భారత గగనతలం మూసివేస్తే పాకిస్తాన్ విమానాలకు కష్టాలేనా?

విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
    • రచయిత, దేవినా గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉంది. దీనికి తోడు, దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రైవేటీకరణకు విఫల ప్రయత్నాలు పీఐఏ ఇబ్బందులను మరింత పెంచాయి.

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై దాడి జరిగింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రతిచర్యగా పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భారత విమానయాన సంస్థలకు పాక్ తన గగనతలాన్ని మూసివేయడం ఒకటి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వచ్చే విమానాలకూ భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్ విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌కు ఇబ్బందులు..

గగనతలాల మూసివేత రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధం అయినప్పటికీ, భారత నిర్ణయం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది.

"భారత్ నిర్ణయంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చైనా గగనతలం నుంచి తన విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ విమానాల ప్రయాణ సమయం పెరుగుతుంది. ఇస్లామాబాద్ నుంచి బ్యాంకాక్ వంటి మార్గాలు నష్టాలను మూటగట్టుకుంటాయి" అని పాకిస్తాన్ విమానయాన ఆర్థికవేత్త, టెయిల్‌విండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ మొహమ్మద్ అఫ్సర్ మాలిక్ అన్నారు.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ప్రకారం.. పాకిస్తాన్ నుంచి మలేసియా, దక్షిణ కొరియాలకు వెళ్లే విమానాలపై దీని ప్రభావం తక్కువగా ఉండవచ్చు. కానీ, లాజిస్టిక్స్‌(వస్తువుల నిల్వ, రవాణా)తో పాటు ఆదాయంపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. దీని కారణంగా, పాకిస్తాన్ నుంచి వారంలో ఆరు నుంచి ఎనిమిది విమానాలు మాత్రమే నడిచే అవకాశముంది. అంతేకాదు, విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి.

పీఐఏ విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

గతంలోనూ భారీ నష్టం

పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు గగనతల ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు రావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ దాడి చేసింది. దీంతో భారత విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసివేసింది.

"చివరిసారి భారత విమానాలకు పాక్ దాని గగనతలాన్ని మూసివేసినప్పుడు, ఆ దేశం 45 నుంచి 50 మిలియన్ డాలర్లు నష్టపోయింది" అని సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్‌కు చెందిన గ్రూప్ కెప్టెన్ (రిటైర్డ్), సీనియర్ ఫెలో ప్రొఫెసర్ డాక్టర్ దినేష్ కుమార్ పాండే తెలిపారు.

"నిబంధనల ప్రకారం ఒక అంతర్జాతీయ విమానం మరొక దేశ గగనతలంపై ప్రయాణిస్తే ఆ దేశానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, దీనిని ఓవర్‌ఫ్లైట్ ఫీజు అంటారు. ఈ ఫీజునే పాకిస్తాన్ కోల్పోయింది" అని పాండే తెలిపారు.

కానీ, ఈ గగనతల వివాదం పీఐఏ సంక్షోభంలో ఒక అంశం మాత్రమే.

వాణిజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అప్పుల్లో విమానయాన సంస్థ

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చాలాకాలంగా ప్రభుత్వ మద్దతుపైనే ఆధారపడి పనిచేస్తోంది. సంస్థ అప్పులు పెరుగుతున్నాయి, విమానాలు పాతవి అవుతున్నాయి. దీంతో, విమానయాన మార్కెట్లో పోటీ పడే దాని సామర్థ్యం తగ్గిపోయింది.

మొహమ్మద్ అఫ్సర్ మాలిక్ మాట్లాడుతూ " ఓపెన్ మార్కెట్‌లో ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ బాగా రాణించడం చాలా అరుదు. వాటి పనితీరులో అసమర్థత కనిపిస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉద్యోగులుంటారు. ప్రైవేట్ విమానయాన సంస్థల మాదిరి జవాబుదారీతనం ఉండదు" అని అన్నారు.

2023లో మలేషియాలో పాకిస్తాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానాన్ని సీజ్ చేసినపుడు సంస్థ విశ్వసనీయత దెబ్బతింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.

ఆ సమయంలో, పీఐఏకి పాక్ ప్రభుత్వ సంస్థ అయిన పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ ఇంధన సరఫరాను నిలిపివేసింది. దీంతో చాలా విమానాలు ఆగిపోయాయి. డిసెంబర్ 2024లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 34 విమానాలు ఎగరడానికి అవసరమైన సామగ్రి లేనందున వాటిని నిలిపివేసినట్లు ప్రకటించారు. ఏటీఆర్ విమానాలపై కూడా దీని ప్రభావం పడింది, దాని ఐదు విమానాలలో రెండు మాత్రమే నడిచాయి.

విమానయాన సంస్థ

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేటీకరణలో ఇబ్బందులు

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలాకాలంగా ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సహాయంగా ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ పొందింది. దీనికి విధించిన షరతులలో ఒకటి.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా నష్టాల్లో ఉన్న కంపెనీలను విక్రయించడం.

అందువల్ల, 2024 అక్టోబర్‌లో ప్రభుత్వ విమానయాన సంస్థల కోసం బిడ్ చేయాలంటూ ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించింది పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ, దీనిపై ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపలేదు. పీఐఏలో 60 శాతం వాటాను విక్రయించడానికి ప్రాథమిక ధరను 300 మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది ప్రభుత్వం.

కాగా, ఎయిర్ లైన్స్‌ను కొనడానికి ఒక కంపెనీ ముందుకు వచ్చింది, అది రియల్ ఎస్టేట్ కంపెనీ 'బ్లూ వరల్డ్ సిటీ'. కానీ, ఈ కంపెనీ కేవలం 36 మిలియన్ డాలర్లను మాత్రమే ఆఫర్ చేసింది. కంపెనీ ఆ ఆఫర్‌ను ప్రభుత్వం తిరస్కరించింది.

దీంతో, ఎయిర్‌లైన్స్‌ను నష్టాల నుంచి బయటపడేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికోసం ప్రయత్నాలు చేసింది.

పాకిస్తాన్ విమానయాన, రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా "21 సంవత్సరాల తర్వాత, 2024లో విమానయాన సంస్థ లాభదాయకంగా మారింది" అని తెలిపారు.

విమానయాన సంస్థ కూడా దీనిని ధ్రువీకరించింది.

కాగా, ప్రైవేటీకరణ ప్రక్రియకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. 2025 జూన్ 3న తదుపరి బిడ్స్ దాఖలు చేయనున్నారు. ఈ ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో ఆకాశంలో పయనించడానికి కొనుగోలుదారుడి కోసం పీఐఏ ఎదురుచూస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)