సూర్యచంద్రులకు, నక్షత్రాలకు అత్యంత దగ్గరగా ఉన్న భూమి మీద ప్రదేశం ఏదో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
భూమి మీద నుంచి అంతరిక్షానికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
భూమి మీద ఎత్తైన పర్వతం ఏదంటే ఎవరెస్ట్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ ఎత్తు సముద్ర మట్టం నుంచి చూస్తే 8,848 మీటర్లు ఉంటుంది.
అయితే ఒక పర్వతాన్ని, దాని పునాది నుంచి శిఖరం వరకు కొలిచినప్పుడు పొడవైన పర్వతం ఏదంటే మాత్రం మౌనా కియా అనే సమాధానం వస్తుంది.
హవాయి ద్వీపంలో ఈ పర్వతం, దాని బేస్ నుంచి చివరి అంచు వరకు చూస్తే 10, 210 మీటర్ల ఎత్తు ఉంది.
అయితే సముద్ర మట్టం నుంచి చూస్తే దీని ఎత్తు 4207 మీటర్లే. ఈ పర్వతపు దిగువ భాగం కొంతమేర పసిఫిక్ సముద్రం లోపల మునిగి ఉంది.

ఎత్తైన పర్వతాల విషయంలో ఎవరెస్ట్‌తోనూ, మౌనా కియాతోనూ పోటీ పడుతోంది మౌంట్ చింబరాజో.
ఈక్వెడార్‌లోని ఆండీస్ పర్వతశ్రేణుల్లో నిద్రాణమై ఉన్న అగ్నిపర్వతమే మౌంట్ చింబరాజో.
సముద్ర మట్టం నుంచి చూస్తే దీని ఎత్తు 6268 మీటర్లే. అంటే ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది.
కానీ, భూమి మీద 0 డిగ్రీల అక్షాంశం కేంద్రంగా చూస్తే చింబరాజో ఎవరెస్ట్ శిఖరం కంటే 2072 మీటర్ల కంటే ఎత్తైనదని నేషనల్ ఓషియన్ సర్వీస్ చెబుతోంది.
అందుకే ఇది భూమి మీద అంతరిక్షానికి, సూర్యచంద్రులు, నక్షత్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది.

ఫొటో సోర్స్, Getty Images
చింబరాజో ఎక్కడ ఉంది?
మౌంట్ చింబరాజో ఆండీస్ పర్వతశ్రేణుల్లో నిద్రాణమై ఉన్న అగ్ని పర్వతం.
ఈక్వెడార్ రాజధాని క్విటోకి దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పర్వతమైనప్పటికీ పైకి వెళ్లే కొద్దీ చాలా వెడల్పుగా ఉంటుంది. ఎక్కువగా మంచుతో కప్పి ఉన్న ఈ పర్వతంపై శాస్త్రవేత్తలు, పర్వాతారోహకులు, భౌగోళిక శాస్త్రవేత్తలకు ఆసక్తి ఎక్కువ.
భూమధ్య రేఖ వద్ద భూమి ఎత్తుగా ఉండటం వల్ల చింబరాజో పునాది సహజంగానే ఎత్తైన ప్రాంతంలో ఉంది.
సముద్ర మట్టం నుంచి చూస్తే ఆండీస్ పర్వతశ్రేణిలో చింబరాజో 39వ పొడవైన పర్వతం. 19వ శతాబ్దంలో ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైన పర్వతంగా భావించేవారు.
1802లో అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఆయన పర్వత శిఖరం వరకు చేరుకోలేదు.
అయితే బ్రిటిష్ పర్వతారోహకుడు ఎడ్వర్డ్ వింపర్1880లో చింబరాజో పర్వత శిఖరాన్ని అధిరోహించారు.
పర్యటక శాఖ ప్రోత్సాహంతో చింబరాజో పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రతీ ఏటా 500 మంది పర్వతారోహకులు వస్తున్నారని ఈక్వెడార్ పర్యటక శాఖ మంత్రి శాంటియాగో గ్రాండా చెప్పారు.
ఈ పర్వతాన్ని అధిరోహించడానికి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి అనువైన కాలం.

ఫొటో సోర్స్, ecuador.travel/en/
ఎలా నిర్ధరించారు?
భూమి గుండ్రంగా ఉన్నప్పటికీ అది పరిపూర్ణ గోళం కాదు. ధ్రువాల దగ్గర చదునుగా, భూమధ్య రేఖ దగ్గర ఉబ్బినట్లుగా ఉంటుంది.
భూమిని ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా విభజిస్తూ అక్షాంశాలను గీశారు. రెండు ధ్రువాలకు సరిగ్గా మధ్యన 0 డిగ్రీల వద్ద భూమధ్య రేఖ ఉంది. దీని చుట్టు కొలత 40,075 కిలోమీటర్లు.
చింబరాజో పర్వతం భూమధ్య రేఖ నుంచి దక్షిణంవైపున 1.28 డిగ్రీల అక్షాంశం వద్ద దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
భూ మధ్య రేఖ కేంద్రంగా గీసిన అక్షాంశాల్లో రెండు అక్షాంశాల మధ్య దూరం 69 మైళ్లు.
ఎవరెస్ట్ పర్వతం భూమధ్య రేఖ నుంచి 27.986065 డిగ్రీల అక్షాంశంపై ఉంది.
అంటే భూమధ్య రేఖ నుంచి ఇది దక్షిణం వైపున 4,463 కిలోమీటర్ల దూరంలో ఉంది.
భూమధ్య రేఖ నుంచి చూస్తే చింబరాజో, ఎవరెస్ట్ మధ్య 4313 కిలోమీటర్ల దూరం ఉంది.
భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటంవల్ల చింబరాజో పర్వతం ఎవరెస్ట్ కంటే ఎత్తులో, ఎవరెస్ట్ కన్నా చంద్రుడికి దగ్గరగా ఉంది.
భూమధ్య రేఖ నుంచి దూరం వెళ్లే కొద్దీ భూమి చుట్టు కొలత తగ్గిపోతుంది.
సముద్ర మట్టం నుంచి ఎవరెస్టు ఎత్తుగా ఉన్నప్పటికీ, భూ ఉపరితలం నుంచి చూస్తే చింబరాజో కంటే అది తక్కువ ఎత్తులో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భూమికి అంతరిక్షాానికి మధ్య..
భూమి మీద ఎత్తైన ప్రాంతం, అక్కడ ఉన్న పర్వతాల్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల తర్వాత అంతరిక్షం మొదలవుతుంది.
భూమికి, అంతరిక్షానికి మధ్య ఉన్న ఊహాత్మక సరిహద్దు రేఖను కర్మన్ లైన్ అంటారు.
ఈ ఊహాత్మక రేఖకు ఫిజిక్స్ శాస్త్రవేత్త థియోడర్ వాన్ కర్మన్ పేరు పెట్టారు.
భూమి వాతావరణానికి, అంతరిక్ష వలయానికి ఇదే సరిహద్దు. కర్మన్ లైన్ దాటిన తర్వాత గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతుంది.
భూమి మీద ఏ ప్రాంతం ఈ కర్మన్ లైన్‌కు దగ్గరగా ఉందని శాస్త్రీయంగా పరిశోధించి చూసినప్పుడు అది ఈక్వెడార్‌లోని చింబరాజో పర్వత శిఖరం అని తేలినట్లు అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన నేషనల్ ఓషియన్ సర్వీస్ ప్రకటించింది.
భూమి కేంద్రం ఆధారంగా తీసుకుంటే ఎవరెస్ట్ మీద నిలబడిన దానితో పోలిస్తే చింబరాజో పర్వతం మీద నిలబడినప్పుడు 2067 మీటర్ల ఎత్తులో ఉంటారు.
భూమధ్య రేఖ వద్ద భూమి ఉబ్బినట్లుగా ఉండటం వల్ల వివిధ ప్రాంతాల ఎత్తుకు సంబంధించిన కొలతలు ప్రభావితం అవుతాయి.
నేషనల్ ఓషియన్ సర్వీస్ ప్రకారం భూమి కేంద్రంగా చూస్తే ఈక్వెడార్‌కు చెందిన మౌంట్ చింబరాజో భూమి మీద మరే ఇతర ప్రాంతంకన్నా ఎత్తైనదిగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్షానికి దగ్గరగా అంటే...
అంతరిక్షం నుంచి చూస్తే ఈ ప్రాంతం కనిపిస్తుందని లేదా ఈ ప్రాంతం భూమి వాతావరణాన్ని దాటి పోయిందనో లేదా అంతరిక్ష బాహ్య వలయానికి సమీపంలో ఉందనో కాదు.
భూమి భౌగోళిక ఆకారం, గురుత్వాకర్షణక్షేత్రం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా కదలికలను కొలిచే జియోడెసీ ఆధారంగా చింబరాజో పర్వతాలన్నింటి కంటే చాలా ఎత్తులో ఉందని నిర్ణయించారు.
భూమధ్య రేఖ వద్ద ఉన్న ప్రాంతాలు సముద్ర మట్టంతో సంబంధం లేకుండానే భౌతికంగా ధ్రువాల వద్ద ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి.
మౌంట్ చింబారాజో ఈ సూత్రానికి సంపూర్ణ ఉదాహరణ. భూమధ్య రేఖపై దాని స్థానం, గణనీయమైన ఎత్తు కారణంగా అది అంతరిక్షానికి దగ్గరగా ఉన్న శిఖరంగా గుర్తింపు పొందింది.
పెరూలోని హువాస్కరన్, టాంజానియాలోని కిలిమంజారో పర్వతాలు కూడా ఎత్తైనవే. కానీ భూ కేంద్రం ఆధారంగా చూస్తే చింబారాజోకున్న అడ్వాంటేజ్ వీటికి లేదు.
మామూలుగా చూస్తే వీటి మధ్య పెద్దగా తేడా ఉన్నట్లు కనిపించకున్నా, శాస్త్రీయంగా కొలిచినప్పుడు ఇది చాలా కీలక అంశంగా నిలుస్తోంది.
ప్లానెటరీ జియోమెట్రీలో ఎత్తు, దూరం ఆధారంగా పరిశోధకులు అవగాహనకు రావడంలో ఇవే ముఖ్యం.
ప్రపంచంలో చాలా కాలంగా ఎత్తైన ప్రదేశాల గురించి ఉన్న వాదనలకు శాస్త్రీయ దృక్పథాన్ని అందిస్తుంది.
ప్రపంచంలోకెల్లా ఎత్తైనది అనే దాన్ని కొలత ఆధారంగా నిర్ణయిస్తుంది.
జియోడెసీతో ఉపగ్రహ డేటా, గ్లోబల్ పొజిషనింగ్ నెట్‌వర్క్ సాయంతో భూమి ఉపరితలం, ఆకారం, కొలత విషయంలో కచ్చితమైన కొలతలు సేకరించవచ్చు.
ఈ కొలతల సాయంతో వాతావరణ నమూనాలు, భూమి లోపల పొరల్లో కదలికలు, సముద్ర మట్టాల్లో మార్పులను అంచనా వేయవచ్చు.
ఈక్వెడార్ విషయంలో శాస్త్రీయంగా నిరూపణ అయిన ఈ వాస్తవం ఆ దేశానికి ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది.
చింబరాజో పర్వతాన్ని అధిరోహించడం ద్వారా పర్వతారోహకులు పర్వత సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడంతో పాటు భూమి మీద నుంచి అంతరిక్షానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికిి చేరుకున్నామనే భావనను ఆస్వాదిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














