సెలినా జైట్లీ: ‘నా సోదరుడు ఏమయ్యాడో 14 నెలలుగా తెలియడం లేదు’

సెలినా జైట్లీ

ఫొటో సోర్స్, CelinaJaitly@x

ఫొటో క్యాప్షన్, సోదరుడితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సెలినా జైట్లీ

బాలీవుడ్ నటి సెలినా జైట్లీ తన సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ 14 నెలలుగా కనిపించడం లేదని తెలిపారు.

తన సోదరుడు మేజర్ విక్రాంత్‌ను చూడక 14 నెలల 17 రోజులు అయిందని ఆదివారం(23.11.2025) ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.

తన సోదరుడిని తొలుత కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ఎక్కడో నిర్బంధించారని సోషల్ మీడియా పోస్టులో ఆమె రాశారు.

ఈ విషయంపై దిల్లీ హైకోర్టులో సెలినా పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల తర్వాత తన సోదరుడిని తిరిగి తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

విక్రాంత్ జైట్లీని తొలుత కిడ్నాప్ చేసి, ఆ తర్వాత దుబయిలో నిర్బంధించారని సెలినా న్యాయవాది రాఘవ్ కక్కఢ్ ఆరోపించారు.

కాగా యూఏఈలో రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీని అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని 2025 నవంబర్ నెల మొదట్లో విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

భారత అధికారులు ఆయనకు అవసరమైన సాయమంతా చేస్తున్నట్లు తెలిపింది.

వీక్లీ మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్, ''ఈ విషయంపై యూఏఈ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. గత కొన్ని నెలల్లో నాలుగు సార్లు కాన్సులర్ యాక్సస్‌ కోరాం. ఈ యాక్సస్ కింద మన ఎంబసీ అధికారులు వారిని కలిశారు'' అని తెలిపారు.

‘‘ఆయన కుటుంబంతో, భార్యతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఇటీవల నవంబర్ 3న దిల్లీ హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం, మేం చేయగలిగిన సాయమంతా వారికి అందిస్తున్నాం'' అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సోదరుడి ‘కిడ్నాప్‌’పై సెలినా ఏమన్నారు?

సెలినా తన సోదరుడితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తన సోదరుడు మేజర్ విక్రాంత్ తనకు 444 రోజులుగా దూరంగా ఉన్నారని రాశారు.

''విక్రాంత్ కిడ్నాప్ అయ్యారు. ఆయనతో ఎలాంటి కాంటాక్ట్ లేదు. మిడిల్ ఈస్ట్‌లో ఎక్కడో నిర్బంధించారు. ఆయన గొంతు వినాలని, ఆయన్ను చూడాలని వేచిచూస్తున్నా. విక్రాంత్‌ను వారేం చేశారోనని భయమేస్తుంది'' అని ఆమె సోషల్ మీడియాలో రాశారు.

''ఫోన్‌లో ఆయనతో మాట్లాడాను. నా నెంబర్లలో ఒకటి తనకి గుర్తుంది. ఆ ఫోన్ కాల్‌లో మాటలు తక్కువ, బాధ ఎక్కువగా ఉంది. సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. నా సోదరుడు తన యవ్వనాన్ని, మనసును, జీవితాన్ని భారత్‌కే అంకితం చేశారు. మువ్వన్నెల జెండా కోసమే బతికాడు. తన రక్తాన్ని చిందించాడు'' అంటూ సెలినా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

''ఇది కేవలం ఒకరి వ్యక్తిగత సమస్య కాదు. ఇది విదేశాల్లో మన సైనికులను, ప్రముఖులను కిడ్నాప్ చేసే పద్ధతి. మన జాతి భద్రతకు ఇది ఇప్పుడు ప్రమాదకరంగా మారుతుందా? తప్పనిసరిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయాలి'' అని తెలిపారు.

నిరుడు ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులను విడుదల చేయించడంలో భారత విదేశాంగ శాఖ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ.. తన సోదరుడినీ అలాగే విడుదల చేయించాలని కోరారు.

సెలినా జైట్లీ

ఫొటో సోర్స్, Yogen Shah/The India Today Group via Getty Images

సెలినా ఫిర్యాదుపై కోర్టు ఏం చెప్పింది?

గత ఏడాదంతా తనకు ఒక పీడ కల అని గత నెలలో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన సెలినా చెప్పారు.

''అంతర్జాతీయ వేదికలపై భారత హోదా పెరుగుతోంది. కానీ, మన సైనికులు తరచూ విదేశాల్లో లక్ష్యంగా మారుతున్నారు. కోర్టు ఆదేశాలు నా సోదరుడిని తిరిగి దేశానికి తీసుకొస్తాయని ఆశిస్తున్నా'' అని తెలిపారు.

కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సచిన్ దత్తా మాట్లాడుతూ, "ఒక భారతీయ పౌరుడికి విదేశంలో స్వేచ్ఛ కరువైనప్పుడు, దేశం మౌన ప్రేక్షకురాలిగా ఉండలేదు" అని అన్నట్లు న్యాయపరమైన విషయాలను రిపోర్టు చేసే వెబ్‌సైట్ లాబీ నివేదించింది.

సెలినా న్యాయవాది రాఘవ్ కక్కఢ్ మాట్లాడుతూ, ''విక్రాంత్‌కు సంబంధించి మాకెలాంటి సమాచారం లేదు. ఆయన్నెందుకు నిర్బంధించారనే తెలియదు. దుబయిలో ఆయన్ను నిర్బంధించారని మాత్రమే మాకు తెలుసు. గత 14 నెలలుగా ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం'' అని తెలిపారు.

''సెలినాకు, ఆమె సోదరుడికి మధ్య సమన్వయం చేయడంలో సహాయపడటానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని (విదేశాంగ మంత్రిత్వ శాఖను) కోర్టు ఆదేశించింది. అలా చేయడం వల్ల వారికి న్యాయ సహాయం లభిస్తుందని కోర్టు తెలిపింది'' అని పేర్కొన్నారు.

''భవిష్యత్‌లో ఆయన్ను వెనక్కి తీసుకురాగలుగుతామని ఆశిస్తున్నాం. మన ఆర్మీలో ఆయన మేజర్. ప్రభుత్వం సాయం చేస్తుందని భావిస్తున్నా'' అని తెలిపారు.

డిసెంబర్ 4న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఈ కేసులో స్టేటస్ రిపోర్టును సమర్పిస్తారని ఆయన భావిస్తున్నారు.

రిటైర్డ్ మేజర్ విక్రాంత్ ఎవరు?

ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సెలినా భారత ప్రభుత్వాన్ని ఒక పార్టీగా చేర్చారు.

నవంబర్‌లో ఈ కేసు విచారణ తర్వాత జస్టిస్ సచిన్ దత్తా జారీ చేసిన ఉత్తర్వులో, సెలినా సోదరుడు విక్రాంత్ 2016 నుంచి యూఏఈ నివాసిగా ఉన్నట్లు తెలిసింది.

మతితీ గ్రూప్‌లో (MATITI) ఆయన పనిచేస్తున్నారు. ట్రేడింగ్, కన్సెల్టెన్సీ, రిస్క్ మేనేజ్‌మెంట్ సేవలను ఇది అందిస్తుంది.

కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. విక్రాంత్ జైట్లీ ఆ కంపెనీకి సీఈవో, పార్టనర్.

జస్టిస్ దత్తా ఉత్తర్వులలో ఇచ్చిన సమాచారం ప్రకారం, విక్రాంత్‌ను 2024 సెప్టెంబర్ 6న యూఏఈలో కిడ్నాప్ చేసి నిర్బంధించారు.

చాలాకాలం అయినా కూడా విదేశాంగ శాఖ విక్రాంత్ పరిస్థితిని, లీగల్ స్టేటస్‌ను తెలుసుకోవడంలో విఫలమైందని సెలినా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)