నిఠారీ హత్యల కేసు: సురీందర్ కోలి విడుదల తరువాత ‘మా పిల్లలను చంపింది ఎవరు?’ అంటున్న తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రేరణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
న్యాయాన్ని ఆశిస్తూ.. రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోయాయి. పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. ఇప్పుడు ఇదంతా నిఠారీ హత్యల బాధిత కుటుంబాలకు అర్థరహితంగా మారిపోయింది.
నిఠారీ హత్యల కేసులో ప్రధాన నిందితుడైన సురిందర్ కోలిని ఈ కేసులకు సంబంధించి నవంబర్ 11న జరిగిన తుది విచారణలో సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
అంతకుముందు కోర్టులు సురిందర్ కోలిని దోషిగా నిర్ధరించి, శిక్ష విధింపునకు పరిగణనలోకి తీసుకున్న ఆధారాలు చట్టవిరుద్ధమైనవిగా, నమ్మశక్యం కానివిగా, పరస్పరం విరుద్ధమైనవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
జైలు నుంచి సురిందర్ కోలి విడుదలైన ఫోటోలను చూస్తూ మాట్లాడిన బాధితుల కుటుంబాలు.. ''ఒకవేళ అతను అమాయకుడైతే, మరి ఈ నేరం ఎవరు చేసినట్లు? మా పిల్లల ప్రాణాలను ఎవరు తీశారు?'' అని ప్రశ్నించారు.
ఈ కేసులో మరో నిందితుడు మోనిందర్ సింగ్ పందేర్‌ను ఇప్పటికే కోర్టు నిర్దోషిగా తేల్చింది.
నోయిడాలోని సెక్టార్-31లో ఉన్న నిఠారీ గ్రామంలో ఇప్పుడు బాధిత పిల్లల కుటుంబాలు కేవలం నాలుగు మాత్రమే మిగిలాయి. చాలా కుటుంబాలు ఈ గ్రామాన్ని, కోర్టు పోరాటాన్ని వదిలి వెళ్లిపోయాయి.

మేం మాట్లాడిన బాధిత కుటుంబాల్లో, ఒకరు తమ ఎనిమిదేళ్ల పాపను, మరొకరు పదేళ్ల కూతురిని పోగొట్టుకున్నారు.
ఈ రెండు కేసులు కూడా అత్యాచారం, హత్యతో ముడిపడి ఉన్నాయి. అందుకే, మేం ఈ కుటుంబాల గుర్తింపును వెల్లడించడం లేదు.
రాజ్‌కిషన్ కొడుకు హర్ష్‌కు అప్పుడు కేవలం మూడున్నర ఏళ్లు మాత్రమే. ఈ కేసులో కిడ్నాప్, హత్య జరిగింది. వారి సమ్మతితోనే మేం ఈ కుటుంబ గుర్తింపును వెల్లడిస్తున్నాం.

'ఆధారాలన్నీ ఆయన ఇంట్లోనే దొరికాయి'
నిఠారీలోని ఒక గుడిసెలో ఆ 10 ఏళ్ల బాలిక కుటుంబం నివసిస్తోంది. మేం అక్కడికి చేరుకున్నప్పుడు, బాలిక తల్లి అప్పటికే కొందరు మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ ఉండటాన్ని చూశాం.
ఆమె మాటల్లో బాధ, కోపం, నిరాశ స్పష్టంగా కనిపించాయి.
'' అతను మేం నిర్దోషులం అని చెప్పుకుంటున్నారు. అతని ఇంట్లోనే అస్థిపంజరం, బట్టలు స్వాధీనం చేసుకున్నారు. మా కూతురి చెప్పులు, బట్టలు, పుర్రె అతని ఇంటికి సమీపంలో దొరికాయి. పుర్రె రెండు కిలోల నల్లటి పాలిథీన్ బ్యాగ్‌లో ఉంది. అయినా, అతను మేం నిర్దోషులమని చెప్పుకుంటున్నాడు'' అని ఆమె అన్నారు.
''అతన్ని ఉరితీస్తారనే ఆశతో మేం పోరాడుతూనే ఉన్నాం. ఇల్లు, పొలంతో పాటు మాకున్నదంతా అమ్మేసి, ఈ కేసుకు ధారబోశాం. కానీ, ఈరోజు మాకేం దక్కింది. నిరాశే'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసు కోసం పోరాడే క్రమంలో ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు వచ్చాయి.
తన చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ.. ''ఇది మా అద్దె గుడిసె. ఇవి మా బట్టలు. రూ.100 నుంచి రూ.200 సంపాదిస్తూ, పూట గడుపుతున్నాం. వయసు మీద పడుతుండటంతో, మేం పనిచేయలేకపోతున్నాం'' అన్నారు.

అదే సమయంలో, ఆమె భర్తను దీని గురించి అడిగినప్పుడు, ''ఒకవేళ పందేర్, కోలి దోషి కాకపోతే.. మరి ఇంకెవరు? ఆయన ఇంట్లో ఉంటూ ఈ పనులన్నీ ఎవరు చేశారు? దీనికి సమాధానం ఇప్పుడు కేవలం దేవుడే చెప్పగలడు'' అన్నారు.
''ఎముకలు, తల అతని ఇంటి పక్కనే దొరికాయి. ప్రతిదీ అతని ఇంట్లోనే దొరికింది. ఇంతకుమించిన ఆధారాలు ఏం కావాలి? ఆ సమయంలో మీడియాలో చూపించిందంతా అబద్ధమా? దర్యాప్తు సరిగ్గా చేస్తే, వారికి మరణశిక్ష పడుతుంది. లేదంటే, ఇక భగవంతుడు ఉన్నాడు'' అని అన్నారు.
''అతను అమాయకుడనుకుందాం''
నిఠారీ హత్యల కేసులో పూనమ్ తన మూడున్నరేళ్ల కొడుకుని పోగొట్టుకున్నారు. ఆమె మోనిందర్ సింగ్ పందేర్ డీ-5 బంగ్లాకు కేవలం వంద మీటర్ల దూరంలోనే నివసిస్తున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు మేం అక్కడకు చేరుకున్నాం. ఈ కేసు గురించి మాట్లాడటం తనకు బాధాకరంగా ఉందని ఆమె మాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
ఆమె భర్త రాజ్‌కిషన్ మాత్రమే మాట్లాడారు.

ఫొటో సోర్స్, Getty Images
''నిఠారీ హత్యల కేసులో నిజమేంటో దేశానికి, ప్రపంచానికి తెలుసు. ప్రతి ఒక్కరూ సాక్ష్యాలను చూశారు. పోలీసుల ముందు నేరం అంగీకరించారు. సీబీఐ కోర్టు అతనికి మరణశిక్ష వేసింది. ఇవ్వన్నీ ఉన్నప్పటికీ, కోర్టు సురిందర్‌ను అమాయకుడు అంటే, మేం కూడా అతను అమాయకుడని అంగీకరించాం. మా గాయాలను తిరిగి పొడుచుకోవాలనుకోవడం లేదు. ఈ కేసును తిరిగి తెరవాలని కూడా కోరుకోవడం లేదు. న్యాయం కోసం వేచి చూసి అలసిపోయాం'' అని రాజ్‌కిషన్ అన్నారు.
అయితే, పిల్లల హత్య, అత్యాచారాలకు సంబంధించి నేరాంగీకారాలన్నింటినీ ఒత్తిడితో తన నుంచి రాబట్టారని అలహాబాద్ హైకోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో సురిందర్ కోలి పేర్కొన్నారు.

'మా పిల్లలు పోయారు, మాకు న్యాయం జరగలేదు'
నిఠారీ హత్యల కేసులో ఎనిమిదేళ్ల కూతుర్ని పోగొట్టుకున్న ఒక మహిళ పోలీసులు, సీబీఐ పాత్రను ప్రశ్నించారు. దర్యాప్తు సరిగ్గా చేయలేదని ఆమె ఆరోపించారు.
''ఒకవేళ వారు మా డీఎన్ఏ పరీక్ష చేయిస్తే, వారు మా పిల్లలు కాదని ఇప్పుడు మేం అంగీకరించాలా? మా పిల్లలు పోయారు. మాకు న్యాయం దక్కలేదు. మా ఉద్యోగాలు పోయాయి. సంవత్సరం పాటు ఆకలి దప్పులతో తిరిగాం. ఎక్కడికెక్కడో తిరిగాం, ఎవరూ మమ్మల్ని అడగలేదు. ఒక్క క్షణంలో నిర్దోషులని ప్రకటించి విడుదల చేశారు. మాకు బాధ లేదా?'' అని ప్రశ్నించారు.
''నా కూతుర్ని ఎవరు చంపేశారు? ఇంత క్రూరంగా.. పశువులను కూడా ఎవరూ చంపరు. ఎంత బాధాకరమో చెప్పండి'' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటి విషయం?
అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాలను నాశనం చేయడం, ఇతర అభియోగాలకు సంబంధించిన కేసుల్లో 2009లో ఘాజియాబాద్ సీబీఐ కోర్టులో మోనిందర్ సింగ్ పందేర్, సురిందర్ కోలికి సీబీఐ కోర్టు మరణ శిక్ష విధించింది.
11 కేసుల్లో ఏకైక నిందితుడిగా కోలి ఉన్నారు. రెండు కేసుల్లో పందేర్‌తో కలిపి సహ-నిందితుడిగా చేర్చారు.
అలహాబాద్ హైకోర్టు ఈ కేసు సంబంధిత 12 అభియోగాల నుంచి 2023లో కోలిని నిర్దోషిగా విడుదల చేసింది. మోనిందర్ సింగ్ పందేర్ కూడా తనపై నమోదైన రెండు కేసుల నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు.
దర్యాప్తు సరిగ్గా నిర్వహించలేదని, 'సాక్ష్యం సేకరించే ప్రాథమిక నిబంధనలు నిర్మొహమాటంగా ఉల్లంఘనకు గురయ్యాయి' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు తీర్పులో ఏముంది?
సుప్రీంకోర్టు న్యాయవాది పరాస్ నాథ్ సింగ్ కోర్టు నిర్ణయాన్ని వివరిస్తూ ఇలా చెప్పారు.
"ఈ కేసులో తగిన సాక్ష్యధారాలు లేవు. అందుకే, సీబీఐ నమోదు చేసిన కోలి వాంగ్మూలాలను కోర్టు విశ్వసించదగినవిగా పరిగణించలేదు. ఎందుకంటే, చట్టం ప్రకారం.. ఒక వాంగ్మూలాన్ని ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఇవ్వాలి" అన్నారు.
"60 రోజుల పాటు కోలి పోలీసు కస్టడీలో ఉన్నారు. కానీ, ఈ 60 రోజుల్లో ఆయనకు ఎప్పుడూ వైద్య పరీక్షలు నిర్వహించలేదు. ఇది శారీరకంగా హింసించారనే అనుమానాలను పెంచుతోంది. 2007లో మాత్రమే ఒక మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించారు. కానీ, దానిని ధ్రువీకరించడానికి ఆ డాక్టర్‌ను హాజరుపరచలేదు" అని అలహాబాద్ హైకోర్టు తీర్పుకు సంబంధించిన 308 పేజీల కాపీలో 47వ పేజీలో ఉంది.
కోలి ఆరోపిత వాంగ్మూలాన్ని నమోదు చేసిన మెజిస్ట్రేట్ కూడా.. నిందితుడు ఎవరి ఒత్తిడి లేకుండా ఈ మాటలు చెప్పాడా లేదా అనే విషయంపై సంతృప్తి వ్యక్తం చేయలేదని తీర్పులో రాశారు.
ప్రాసిక్యూషన్ ఎప్పటికప్పుడు తన వైఖరిని మార్చుకుందని హైకోర్టు నొక్కి చెప్పింది.
డీ-5 ఇంటి యజమాని అయిన మోనిందర్ పందేర్, కోలిపై తొలుత కేసు నమోదైంది. ఘటనా స్థలంలో దొరికిన వాటికి ఈ ఇద్దరే బాధ్యులుగా పేర్కొన్నారు. కానీ, సమయం గడిచేకొద్ది ప్రతిదానికి కోలినే నిందించడం మొదలు పెట్టారు.
దర్యాప్తు వివిధ దశల్లో ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలను మారుస్తూ వచ్చింది. చివరికి మిగిలింది కోలి నేరాంగీకారమే. దీని విశ్వసనీయత కూడా అప్పటికే ప్రశ్నార్థకంగా మారింది.
"ఇప్పటికే 12 కేసుల్లో కోలిని నిర్దోషిగా ప్రకటించిన అదే సాక్ష్యాల ఆధారంగా… మరో కేసులో కోలిని దోషిగా నిర్ధరించడం రాజ్యాంగబద్ధంగా సరైనది కాదు" అని నవంబర్ 11న కోలిపై పెండింగ్‌లో ఉన్న చివరి కేసులో తీర్పును వెల్లడిస్తూ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
నిఠారీలో జరిగిన నేరాలు భయంకరమైనవిగా, తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాల బాధ వర్ణనాతీతమని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఇంత సుదీర్ఘ దర్యాప్తు తర్వాత కూడా తగిన సాక్ష్యాధారాలతో నిజమైన నేరస్తులెవరో రుజువు కాలేదు.
"కేవలం అనుమానం ఆధారంగా చట్టం ఎవరినీ దోషిగా ప్రకటించలేదు. అనుమానం ఎంత బలంగా ఉన్నప్పటికీ, కోర్టుకు బలమైన సాక్ష్యాలు అవసరం. న్యాయం అందించాలనే ఒత్తిడిలో చట్టపరమైన నిబంధనలను పక్కదారి పట్టించలేం" అని కోర్టు పేర్కొంది.
చివరికి.. పోలీసులు, ఏజెన్సీల దర్యాప్తు ప్రక్రియపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.
"దర్యాప్తు సకాలంలో, వృత్తిపరమైన నిబద్ధతతో, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా జరిగితే అత్యంత క్లిష్టమైన కేసుల్లో కూడా నిజం బయటకు వస్తుంది. కానీ నిఠారీ కేసులో ఇది జరగలేదు. నిర్లక్ష్యం, అలసత్వం మొత్తం దర్యాప్తును దెబ్బతీశాయి. అవి.. అసలు నేరస్తుడిని కనిపెట్టే మార్గాలను అడ్డుకున్నాయి " అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఫలితంగా.. మోనిందర్ సింగ్ పందేర్, సురిందర్ కోలి అన్ని కేసుల్లో నిర్దోషులుగా తేలి, ఇప్పుడు విడుదలయ్యారు.
కానీ, కోర్టు తీర్పు బాధిత కుటుంబాలను నిస్సందేహంగా నిరాశపరిచింది.
'మా పిల్లలను ఎవరు చంపారు?' అని ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ తీర్పు వారి గాయాలను తిరిగి రేపినట్లైంది. ఇప్పటికీ అనేక ప్రశ్నలు వారిని కలవరానికి గురి చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ నిఠారి హత్య కేసులు?
దిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2005 నుంచి 2006 మధ్యలో చాలామంది చిన్నారులు, యువతులు ఒకరి తర్వాత ఒకరు అదృశ్యమవ్వడం వెలుగులోకి వచ్చింది.
స్థానిక పోలీసు స్టేషన్‌లో ఈ పిల్లల కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. నెలల తరబడి పోలీసులు వీరిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి.
చివరికి పోలీసులు విచారణ ప్రారంభించినప్పుడు, పందేర్ ఇంటి వెనుకాల డ్రైనేజీలో 19 అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు మోనిందర్ సింగ్ పందేర్, సురిందర్ కోలిని అరెస్ట్ చేశారు.
ఈ కేసు సీబీఐకి చేరింది. దర్యాప్తుసమయంలో మనిషి ఎముకల భాగాలను, డ్రైనేజీలో పారేసిన మానవ అవయవాలు ఉన్న 40 ప్యాకెట్లను కనుగొన్నారు.
దీంతో, దర్యాప్తును వేగవంతం చేసింది. 2009లో ఘాజియాబాద్‌లోని సీబీఐ కోర్టు ఒక కేసులో ఇద్దరికీ మరణశిక్ష వేసింది.
ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు ఈ కేసు చేరుకుంది. సుప్రీంకోర్టు నిందితులిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














