కెనడాలో ‘అదృశ్య’మైపోతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు, అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మొహమ్మద్ సోహెయిబ్, ఉమెర్ సలీమి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. పైలెట్లకు లైసెన్స్‌లు లేకపోవడంపై కొన్నిసార్లు, ప్రైవేటీకరణ ప్రయత్నాలపై మరికొన్నిసార్లు వివాదాలు రేగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే పీఐఏ ఉద్యోగులు కెనడాకు వెళ్లిన తర్వాత 'అదృశ్యం' అవుతుండటంపై నివేదికలు తెరపైకి వచ్చాయి.
తాజాగా, కెనడాలోని టొరంటో నుంచి లాహోర్‌కు రావాల్సిన పీకే 798 నంబరు విమానంలో అసిఫ్ నాజం అనే ఫ్లైట్ అటెండెంట్ విమానాశ్రయానికి రాలేదు. ఈ విషయాన్ని పీఐఏ శనివారం (నవంబర్ 22న)నాడు ధ్రువీకరించింది.
విషయమేమిటని ఆరాతీస్తే, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారని పీఐఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.
దర్యాప్తు జరుగుతోందని, చట్టవిరుద్ధంగా అదృశ్యమైనట్లు తేలితే సంబంధిత ఎయిర్‌లైన్స్ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకుంటామని పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ చెప్పారు.


ఫొటో సోర్స్, Mike Campbell/NurPhoto via Getty Images
'అదృశ్యం' ఘటనలు గతంలోనూ అనేకం...
పీఐఏ సిబ్బందిలో ఎవరో ఒకరు కెనడా నుంచి వెనుదిరగకుండా అదృశ్యం కావడం కొత్తేమీ కాదు. ఫ్లైట్ అటెండెంట్‌లు, ఎయిర్ హోస్టెస్‌లు అదృశ్యమైన ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి.
2024 ఫిబ్రవరి 29వ తేదీన ఈ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
పీకే నంబరు 783 పీఐఏ విమానంలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ జిబ్రాన్ బలోచ్ కరాచీ నుంచి టొరంటో వచ్చారు. పీకే 782 నంబరు ఫ్లైట్ తిరిగి బయల్దేరాల్సి ఉంది. టొరంటోని పియర్సన్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3 వద్ద విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
కానీ ఫ్లైట్ అటెండెంట్ జిబ్రాన్ రాలేదు. నిర్ణీత సమయానికి విమానాశ్రయానికెళ్లాల్సిన ఆయన హోటల్ నుంచి బయల్దేరలేదు.
పాకిస్తాన్ దినపత్రిక డాన్ కథనం ప్రకారం, పీఐఏ సిబ్బంది హోటల్ రూంలో జిబ్రాన్ కోసం వెతికారు, కానీ ఆయన అక్కడ లేరు. అధికారులు ఆయన ఆచూకీ కనుక్కోలేకపోయారు.
ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు, పీఐఏలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న మరియం రజా కూడా అదే రీతిలో టొరంటోలోని తన హోటల్ గది నుంచి 'అదృశ్యం' అయ్యారని ఆ పత్రిక పేర్కొంది.
'థాంక్యూ పీఐఏ' అని రాసిన పేపర్ ఒకటి ఆ హోటల్ గదిలోని ఆమె దుస్తుల వద్ద పీఐఏ అధికారులకు కనిపించిందని సామా టీవీ వెల్లడించింది.
అదే విధంగా 2024 జనవరిలో ఫైజా ముఖ్తార్ అనే ఎయిర్ హోస్టెస్ కూడా తనకు నిర్ణయించిన విమానంలో కెనడా నుంచి పాకిస్తాన్‌కు తిరిగిరాలేదు.
డాన్ కథనం ప్రకారం, 2023 సంవత్సరంలో ఏడుగురు పీఐఏ క్యాబిన్ క్రూ మెంబర్లు 'అదృశ్యం' అయ్యారు.
‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం, 2022 సంవత్సరంలో కూడా అదే తరహాలో అయిదుగురు ఉద్యోగులు 'అదృశ్యం' కాగా, వారి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images
పీఐఏ ఏం చెబుతోంది?
పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం, క్రూ మెంబర్లు కెనడా వెళ్లిన తర్వాత తిరిగిరాకుండా అదృశ్యం అవుతున్న సంఘటనలు గత కొన్నేళ్లలో తరచుగా జరుగుతున్నాయి.
గతంలోనూ ఇలా ఉన్నా, గత కొన్నేళ్లుగా ఎక్కువయ్యాయి.
దీనికి కారణం పాకిస్తాన్‌లో క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి, పీఐఏ ప్రైవేటీకరణపై అనిశ్చితితో ముడిపడి ఉందని చెబుతున్నారు.
పీఐఏ ప్రైవేటీకరణ అనేది గత రెండు దశాబ్దాల్లో ఆ దిశగా పాకిస్తాన్ చేస్తున్న తొలి ప్రయత్నంగా పరిగణిస్తున్నారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు అందిస్తున్న సుమారు ఏడు బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించిన షరతుల ప్రకారం పీఐఏ ప్రైవేటీకరణ తప్పనిసరి.
కానీ, కెనడాలో శరణార్థుల చట్టంలో ఉన్న విస్తృతమైన వెసులుబాటును పీఐఏ ఉద్యోగులు ఆసరాగా తీసుకుంటున్నారని పీఐఏ చెబుతోంది.
అయితే, పీఐఏ తప్ప మరే ఇతర ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్లు కెనడాలో అదృశ్యమైన దాఖలాలు లేవు.
ఈ సమస్య పీఐఏ ఉద్యోగులకో లేదా పాకిస్తాన్‌కో మాత్రమే పరిమితం కాలేదని, అనేక ఇతర దేశాల వారు కూడా కెనడా శరణార్థుల చట్టంలోని వెసులుబాటును వాడుకుంటున్నారని కెనడాలో వలసలను పరిశీలిస్తున్న నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పీఐఏ నిబంధనలు మార్చినా.....
ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో క్యాబిన్ క్రూ మెంబర్లు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి విమానాశ్రయాల్లో తమ పాస్‌పోర్ట్‌లను తప్పనిసరిగా అప్పగించాలని నిబంధనను పీఐఏ 2021లో తీసుకొచ్చింది.
అలాగే యువ ఎయిర్ హోస్టెస్‌లను, స్టివార్డ్‌లను ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పంపవద్దని పీఐఏ మరో నిర్ణయం తీసుకుంది.
పీఐఏ అధికార ప్రతినిధి చెబుతున్న ప్రకారం, ఈ మార్పులేవీ ఫలితమివ్వలేదు. దీంతో, ఈ సమస్యపై విచారణకు, సిబ్బందిపై పర్యవేక్షణకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
''ఈ విషయంలో కెనడా అధికారులతో కూడా మేం మాట్లాడాం. క్రూ మెంబర్లకు సంబంధించిన సవివర సమాచారం వారికి అందించాం'' అని పీఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
ఇవన్నీ ఎలా ఉన్నా, పీఐఏ ఉద్యోగులు 'కనిపించకుండా' పోవడానికి కెనడా ఎందుకు ఇష్టమైన దేశంగా మారింది?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం, గత ఏడాది టొరంటోలోని అధికారులు, పీఐఏ సహా ఇతర విమానయాన సంస్థల ఉద్యోగులతో, అలాగే కెనడాలో ఇమ్మిగ్రేషన్ విషయాలపై పనిచేస్తున్న ఒక న్యాయవాది, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌తో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Arlyn McAdorey/Toronto Star via Getty Images
కెనడానే ఎందుకు కావాలనుకుంటున్నారు?
టొరంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కెనడాలో ఒంటారియో ప్రావిన్స్‌లోని పీల్ రీజినల్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
అదృశ్యమైన పీఐఏ క్రూ మెంబర్లకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు దాఖలయ్యాయా అని పీల్ పోలీసులను బీబీసీ ప్రశ్నించింది.
''తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి మా విమానాశ్రయ విభాగంతో మేం ధ్రువీకరించుకున్నాం, ఈ విషయంలో పీల్ పోలీసులకు కాల్స్ ఏవీ రాలేదు'' అంటూ పీల్ పోలీసు ప్రతినిధి రిచర్డ్ చిన్ బీబీసీకి ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చారు.
''సాధారణంగా, తప్పిపోయిన వ్యక్తికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి కుటుంబసభ్యులు లేదంటే పరిచయస్తులు పోలీసులను సంప్రదిస్తారు. ఒకవేళ విమానాశ్రయ ఉద్యోగులు ఆశ్రయం పొందాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోతున్నట్లయితే, వారు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ)ను సంప్రదించే అవకాశం ఉంది'' అని ఆయన తెలిపారు.
ఈ విషయమై సీబీఎస్ఏ అధికార ప్రతినిధి కారెన్ మార్టెల్ స్పందిస్తూ, ''వ్యక్తులు, వలసల సమాచారం ప్రైవేట్‌గా పరిగణిస్తారు. అది గోప్యతా చట్టం (ప్రైవసీ యాక్ట్) పరిధిలోకి వస్తుంది. కాబట్టి, వ్యక్తుల గురించి లేదా వారి కేసులకు సంబంధించిన వివరాలను సీబీఎస్ఏ బహిర్గతం చేయబోదు'' అని పేర్కొంటూ బీబీసీకి ఈమెయిల్ పంపారు.
కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్‌షిప్ డిపార్ట్‌మెంట్ (ఐఆర్‌సీసీ) కూడా ఇదే తరహాలో స్పందించింది.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ విమానాల్లో క్రూ మెంబర్లకు నిబంధనలేమిటి?
విదేశీ విమానాల్లో కెనడాకు చేరుకునే క్రూ మెంబర్లకు వర్తించే చట్టాల గురించి కారెన్ మార్టెల్ వివరించారు.
ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్‌షిప్ (అమెండ్మెంట్) యాక్ట్ ప్రకారం విమాన సిబ్బందిలో భాగమైన వ్యక్తులు కెనడాలో ప్రవేశించడానికి లేదా అక్కడ ఉండటానికి తాత్కాలిక వీసా అవసరం లేదు. అయితే విమానం బయల్దేరిన దేశం, కెనడా మధ్య వీసా ఒప్పందం ఉండాలి.
విదేశీ విమానాలకు సంబంధించిన సిబ్బంది ఎవరైనా కెనడా చేరుకున్న తర్వాత తమ ఉద్యోగం వదిలేస్తే, సంబంధిత విమానయాన సంస్థ ఆ వ్యక్తి గురించి సీబీఎస్‌ఏకి సమాచారం ఇవ్వాల్సిన ఉందని కారెన్ మార్టెల్ చెప్పారు.
కెనడా నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగిని తొలగించినా లేదా ఆ వ్యక్తి 72 గంటల్లోపు స్వచ్ఛందంగా కెనడాను విడిచి వెళ్లకపోయినా సంబంధిత విమానయాన సంస్థ కచ్చితంగా కెనడా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలు లేనివారెవ్వరినీ కెనడాకు తీసుకురాకుండా సంబంధిత విమానయాన సంస్థలు చూసుకోవాలని, లేదంటే నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకొంటారని కారెన్ మార్టెల్ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, ADRIAN DENNIS/AFP via Getty Images
కెనడాలోనే ఉద్యోగుల ‘అదృశ్యం’
కెనడాలో 'అదృశ్యం' అనేది ఉద్యోగులకు ఎందుకంత సులువవుతుందని పీఐఏ, ఇతర విమానయాన సంస్థల్లోని ప్రస్తుత, మాజీ ఉద్యోగులతో బీబీసీ మాట్లాడింది.
సరళమైన చట్టాలు, బలమైన స్థానిక నెట్‌వర్క్ కారణంగా, కెనడాలో ఇలాంటి సంఘటనలను ఆపడం అంత సులువు కాదన్న విషయాన్ని వారంతా అంగీకరిస్తున్నారు.
మరో ఇబ్బందేమిటంటే, డాక్యుమెంటేషన్. సాధారణంగా ప్రయాణికుల కంటే విమానయాన సంస్థల ఉద్యోగులకు భిన్నమైన ట్రావెల్ డాక్యుమెంట్లు ఉంటాయి. సంబంధిత దేశాలకు సంబంధించిన వీసాలు వారికి అవసరం లేదు. బదులుగా, జనరల్ డిక్లరేషన్ ఉపయోగించి వారు ఆయా దేశాలకు వెళ్లవచ్చు.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఈ డాక్యుమెంట్‌లో విమానం రాకపోకల సమాచారం, విమానం రిజిస్ట్రేషన్ నంబరు, క్రూ మెంబర్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
వాస్తవానికి ఈ డాక్యుమెంట్ ఒక నిర్ణీత సమయంలో ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్తామని ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించే ఒక విధమైన హామీ లాంటిది.
''ఎవరైనా క్రూ మెంబర్ కనిపించకుండాపోవాలనుకున్నప్పుడు మిగతావారెవ్వరికీ తెలియనివ్వరు. ఆ దేశంలో ఉన్న వ్యక్తులతో ముందుగానే మాట్లాడుకుంటారు'' అని పీఐఏ అధికారి ఒకరు అన్నారు.
''ఇదేమీ ఒక్కరోజులో తీసుకునే నిర్ణయం కానేకాదు. కెనడాలోని ఏజెంట్ల నెట్‌వర్క్‌తో మాట్లాడుకొని డాక్యుమెంట్లు తయారు చేయించుకుంటారు'' అని ఆ అధికారి చెప్పారు.
''పీఐఏలో నియంత్రణ ప్రక్రియ ఇతర సంస్థల్లో మాదిరిగా కఠినంగా ఉండదు, ఇది కూడా ఒక కారణం కావచ్చు'' అని ఒక ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ ఒకరు బీబీసీతో అన్నారు.
దీనికి తోడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, పీఐఏలో నెలకొన్న అనిశ్చితి కూడా ఉద్యోగుల అదృశ్యం వెనుక ఒక కారణం కావచ్చు.
ఎయిర్‌లైన్స్ అధికారులు చెబుతున్న ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రయాణాలు చేసే విమానాల్లోని క్రూ మెంబర్లు వారు వెళ్లే దేశంలో ప్రయాణించడానికి లేదా బంధువులను కలుసుకోవడానికి సంబంధించి ఎటువంటి ఆంక్షలూ లేవు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ కెనడాలోనే ఎందుకిలా?
గత రెండు దశాబ్దాలుగా కెనడాలో కాందిశీకుల తరఫున పనిచేస్తున్న కెనడాకు చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ మెహ్రీన్ రజా, మరో దేశంలో ఆశ్రయం పొందలేకపోతున్నవారికి సహాయం చేయడానికి ఒంటారియోలో సౌత్ ఆసియా లీగల్ క్లినిక్‌ను ఏర్పాటుచేశారు.
''మేము పీఐఏ క్రూ మెంబర్లకు సంబంధించిన నివేదికలు చూశాం. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ సహా పలు దేశాల నుంచి వివిధ కారణాల వల్ల కెనడాలో ఆశ్రయం కోరుకునే వారి దరఖాస్తులు పెరిగాయి'' అని మెహ్రీన్ రజా బీబీసీతో అన్నారు.
''కెనడా చట్టాల ప్రకారం, ఆశ్రయం కోరే వ్యక్తిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సందేహంతో చూడకూడదు. ఈ విషయంలో మేము శిక్షణ కూడా నిర్వహిస్తాం. ఎవరైనా ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకొని, వారి భాగస్వామి సహాయంతో స్పౌజ్ వీసా లేదా పర్మినెంట్ వీసా పొందవచ్చు'' అని ఆమె చెప్పారు.
కెనడా ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డు డేటా ప్రకారం, ఆశ్రయం కోసం 2023లో 1,44,000 దరఖాస్తులు కెనడా అధికార సంస్థలకు అందాయి. 2022లో అందిన దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే 57 శాతం పెరిగాయి. వీటిలో 4,832 దరఖాస్తులు పాకిస్తాన్ వారివే. గత ఏడాది దాఖలైన 1,894 దరఖాస్తుల కన్నా 60 శాతం పెరిగాయి.
గత కొన్నేళ్లుగా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అబ్దుల్లా బిలాల్ బీబీసీతో మాట్లాడుతూ, ''కెనడా చట్టం ప్రకారం, దేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోకి ప్రవేశించిన తర్వాత మీరు ఒకరితో కలిసి ఉంటూ ఆశ్రయం కోసం కేసు దాఖలు చేయవచ్చు'' అని చెప్పారు.
''ఈ ప్రక్రియ అంతా కొన్నేళ్లు పడుతుంది, ఒకవేళ ఏదైనా కారణంతో ఆశ్రయం మంజూరుచేయకపోతే, మీరు అప్పీల్ చేసుకోవచ్చు'' అని అన్నారు.
ఆశ్రయం కోరుకునే వ్యక్తులు చాలాసార్లు తప్పుడు కారణాలే చూపిస్తారనీ, దీని ప్రభావం నిజంగా ఆశ్రయం పొందడానికి అర్హత ఉన్నవారిపై పడుతుందని మెహ్రీన్, బిలాస్‌లు అంటున్నారు.
''కెనడాలో ఆశ్రయం ఇచ్చే ప్రక్రియ వ్యాపారమైపోయింది. పర్యటక వీసాపై వచ్చి, తర్వాత ఆశ్రయం కోసం దరఖాస్తు చేస్తున్నారు'' అని బిలాల్ అన్నారు.
పాకిస్తాన్ నుంచి మాత్రమే కాదు భారత్, ఇరాన్, నైజీరియా, మెక్సికో వంటి ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు కెనడాలో ఆశ్రయం కోరుతున్నారు. అయితే అందుకు కారణాలేమిటో ధ్రువీకరించడం కష్టం'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సమస్య పరిష్కారానికి పీఐఏ ఏం చేస్తుంది?
పేరు వెల్లడించడానికి ఇష్టపడని పీఐఏ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, ఉద్యోగుల అదృశ్యం ఘటనలను ఆపడానికి వారి నుంచి బాండ్‌లు తీసుకునే విధానాన్ని ప్రారంభించారనీ, కానీ దానితో పెద్దగా లాభం లేదనీ చెప్పారు.
''అదృశ్యమైన వ్యక్తుల కుటుంబాలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనే ప్రతిపాదననూ పరిశీలించారు. కానీ అది అసాధ్యమని భావించి విరమించుకున్నారు. అదే జరిగితే కోర్టు దాన్ని ఒక్క నిమిషంలోనే కొట్టేసి ఉండేది'' అని అభిప్రాయపడ్డారు.
''అదృశ్యమైన ఉద్యోగులను రెడ్ ఫ్లై లిస్టులో పెట్టే చర్చ కూడా జరిగింది. అయితే అది కష్టం. ఎందుకంటే వారు దేశం నుంచి బహిష్కృతులైనవారు కాదు. కొన్నేళ్ల తర్వాత వారు మరో దేశం పాస్‌పోర్టుతో ప్రయాణిస్తుంటారు. మీరు వారిని నిలువరించలేరు'' అని ఆ అధికారి అన్నారు.
పాస్‌పోర్టులను విమానాశ్రయాల్లో అప్పగించే విధానంపై మెహ్రీన్ రజా మాట్లాడుతూ, ''ఆశ్రయం కోరేవారు మొదట ధ్వంసం చేసేది పాస్‌పోర్టునే. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు'' అన్నారు.
ఉభయ దేశాల అధికారుల మధ్య చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














