దిల్లీ పేలుడు: తమ వారు ఏమయ్యారో తెలియక మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల వెతుకులాట.. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో హృదయ విదారక దృశ్యాలు

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌కు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడులో గాయపడిన బాధితులను, ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రి బయట నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకు.. ప్రతి దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఆస్పత్రి ఎమర్జెన్సీ బ్లాక్‌కు బయట పోలీసులను, భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

ఎమర్జెన్సీ వార్డు బయట తమ వాళ్ల కోసం కుటుంబ సభ్యులు ఎంక్వైరీ చేస్తున్నారు.

మేం రాత్రి 8 గంటలకు లోక్ నాయక్ ఆస్పత్రికి చేరుకున్నాం. కానీ, మీడియా వ్యక్తుల్ని లోపలికి అనుమతించలేదు.

కొందరు అంబులెన్స్ డ్రైవర్‌తో మాట్లాడుతూ కనిపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు
ఫొటో క్యాప్షన్, అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ అసద్

అంబులెన్స్ డ్రైవర్ ఏం చెప్పారు?

అంబులెన్స్ డ్రైవర్‌తో మేం కూడా మాట్లాడాం. ఆయన పేరు మొహమ్మద్ అసద్.

బీబీసీతో మాట్లాడిన అసద్.. ''ఎర్రకోటకు సమీపంలో పేలుడు జరిగిందని ఆస్పత్రి నుంచి మాకు సమాచారం అందింది. మా వెహికిల్‌లో మేం అక్కడికి వెళ్లాలి. ఆ కాల్ తర్వాత 8 నుంచి 10 అంబులెన్సులు ఆస్పత్రి నుంచి ఘటనా స్థలానికి బయలుదేరాయి. ఘటనా స్థలంలో నాలుగు నుంచి ఐదు మృతదేహాలను గుర్తించాం. అన్ని కూడా ముక్కలు ముక్కలుగా రోడ్డుపై పడి ఉన్నాయి. మేం ఎలాగోలా ఈ మృతదేహాల భాగాలను సేకరించి, ఆస్పత్రికి తీసుకొచ్చాం. అక్కడ గాయపడిన వారిని చూడలేదు. అప్పటికే వారిని ఆస్పత్రికి తీసుకొచ్చేశారు'' అని తెలిపారు.

అసద్‌తో మాట్లాడుతున్న సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన కాన్వాయ్‌లో ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోకి వెళ్లడం కనిపించింది.

ఘటనలో గాయపడిన బాధితులను అమిత్ షా కలిశారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆస్పత్రి సిబ్బంది ఒకరు మాతో చెప్పారు.

బాధితులను పరామర్శించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఆస్పత్రికి వచ్చారు.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు
ఫొటో క్యాప్షన్, పవన్ శర్మ

బాధితుల బంధువుల ఆందోళన

ఆస్పత్రి బయట బాధితుల బంధువులు కొందరిని మేం కలిశాం. తన సోదరి భర్త భవానీ శంకర్ ఆస్పత్రి లోపల ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయ్యారని పవన్ శర్మ చెప్పారు. కానీ, ఆయన్ను కలిసేందుకు వారు మమ్మల్ని అనుమతించలేదు.

పవన్ తండ్రితో కూడా మాట్లాడాం. ఆయన ఆస్పత్రి ప్రధాన గేటు లోపల ఉన్నారు. గాయపడిన బాధితులను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆయన మాతో చెప్పారు.

'' ఘటన జరిగిన తర్వాత, బావ నుంచి నాకు వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్‌లో ముఖానికి, చేతికి అయిన గాయాలను చూపించారు. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారు'' అని భవానీ శంకర్‌ పరిస్థితిని పవన్ శర్మ వివరించారు.

భవానీ శంకర్ బంధువులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఎర్రకోట ప్రాంతంలో ఈయన ట్యాక్సీ నడుపుతుంటారని తెలిసింది.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు
ఫొటో క్యాప్షన్, కారు పేలుడులో సఫాన్ గాయపడినట్లు తెలిపిన తన మామ తాజుద్దీన్

'అతన్ని కలిసేందుకు ఆస్పత్రి యంత్రాంగం అనుమతించడం లేదు'

గాయపడిన వారిలో మరో వ్యక్తి సఫాన్. అతన్ని కలిసేందుకు ప్రయత్నిస్తూ.. ఆస్పత్రి బయటికి, లోపలికి వెళ్తోన్న తన మామ తాజుద్దీన్ మాతో మాట్లాడారు.

''అతనికి 17 ఏళ్లు. కారు పేలుడు జరిగినప్పుడు కొన్ని వందల మీటర్ల దూరంలోనే బ్యాటరీ రిక్షాలో వెళ్తున్నాడు. ఈ ఘటనతో అతనికి గాయాలయ్యాయి. ఒక చెవి వినికిడి కోల్పోయాడు'' అని చెప్పారు.

గాయపడిన వారిని కలిసేందుకు ఆస్పత్రి యంత్రాంగం కుటుంబ సభ్యులెవరినీ అనుమతించడం లేదని ఆయన అన్నారు.

బాధితులకు చికిత్స అంతా అయ్యేంత వరకు, ఎవరినీ అనుమతించమని ఆస్పత్రి యంత్రాంగం చెబుతున్నట్లు తాజుద్దీన్ తెలిపారు.

ఆస్పత్రి లోపల, ఎమర్జెన్సీ వార్డు బయట పరిస్థితిని వివరించిన ఆయన, ''గాయపడిన తమ వారిని కలిసేందుకు మాలాంటి చాలామంది ప్రయత్నిస్తున్నారు'' అని చెప్పారు.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు
ఫొటో క్యాప్షన్, పూర్ణిమా జైశ్వాల్

'నా సోదరుడి పరిస్థితిని వార్తల్లో చూశాను'

మేం ఎలాగోలా ఆస్పత్రి లోపలికి వెళ్లేసరికి రాత్రి 11.30 అయింది. ఎమర్జెన్సీ వార్డు బయట పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి.

పూర్ణిమా జైశ్వాల్ అనే మహిళ ఏడుస్తూ కనిపించారు. అంతకు కొన్ని క్షణాల ముందే, గాయపడిన తన సోదరుడిని స్ట్రెచర్‌పై వార్డులోకి తీసుకెళ్లడం చూశారు.

''తొలుత మా సోదరుడిని వార్తల్లో చూశాం. హోం మంత్రి అమిత్ షా ఆయన్ని కలిశారు. ఆయన గాయపడ్డారు. మేం వెంటనే ఆస్పత్రికి వచ్చాం. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ముక్కుపై కట్టుకట్టి ఉంది. చేతులపై, ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయి'' అని పూర్ణిమా జైశ్వాల్ తెలిపారు.

అంతలోనే మరో మహిళ ఏడుపు మాకు వినిపించింది. వార్డు నుంచి ఆ మహిళ బయటికి వస్తున్నారు. ఈ పేలుడులో తన సోదరుడిని ఆమె కోల్పోయారు.

ఆ మహిళ సోదరుడి పేరు మోహ్సిన్ మాలిక్. ఎర్రకోట ప్రాంతంలో ఆయన ఈ-రిక్షా నడిపేవారు. మోహ్సిన్‌కు 28 ఏళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తన సోదరిని ఓదారుస్తోన్న వ్యక్తి చెప్పారు. ఆయన మృతి చెందినట్లు ఆస్పత్రి యంత్రాంగం తన కుటుంబానికి చెప్పింది.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు
ఫొటో క్యాప్షన్, సందీప్

తమవారిని వెతుక్కుంటూ ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు

అలాంటి వ్యక్తుల్లో సందీప్ ఒకరు. తన బావ లోకేష్‌ను వెతికేందుకు ఇక్కడకు వచ్చారు.

''ఈ ఘటన జరిగినప్పుడు, చాందినీ వద్ద ఆయన తమ ఫ్యామిలీ డ్రైవర్ కోసం వేచిచూస్తున్నారు. ఆయనతో కలిసి ఎక్కడికో వెళ్లాలి. కారు పేలుడు వార్తలు వచ్చిన కొన్ని గంటలకు చనిపోయిన వారిలో డ్రైవర్ ఒకరని తెలిసింది. కానీ, మా బావ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆయనకు కాల్ చేశాం. కానీ, ఆయన ఫోన్ పోలీసుల వద్ద ఉంది. ఘటనా స్థలంలో ఈ ఫోన్‌ను గుర్తించామని పోలీసులు చెప్పారు. కానీ, ఆయన గురించి వారికి కూడా ఎలాంటి సమాచారం లేదు. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వద్ద చెక్ చేయమని పోలీసులు చెప్పారు. గత రెండు గంటలుగా ఇక్కడ ఉన్నాను. కానీ, ఎవరి వద్ద ఎలాంటి సమాచారం లేదు'' అని తెలిపారు.

మాతో మాట్లాడుతున్నప్పుడు, వార్డు బయట నిలబడి ఉన్న ఆసుపత్రి సిబ్బంది సందీప్‌ని నాలుగో నంబర్ గేటు దగ్గరకు వెళ్లమని చెప్పారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయనకు కొంత సమాచారం లభించే అవకాశం ఉంది.

ఆయనతో మేం అర్ధరాత్రి 2.30 నిమిషాలకు మాట్లాడాం. ఆస్పత్రి మార్చురీ బయట ఆయన నిల్చుని ఉన్నారు. అక్కడున్న మృతదేహాన్ని గుర్తించమని ఆస్పత్రి సిబ్బంది ఆయనకు చెప్పారు.

అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆస్పత్రి పీఆర్ఓతో మాట్లాడేందుకు మేం ప్రయత్నించాం. కానీ, ఎటువంటి స్పందన రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)