాలున్నాయి. చాలా మంది పోలీసు అధికారులు కూడా నమ్ముతారు. అందుకే అలాంటి కేసులు దర్యాప్తు చేయడానికి భయపడుతుంటారు. దీంతో చాలా కేసులు అపరిష్కృతంగా ఉండిపోతుంటాయి.

మానవ శరీరభాగాలతో అంతర్గతంగా జరుగుతున్న ఈ వ్యాపారంతో చాలా కుటుంబాలు తీవ్రవిషాదంలో మునిగిపోతున్నాయి. నేను వాటిగురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నా.

తాము జూజూ చేస్తామని, పూజల కోసం శరీరభాగాలు తెప్పించగలమని చెప్పే ఇద్దరిని బీబీసీ ఆఫ్రికా ఐ టీమ్ గుర్తించగలిగింది.

పెద్ద నెట్‌వర్క్‌లో తాము భాగమని వారిద్దరూ చెప్పారు. పశ్చిమాఫిక్రాలో తమకు పలుకుబడిగల క్లయింట్లు ఉన్నారని వారిలో ఒకరు చెప్పారు. ఆయన చెప్పిన వాటిని బీబీసీ వెరిఫై చేయలేకపోయింది.

మా బృందంలో ఒకరు ఒస్మాన్ అనే పేరు పెట్టుకున్నారు. మనిషిని బలివ్వడం ద్వారా అధికారం పొందాలని చూస్తున్న రాజకీయనాయకుడిలా నటించారు.

బ్లాక్ మ్యాజిక్, శరీర భాగాలు, మంత్రశక్తులు, సియెర్రా లియోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్నికల సమయంలో పిల్లలను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలని తల్లిదండ్రులు చెప్తుంటారు.

‘ఎన్నికల సమయంలో మరింత ప్రమాదం’

కంబియా జిల్లాలోని మారుమూల ప్రాంతంలోకి మొదట మేం వెళ్లాం. గినిన్ సరిహద్దుల్లో దట్టమైన పొదల్లో ఉన్న రహస్య స్థావరంలో ‘జూజూ’తో సంబంధం ఉన్న ఒకరిని కలిశాం.

తన పేరు కాను అని ఆయన చెప్పుకున్నారు. ఎర్రని వస్త్రంతో తన ముఖం మొత్తం కప్పుకున్నారు. తనకు పెద్ద పెద్ద రాజకీయనాయకులతో సంబంధాలున్నాయని చెప్పారు.

''గినియా, సోనెగల్, నైజీరియా దేశాలకు చెందిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో తాను పనిచేశానని చెప్పారు. ఎన్నికల సమయంలో రాత్రివేళల్లో ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోతుందన్నారు.

ఎన్నికల సమయాన్ని చాలా ప్రమాదకరంగా భావిస్తారు. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని, అపహరణ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని తల్లిదండ్రులను హెచ్చరిస్తుంటారు.

రెండోసారి వెళ్లినప్పుడు కాను మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించారు. తాను చేస్తున్న పనులకు సాక్ష్యంగా మనిషి పుర్రెను ఒస్మాన్‌కు చూపించారు.

''మీరు ఇది చూశారా? ఓ మహిళ పుర్రె ఇది. ఇవాళగానీ, రేపుగానీ ఓ వ్యక్తి వచ్చి దాన్ని తీసుకెళ్తారు'' అని ఆయన తెలిపారు.

రహస్య స్థావరం వెనక ఉన్న ఓ గుంతను మాకు చూపించారు. ''మనిషి శరీర భాగాలను ఇక్కడే వేలాడదీస్తాం. ఇక్కడే వధిస్తాం. రక్తం ఇక్కడ పడుతుంది. ఎంత పెద్ద పెద్ద నేతలైనా అధికారం కావాలనుకుంటే మా దగ్గరకు వస్తారు. వాళ్లేం కోరితే అదిస్తాం'' అని కానూ చెప్పారు.

ఓ మహిళ శరీరభాగాలు కావాలని ఒస్మాన్ చెప్పారు.

''మహిళ శరీర భాగాలు70 మిలియన్ లియోలు, లేదా 3వేల డాలర్లు’’ అని చెప్పారు ఆయన.

ఎవరినీ ప్రమాదంలోకి నెట్టకూడదన్న ఉద్దేశంతో మేం కానును మళ్లీ కలవలేదు. ఆయన మోసగాడు కావొచ్చు. మేం సేకరించిన ఆధారాలన్నింటినీ స్థానిక పోలీసులకు దర్యాప్తు కోసం ఇచ్చాం.

బ్లాక్ మ్యాజిక్, శరీర భాగాలు, మంత్రశక్తులు, సియెర్రా లియోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొందరి వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని సంప్రదాయవైద్యులంటున్నారు.

‘నిజమైన సంప్రదాయ వైద్యులకు చెడ్డపేరు’

ఇలాంటి జూజూలు కొన్నిసార్లు తమను తాము మొక్కలతో చికిత్స చేసే హెర్బలిస్టులుగా చెప్పుకుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం సియోర్రా లియోన్‌లో 2022లో రిజిస్టర్ అయిన డాక్టర్ల సంఖ్య 1,000. సంప్రదాయ వైద్యం చేసేవారి సంఖ్య 45వేలు ఉంటుందని అంచనా. సియోర్రా లియోన్ 1990ల్లో అంతర్యుర్ధంతో అల్లాడిపోయింది. దశాబ్దం క్రితం ఎబోలాకు కేంద్రంగా ఉంది.

పశ్చిమాఫ్రికాలో చాలా మంది ఎక్కువగా ఇలాంటి సంప్రదాయ వైద్యుల మీదే ఆధారపడతారు. మానసిక అనారోగ్య సమస్యలకు కూడా వారు చికిత్స చేస్తామని చెప్తుంటారు. ఆధ్మాత్మికత, వారి సంప్రదాయ వైద్యం, చికిత్సా విధానం కలిసిపోయి ఉంటాయి.

కానులాంటి వారి వల్ల సంపద్రాయ వైద్యానికి చెడ్డపేరు వస్తోందని షేకు టరావాల్లీ అన్నారు.

''మంచిపేరు తెచ్చుకోవడానికి మేం చాలా కష్టపడతాం. సాధారణ ప్రజలకు ఈ విషయం అర్ధం కాదు. వాళ్లు అందరినీ చెడ్డ హెర్బలిస్టుల్లా చూస్తారు. పాడైపోయిన ఓ చేప, మొత్తం చేపలను చెడగొడుతుంది. మేం రోగాలను నయం చేసేవాళ్లం...హంతకులం కాదు'' అని ఆయన బీబీసీ ఆఫ్రికా ఐతో చెప్పారు.

రోగులకు చికిత్స చేసేందుకు సంప్రదాయ వైద్య క్లినుక్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయాలని నిజానికి టారావల్లీ అనుకుంటున్నారు.

అధికారం, డబ్బు కోసం ఆశపడేవారే ఇలాంటి హత్యల వెనక ఉంటారని ఆయన అన్నారు.

బ్లాక్ మ్యాజిక్, శరీర భాగాలు, మంత్రశక్తులు, సియెర్రా లియోన్
ఫొటో క్యాప్షన్, మనిషి శరీరభాగాలు సరఫరా చేసే వ్యక్తి

లెక్కకు అందని హత్యల సంఖ్య

సియెర్రా లియోన్‌లో ఇలాంటి హత్యలకు లెక్కలేదు. మృతులు ముస్లింలో, క్రిస్టియన్లో గుర్తించలేరు.

''చాలా ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి హత్యలను అధికారికంగా రికార్డు చేయరని బ్రిటన్‌లోని ఆర్డన్ యూనివర్శిటీ లెక్చరర్ ఎమ్మానుయెల్ సర్పొంగ్ ఒవుసు బీబీసీతో చెప్పారు.

ప్రమాదాలు, ప్రమాదకర జంతువుల దాడి, ఆత్మహత్యలు, సహజ మరణాలుగా వాటిని తప్పుగా నమోదుచేస్తారు. దాదాపు 90శాతం నిందితులు దొరకరు.

రాజధాని శివారల్లోని వాటర్‌లూ‌లో మరో అనుమానితుణ్ని మేం గుర్తించాం. ఆయన మానవ శరీర భాగాలు సరఫరా చేస్తుంటారు. డ్రగ్స్‌తో పాటు ఇతర నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతమిది.

''నేను ఒంటరిగా లేను. నా దగ్గర 250మంది హెర్బలిస్టుల వరకు పనిచేస్తున్నారు'' అని ఆ వ్యక్తిచెప్పారు. మా బృందంలోని వ్యక్తి ఒస్మాన్ పేరుతో మళ్లీ రహస్య కెమెరా పట్టుకున్నారు.

''మా దగ్గర మనిషి శరీర భాగాలేమీ లేవు. ప్రత్యేకమైన శరీర భాగం కావాలని ఎవరన్నా అడిగితే మేం దాన్ని సమకూరుస్తాం'' అని ఆయన చెప్పారు.

మనుషులను అపహరించడంలో తన సహచరులు ఎంత చురుకైన వారో ఆయన వర్ణించారు. ఆయన్ను రెండోసారి కలిసినప్పుడు ఓస్మాన్ ఓ వాయిస్ మెసేజ్ సంపాదించారు. బాధితుణ్ని వెతికేందుకు ప్రతిరాత్రి తాము బయటకు వెళ్తామని ఇప్పుడలా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆ వ్యక్తి మెసేజ్‌లో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)