గోదావరిలో మునిగిన బోటు వెలికితీత: ముందుకు సాగని ఆపరేషన్.. నిరాశలో బాధితుల బంధువులు

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
గోదావరిలో కచ్చూలూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిపోయిన బోటుని వెలికితీయడానికి చేపట్టిన ఆపరేషన్ రాయల వశిష్ట ముందుకు సాగడం లేదు. వరుసగా నాలుగు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయనే ధీమా కనిపించడం లేదు. తమ బంధువుల కడచూపు అయినా దొరుకుతుందని ఆశిస్తున్నవారికి నిరాశ తప్పడం లేదు.
సెప్టెంబర్ 15 మధ్యాహ్నం ఒంటిగంటప్పుడు ప్రమాదం జరిగింది. స్థానికులు రక్షించిన 26 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
బోటులోని మిగతా ప్రయాణికుల్లో 36 మంది మృతదేహాలను ఇప్పటివరకు కనుగొన్నారు. వాటిలో కొన్ని ఘటన స్థలానికి సమీపంలోనూ, మరికొన్ని పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ సమీపంలోనూ, మరికొన్ని దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలోనూ దొరికాయి.
ప్రమాదం జరిగిన కచ్చులూరికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో పాశర్లపూడి సమీపాన రెండు మృతదేహాలు దొరికాయంటే గోదావరి వేగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంకా 15 మృతదేహాలు దొరకాల్సి ఉంది. అవి బోటులో దిగువన ఇరుక్కుని ఉంటాయని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

వెలికితీత పనులను చేపట్టిన ప్రైవేటు సంస్థ
గోదావరిలో ఇంతకుముందు కూడా ప్రమాదాలు జరిగాయి. కాస్త ఆలస్యంగానైనా పలుసార్లు బోట్లు ఒడ్డుకు చేర్చారు. 2018లో ముమ్మిడివరం మండలం పశువుల్లంక వద్ద జరిగిన ప్రమాదంలో వారం పాటు శ్రమించినా రెండు మృతదేహాల ఆచూకీ మాత్రం తెలియలేదు. ప్రమాద స్థలం సముద్ర తీరానికి సమీపాన ఉండటంతో గోదావరి వడి కారణంగా అవి సాగరంలో చేరిపోయి ఉంటాయని తేల్చారు.
గోదావరి పొడవునా పరిశీలిస్తే కచ్చులూరు మందం పరిసరాల్లోనే నది అత్యంత లోతుగా ఉంటుందని సాగునీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఈ రామనాథరావు బీబీసీతో మాట్లాడుతూ- "రాజమహేంద్రవరం వద్ద గోదావరిని 'అఖండ గోదావరి' అని పిలుస్తారు. అక్కడ నది ప్రవాహం నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. కచ్చులూరు వద్ద 200 మీటర్లు కూడా ఉండదు. రెండు కొండల మధ్యలో నదీ ప్రవాహం సాగడంతో అక్కడ గోదావరి వడి ఊహించనంత వేగంగా ఉంటుంది. లోతు కూడా వరదలప్పుడు సుమారు 300 అడుగులు ఉంటుంది. ఇప్పుడు నీటిమట్టం తగ్గింది కాబట్టి కనీసంగా 200 అడుగులు పైనే ఉంటుంది. అంత వేగంగా ప్రవహించే నదీ జలాల మధ్య లోతులోకి వెళ్లి గాలింపు చేపట్టడం పెద్ద సవాలే" అని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం జరిగాక పది రోజుల పాటు సహాయ చర్యలు సాగించి, తర్వాత నాలుగు రోజులు విరామం తీసుకున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం వెలికితీత ప్రయత్నాలను ప్రైవేటు సంస్థకు అప్పగించింది.

వర్షం వల్ల సాగని ఆపరేషన్
కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు రూ.22 లక్షలకు కాంట్రాక్ట్ అప్పగించారు. సంస్థ తరపున ధర్మాడి సత్యం బృందం సెప్టెంబర్ 29న రంగంలో దిగింది. తొలి రోజు సామగ్రిని తరలించింది. 30న ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాల్లో ఇనుప తాడు తెగిపోవడంవల్ల ఒకసారి, లంగరు వంగిపోవడం వల్ల మరోసారి ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారం వర్షం కారణంగా ఆపరేషన్ ముందుకు సాగలేదు.
సహాయ చర్యల కోసం దేవీపట్నం చేరుకున్న జాతీయ విపత్తు నిర్వహన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలు ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నాయి.
ఈ ప్రయత్నాలపై స్పష్టత రావడం లేదు: ఎన్టీఆర్‌ఎఫ్
ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధి ప్రభాకర్‌ను బీబీసీ వివరణ కోరగా- "బోటు వెలికితీత విషయమై ముంబయి, ఉత్తరాఖండ్ నుంచి నిపుణులు వచ్చారు. అక్కడి పరిస్థితి గమనించి బోటు ఎక్కడ ఉందనే విషయాన్ని ధృవీకరించారు" అన్నారు.
200 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికితీసిన చరిత్ర ఇప్పటివరకు లేదని ఆయన చెప్పారు. భౌగోళికంగా కచ్చులూరు ప్రాంతంలో ఈ ప్రయత్నాలు చేయడం కష్టంగా ఉందన్నారు.
"ప్రభుత్వ ఆదేశాలతో సాగుతున్న ప్రస్తుత ప్రయత్నాల విషయంలో స్పష్టత రావడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం వాటిని పరిశీలిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి" అని ప్రభాకర్ చెప్పారు.

కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి బృందాలు పంపుతామన్నారు.. కానీ..
బోటు ప్రమాదంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సెప్టెంబర్ 23న రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి కారణాలు, బోటు వెలికితీత పనులపై ఆరా తీశారు.
బోటు వెలికితీతకు కేంద్ర బృందాలను పంపిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ వెల్లడించారు.
"కేంద్ర మంత్రి ముంబయి నుంచి బృందాలు వస్తాయన్నారు. ఇంకా రాలేదు. ఈలోగా స్థానికుల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నాం. తొలుత బోటుకు తాడు తగిలిందని అంచనాలున్నాయి. కొంత ఆయిల్ తెట్టు కూడా గుర్తించారు. బోటు కదలడంతో వాసన కూడా వచ్చిందని చెబుతున్నారు. ఈ ప్రయత్నాలకు ఫలితం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే" అని ఆయన చెప్పారు.

'ఈ ప్రయత్నాలు సరిపోవు'
బాలాజీ మెరైన్స్ సంస్థ ప్రస్తుత ప్రయత్నాలతో బోటు బయటకు రావడం కష్టమేనని స్థానికులు చెబుతున్నారు.
దేవీపట్నం గ్రామానికి చెందిన బోటు సరంగి శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడుతూ- రాయల్ వశిష్ట బోటు ఎక్కువ భాగం ఇనుము, చెక్కతో ఉంటుందని, కాబట్టి బరువు ఎక్కువేనని, అలాంటప్పుడు నిజంగా నీటిలో లంగరుకు తగిలినా దానిని లాగడానికి ఒక ప్రొక్లయినర్ ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఒక ప్రొక్లయినర్‌తో 25 మంది చేస్తున్న ప్రయత్నం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. మరింత యంత్ర సామగ్రి వాడితే తప్ప ఒడ్డుకు తీసుకురాగలమన్న ధీమా కనిపించడం లేదన్నారు.
బోటు వెలికితీత ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న ధర్మాడి సత్యం కూడా అదే రీతిలో అభిప్రాయపడ్డారు.
"అడుగున నీరు చాలా వేగంగా వెళ్తున్నప్పుడు కిందకు దిగడం సాధ్యం కాదు. మేం పైనుంచి తాళ్లు, లంగరు వేస్తున్నాం. దేనికి తగులుతుందో చెప్పలేం. ఓసారి బోటుకే తగిలిందని అనుకున్నాం. కానీ అది రాయికి తగిలి తాడు తెగిపోయింది. ఇలా ప్రయత్నాలు తప్ప మేం కూడా చేసేదేమీ లేదు. ఎప్పటికి ఒడ్డుకి చేర్చగలమన్నది చెప్పలేం" అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
- మన్మోహన్ సింగ్: ప్రొఫెసర్ నుంచి ప్రధాని పదవి వరకు..
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








