జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి చేసిన ఫిర్యాదులో ఏముంది?

మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మాగంటి సునీత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, తల్లి మహనంద కుమారి
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సహజంగా ఎన్నికలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి.

కానీ తాజా వివాదం మాత్రం జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం, ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ రేగింది.

గోపీనాథ్ మరణానికి కారణమైన పరిస్థితులపై విచారణ చేయించాలని కోరుతూ ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ''నా కొడుకు మరణంపై అనుమానం ఉంది. దాని గురించి విచారణ చేయాలనడిగాను'' అని ఆమె మీడియాతో చెప్పారు. చికిత్స సమయంలో గోపీనాథ్‌ను చూడనివ్వలేదని చెప్పారు.

దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది, అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏ అస్త్రాన్నీ వదులుకోవడం లేదు’’ అని సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ బీబీసీతో చెప్పారు.

మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మాగంటి సునీత

ఫొటో సోర్స్, x.com/magantigopimla/

ఫొటో క్యాప్షన్, మాగంటి సునీత

మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు.

మొదటిసారి 2014లో ఆయన తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరి 2018, 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఈ ఏడాది జూన్ 5న గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ జూన్ 8న కన్నుమూశారని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వచ్చింది.

నవంబరు 11న ఇక్కడ పోలింగ్ జరగనుంది. నవంబరు 14న ఫలితాలు వెల్లడిస్తారు.

బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లుండగా.. అందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు.

మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మాగంటి సునీత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తన కుమారుడి మరణంపై విచారణ జరిపించాలని మాగంటి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయంటూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులుకు ఫిర్యాదు చేశారు ఆయన తల్లి మహానంద కుమారి. గోపీనాథ్ చనిపోయారని ఈ ఏడాది జూన్ 8న అధికారికంగా ప్రకటించారని, తన కుమారుడు మరణం విషయంలో సమాచారాన్ని దాచిపెట్టినట్లుగా అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారామె.

''గోపీనాథ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత నన్ను చూడనివ్వకుండా అడ్డుకున్నారు. కొన్ని నెలలుగా వరుసగా అనారోగ్య సమస్యలతో గోపీనాథ్ బాధపడుతూ వచ్చారు'' అన్నారు మహానంద కుమారి.

దీనిపై గోపీనాథ్ భార్య సునీత, కుమార్తె దిశిరలపై మహానంద కుమారి ఆరోపణలు చేశారు.

''గోపీనాథ్‌కు అనారోగ్య సమస్యలకుతోడు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలను సరిగా పట్టించుకోలేదు. ఒక కిడ్నీ తొలగించిన తర్వాత ఆయనతో ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీనివల్ల క్రియటిన్ స్థాయులు పెరిగిపోయి గోపీనాథ్ ప్రాణాల మీదకు వచ్చింది'' అని ఆరోపించారు.

దీనిపై మాగంటి సునీత కుటుంబం ఇంకా స్పందించాల్సి ఉంది.

వారిని సంప్రదించేందుకు బీబీసీ ఫోన్‌లో ప్రయత్నిచినా వారు అందుబాటులోకి రాలేదు. వారి వివరణ వచ్చాక ఇక్కడ అప్డేట్ చేస్తాం.

మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మాగంటి సునీత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మాగంటి గోపీనాథ్ తన తల్లి నుంచి విడాకులు తీసుకోకుండా సునీతను వివాహం చేసుకున్నారని ఆయన కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

"నన్ను లోపలకు రానివ్వలేదు"

గోపీనాథ్‌ను జూన్ 5న ఆసుపత్రిలో చేర్చాక ఆయనను చూసేందుకు తనను అనుమతించలేదని, కానీ ఆ సమయంలో కేటీఆర్‌ను అనుమతించారని మహానంద కుమారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను ఆసుపత్రిలోకి రానీయకుండా సునీత, ఆమె కుమార్తె దిశిర అడ్డుకున్నారని చెబుతున్నారు.

ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి గోపీనాథ్ మరణానికి బాధ్యులెవరనేది తేల్చాలని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో మహనంద కుమారి కోరారు.

''గోపీనాథ్‌ను చూడనివ్వకుండా తనను అడ్డుకోవడం, అదే సమయంలో ఇతర వ్యక్తులను అనుమతించడంపై విచారణ చేయాలి. ఆయన మరణానికి ఎవరైనా బాధ్యులని తెలితే, వారిపై చర్యలు తీసుకోవాలి'' అని మహానంద కుమారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు,

ఈ ఫిర్యాదును స్వీకరించి, విచారణ జరుపుతున్నామని చెప్పారు రాయదుర్గం పోలీసులు.

మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మాగంటి సునీత

ఫొటో సోర్స్, facebook.com/KTRTRS

ఫొటో క్యాప్షన్, గోపీనాథ్‍‌ మరణం విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను కేటీఆర్ తిరస్కరించారు.

కేటీఆర్ ఏమన్నారంటే..

మహానంద కుమారి ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

''కొడుకు చనిపోయిన ఆరు నెలల తర్వాత ఆమె (మహానంద కుమారి) అలా మాట్లాడుతున్నారంటే, ఆమె వెనక ఇద్దరు కాంగ్రెస్ నేతలు నిల్చుని మాట్లాడుతున్నారంటే... ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు'' అన్నారు.

దీనిపై 'మీట్ ద ప్రెస్'లో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. 'మాగంటి తల్లిని అవమానించింది వారే (కేటీఆర్)' అని ఆరోపించారు.

మరోవైపు, గోపీనాథ్‌ను ఆసుపత్రిలో చూడనివ్వకుండా ఆయన తల్లిని అడ్డుకోవడానికి తానెవరినని, ఆయన చనిపోయాకే తాను ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు కేటీఆర్.

ఆ సమయంలో తాను అమెరికాలో ఉన్నానని చెప్పారాయన.

''గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి అమెరికా నుంచి తిరిగి వచ్చాను. నేను వచ్చిన రోజు తెల్లారో.. వస్తున్న సమయంలోనో ఆయన చనిపోయినట్లుగా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అలాంటప్పుడు వారిని నేనెలా అడ్డుకుంటాను'' అన్నారు కేటీఆర్.

‘‘గోపీనాథ్ మరణాన్ని కూడా రాజకీయం చేస్తారా’’ అని ప్రశ్నించారు కేటీఆర్.

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారన్నారు.

'వారి (గోపీనాథ్) కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. దానికి నేనేం చేస్తాను? మాగంటి గోపీనాథ్ మరణంపై ఈ స్థాయిలో రాజకీయం చేయడం తగదు. ఆయన భార్య సునీత మా పార్టీ తరఫున అభ్యర్థి. ఆమె ఏడుస్తుంటే కూడా రాజకీయాలు చేస్తున్నారు'' అని విమర్శించారు.

మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మాగంటి సునీత

ఫొటో సోర్స్, x.com/bandisanjay_bjp

ఫొటో క్యాప్షన్, గోపీనాథ్ మరణంపై సందేహాలు ఉన్నాయని, విచారణ జరిపించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తెరపైకి మొదటి భార్య, కుమారుడు

మాగంటి గోపీనాథ్ వివాహ బంధంపైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆయన మొదటి భార్య మాలినీదేవి కుమారుడు కొసరాజు తారక్ ప్రద్యుమ్న.

గోపీనాథ్‌తో మాలినీదేవికి 1998లో వివాహం జరిగిందని మహానంద కుమారి చెబుతున్నారు.

తన తల్లే గోపీనాథ్ భార్య అని, ఆమె నుంచి విడాకులు తీసుకోకుండా సునీతను వివాహం చేసుకున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు తారక్ ప్రద్యమ్న.

''మాలినీ దేవితో పరస్పర అంగీకారంతో విడిపోయి సునీతను 2000లో గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు'' అని గోపీనాథ్ సన్నిహితుడొకరు బీబీసీతో చెప్పారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ ఇచ్చిన అఫిడవిట్‌లో తన భార్య పేరును సునీతగానే పేర్కొన్నారు.

ఆమె పేరుతో ఉన్న ఆస్తుల వివరాలను అందులో ప్రస్తావించారు.

ఎన్నికల అఫిడవిట్‌లో తన సంతానంగా నాగ అక్షర, వాత్సల్యనాథ్, దిశిర పేర్లు రాశారు గోపీనాథ్.

తన అఫిడవిట్‌లో ఎక్కడా మాలినీదేవి, తారక్ ప్రద్యుమ్నల పేర్లను గోపీనాథ్ ప్రస్తావించలేదు.

మరోవైపు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌లో తమ పేర్లు కూడా చేర్చాలని శేరిలింగంపల్లి తహసీల్దారుకు మాలినీదేవి, తారక్ ప్రద్యుమ్నతో కలిసి అక్టోబర్‌లో మహానంద కుమారి ఫిర్యాదు చేశారు.

దీనిపై అటు మాలినీదేవి, ఇటు సునీతకు నోటీసులు జారీ చేసి విచారించారు శేరిలింగంపల్లి తహసీల్దారు వెంకారెడ్డి.

అప్పటికే జూన్ 25న లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కోసం సునీత దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు సర్టిఫికెట్ జారీ చేశారు తహసీల్దారు. ప్రస్తుతం ఆ సర్టిఫికెట్‌ను హోల్డ్‌లో పెడుతున్నట్లుగా ఆయన ప్రకటించారు.

నవంబరు 6న మాలినీదేవి, తారక్ ప్రద్యుమ్న, మహానంద కుమారి విచారణకు హాజరయ్యారు. అలాగే సునీత తరఫున కుమార్తె దిశిర వచ్చి తమ వాదనలు వినిపించారు.

''ఇరు వర్గాల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు కావాలని చెప్పాం. వారు సమయం కావాలని కోరడంతో విచారణను 25కి వాయిదా వేశాం. 19వ తేదీలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలని చెప్పాం'' అని తహసీల్దారు వెంకారెడ్డి చెప్పారు.

ఇరు వర్గాల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని పరిశీలించి, విచారించిన తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని వివరించారు.

మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మాగంటి సునీత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిందని సీనియర్ జర్నలిస్ట్ అమర్ అన్నారు.

అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకం

కీలక నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడంతో జరిగిన ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది.

కంటోన్మెంట్ శాసనసభ కంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కొన్ని కారణలున్నాయని చెప్పారు దేవులపల్లి అమర్.

''2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. కేసీఆర్ బయట కనిపించడం లేదు. పార్టీలో అంతర్గత సంక్షోభం, బీఆర్ఎస్ పాలనా కాలంపై విచారణలు.. ఇవన్నీ పార్టీని కుంగతీశాయి. అలాంటి స్థితిలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే ఆ పార్టీ అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది'' అని చెప్పారాయన.

"కాంగ్రెస్ గెలిచి బీజేపీ, బీఆర్ఎస్ ఓడితే, బీఆర్ఎస్ స్థానాన్ని తీసుకునేందుకు బీజేపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే తమ పాలనను ప్రజలు అంగీకరించారని చెప్పుకునేందుకు అవకాశం లభిస్తుంది'' అని చెప్పారు దేవులపల్లి అమర్.

అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న బస్తీల సమస్యలపై మాట్లాడటం కంటే, కుటుంబ వివాదాలు, జాతీయ సమస్యలకే ప్రాధాన్యం ఇచ్చాయని ఆయనన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)