27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో 'మహా నగరం'గా హైదరాబాద్.. కొత్తగా వచ్చే 5 మార్పులేంటి?

హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరగనుంది.

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, రోడ్డుకు ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసే ప్రతిపాదనకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

మొత్తం 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు.

''మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయడానికి జీహెచ్ఎంసీ యాక్టు, తెలంగాణ మున్సిపల్ యాక్టులకు సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది'' అని మీడియాకు చెప్పారు శ్రీధర్ బాబు.

అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కూడా ఈ విలీన ప్రతిపాదనను ఆమోదించింది.

ఎన్నో ఏళ్లుగా ఉన్న విలీన ప్రతిపాదనలకు కార్యరూపం రావడంతో జీహెచ్ఎంసీ ఇప్పుడు 'మెగా' సిటీగా మారనుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ విలీనం ద్వారా ఏయే మార్పులు రానున్నాయి? ఏం జరగనుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

ఫొటో సోర్స్, peerzadigudacorporation

ఫొటో క్యాప్షన్, మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి మూడింతలు పెరుగుతుందని ఓ అధికారి చెప్పారు.
హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

జీహెచ్ఎంసీ ప్రస్తుత పరిధి 650 చదరపు కిలోమీటర్లు. దీన్ని 2007 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 150 డివిజన్లు ఉన్నాయి.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ నాలుగు జిల్లాలు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి) పరిధిలో పూర్తిగానో, పాక్షికంగానో విస్తరించి ఉంది.

మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి మూడింతలు పెరుగుతుందని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు చెప్పారు.

''మా అంచనా ప్రకారం, జీహెచ్ఎంసీ పరిధి సుమారు 2000 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుందని భావిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే కాకుండా శివారు ప్రాంత మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి ఉండాలని చెప్పారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి.

మరోవైపు, హెచ్ఎండీఏ (హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ) పరిధి 7257 చదరపు కిలోమీటర్లు ఉండగా.. దాన్ని గతంలో 10,472 చదరపు కిలోమీటర్లకు పెంచింది ప్రభుత్వం.

ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో ఆ మేరకు పరిధి తగ్గనుంది.

హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కువ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.
హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

విలీనం అవుతాయని చెబుతున్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కువ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.

ఇవన్నీ ఔటర్ రింగు రోడ్డు లోపల, పక్కనే ఉన్నాయి. కొత్తూరు, ఇబ్రహీంపట్నం వంటి మున్సిపాలిటీలు సిటీకి దూరంగా ఉండటంతో వాటిని విలీనం చేయడం లేదు ప్రభుత్వం.

ప్రతిపాదిత మున్సిపాలిటీలు: పెద్దఅంబర్ పేట, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్ పూర్.

ప్రతిపాదిత కార్పొరేషన్లు: బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట.

ఈ మున్సిపాలిటీల్లో తుక్కుగూడను 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో కలపాలని అక్కడి నాయకులు ఇటీవల ప్రభుత్వానికి విజ్ఝప్తి చేశారు. అయితే, జీహెచ్ఎంసీలో కలపడానికే ప్రభుత్వం మొగ్గుచూపింది.

జనాభా లెక్కలు: 2011 జనాభా లెక్కల ప్రకారం, జీహెచ్ఎంసీ జనాభా 67లక్షల31వేలు.

ప్రస్తుతం జనాభా సంఖ్య కోటీ40లక్షలకు చేరి ఉంటుందని జీహెచ్ఎంసీ అంచనా. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తే సుమారు కోటీ70లక్షలకు చేరుకుంటుందని మున్సిపల్ అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.

త్వరలో చేపట్టే జనగణన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.

హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

ఫొటో సోర్స్, boduppal corporation

ఫొటో క్యాప్షన్, విలీనం జరిగితే లోక్‌సభ స్థానాల జాబితాలో భువనగిరి కూడా చేరనుంది.
హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా రెండు (ఇబ్రహీంపట్నం, మేడ్చల్) నియోజకవర్గాలు జత కలవనున్నాయి.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల లోక్ సభ స్థానాలున్నాయి.

విలీనం జరిగితే రాజకీయ, భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే, లోక్‌సభ స్థానాల జాబితాలో భువనగిరి కూడా చేరనుంది.

హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలీనం తర్వాత వార్డుల సంఖ్య 250-300కు పెరగొచ్చని అధికారు అంచనా.
హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 150 డివిజన్లు ఉన్నాయి. ఇవన్నీ 2009కి ముందు ఏర్పడినవే.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం పూర్తయితే డివిజన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

2009లో డివిజన్‌కు సగటున 36వేల ఓటర్ల చొప్పున విభజన చేశారు. గత 16 ఏళ్లలో జనాభా, ఓటర్లు భారీగా పెరిగారు. 2014, 2020లో జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య పెంచేందుకు కసరత్తు జరిగినా, ముందుకు సాగలేదు. అప్పటి ప్రభుత్వాలు వార్డుల సంఖ్యను యథావిధిగా ఉంచాయి. ఆ మేరకే ఎన్నికలు నిర్వహించాయి.

కొత్త ప్రాంతాల విలీనంతో ఇప్పుడు డివిజన్ల పునర్విభజన చేయక తప్పని పరిస్థితి.

విలీనం తర్వాత కచ్చితంగా పరిపాలన, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పద్మనాభ రెడ్డి చెప్పారు.

''విలీనం తర్వాత వార్డుల సంఖ్య 250-300కు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం మొత్తం ప్రాంతాన్ని ఆరు జోన్లుగా మార్చి, ఎక్కడికక్కడ కమిషనర్లు, కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. వారిపై పర్యవేక్షణకు గ్రేటర్ హైదరాబాద్ పరంగా మరో కమిషనర్ ఉంటే పాలన పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది'' అని సూచించారు.

దీనిపై మున్సిపల్ అధికారులు గతేడాది కొంత కసరత్తు చేశారు. సమీప ప్రాంతాలు విలీనం చేసిన తర్వాత జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా చేయాలని ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం పూర్తికాకపోవడంతో ఇది ముందుకు సాగలేదు.

హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలీన ప్రతిపాదనను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఆమోదించింది.
హైదరాబాద్, మహానగరం, మున్సిపాలిటీ, కార్పొరేషన్

హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలను యథావిధిగా మరో విడత వరకు ఉంచాలని నార్సింగి, మణికొండ మున్సిపల్ నాయకులు ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.

ఈ మున్సిపాలిటీలన్నీ 2016-17లో ఏర్పాటు చేశారు. 2020 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఒక విడత పాలకవర్గాల కాలం ముగిసింది. వీటన్నింటినీ విలీనం చేయడం కారణంగా పన్నుల భారం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది.

''పన్నులు పెరుగుతాయనే ప్రచారం ఉంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'' అని బోడుప్పల్ కార్పొరేషన్ ద్వారకానగర్ కాలనీ బ్లాక్ అధ్యక్షుడు పి.మూర్తి అన్నారు.

ప్రభుత్వానికి పన్ను శ్లాబులు పెంచే ఆలోచన లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)