భారత్-చైనా: డైరెక్ట్ విమాన సర్వీసులు మళ్లీ మొదలు, ఉద్రిక్తతలు తగ్గుతున్నాయా?

భారత్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా గ్వాంగ్‌‌ జౌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారత్ వచ్చేందుకు చెక్ ఇన్ అవుతున్న ప్రయాణికులు
    • రచయిత, అన్బరసన్ ఎతిరాజన్, కో ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

భారత్-చైనా దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.

సోమవారం 6E 1703 అనే నంబరుగల ఇండిగో విమానం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి చైనాలోని దక్షిణాది నగరం గ్వాంగ్‌జౌ చేరుకుంది.

ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో ఈ రెండు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను నిలిపివేశారు.

తర్వాత సరిహద్దులో ఉద్రిక్తతలు పెరగడంతో సర్వీసులు మళ్లీ ప్రారంభం కాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆదివారం సాయంత్రం కోల్‌కతా విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికులు చెక్ ఇన్ అవుతున్న సమయంలో విమానయాన సిబ్బంది జ్యోతి ప్రజ్వలన చేసి విమాన సర్వీసుల పునఃప్రారంభానికి స్వాగతం పలికారు.

సర్వీసులు తిరిగి ప్రారంభించడం వల్ల రెండు దేశాల మధ్య ప్రయాణ సమయం ఆదా అవుతుందని ఒక ప్రయాణికుడు అన్నారు.

భారత్ చైనా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

మెరుగుపడుతున్న సంబంధాలు

ఈ మధ్య ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత 2025 ఆగస్టులో చైనాలో పర్యటించారు. అదే నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌కు వచ్చారు.

ఈ విమాన సర్వీసుల పునఃప్రారంభం ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడంలో దోహదపడుతుందని భారత ప్రభుత్వం తెలిపింది.

చైనా పర్యటకులకు భారత ప్రభుత్వం వీసాల జారీని కూడా తిరిగి ప్రారంభించింది.

‘‘ఇది భారత్-చైనా సంబంధాల్లో చాలా ముఖ్యమైన రోజు’’ అని చైనా కాన్సులేట్ సీనియర్ అధికారి చిన్ యాంగ్ అన్నారు.

చైనాకు చెందిన ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ నవంబరులో షాంఘై-దిల్లీ మధ్య విమాన సర్వీసును ప్రారంభించనుంది.

భారత్ చైనా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్వాంగ్‌జౌ వెళుతున్న ప్రయాణికులు

భారత్, చైనాల మధ్య 3,440 కిలోమీటర్ల పొడవుకు పైగా సరిహద్దు ఉంది. ఇందులో కొన్నిచోట్ల కచ్చితమైన సరిహద్దు లేదు. రెండు దేశాలు ఆయా ప్రాంతాలపై హక్కు తమదేనని వాదిస్తున్నాయి.

2020లో, గల్వాన్ లోయలో ఇరుదేశాల దళాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో కనీసం 20 మంది భారతీయ సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించారు.

1975 తర్వాత ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణ ఇది. ఇరుదేశాల మధ్య సంబంధాలు స్తంభించిపోవడానికి ఈ ఘర్షణ కారణమైంది.

అయితే, దెబ్బతిన్న సంబంధాలను క్రమంగా బలోపేతం చేసుకునేందుకు గత ఏడాది కాలంగా బీజింగ్, దిల్లీలు చర్యలు చేపడుతున్నాయి.

రెండువైపుల నుంచి ఉన్నతస్థాయి అధికారులు అనేక దశల చర్చలు, సమావేశాలు నిర్వహించారు.

గత ఏడాది అక్టోబర్‌లో, వివాదాస్పద హిమాలయ సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాలు పెట్రోలింగ్ ఏర్పాట్లకు అంగీకరించాయి .

ఈ ఏడాది, టిబెట్ అటానమస్ రీజియన్ అని పిలిచే కొన్ని మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను సందర్శించడానికి భారతీయ యాత్రికులను అనుమతించింది చైనా.

భారత్ కూడా చైనా పర్యటకులకు వీసా సేవలను పునఃప్రారంభించింది. నిర్దేశిత పాసుల ద్వారా సరిహద్దు వాణిజ్యానికి సంబంధించిన చర్చల పునఃప్రారంభానికి అంగీకరించింది.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణించడం కూడా దిల్లీ, బీజింగ్ సంబంధాలు మెరుగయ్యేందుకు మరో కారణంగా చెప్పొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)