నైజీరియాలో భారీ కిడ్నాప్ : పాఠశాల నుంచి 315 మంది అపహరణ

- రచయిత, అలెక్స్ స్మిత్, క్రిస్ ఎవోకోర్, ఎలెట్రా నేస్మిత్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
సెంట్రల్ నైజీరియాలోని ఓ కేథలిక్ పాఠశాల నుంచి 300 మందికి పైగా పిల్లలు, సిబ్బందిని సాయుధులు కిడ్నాప్ చేసినట్లు రిపోర్టులు వస్తున్నాయి.
నైజర్ రాష్ట్రంలో పాపిరిలోని సెయింట్ మేరీస్ స్కూల్ నుంచి 303 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులను తీసుకెళ్లారని క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా తెలిపింది.కిడ్నాప్ గురించి ప్రాథమిక సమాచారం ఇచ్చినప్పుడు ఇంతపెద్ద సంఖ్య చెప్పలేదు. స్కూల్లో తనిఖీ తర్వాత, కిడ్నాపైన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలిసిందని అసోసియేషన్ చెప్పింది.
సాయుధ గ్రూపుల దాడులు పెరుగుతున్న సమయంలోనే ఈ కిడ్నాప్ జరిగింది. 2014లో జరిగిన చిబోక్ కిడ్నాప్(276 మంది పాఠశాల విద్యార్థులు)తో పోలిస్తే ఈ సంఖ్య పెద్దది.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు సాయుధులు పాఠశాలలోకి ప్రవేశించి అక్కడ నిద్రిస్తున్న విద్యార్థులను కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.
‘‘అందరూ నిశ్చేష్టులయ్యారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది’’ అని చెప్పారు డొమినిక్ ఆడము అనే వ్యక్తి. ఆయన కుమార్తెలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. కానీ వారు కిడ్నాప్ కాలేదు.
"ఆరు, పదమూడేళ్ల వయస్సున్న నా మేనకోడళ్లను తీసుకెళ్లారు" అని ఒక మహిళ ఏడుస్తూ బీబీసీతో చెప్పారు. "వాళ్లు ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా" అన్నారామె.


ఫొటో సోర్స్, AFP
పోలీసులు ఏమంటున్నారు?
కిడ్నాపైన విద్యార్థులను రక్షించడానికి భద్రతా దళాలు అడవుల్లో గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
మొదట్లో 215 మంది విద్యార్థులను తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు.
ఏఎఫ్‌పీ వార్తాసంస్థ ప్రకారం, కిడ్నాపైన విద్యార్థులు పాఠశాల మొత్తం విద్యార్థులలో దాదాపు సగం మంది.
దాడుల ప్రమాదం ఎక్కువగా ఉందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల అనంతరం, అన్ని బోర్డింగ్ సంస్థలను మూసివేయాలన్న ఆదేశాలను పాఠశాల పట్టించుకోలేదని నైజర్ రాష్ట్ర అధికారులు తెలిపారు.
పాఠశాల తెరిచి, విద్యార్థులు, సిబ్బందిని ప్రమాదంలో పడేశారని అధికారులు ఒక ప్రకటనలో ఆరోపించారు. దీనిపై, పాఠశాల స్పందించలేదు.
ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు?
స్థానికంగా 'బందిపోట్లు' అని పిలిచే క్రిమినల్ ముఠాలు విమోచన చెల్లింపు (బందీల విడుదలకు డబ్బు) కోసం ప్రజలను కిడ్నాప్ చేయడం, నైజీరియాలోని అనేక ప్రాంతాలలో ప్రధాన సమస్యగా ఉంది.
ఈ ముఠాలకు డబ్బు ప్రవాహాన్ని ఆపేందుకు ప్రభుత్వం విమోచన చెల్లింపులను నిషేధించింది. కానీ, పెద్దగా మార్పురాలేదు. శుక్రవారం జరిగిన కిడ్నాప్, ఆ దేశంలో ఒక వారంలో జరిగిన మూడో సామూహిక కిడ్నాప్.
సోమవారం, పొరుగున ఉన్న కెబ్బి రాష్ట్రంలోని బోర్డింగ్ స్కూల్ నుంచి 20 మందికి పైగా బాలికలను కిడ్నాప్ చేశారు. ఇందులో, బాధితులంతా ముస్లింలని బీబీసీకి తెలిపారు.
దక్షిణాన ఉన్న క్వారా రాష్ట్రంలో కూడా ఒక చర్చిపై దాడి జరిగింది, ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 38 మందిని కిడ్నాప్ చేశారు.
వరుస ఘటనలతో నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు తన విదేశీ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ఈ వారాంతంలో దక్షిణాఫ్రికాలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవ్వాల్సి ఉంది. కానీ, దేశ భద్రతా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నలభైకు పైగా పైగా కళాశాలలను మూసివేయాలని నైజీరియా ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేశాయి. మరోవైపు, దేశంలో పెరుగుతున్న అభద్రత ప్రజల్లో కోపం, భయాన్ని కలిగిస్తోంది. పిల్లలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డోనల్డ్ ట్రంప్ హెచ్చరిక
నైజీరియాలో క్రైస్తవులను హింసిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవలే ఆరోపించారు. ఈ వాదనను నైజీరియా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ వాదనల క్రమంలోనే సామూహిక కిడ్నాప్ జరిగింది.
ఇస్లామిస్ట్ మిలిటెంట్లు నైజీరియాలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అమెరికాలోని రాజకీయ నాయకులు, క్యాంపెయినర్స్ కొన్నినెలలుగా ఆరోపిస్తున్నారు.
నైజీరియా ప్రభుత్వం 'క్రైస్తవులను చంపడానికి అనుమతిస్తూ ఉంటే' అక్కడికి సాయుధ దళాలను పంపుతానని ట్రంప్ ఈ నెల ప్రారంభంలో హెచ్చరించారు.
క్రైస్తవులను హింసిస్తున్నారనే వాదనలు వాస్తవాన్ని వక్రీకరించే విధంగా ఉన్నాయని నైజీరియా ప్రభుత్వం పేర్కొంది.
ఒక అధికారి మాట్లాడుతూ "ఉగ్రవాదులు తమ హింసాత్మక భావజాలాన్ని వ్యతిరేకించే ఎవరిపైనైనా దాడిచేస్తారు - వారు ముస్లింలు, క్రైస్తవులు, మతానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా కావొచ్చు'' అన్నారు.
ఈశాన్య నైజీరియాలో జిహాదీ గ్రూపులు 10 సంవత్సరాలకుపైగా ప్రభుత్వంతో పోరాడుతున్నాయి.
నైజీరియాలో బాధితులు ఎక్కువగా ముస్లింలేనని, ఎందుకంటే ముస్లింలు నివసించే ఉత్తర ప్రాంతంలోనే ఎక్కువ దాడులు జరుగుతాయని హింసను ట్రాక్ చేసే గ్రూపులు చెబుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
వనరుల కోసం ఘర్షణలు
మధ్య నైజీరియాలో పశువుల కాపరులు (ఎక్కువగా ముస్లింలు), రైతుల (ఎక్కువగా క్రైస్తవులు) మధ్య దారుణమైన ఘర్షణలు జరుగుతుంటాయి. మతం కంటే కూడా నీరు, భూమి లాంటి ప్రకృతి వనరులపై ఆధిపత్యమే ఎక్కువగా ఈ పోరాటాల వెనుక ఉన్న లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇస్లామిస్ట్ గ్రూప్ బోకో హరామ్ 2014లో చిబోక్‌లోని ఒక పాఠశాల నుంచి 276 మంది బాలికలను కిడ్నాప్ చేసింది. ఈ సంఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వారిని తిరిగి తీసుకురావాలని కోరుతూ ప్రపంచవ్యాప్త ప్రచారానికి దారితీసింది, ఇందులో అప్పటి అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా చురుగ్గా పాల్గొన్నారు.
కిడ్నాప్ అయిన వారిలో చాలామంది బాలికలు తప్పించుకున్నారు లేదా విడుదలయ్యారు. కానీ, దాదాపు 100 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














