గుప్త నిధి కోసం తవ్వకాలు.. అనుమానాస్పదంగా నలుగురి మృతి - ప్రెస్ రివ్యూ

అంబులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం నాగపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ రహీం, హాజీరాబీ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు. కుమారుడు కరీంపాషా నాగర్‌కర్నూల్‌లో ఉంటున్నాడు. రెండో కుమార్తె ఆష్మాబేగం కూడా తన భర్త ఖాజా, కూతురు ఆశ్రీన్‌తో కలిసి కొంతకాలంగా నాగర్‌కర్నూల్‌లో జీవిస్తున్నారు.

తమ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని హాజీరాబీ కొన్నేండ్లుగా కుటుంబ సభ్యులతో చర్చిస్తుండేది. ఈ క్రమంలో 2014 ఆగస్టు 12న ఇంటి ఆవరణలో తవ్వకాలు జరుపగా ఎలాంటి నిధులు లభించలేదు.

తాజాగా అల్లుడు ఖాజా తన భార్యాపిల్లలతో కలిసి నాగపూర్‌కు చేరుకొని గురువారం రాత్రి హజీరాబీ ఇంట్లో తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లోనే నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పదస్థితిలో చనిపోయారు.

ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడిఉంది. ఇంట్లో మృతదేహాలను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇంటి ఆవరణలో గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయనీ, విచారణ పూర్తిచేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా 'మా ఇంట్లో గుప్తనిధులు, దెయ్యాలు ఉన్నాయని.. నిధులను బయటకు తీయాలని మా అమ్మ హాజీరాబీ తరచూ చెబుతూ ఉండేది' అని మృతురాలి కొడుకు కరీంపాషా తెలిపాడు. గతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన సమయంలో తన తండ్రి రహీం మృతిచెందినట్లు పేర్కొన్నాడు.

విద్యార్థులు

సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేసినట్లు సాక్షి ఓ కథనంలో తెలిపింది.

ఎంసెట్, సహా వివిధ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు షెడ్యూళ్లు ఇచ్చినా కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.

సెప్టెంబర్‌ మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించాలని, అక్టోబర్‌ 15 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను రూపొందించింది.

ఈ ఏడాది ఏపీ ఐసెట్‌ను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 64,822 మంది దరఖాస్తు చేసుకున్నారని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 45 పట్టణాల్లో నాలుగు సెషన్స్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

'కీ' హీరోయిన్‌కు కరోనా పాజిటివ్

సినీ నటి నిక్కీ గల్రానీకి కరోనా సోకినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

కరోనా లక్షణాలైన రుచి, వాసన కోల్పోవడం, జ్వరం, గొంతు మంట వంటి లక్షణాలు కనిపించడంతో గత వారం కరోనా పరీక్ష చేయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

అన్ని జాగ్రత్తలూ పాటిస్తున్నానని, దానివల్ల త్వరగా కోలుకుంటున్నానని నిక్కీ తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్థిస్తున్న స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

చెన్నై కార్మొరేషన్‌‌తో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు.

నిక్కీ గల్రానీ తమిళ, మళయాళంలలో అనేక సినిమాలు చేశారు. జీవా నటించిన కీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ నిక్కీ గల్రానీ సుపరిచితమే. ఆమె సోదరి సంజన ప్రభాస్ సినిమా బుజ్జిగాడులో నటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)