లారెన్స్ బిష్ణోయీ తమ్ముడు అన్మోల్ బిష్ణోయీ అరెస్ట్, ఆయనపై ఉన్న అభియోగాలు ఏంటి?

లారెన్స్ బిష్ణోయీ, అన్మోల్ బిష్ణోయీ, అమెరికా, ఇండియా, ఎన్‌ఐఏ, మూసేవాలా

ఫొటో సోర్స్, NIA

ఫొటో క్యాప్షన్, అమెరికా నుంచి భారత్‌కు రాగానే అన్మోల్ బిష్ణోయీని అరెస్టు చేశారు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయీ సోదరుడు, పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన అన్మోల్ బిష్ణోయీని బుధవారం అమెరికా నుంచి భారత్ రాగానే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.

2022 నుంచి పరారీలో ఉండి, అమెరికాలో నివసిస్తున్న అన్మోల్ బిష్ణోయీ(25)ని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

జైలులో ఉన్న తన సోదరుడు లారెన్స్ బిష్ణోయీ టెర్రర్-సిండికేట్‌‌తో అన్మోల్‌కు సంబంధముందని, ఇప్పటివరకు ఈ సిండికేట్‌లోని 19 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.

"2020, 2023 మధ్య దేశంలో జరిగిన అనేక టెర్రరిస్ట్ కార్యకలాపాలలో టెర్రరిస్ట్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయీలకు అన్మోల్‌ సహాయం చేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. 2023 మార్చిలో అన్మోల్‌పై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది" అని ఏజెన్సీ ప్రకటనలో పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్ఐఏ ఇంకా ఏం చెప్పింది?

"బిష్ణోయీ గ్యాంగ్‌లో అన్మోల్ కీలకంగా పనిచేస్తూ, టెర్రర్ సిండికేట్‌లను నడుపుతూ, లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్ కోసం అమెరికా నుంచి టెర్రరిస్ట్ చర్యలను అమలు చేస్తూ, క్షేత్రస్థాయిలోని నేరస్తులకు సహాయం అందించారు" అని ఎన్ఐఏ పేర్కొంది.

"విదేశాల్లో ఉంటూ కూడా ఇతర గ్యాంగ్‌స్టర్ల సాయంతో భారత్‌లో డబ్బులు వసూలు చేశారు" అని తెలిపింది.

ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ బిష్ణోయీ కూడా నిందితుడు.

అన్మోల్ బిష్ణోయీని అమెరికా నుంచి నవంబర్ 18న తీసుకొచ్చారని బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ చెప్పారు.

"మా కుటుంబం అమెరికాలో విక్టిమ్ ఫ్యామిలీ(బాధిత కుటుంబం)గా నమోదైంది. అన్మోల్ బిష్ణోయీ గురించి విక్టిమ్ నోటిఫికేషన్‌ సిస్టంలో భాగంగా మాకు సమాచారం అందుతుంది. అమెరికా నుంచి అన్మోల్ బిష్ణోయీని నవంబర్ 18న పంపించినట్లు ఈరోజు ఫెడరల్ ప్రభుత్వం నుంచి మాకు మెయిల్ వచ్చింది" అని వార్తాసంస్థ ఏఎన్ఐతో ఆయన చెప్పారు.

లారెన్స్ బిష్ణోయీ, అన్మోల్ బిష్ణోయీ, అమెరికా, ఇండియా, ఎన్‌ఐఏ, మూసేవాలా

ఫొటో సోర్స్, NIA/ANI

ఫొటో క్యాప్షన్, అన్మోల్ బిష్ణోయీ గత ఏడాది అమెరికాలో పట్టుబడ్డారు.

అమెరికాలో అరెస్టు

"ఆయన్ను ముంబయికి తీసుకురావాలని, విచారణ జరిపి అరెస్టు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా" అని జీషన్ సిద్ధిఖీ అన్నారు.

"ఆయన సమాజానికి ముప్పు. నా తండ్రి హత్య కేసులో నిందితుడు, సల్మాన్ ఖాన్ కేసులో ఆయన పేరు పదేపదే వినిపిస్తోంది. అన్మోల్ బిష్ణోయీతో వీటిని చేయించింది ఎవరనేది ముఖ్యం" అని అన్నారు.

గత ఏడాది నవంబర్‌లోనే అన్మోల్ బిష్ణోయీని అదుపులోకి తీసుకున్నట్లు రిపోర్టులు వచ్చాయి.

అన్మోల్ బిష్ణోయీని భారత్‌కు తీసుకురావడంలో చట్టపరమైన చిక్కులున్నాయని, నిర్దేశించిన విధానం ప్రకారం ముందుకెళ్తామని అప్పట్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు పీటీఐ తెలిపింది.

అన్మోల్ బిష్ణోయీ కోసం వెతుకుతున్న ముంబయి పోలీసులకు, ఆయన అమెరికాలోనే ఉన్నారని యూఎస్ అధికారులు చెప్పినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.

లారెన్స్ బిష్ణోయీ, అన్మోల్ బిష్ణోయీ, అమెరికా, ఇండియా, ఎన్‌ఐఏ, మూసేవాలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాయకుడు సిద్ధూ మూసేవాలాను బిష్ణోయీ గ్యాంగ్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

నకిలీ పాస్‌పోర్ట్‌తో పరారీ

అన్మోల్ బిష్ణోయీ అనేక ముఖ్య నేరాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబయి పోలీసులు ఆయన్ను రప్పించడానికి చాలారోజులుగా ప్రయత్నిస్తున్నారు.

మీడియా రిపోర్టుల ప్రకారం, బాబా సిద్ధిఖీ హత్య, నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు వంటి పలు కేసుల్లో నిందితుడైన అన్మోల్ బిష్ణోయీని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ విభాగం అదుపులోకి తీసుకుంది.

బాబా సిద్ధిఖీ గత సంవత్సరం అక్టోబర్ నెలలో ముంబయిలోని బాంద్రా ఈస్ట్‌లో హత్యకు గురయ్యారు.

ఎన్ఐఏ వెబ్‌సైట్ ప్రకారం, ఏజెన్సీ అన్మోల్ బిష్ణోయీ కోసం వెతుకుతోంది. 'భాను' అని కూడా పిలిచే అన్మోల్ పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందిన వ్యక్తి.

2024 మే 15న 'భాను' పేరుతో ఉన్న నకిలీ పాస్‌పోర్ట్ సాయంతో అన్మోల్ బిష్ణోయీ అమెరికాకు పారిపోయారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో తెలిపింది. అన్మోల్ వద్ద ప్రయాణ పత్రాలతో పాటు దొరికిన కంపెనీ లేఖ కూడా నకిలీదని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం కనుగొన్నట్లు తెలిపింది.

లారెన్స్ బిష్ణోయీ, అన్మోల్ బిష్ణోయీ, అమెరికా, ఇండియా, ఎన్‌ఐఏ, మూసేవాలా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, తన సోదరుడు లారెన్స్ బిష్ణోయీ(ఫోటోలో ఉన్న వ్యక్తి) గ్యాంగ్‌ను నడపడంలోనూ అన్మోల్ బిష్ణోయీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బిష్ణోయీ సోదరులపై ఆరోపణలు

లారెన్స్ బిష్ణోయీ ముఠాను నడపడంలో అన్మోల్ బిష్ణోయీ పాత్ర కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా పోలీసులు అన్మోల్ కోసం వెతుకుతున్నారు.

సిద్ధు మూసేవాలాను 2022 మే 29న పంజాబ్‌లోని మాన్సాలో కాల్చి చంపారు.

32 ఏళ్ల లారెన్స్ బిష్ణోయీ ముఠాలో దాదాపు 700 మంది షూటర్లు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది చిన్న పట్టణాలు, నగరాలకు చెందినవారని భారత దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ అనేక రిపోర్టులు పేర్కొన్నాయి.

పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో లారెన్స్ బిష్ణోయీ ప్రభావం ఉంటుందని చెబుతుంటారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపుల వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

లారెన్స్ బిష్ణోయీపై ప్రస్తుతం 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 7 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది.

విద్యార్థి రాజకీయాల సమయంలో వర్గపోరుతో ప్రారంభమైన లారెన్స్ బిష్ణోయీ నేర ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్యలకు చేరుకుంది.

పోలీసుల ప్రకారం, ఈ ముఠా పెద్ద మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను కూడా నిర్వహిస్తోంది. లారెన్స్ 'ఏ' కేటగిరీకి చెందిన గ్యాంగ్‌స్టర్. పంజాబ్ పోలీసులు గ్యాంగ్‌స్టర్ల కోసం ఒక కేటగిరీని ఏర్పాటు చేశారు. 'ఏ' కేటగిరీ మరింత తీవ్రమైన నేరాలలో పాల్గొన్న నిందితులను సూచిస్తుంది.

లారెన్స్ బిష్ణోయీ గత రెండున్నర సంవత్సరాలుగా అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. అయినప్పటికీ, ఆయన ముఠా బయట చురుగ్గా ఉందని భావిస్తున్నారు.

లారెన్స్ బిష్ణోయీ, అన్మోల్ బిష్ణోయీ, అమెరికా, ఇండియా, ఎన్‌ఐఏ, మూసేవాలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో బాబా సిద్దిఖీ. గతేడాది అక్టోబర్‌లో, ముంబైలో సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. (ఫైల్ ఫోటో)

అన్మోల్ కోసం వెతుకుతున్న దర్యాప్తు సంస్థలు

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, 2024 ఏప్రిల్ 14న సినీ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్ బిష్ణోయీ కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అన్మోల్, లారెన్స్ బిష్ణోయీ ముఠా సభ్యుడు విక్కీ గుప్తా మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ ఈ కేసు దర్యాప్తు సమయంలో దొరికిందని ముంబయి పోలీసులు కోర్టుకు తెలిపారు.

అక్టోబర్ 12న జరిగిన బాబా సిద్ధిఖీ హత్యలో అన్మోల్ బిష్ణోయీ ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అదే నెలలో పోలీసులు ముంబయిలోని ప్రత్యేక కోర్టుకు తెలిపారు.

ఎన్ఐఏ వెబ్‌సైట్ ప్రకారం, 2022లో డేరా సచ్చా సౌదా అనుచరుడు ప్రదీప్ కుమార్ హత్య, రాజస్థాన్‌లోని సికార్‌లో రాజు తెహెత్ హత్యతో సహా అనేక క్రిమినల్ కేసుల్లో అన్మోల్ బిష్ణోయీతో పాటు ఇతరులను ఏజెన్సీ నిందితులుగా పేర్కొంది.

దీనితో పాటు, సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్ బిష్ణోయీని నిందితుడిగా చేర్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)