ట్రంప్,మమ్దానీ సమావేశం ఎలా జరిగింది, ఏం మాట్లాడుకున్నారు?

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images
శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కలుసుకున్నారు.
ఈ సమావేశం ఉద్విగ్నంగా ఉంటుందని చాలామంది భావించారు. కానీ వీరిద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు.
ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో మమ్దానీతో సమావేశం ఫోటోలను పోస్ట్ చేసి, "న్యూయార్క్ నగర కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవడం గొప్ప గౌరవం" అని రాశారు. మరోవైపు, మీడియా సమావేశానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను మమ్దానీ పోస్ట్ చేశారు.
"న్యూయార్క్‌లోని శ్రామిక ప్రజలు నగర రాజకీయాల్లో కనుమరుగైపోయారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 2.9 డాలర్ల రైలు లేదా బస్సు ఛార్జీని కూడా భరించలేకపోతున్నారు.. మన రాజకీయాల్లో వారిని ప్రధానంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని నేనీరోజు అధ్యక్షుడు ట్రంప్‌తో చెప్పాను" అని ఆ పోస్టులో తెలిపారు.
సమావేశం తర్వాత, ఇద్దరు నాయకులు రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
న్యూయార్క్ ఎన్నికల ప్రచారంలో మమ్దానీని కమ్యూనిస్ట్ అని ట్రంప్, అధ్యక్షుడిని నియంత అని మమ్దానీ పిలిచారని ఒక రిపోర్టర్ గుర్తుచేశారు. కానీ, ఇద్దరు నాయకులు తమ మునుపటి ప్రకటనలపై అడిగిన అనేక ప్రశ్నలను తప్పించుకుంటూ, ఒకరినొకరు ప్రశంసించుకుంటూ వెళ్లారు.


ఫొటో సోర్స్, WATSON/AFP via Getty Images
‘ఫాసిస్ట్’ పదప్రయోగంపై మమ్దానీ ఏం చెప్పారంటే?
'మీరు అధ్యక్షుడిని ఫాసిస్ట్‌గా భావిస్తున్నారా?' అని మమ్దానీని ఒక రిపోర్టర్ అడిగారు.
మమ్దానీ సమాధానం చెప్పడం ప్రారంభించగానే ట్రంప్ మధ్యలో అడ్డుకుని, మమ్దానీ చేతిని తేలికగా తట్టి, నవ్వుతూ, "సరే, మీరు అవును అని చెప్పొచ్చు. వివరించడం కంటే ఇది సులభం" అన్నారు.
ట్రంప్ నియంత అని, ఫాసిస్ట్ ఎజెండాను అనుసరిస్తున్నారని మమ్దానీ గతంలో ఆరోపించారు.
ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారా అని రిపోర్టర్ మమ్దానీని ప్రశ్నించగా, ఆయన సమాధానమిస్తూ "అధ్యక్షుడు, నేను మా స్థానాలు, అభిప్రాయాల గురించి చాలా స్పష్టంగా ఉన్నాం. మా సమావేశం మా అసమ్మతులపైన కాకుండా, ఉమ్మడి లక్ష్యంపై దృష్టి పెట్టింది" అన్నారు.
"ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది 85 లక్షల మంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మేం ద్రవ్యోల్బణ సవాల్‌ను ఎదుర్కొంటున్నాం, నలుగురిలో ఒకరు పేదరికంలో ఉన్నారు. మా సమావేశంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎలా కలిసి పనిచేయవచ్చో చర్చించాం. ద్రవ్యోల్బణం గురించి చింతించే బదులు, నిరాడంబరమైన జీవితాన్ని గడపగలిగే నగరాన్ని వారికి ఎలా అందించగలమనేది చర్చించాం" అని మమ్దానీ అన్నారు.
అప్పుడు ట్రంప్ మాట్లాడుతూ, "నన్ను నియంత కంటే దారుణంగా పిలిచారు. కానీ, అది అంత అవమానకరమైనది కాదు. బహుశా మేం కలిసి పనిచేస్తే, వారు నా గురించి అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Bryan Bedder/Getty Images for Anti-Defamation League
‘‘ట్రంప్... మీరు జిహాదీ పక్కన నిలబడ్డారా?’’
రిపబ్లికన్ ఎలిస్ స్టెఫానిక్ పోస్టును రిపోర్టర్లు ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. ఆమె ఎన్నికల ప్రచారంలో మమ్దానీని 'జిహాదీ'కి ముడిపెడుతూ పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో, "ఓవల్ ఆఫీసులో జిహాదీ పక్కన నిలబడి ఉన్నానని మీరు అనుకుంటున్నారా?" అని ట్రంప్‌ను ఒక రిపోర్టర్ అడిగారు.
అయితే, మమ్దానీ 'తెలివైన వ్యక్తి' అని బదులిచ్చారు ట్రంప్.
న్యూయార్క్ గవర్నర్ రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి స్టెఫానిక్, న్యూయార్క్ పోస్ట్ వార్తాపత్రిక మొదటి పేజీలోని మమ్దానీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, "ఆయన జిహాదీలా నడిస్తే, జిహాదీలా మాట్లాడితే, జిహాదీలా ప్రచారం చేస్తే, జిహాదీలకు మద్దతు ఇస్తే, ఆయన కూడా జిహాదీ" అని తెలిపారు.
ఆ పోస్టు గురించే ట్రంప్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు. "లేదు, నేను దాన్ని నమ్మను. కొన్నిసార్లు మీరు ఎన్నికల ప్రచారంలో చాలా చెబుతారు" అని ట్రంప్ అన్నారు.
"స్టెఫానిక్ చాలా సమర్థురాలు, దాని గురించి మీరు ఆమెనే అడగాలి. కానీ, నేను కలిసిన వ్యక్తి న్యూయార్క్ అభివృద్ధి చెందాలని కోరుకునే తెలివైన వ్యక్తి" అన్నారు.

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images
మమ్దానీపై ప్రశంసలు
ట్రంప్, మమ్దానీ ముందుగా ఒక ప్రైవేట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరిందని స్పష్టమైంది.
మమ్దానీ ట్రంప్ పక్కన గౌరవంగా నిలబడి కనిపించారు. ఇరువురూ, ముఖ్యంగా ట్రంప్ చాలా కూల్‌గా కనిపించారు. మమ్దానీని ట్రంప్ విమర్శించలేదు, బదులుగా ప్రశంసించారు. ఆయన "మంచి మేయర్ అవుతారు" అన్నారు ట్రంప్. "ఆయన బాగా పని చేస్తారని" తనకు నమ్మకం ఉందన్నారు.
ట్రంప్, మమ్దానీ ఇద్దరూ న్యూయార్క్ వాసులే. ట్రంప్ చిన్ననాటి ఇల్లు జమైకా ఎస్టేట్స్ పరిసరాల్లో ఉంది. అయితే మమ్దానీ ప్రస్తుతం ఆస్టోరియాలో నివసిస్తున్నారు.
ట్రంప్, తాను న్యూయార్క్ నగరాన్ని "ప్రేమిస్తున్నట్లు" మమ్దానీ చెప్పారు.
ట్రంప్ న్యూయార్క్‌లో మన్‌హట్టన్‌లోని తన ఇంట్లో చాలా తక్కువ సమయం గడుపుతుంటారు. కానీ, మీడియాతో ఈ నగరం గురించి ఉత్సాహంగా మాట్లాడారు.
"ఈ నగరం అద్భుతంగా ఉంటుంది. ఇది గొప్ప విజయాన్ని సాధించగలిగితే సంతోషిస్తాను. చాలా సంతోషంగా ఉంటాను" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images
రిపబ్లికన్ వ్యూహానికి ఇబ్బంది కానుందా?
అయితే, ఈ ఇద్దరు రాజకీయ నాయకులు రెండు నెలల కిందటి ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్న స్థితికి, మరోసారి వెళ్లే సమస్యలు ఇంకా ఉన్నాయనే భావన ఉంది. డెమొక్రాట్ల మద్దతుదారులను న్యూయార్క్‌లోని కొన్ని వలస వర్గాలను ఆగ్రహానికి గురిచేసిన ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానం గురించి ఒక రిపోర్టర్ ట్రంప్, మమ్దానీలను ప్రశ్నించారు.
న్యూయార్క్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానం అమలుపై ట్రంప్‌తో మాట్లాడినట్లు మమ్దానీ చెప్పారు. ఇంతలో, ట్రంప్ వలసల గురించి తక్కువగా, నేరాల గురించి ఎక్కువగా మాట్లాడినట్లు చెప్పారు.
"వారు కూడా నేరాలు పెరగాలని కోరుకోవడం లేదు, నేనూ కోరుకోవడం లేదు" అని ట్రంప్ అన్నారు.
మమ్దానీ నాయకత్వంలో న్యూయార్క్‌లో తాను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నానని అన్నారు.
కానీ, ట్రంప్ పరిపాలన అక్రమ వలసలకు వ్యతిరేకంగా కఠినమైన విధానాలను అమలు చేయడం, వీలైనంత ఎక్కువమందిని బహిష్కరించాలని నిర్దేశించడంతో, దీనిపై ఇద్దరు నాయకులు మరోసారి విభేదించే అవకాశం ఉంది.
2026 మధ్యంతర ఎన్నికల్లో, ప్రయోజనం పొందడానికి మమ్దానీని రాజకీయ ప్రత్యర్థిగా ఉపయోగించుకోవాలని రిపబ్లికన్లు యోచిస్తున్నారనే వాదన ఉంది. కానీ, శుక్రవారం మమ్దానీతో సమావేశం తర్వాత, న్యూయార్క్ కొత్త మేయర్ "కొంతమంది కన్జర్వేటీవ్‌లను ఆశ్చర్యపరచవచ్చు" అని ట్రంప్ అన్నారు.
అటువంటి పరిస్థితిలో, భవిష్యత్తులో రిపబ్లికన్ పార్టీ వ్యూహాన్ని ఇది క్లిష్టతరం చేస్తుందని పలువురు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














