డీఎన్ఏ టెస్ట్ కోసం ఎవరు అడగొచ్చు, ఏయే సందర్భాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2017లో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన తల్లీబిడ్డల హత్య కేసు నిందితుడిని ల్యాప్‌టాప్‌పై ఉన్న డీఎన్ఏ ఆధారంగా గుర్తించారు.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలని అక్కడి పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.
అలాగే, కర్నూలు సమీపంలో ఇటీవల జరిగిన వేమూరి కావేరీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి డీఎన్ఏ పరీక్షలు చేసి, 18మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి తన తండ్రి అంటూ రోహిత్ శేఖర్ అనే యువకుడు వేసిన పిటిషన్ విచారణలో భాగంగా అప్పట్లో డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. ఈ కేసులో కూడా డీఎన్ఏనే కీలకంగా మారింది. ఆ పరీక్షలో రోహిత్ శేఖర్ ఎన్డీ తివారీ కొడుకేనంటూ తేలింది.
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌లో కొందరు వ్యక్తులు తమ పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలను వాడుతున్నారు.

అసలేంటీ డీఎన్‌ఏ?
డీఎన్ఏ పరీక్ష ఆధారంగా నేరాలను పరిష్కరించడం, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాన్ని ధ్రువీకరించడం, వ్యాధులను గుర్తించడం వంటివి చేస్తున్నారు.
డీఎన్ఏ అంటే డీ ఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ భూమిపై నివసించే ప్రతి జీవిలోని ప్రతి కణంలో ఉండే అతి ముఖ్యమైన జన్యుపదార్థం ఇది.
జీవి ఎదుగుదల, మనుగడ, పునరుత్పత్తికి అవసరమైన సమస్త జన్యు సమాచారం ఇందులో ఉంటుంది.
డీఎన్ఏ అనేది ప్రతి జీవి శరీరానికి సంబంధించిన ఒక ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది. అంటే, శరీరంలోని కణాలు ఏం చేయాలో చెప్పే అన్ని సూచనలనూ డీఎన్ఏ ఒక కోడ్ మాదిరి అందిస్తుంటుంది.
మనుషుల్లోని కణాల్లో సగం డీఎన్ఏ తల్లి నుంచి, సగం తండ్రి నుంచి వస్తుంది. అందుకే తల్లిదండ్రుల ఇద్దరి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తుంటాయి. రంగు, రూపు, జుట్టు.. ఇలా అన్నింటికీ డీఎన్ఏనే కారణం.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని కావెండిష్ ల్యాబొరేటరీలో అమెరికన్ బయాలజిస్ట్ జేమ్స్ వాట్సన్, బ్రిటిష్ రీసెర్చ్ పార్టనర్, ఇంగ్లిష్ ఫిజిసిస్ట్ ఫ్రాన్సిస్ క్రిక్ కలిసి 1950లలో మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉండే డీఎన్‌ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని గుర్తించారు.
జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్‌లతో పాటు డీఎన్ఏపై అధ్యయనం చేసిన మరో శాస్త్రవేత్త మారిస్ విల్కిన్స్‌లకు 1962లో నోబెల్ పురస్కారం లభించింది.
ప్రతి ఒక్కరి డీఎన్ఏ ఒక ప్రత్యేకమైనది. ఒకరి డీఎన్ఏ మరొకరి డీఎన్ఏతో మ్యాచ్ కాదు. అయితే, కవలలు మాత్రం ఒకే రకమైన డీఎన్ఏతో ఉండొచ్చు.
ఏ ఇద్దరి మధ్య అయినా ఎంత దగ్గర బంధుత్వం ఉంటే, వారి డీఎన్ఏ నమూనాలు అంత దగ్గర పోలికలతో ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ జెనెటిక్స్ ఎడ్యుకేషన్ తన రిపోర్టులో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
డీఎన్ఏ పరీక్ష అంటే ఏమిటి?
డీఎన్ఏ పరీక్ష అనేది ఒక వ్యక్తి జన్యు పదార్థాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడమే. ఈ విశ్లేషణ ద్వారా వారి బయలాజికల్ రిలేషన్‌షిప్స్ (రక్త సంబంధీకులు) గురించి మాత్రమే కాకుండా, జన్యుపరమైన ఆరోగ్య అంశాల గురించి కూడా తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా, నేరాలను కనిపెట్టడం, న్యాయపరమైన సమస్యల పరిష్కారం, ప్రమాద సమయాల్లో శరీరాల గుర్తింపు వంటివి సులభం అవుతాయి.
ప్రజల మధ్య డీఎన్ఏ నిర్మాణంలోని చిన్నపాటి తేడాలను, సారూప్యతలను డీఎన్ఏ పరీక్ష వాడుతూ గుర్తిస్తుంటారని ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ జెనెటిక్స్ ఎడ్యుకేషన్ తన రిపోర్టులో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
నేరస్తులను ఎలా కనిపెడతారు?
ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు నేరస్తులను పట్టుకునేందుకు డీఎన్ఏ టెస్టులను ఉపయోగిస్తుంటారు. క్రైమ్ సీన్‌లో దొరికిన శాంపిల్స్, అనుమానితుల నమూనాలను పోల్చిచూస్తూ ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు.
క్రైమ్ సీన్‌లో దొరికిన కణాల నుంచి డీఎన్ఏను తీసి, వాటిని అనాలసిస్ చేసి, డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేస్తారు.
ఈ డీఎన్ఏ ప్రొఫైల్‌ను డాటాబ్యాంకులు లేదా డాటాబేస్‌లలో స్టోర్ చేసి ఉన్న డీఎన్ఏ ప్రొఫైల్స్‌తో లేదా అనుమానితుల ప్రొఫైల్స్‌తో పోల్చిచూస్తారు.
ఒకవేళ ఈ రెండూ సరిపోలితే, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.
కుటుంబ వివాదాలు ఎలా పరిష్కరిస్తారు?
మాతృత్వం, పితృత్వానికి సంబంధించిన వివాదాలను డీఎన్ఏ పరీక్ష ద్వారా పరిష్కరిస్తుంటారు.
పూర్వీకుల మూలాలను తెలుసుకునేందుకు కూడా ఈ పరీక్షనే వాడతారు. అలాగే, పలు రకాల వ్యాధులను కనుగొనేందుకూ డీఎన్ఏ కీలకంగా మారుతుంది.
ఫ్యామిలీ కేసుల్లో, వివాహేతర సంబంధాల విషయంలో డీఎన్ఏ పరీక్షను వాడుతుంటారు. దీన్నే పెటర్నిటీ, మెటర్నిటీ డీఎన్ఏ పరీక్ష అంటారు. పుట్టిన బిడ్డ తన బిడ్డేనా కాదా? అని తెలుసుకునేందుకు, తన తండ్రి/తల్లి ఇతనే అని చెబుతున్న వాదన నిరూపించుకునేందుకు ఈ డీఎన్ఏ పరీక్షలను వాడుతుంటారు.
అత్యాచారం, హత్య వంటి క్రిమినల్ కేసులు : అత్యాచారం కేసులో గోళ్లల్లో ఇరుక్కుపోయిన ఎపిథీలియల్ సెల్స్ ఆధారంగా డీఎన్ఏ పరీక్ష చేస్తుంటామని ట్రూత్‌ల్యాబ్స్ కు చెందిన ఓ సైంటిస్టు వెల్లడించారు. ఆయన తన పేరు రాయడానికి అంగీకరించలేదు.
ట్రూత్ ల్యాబ్స్ అనేది హైదరాబాద్‌లో ఏర్పాటైన ఒక స్వతంత్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2007 అక్టోబర్ 2న కేంద్ర, రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో పనిచేసిన కొందరు రిటైర్డ్ డైరెక్టర్లు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.
డీఎన్ఏ టెస్టుల కోసం శాంపిల్ ఏ కొంచెం దొరికినా సరిపోతుందని, దాని నుంచి డీఎన్ఏ సేకరిస్తామని ఆ సైంటిస్టు తెలిపారు. ఏ వస్తువుపై నైనా కాస్త గట్టిగా టచ్ చేస్తే ఎపిథీలియల్ సెల్స్ పడతాయనీ, వీటి ఆధారంగా డీఎన్ఏ పరీక్ష చేస్తుంటారని ఆయన వెల్లడించారు.
డీఎన్ఏ అనేది ఒక సైన్స్ అయితే, డీఎన్ఏ ఫింగర్‌ప్రింట్ అనేది దానిలో ఒక పుస్తకం లాంటిదని ఆయన పేర్కొన్నారు.
అన్ని క్రిమినల్ కేసుల్లో చాలామటుకు డీఎన్ఏ పరీక్ష చేస్తుంటారని అన్నారు.
ఫెర్టిలిటీ, సరోగసీ కేసుల్లో కూడా డీఎన్ఏ పరీక్షను వాడుతుంటారని ట్రూత్‌ల్యాబ్స్ సైంటిస్టులు చెప్పారు. అయితే, ఫ్యామిలీ కేసుల్లో డీఎన్ఏ పరీక్ష చేయాలంటే, ఎవరి డీఎన్ఏనైతే పరీక్షించాలనుకుంటున్నారో వారి అనుమతి తప్పనిసరి అని ట్రూత్ ల్యాబ్స్ సైంటిస్టులు చెబుతున్నారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం, డీఎన్ఏ టెస్టును ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారంటే...
మృతదేహాల గుర్తింపు : కాలిపోయిన శరీరాన్ని, మృతదేహాన్ని కూడా డీఎన్ఏ పరీక్ష ద్వారా కనుగొనవచ్చు. ఎముకల గుజ్జు, పళ్లు వంటి వాటిల్లో.. చాలాకాలం డీఎన్ఏ దొరుకుతుంది. వీటి ద్వారా పరీక్షలు చేస్తారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అవుతుంటాయి, కానీ క్రైమ్ సీన్ బాగా ధ్వంసమైతే కాస్త కష్టమవుతుంది.
వ్యాధుల గుర్తింపు: కొన్నిసార్లు జన్యుపరంగా వచ్చే వ్యాధులను ముందుగా తెలుసుకునేందుకు కూడా ఈ పరీక్ష వాడుతుంటారు.
అంటే, ఇంట్లో తల్లికి లేదా తండ్రికి క్యాన్సర్ లాంటివి ఉంటే, అవి పిల్లలకు వచ్చే అవకాశం ఉందా? అని ముందుగా తెలుసుకోవాలంటే ఈ పరీక్ష చేయించుకోవచ్చు.
దీన్ని జీనోమ్ టైపింగ్ అంటారు.
అవయవ మార్పిడి కేసులు: కర్ణాటకలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు కుటుంబ సభ్యుల అవయవాన్నే వాడుతున్నారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్ష తప్పనిసరి.

ఫొటో సోర్స్, Getty Images
శరీరంలోని ఏ భాగం నుంచి డీఎన్ఏ సేకరించవచ్చు?
- బకల్ స్వాబ్ (బుగ్గ లోపలి కణాల నుంచి )
- రక్త నమూనాలు
- జుట్టు
- ఎముకలు
- సెమెన్
- పళ్లు
వీటి నుంచే సాధారణంగా డీఎన్ఏను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు.
డీఎన్ఏ పరీక్షకు టైమ్ లిమిట్ ఉంటుందా?
‘‘డీఎన్ఏ పరీక్షకు ఎలాంటి టైమ్ లిమిట్ ఉండదు. ఏ కాలానికి చెందిన మనిషి, జంతువులనైనా డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధరించవచ్చు. అంటే, వారు ఏ జాతికి చెందిన వారు, వారి రంగు ఏంటి, ఎంతకాలం నాటిది వంటివన్నీ కనుగొనవచ్చు’’ ట్రూత్‌ల్యాబ్స్ సైంటిస్టు వెల్లడించారు.
పాతకాలానిది అయితే ఇవన్నీ చూస్తామన్నామనీ, కొత్తవి అయితే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల డీఎన్ఏ బట్టి వారి డీఎన్ఏను పోల్చిచూస్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరైనా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవచ్చా?
దీనికి సంబంధించిన నిబంధనలు దేశాన్ని దేశాన్ని బట్టి మారుతుంటాయి. భారత్‌లో డీఎన్ఏ పరీక్షలకు సంబంధించి అనేక నిబంధనలు, కఠినమైన నియమావళి, సుప్రీంకోర్టు సూచనలు ఉన్నాయి.
డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలంటే దానికి స్పష్టమైన కారణం ఉండాలి. ఇది చాలా కీలకమని ట్రూత్‌ల్యాబ్స్ సైంటిస్టు చెప్పారు.
సమ్మతి, కోర్టు లేఖ తప్పనిసరి
వ్యక్తిగత కేసుల్లో నమూనా ఇవ్వాల్సిన వారి సమ్మతి తప్పనిసరని, లీగల్ ప్రొసీడింగ్స్ సమయంలో కోర్టు నుంచి కచ్చితంగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందని ట్రూత్‌ల్యాబ్స్ సైంటిస్టు చెప్పారు.
ఉదాహరణకు క్రిమినల్ కేసుల్లో కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ల్యాబొరేటరీల్లో కూడా సమ్మతి తీసుకునే ఈ పరీక్ష చేస్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డాటా గోప్యత చాలా అవసరం
డీఎన్ఏ పరీక్షలో డాటా గోప్యత చాలా అవసరమని ట్రూత్‌ల్యాబ్స్ సైంటిస్టులు చెప్పారు.
రాజ్యాంగంలోని గోప్యత హక్కు (రైట్ టూ ప్రైవసీ) కింద డాాటాను స్టోర్ చేస్తామని తెలిపారు.
డాటా లీక్ కానంత వరకు డీఎన్ఏ పరీక్షలో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదన్నారు.
డీఎన్ఏ డాటా నిల్వ చేయడం ప్రమాదమా?
వివిధ రకాలుగా ఈ డీఎన్ఏ ఉపయోగపడడంతో చాలా దేశాల ప్రభుత్వాలు దీనికోసం ప్రత్యేకంగా ఫోరెన్సిక్ డాటా బేస్ ఏర్పాటు చేసి, డీఎన్ఏ వివరాలు నిల్వ చేస్తున్నాయి. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగిస్తున్నారు. యూకే, యూఎస్, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా వంటి చాలా దేశాలు ఈ పనిచేస్తున్నాయి.
అయితే ఈ డీఎన్ఏ ప్రొఫైలింగ్, డాటాబేస్‌ల విషయంలో అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా కోర్టు గదుల్లో డీఎన్ఏ మెటీరియల్‌ను వాడటం, డీఎన్ఏ డాటాబేస్‌ల్లో సమాచారాన్ని స్టోర్ చేయడంపై ప్రశ్నలు వస్తున్నాయి.
- డీఎన్ఏ ప్రొఫైల్స్‌ను స్టోర్ చేయడం గోప్యత ఉల్లంఘన కిందకు వస్తుంది.
- ఈ శాంపిల్స్‌ను ఎలా స్టోర్ చేస్తున్నారు అన్న దానిపై ఆందోళనలు ఉన్నాయి.
- డాటాబేస్‌ల నుంచి డీఎన్ఏ ప్రొఫైల్స్ దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది.
- శాంపిల్ తీసుకున్నప్పటి నుంచి పరీక్ష చేసేంత వరకు, మరో వ్యక్తి డీఎన్‌ఏతో ఈ శాంపుల్‌ను కలవకుండా చూసుకోవాలి.
అనేక అభ్యంతరాలు డీఎన్ఏ స్టోరేజీ గురించి వస్తున్నాయని ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ జెనెటిక్స్ ఎడ్యుకేషన్ తన రిపోర్టులో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
డీఎన్ఏ పరీక్షలపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలేంటి?
అడగగానే డీఎన్ఏ పరీక్షకు ఆదేశించడం కుదరదని, వ్యక్తుల గౌరవాన్ని కాపాడేందుకు, వైవాహిక బంధం ద్వారా జన్మించిన పిల్లల చట్టబద్ధతను పరిరక్షించేందుకు తప్పనిసరిగా కఠినమైన భద్రతలకు లోబడి ఉండాలని తాజాగా సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో రిపోర్టు చేసింది.
ఒక కేసు విచారణ సందర్భంలో న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం, ఇలాంటి పరీక్షలను ఆదేశించే అధికారాన్ని అత్యంత జాగ్రత్తతో న్యాయ ప్రయోజనాలకు తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది.
అలాగే, పెటర్నిటీ పరీక్షలో అందుబాటులో ఉన్న ఇతర విధానాల్లో రుజువు చేయలేని పరిస్థితుల్లో మాత్రమే డీఎన్ఏ పరీక్షకు ఆదేశించాలని ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు 'ది ప్రింట్' కూడా నివేదించింది.
మార్గదర్శకాలేంటి?
నేర పరిశోధనలలో డీఎన్ఏ, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను సరిగ్గా సేకరించడం, నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
కట్టవెల్లై అలియాస్ దివాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు 2025 సందర్భంగా నేర దర్యాప్తులో డీఎన్ఏ ఆధారాల సమగ్రతను నిర్ధరించేందుకు సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాలను జారీ చేసిందని ది ట్రిబ్యూన్ ఇండియా పేర్కొంది.
ఒక జంట హత్య, మహిళపై అత్యాచారం కేసులో మరణశిక్ష పడిన వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ, ఈ కేసులో డీఎన్ఏ ఆధారాల నిర్వహణలో జరిగిన తీవ్రమైన ప్రక్రియ లోపాలను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం గుర్తించినట్లు ట్రిబ్యూన్ కథనం పేర్కొంది.
ఈ కేసు సందర్భంగానే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
అవసరమైన అన్ని ప్రొసీజర్లకు కట్టుబడి డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించాలని, డీఎన్ఏ నమూనాలను సేకరించేటప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్, డేట్, దర్యాప్తు అధికారి, పోలీస్ స్టేషన్ వివరాలు, దానికి సంబంధించిన సెక్షన్, చట్టం, వైద్య నిపుణులు, దర్యాప్తు అధికారి, స్వతంత్ర సాక్షుల సంతకాలు వంటి వాటితో సరైన డాక్యుమెంటేషన్ చేపట్టాలని పేర్కొంది.
డీఎన్ఏ ఆధారాలను సంబంధిత పోలీసు స్టేషన్‌కు లేదా ఆస్పత్రికి తరలించే బాధ్యత దర్యాప్తు అధికారిదే. ఆ తర్వాత సేకరించిన సమయం నుంచి 48 గంటలకు మించకుండా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాలి.
విచారణ పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా డీఎన్ఏ శాంపిల్స్‌ను తెరవడం, మార్చడం, తిరిగి సీల్ చేయడంలాంటివి చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
జంతువులకు కూడా డీఎన్ఏ పరీక్ష చేస్తుంటారా?
జంతువులకు కూడా డీఎన్ఏ పరీక్ష చేస్తుంటారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌లో వన్యప్రాణులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంటారని ట్రూత్‌ల్యాబ్స్ సైంటిస్టు చెప్పారు.
అంతరించిపోయే జాతులను గుర్తించేందుకు, వాటికున్న వ్యాధుల గురించి తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్ష చేపడుతుంటారని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














