చేతబడి చేశారనే ఆరోపణలతో ఆరుగురి పళ్లు పీకి, అశుద్ధం తినిపించిన గ్రామస్తులు -ప్రెస్‌రివ్యూ

చేతబడి అనుమానంతో వృద్ధులపై అమానుషం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు విరిచి, వారి చేత అశుద్ధం తినిపించారని ఈనాడు పేర్కొంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌ సమీపంలోని ఒడిశాలోని గంజాం జిల్లా గోపపూర్‌లో చోటుచేసుకుంది.

ఛత్రపురం ఎస్డీపీఓ ఉత్కళ కేశరిదాస్ కథనం ప్రకారం... గోపపూర్ గ్రామంలో రెండు వారాల వ్యవధిలో వివిధ కారణాలతో ముగ్గురు చనిపోయారు. సెప్టెంబర్ 28న మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. చేతబడి కారణంగానే ఇలా జరుగుతోందని భావించిన గ్రామస్తులు మంగళవారం రాత్రి స్థానికంగా ఉంటున్న ఆరుగురి వృద్ధుల పళ్లు పీకేసి, వారి చేత అశుద్ధం తినిపించారు.

అనంతరం సామాజిక భవనంలో నిర్భంధించారు. బాధితుల ఆక్రందనను తోటి గ్రామస్తులెవరూ పట్టించుకోలేదు. దీనిపై జిల్లా కేంద్రానికి సమాచారం అందడంతో... బుధవారం ఎస్పీ బ్రిజేశ్ రాయ్ తన బృందంతో వెళ్లి బాధితులను రక్షించి, ఎమ్కేసీజీ వైద్య కళాశాలకు తరలించారు.

ఈ కేసులో గోపపూర్‌కు చెందిన 22 మంది మహిళల సహా మొత్తం 29 మందిని అరెస్టు చేసి బుధవారం న్యాయస్థానానికి తరలించారు. అరెస్టుల భయంతో మగవాళ్లంతా గ్రామాన్ని వదిలి పరారయ్యారని పోలీసులు చెప్పారు.

తాము గ్రామంలోకి ప్రవేశించకుండా గ్రామస్తులు కారంపొడి చల్లి అడ్డుకున్నారని, బలవంతంగా ప్రవేశించి బాధితులను రక్షించామని పోలీసులు చెప్పారని ఈనాడు వెల్లడించింది.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో మద్యం బాదుడు.. 6వేల కోట్లపైనే!

'వినియోగం తగ్గించేందుకే ధర పెంచాం. అందుబాటులో లేకుండా చేసేందుకే సమయమూ తగ్గించేశాం. మద్యపాన నిషేధం దిశగా మేం వేస్తున్న అడుగులివి'.. అని ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్నా.. ఆచరణలో సర్కారు చెబుతున్న ఆశయం నెరవేరే సూచనలేవీ కనిపించడం లేదు. పైగా ఖాళీ ఖజానాను నింపేందుకే ధరల పెంపు ఉపయోగపడుతుందనే వాదన వినిపిస్తోందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ధరల పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఆరు వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమయం తగ్గింపు విధానం బెల్టు షాపులకు దారితీయొచ్చనే వాదనా వినిపిస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాఖ రాష్ట్రంలో రూ.20వేల కోట్ల మద్యాన్ని విక్రయించింది. అందులో రూ.17,500 కోట్లు ప్రభుత్వానికి మిగిలింది. సాధారణంగా ఏటా మద్యంపై 7 నుంచి 10 శాతం వృద్ధి ఉంటుంది.

ఈ ఏడాది షాపులు తగ్గించడం వల్ల అది 5 శాతానికి పరిమితం కావొచ్చని భావించారు. అయితే ధరలు పెంచిన నేపథ్యంలో సాధారణ వృద్ధితో సంబంధం లేకుండా ఆదాయం భారీగా పెరగనుంది.

తాజా ధరల పెంపుతో సుమారు 20శాతం అదనంగా వస్తుందనేది అంచనా. అయితే ఇది బ్రాండ్‌ను బట్టి మారుతుంది. ఖరీదైన మద్యం అయితే పెంపు స్వల్పంగానే ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయేది చీప్‌ లిక్కర్‌, మీడియం బ్రాండ్లే. అందువల్ల సగటున చూస్తే పెంపు 20శాతం ఉంటుందని అంటున్నారు.

అంటే గతేడాది వచ్చిన రూ.20వేల కోట్లలో 20శాతం రూ.4వేల కోట్లు అవుతుంది. దీనికి సాధారణ వృద్ధి 5శాతాన్ని కలుపుకొంటే ఇంకా పెరుగుతుంది. ఇవిగాకుండా గతంలో లైసెన్సీలకు ఇచ్చే 10 శాతం మార్జిన్‌ రూ.2వేల కోట్లు ప్రభుత్వానికే మిగులుతుంది.

ఇందులో నిర్వహణకు రూ.800 కోట్లు తీసేసినా రూ.1200 కోట్లు సర్కారుకు మిగులే ఉంటుంది. ధరల పెంపు, సాధారణ వృద్ధి, లైసెన్సీల రూపేణా మిగిలే మొత్తం మూడూ కలిపితే ఎంత లేదన్నా రూ.6వేల కోట్లు దాటిపోతుందనేది ఎక్సైజ్‌ వర్గాల అంచనా అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

రైల్వేస్టేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

మన స్టేషన్లు అంతంతే

స్వచ్ఛ రైల్వేస్టేషన్ల విషయంలో తెలంగాణ ఈసారి బాగా వెనకబడింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లు పరిశుభ్రమైన జాబితాలో మెరుగైన స్థానం దక్కించుకోగా ఈసారి మాత్రం బాగా వెనకబడిపోయాయని సాక్షి పేర్కొంది.

ప్రస్తుత జాబితాలో హైదరాబాద్‌ (నాంపల్లి) స్టేషన్‌ 17వ స్థానం, సికింద్రాబాద్‌ 42, వరంగల్‌ 51, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80 స్థానాలు దక్కించుకున్నాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ బుధవారం ర్యాంకుల జాబితాను విడుదల చేశారు.

స్వచ్ఛత విషయంలో విజయవాడ రైల్వేస్టేషన్‌ దేశంలోనే టాప్‌-10 జాబితాలో స్థానం దక్కించుకుంది. జైపూర్, జోధ్‌పూర్, దుర్గాపుర స్టేషన్లు తొలి 3 ర్యాంకులు దక్కించుకోగా, ఏపీ నుంచి విజయవాడ రైల్వేస్టేషన్‌ 7, సామర్లకోట 45, తిరుపతి 70, నెల్లూరు 81, విశాఖ 84, పలాస 92, అనంతపురం 105, ఏలూరు 107వ ర్యాంకులను దక్కించుకున్నాయని సాక్షి వెల్లడించింది.

ఆర్టీసీ

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ఆర్టీసీ సమ్మె చర్చలు విఫలం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను విరమించేందుకు ఉన్నతస్థాయి కమిటీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో నిర్వహించిన తొలిదశ చర్చలు ఫలించలేదని ఈనాడు వెల్లడించింది.

తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం సాయంత్రం నుంచి సమ్మె చేయాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.

సీనియర్ ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో సునీల్ శర్మ, రామకృష్ణారావుల కమిటీ బుధవారం ముందుగా ఆర్టీసీ అధికారులతో సమావేశమై సంస్థ ఆర్థిక పరిస్థితి, కార్మిక సంఘాల డిమాండ్లపై చర్చించింది.

అనంతరం కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో కమిటీ సుమారు గంటపాటు చర్చించింది.

దసరా పండుగ సమయంలో సమ్మె చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని కమిటీ ప్రతినిధులు కార్మికులకు చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)