పెరుగు నుంచి కేక్ వరకు.. మనం రోజువారీ తినే పదార్థాల్లో దాగి ఉన్న చక్కెర ఎంత ప్రమాదకరం? తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గ్లోబల్ జర్నలిజం టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
మనం రోజువారీ ఆహారంలో ఎంతమేర చక్కెర తీసుకుంటున్నామనే దానిపై శ్రద్ధ వహించాలి. తెలియకుండానే మనం అధిక మోతాదులో చక్కెరను తీసుకుంటూ ఉండవచ్చు. అధిక చక్కెర టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతుంది.
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు గణనీయంగా మారాయి. వాటితో పాటు ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలూ వేగంగానే పెరుగుతున్నాయి.
'ది లాన్సెట్ మెడికల్ జర్నల్'లో ప్రచురించిన డేటా ప్రకారం, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా వృద్ధులు, మూడో వంతు పిల్లలు, కౌమార దశలోని బాలలు, యువత అధిక బరువు లేదా ఊబకాయంతో ఉంటారని అంచనా.
చాలా దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాయి.
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 58.9 కోట్ల మందికి డయాబెటిస్ ఉంది. వీరిలో 10.7 కోట్ల మంది ఆగ్నేయాసియాలో ఉన్నారు. 2050 నాటికి ఆగ్నేయాసియాలో డయాబెటిస్ బాధితుల సంఖ్య 18.5 కోట్లకు చేరుతుందన్నది ఐడీఎఫ్ అంచనా.
శరీర బరువు నిర్వహణలో ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి ఏమిటంటే, మనం ప్రతిరోజూ తినే పెరుగు నుంచి బ్రెడ్ వరకు, కెచప్ నుంచి స్మూతీల వరకు, వాటిలో ఎంత చక్కెర ఉందో మనలో చాలామందికి తెలియకపోవడం.
ఇక్కడ మనం వాటిలో దాగి ఉన్న చక్కెర గురించి మాట్లాడుతున్నాం.


ఫొటో సోర్స్, Getty Images
'ఫ్రీ షుగర్' అంటే ఏమిటి?
ఓట్స్, గింజలు, విత్తనాలు, తేనె, ఇతర తీపి పదార్థాలతో తయారుచేసిన గ్రానోలా.. పెరుగు లేదా పండ్ల రసం ఆరోగ్యకరమైన అల్పాహారంగా అనిపించవచ్చు. కానీ, మీ అల్పాహారాల వల్ల మీరు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫార్సు చేసిన రోజువారీ మోతాదు కంటే ఎక్కువ చక్కెరను వినియోగించి ఉండవచ్చు.
యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, పెద్దలు రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువగా "ఫ్రీ షుగర్స్' తీసుకోకూడదు.
ఫ్రీ షుగర్ అనేది ఆహారం లేదా పానీయాలను తీపిగా మార్చడానికి జోడించే అదనపు చక్కెరను సూచిస్తుంది. తేనెలోని చక్కెరను కూడా ఫ్రీ షుగర్‌గానే పరిగణిస్తారు. ఈ ఫ్రీ షుగర్స్ పండ్ల రసాలలో కూడా ఉంటాయి.
మీ శరీరంలో చక్కెర ప్రభావం.. అది ఆహారంలో ఏ రూపంలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు పండ్లు లేదా కూరగాయలు తిన్నప్పుడు, వాటిలోని పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు హానికరమైన రీతిలో పెరగకుండా నిరోధిస్తుంది.
అయితే, మీరు అదనపు చక్కెరలు లేదా ఫ్రీ షుగర్స్ తీసుకున్నప్పుడు, అవి మీ రక్తంలోకి త్వరగా, తరచుగా పెద్ద మొత్తంలో చేరతాయి. దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది పండ్లు లేదా కూరగాయల రసాలు తాగినా జరుగుతుంది. ఎందుకంటే, రసం తీయడం వల్ల పండ్ల నుంచి ఫైబర్ పోతుంది.
రక్తంలోని చక్కెర స్థాయిలో ఈ భారీ హెచ్చుతగ్గులు కాలక్రమేణా పదేపదే సంభవించినప్పుడు, మరో సమస్య తలెత్తుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్‌కు మీ కణాల ప్రతిస్పందన తగ్గుతుంది.
మునుపటి తరాలతో పోలిస్తే, ఇప్పుడు మన ఆహారంలో చక్కెర నిష్పత్తి గణనీయంగా పెరిగింది. దీనికి ఒక కారణం ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడమే.
నిల్వ ఉంచిన మాంసం, చేపలు వంటి వాటిని కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా లేదా రుచిగా ఉండేలా మారుస్తారు. ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా అదనపు ఉప్పు, చక్కెర జోడిస్తారు.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ అవుతాయి. వాటిలో మీకు మీ వంటగదిలో కనిపించే అవకాశం లేని పదార్థాలు (ఇంగ్రీడియెంట్స్) ఉంటాయి.
ఒక ఆహార పదార్థంలో అలాంటివి ఐదు కంటే ఎక్కువ పదార్థాలు (ఇంగ్రీడియెంట్స్) ఉంటే, అది అల్ట్రా-ప్రాసెస్డ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఆహార పదార్థాలపై శ్రద్ధ వహించండి. హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఫ్రూట్ జ్యూస్ కాన్సెంట్రేట్, తేనె, అగేవ్ నెక్టార్... ఇవన్నీ చక్కెరకు ప్రత్యామ్నాయ పేర్లే.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన షుగర్ వినియోగం...
చక్కెర మన ఆరోగ్యానికి మంచిది కాదనే అవగాహన పెరుగుతున్నప్పటికీ, మనం గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ప్రతి రోజూ ఎక్కువ చక్కెరను వినియోగిస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం, చక్కెర అత్యధిక తలసరి వినియోగం ఉన్న దేశం అమెరికా. భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేషియాలలో కూడా చక్కెర వినియోగం వేగంగా పెరుగుతోంది.
ది లాన్సెట్ మెడికల్ జర్నల్ 200 దేశాల్లో అధిక బరువు, ఊబకాయం గురించిన డేటాను మార్చిలో ప్రచురించింది. పరిశోధనల ప్రకారం, ప్రపంచ ఊబకాయ ధోరణులు ఇలాగే కొనసాగితే, 2050 నాటికి అధిక బరువు, ఊబకాయం ఉన్న వృద్ధుల సంఖ్య పురుషులలో సుమారు 57.4 శాతం, మహిళలలో 60.3 శాతానికి చేరుకుంటుంది.
రానున్న 25 ఏళ్లలో, అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడేవారు అత్యధికంగా చైనా, భారత్, అమెరికాలో ఉంటారని అంచనా. చైనాలో 62.7 కోట్లు, భారత దేశంలో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లు. ఈ అంచనాలు ఆయా దేశాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారాన్ని పెంచుతాయి.
సబ్-సహారా ఆఫ్రికాలో కూడా అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్న ప్రజల సంఖ్య 250 శాతం కంటే ఎక్కువగా పెరుగుతుంది. అంటే, 52.2 కోట్లకు చేరుతుంది. ఈ పెరుగుదలలో నైజీరియా అగ్రస్థానంలో ఉంది. అక్కడ అధిక బరువు, ఊబకాయం ఉన్న ప్రజల సంఖ్య మూడు రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా వేశారు.
అయితే, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు, మన ఆరోగ్య భవిష్యత్తును నిర్ణయించేందుకు కొన్ని చర్యలు చేపట్టవచ్చు.
ఉదాహరణకు, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ) ప్రకారం, ఇక్కడున్న వృద్ధుల్లో 63 శాతం మంది రోజూ చక్కెర పానీయాలు తీసుకుంటారు. స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలతో పాటు ఈ పానీయాలను నివారించడం వల్ల దేశ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.
అలాగే, మీరు తీసుకునే రోజువారీ మొత్తం కేలరీలలో 10 శాతం కంటే తక్కువకు చక్కెరను పరిమితం చేయాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేస్తోంది. మరింత మెరుగైన ఆరోగ్యం కోసం, వాటిని 5 శాతం (రోజుకు సుమారు ఆరు టీస్పూన్ల) కంటే తక్కువగా ఉంచాలని సూచిస్తోంది.
అయితే, అనేక ఆహార పదార్థాలలో సహజంగా లభించే చక్కెర పరిమాణం కూడా కలిపి ఈ ఆరు టీస్పూన్లలోపు ఉండాలి.
చక్కెర స్థాయిలతో పాటు, మీరు అధిక బరువుతో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కూడా పర్యవేక్షించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఊబకాయానికి బీఎంఐ సరైన కొలమానమేనా?
ప్రపంచవ్యాప్తంగా వైద్యులు బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్)ను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మీ ఎత్తు, బరువు ఆధారంగా దీనిని సులభంగా లెక్కించవచ్చు.
కానీ, ఇదే సంపూర్ణమైన కొలమానంగా చెప్పలేం, దానికీ కొన్ని పరిమితులు ఉన్నాయి.
ఒక వ్యక్తి ఎత్తును బట్టి అధిక బరువు ఉన్నారా లేదా అని బీఎంఐ సూచిస్తుంది. కానీ అధిక బరువు కొవ్వు వల్ల వచ్చిందా, కాదా అనేది అది సూచించదు.
శరీరంలోని వివిధ భాగాలలో, ముఖ్యంగా పొట్ట చుట్టూ లేదా ఇతర భాగాల చుట్టూ అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, బీఎంఐ ఆ కొవ్వు రకాలను కూడా పరిగణనలోకి తీసుకోదు.
వ్యక్తి వయస్సు, లింగం, శారీరక శ్రమ వంటివి కూడా బీఎంఐ పరిగణించదు.
యూకేలో కొన్ని ఆసియా, ఇతర మైనారిటీ సమూహాలకు చెందిన కొందరికి బీఎంఐ తక్కువగా ఉన్నప్పటికీ, గుండె జబ్బులు లేదా టైప్ 2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అందువల్ల, ఈ ఏడాది జనవరిలో యూకేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (ఎన్ఐసీఈ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ సమూహాల కోసం, ఎవరైనా అధిక బరువుతో ఉన్నారా లేదా, ఊబకాయంతో ఉన్నారా అని నిర్ధరించడానికి ఉపయోగించే బీఎంఐ పరిమితిని తగ్గించింది.
ఎన్ఐసీఈ కొత్త మార్గదర్శకాలు.. కొవ్వు, కండరాల బరువు సహా శరీర నిర్మాణంలో వివిధ సమూహాలకు చెందిన వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని కూడా ఎత్తిచూపాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














