హెయిలీ గుబ్బీ: ఇథియోపియాలో పేలిన ఈ అగ్నిపర్వతం నుంచి బూడిద భారత్ దాకా ఎంతవేగంతో వస్తోందంటే..

హెయిలీ గుబ్బీ అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇథియోపియాలో విస్ఫోటనానికి గురైన హెయిలీ గుబ్బీ అగ్నిపర్వతం

ఇథియోపియా అఫార్ రీజియన్‌లో ఉన్న హెయిలీ గుబ్బీ అగ్నిపర్వతం ఆదివారం ఉదయం బద్దలైంది. స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం.. దీనివల్ల సమీప గ్రామాల్లో దుమ్ముధూళి ఒక పొర మాదిరిగా కమ్మేసింది.

12000 ఏళ్లల్లో తొలిసారి హెయిలీ గుబ్బీ అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైందని స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ తెలిపింది.

బద్ధలైన ఈ అగ్నిపర్వత బూడిద మేఘం ఎర్ర సముద్రం మీదుగా కదులుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.

అయితే, దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది.

అయితే, ఈ బూడిద స్థానిక పశువుల పెంపకందారుల జీవనోపాధిని ప్రభావితం చేయవచ్చని అధికారులు హెచ్చరించినట్లు పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌పై ప్రభావం

ఈ అగ్నిపర్వతం పేలుడు దట్టమైన పొగను ఆకాశంలోకి 14 కిలోమీటర్ల ఎత్తు వరకు వెదజల్లింది.

దీని నుంచి వెలువడిన ధూళి, పొగ యెమెన్, ఒమన్, భారత్, ఉత్తర పాకిస్తాన్ వైపు కూడా విస్తరించిందని టౌలౌజ్ వోల్కనిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ తెలిపింది.

అయితే, దీనివల్ల ప్రాణనష్టం సంభవించిందా? ఎవరైనా నిరాశ్రయులయ్యారా? అనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.

''ఈ బూడిద మేఘం ఉత్తర భారతంవైపుకు కదులుతుండొచ్చు. హెయిలీ గుబ్బీ వోల్కనిక్ ఏరియా నుంచి గుజరాత్ వరకు అతిపెద్ద బూడిద మేఘం కనిపిస్తోంది. విస్ఫోటనం ప్రస్తుతం ఆగిపోయింది. కానీ, ఈ బూడిద మేఘం వాతావరణంలో బాగా వ్యాపించింది. గంటకు 100 నుంచి 120 కి.మీల వేగంతో ఉత్తర భారతం దిశగా ఇది కదులుతోంది'' అని సోమవారం సాయంత్రం ఇండియా మెట్ స్కై వెదర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

''ఈ మేఘం ఆకాశంలో 15000-25000 అడుగుల నుంచి 45000 అడుగుల వరకు విస్తరించి ఉంది. దీనిలో ముఖ్యంగా అగ్నిపర్వతం పేలిన సమయంలో బయటికి వచ్చిన బూడిద, సల్ఫర్ డయాక్సైడ్, చిన్న చిన్న గాజు ముక్కలు, రాక్ పార్టికల్స్ (రాతి శకలాలు) ఉన్నాయి. ఇవి ఆకాశాన్ని సాధారణం కంటే ఎక్కువ చీకటిగా చేసి, ఎయిర్ ట్రాఫిక్‌ను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల విమానాలు ఆలస్యం కావడం, ప్రయాణ వ్యవధులు పెరగడం జరుగుతుంది'' అని తెలిపింది.

''ఈ బూడిద మేఘం రాత్రి 10 కల్లా గుజరాత్‌లోకి (పశ్చిమ ప్రాంతంలోకి) ప్రవేశిస్తుందని అంచనాలున్నాయి. ఆ తర్వాత రాజస్తాన్, వాయువ్య మహారాష్ట్ర, దిల్లీ, హరియాణ, పంజాబ్ వైపుకు కదులుతుంది. చివరికి హిమాయాలు, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బూడిద మేఘం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆకాశం మామూలు కంటే మరింత మసకగా కనిపిస్తుంది. ఇది దిల్లీలోని గాలి నాణ్యతను మరింతగా కలుషితం చేయవచ్చు'' అని ఇండియా మెట్ స్కై వెదర్ పేర్కొంది.

అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Getty Images

'' ఈ బూడిద మేఘం ఎర్ర సముద్రం దాటి మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా వైపు కదులుతుండటంతో, విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేయడం ప్రారంభించాయి. ఇండిగో ఆరు విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది" అని హిందూస్తాన్ టైమ్స్ తన వెబ్‌సైట్‌లో నివేదించింది.

''ఈ విమానాల్లో ఒకటి ముంబయి నుంచి వచ్చేది ఉంది. రద్దైన ఇతర విమానాలు దక్షిణ భారతం నుంచి వస్తున్నాయి. పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ గుండా విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ముంబయి ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేసి ఉంది. దీనివల్ల, భారతీయ విమానయాన సంస్థలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది'' అని పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

విమానాలపై ఎలాంటి ప్రభావం?

న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రకారం... ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతం వల్ల కలిగే సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు విమానయాన సంస్థలకు, విమానాశ్రయాలకు సోమవారంనాడు మార్గదర్శకాలు జారీ చేసింది డీజీసీఏ .

బూడిద మేఘాల వల్ల ఆకాశ ఎయిర్, ఇండిగో వంటి విమానయాన సంస్థలు కొన్ని విమానాలను రద్దు చేసినట్లు పీటీఐ తెలిపింది.

''గుజరాత్‌లో కొన్ని భాగాల్లో, దిల్లీ ఎన్‌సీఆర్‌లో రాబోయే కొన్ని గంటల్లో దీని ప్రభావం కనిపించనుంది. ఇప్పటికే మేఘాలు గుజరాత్‌కు దగ్గరగా చేరుకున్నాయి. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో, ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో వచ్చే కొన్ని గంటల్లో దీని ప్రభావాలను మనం చూడొచ్చు. ప్రధానంగా విమానాలపై దీని ప్రభావం కనిపిస్తుంది'' అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం. మొహాపాత్ర తెలిపారు.

ప్రయాణికుల భద్రతపై దృష్టి పెడుతూ ఎయిరిండియా ఒక ప్రకటన జారీ చేసింది.

''ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలు కావడంతో, కొన్ని భౌగోళిక ప్రాంతాల్లో బూడిద మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. మా ఆపరేషన్ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటి వరకైతే ఎయిరిండియా విమానాలపై పెద్దగా ప్రభావం లేదు'' అని ఎయిరిండియా తన ప్రకటనలో వెల్లడించింది.

''మా ప్రయాణికుల, సిబ్బంది, విమానాల భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇదే మా ప్రథమ ప్రాధాన్యం. గ్రౌండ్‌టీమ్‌లు ప్రయాణికులకు అవసరమైన మద్దతును అందిస్తూ.. విమానాల గురించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు'' అని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)