‘‘జస్ట్ 20 నిమిషాల డేటింగ్..జీవితాన్ని నరకప్రాయం చేసింది’’

బాధితురాలు నాదియా
ఫొటో క్యాప్షన్, బాధితురాలు నాదియా
    • రచయిత, కాట్రియోనా మాక్‌ఫీ, రాచెల్ కోబర్న్
    • హోదా, బీబీసీ డిస్‌క్లోజర్

ఆన్‌లైన్ డేటింగ్ యాప్ టిండర్‌లో పరిచయమైన క్రిస్టోఫర్ హార్కిన్స్ అనే వ్యక్తితో 20 నిమిషాల సమయం గడిపినందుకు చంపుతాననే బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అది చాలాఏళ్లు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని ఓ మహిళ చెప్పారు.

మోసగాడు, అత్యాచారాలు చేసేవ్యక్తిగా పేరుపడ్డ క్రిస్టోఫర్ హార్కిన్స్ ‌అనే వ్యక్తితో 2018లో మొదటిసారి డేటింగ్‌కు వెళ్లిన నాదియా, ‘మనసు కీడు శంకించడంతో’ వెంటనే తిరుగు ముఖం పట్టారు. ఇక అప్పటి నుంచి తాను దూషణలు ఎదుర్కొన్నట్టు ఆమె చెప్పారు.

స్కాట్లాండ్‌లో వలపువల విసిరి మోసాలకు పాల్పడే వ్యక్తి కారణంగా తాము ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అరడజనుమంది మహిళలు న్యూ బీబీసీ డిస్‌క్లోజర్ పాడ్‌కాస్ట్: మ్యాచ్డ్ విత్ ఏ ప్రెడేటర్ కార్యక్రమంలో పంచుకున్నారు. వీరిలో స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్టుగా పనిచేస్తున్న నాదియా ఒకరు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్రిస్టోఫర్ హార్కిన్స్
ఫొటో క్యాప్షన్, క్రిస్టోఫర్ హార్కిన్స్

‘అతనో ప్రమాదకరమైన నేరగాడు...’

హార్కిన్స్‌పై స్కాట్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు 2012 నుంచి 11 మంది మహిళలు ప్రయత్నించినట్లు బీబీసీ పరిశోధన‌లో వెల్లడైంది. ఆయనపై భౌతిక దాడులు, మోసాలు, బెదిరింపులు, వేధింపులు తదితర ఆరోపణలుఉన్నప్పటికీ 2019 చివరి వరకూ ఆయనను పోలీసులు విచారించలేదు.

అయితే గతంలో అందిన ఫిర్యాదులన్నీఆర్థిక అంశాలకు సంబంధించినవని, వాటిన్నంటిని విడివిడిగా విచారించామని, ప్రస్తుతం ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని ఆశిస్తున్నామని స్కాట్లాండ్ పోలీసులు చెప్పారు.

హార్కిన్స్‌ 2024లో జైలుకు వెళ్లేవరకు దాదాపు దశాబ్దంపాటు స్కాట్లాండ్, లండన్‌లో తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన మహిళలపై నేరాలకు పాల్పడ్డాడు.

అతన్ని ఇంకా ముందే కట్టడి చేసి ఉండాల్సిందని నాదియా భావిస్తున్నారు. అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరిన అనేకమంది బాధితులకు స్కాట్లాండ్ పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వారిలో నాదియా కూడా ఉన్నారు.

ప్రస్తుతం నాదియా వయసు 34 ఏళ్లు, హార్కిన్స్ వయస్సు 38 సంవత్సరాలు. ఏడేళ్ల క్రితం వారిద్దరూ టిండర్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు.

కొన్ని వారాల పాటు వారిద్దరి మధ్య మెసేజ్‌లతో చాటింగ్ సాగింది. తర్వాత, గ్లాస్గోలో డిన్నర్‌కు వెళ్లడానికి ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

హార్కిన్స్‌ను కలుసుకోవడానికి కుంబర్‌నాల్డ్‌లోని అతని ఫ్లాట్‌కు వెళ్లినప్పుడే నాదియాకు తొలిసారిగా మనస్సు కీడు శంకించింది.

జాగింగ్ ప్యాంట్, బనీనుతో ఉన్న హార్కిన్స్ గది తలుపులు తెరిచాడు. తనకు బాగా అలసటగా ఉందని, బయటకు రాలేనని చెప్పాడు.

ఫ్లాట్‌లోనే ఉండి, టేక్అవే ఆర్డర్ చేద్దామన్నాడు.

"అదే నాకు వింతగా తోచింది'' అన్నారు నాదియా.

‘‘నేను లోపలకు వెళ్లాను. అక్కడ ఎటువంటి ఫర్నీచర్ లేదు. లివింగ్ రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. కొన్ని పెట్టలమీద టీవీ మాత్రమే ఉంది’’ అని అప్పటి పరిస్థితిని నాదియా గుర్తుచేసుకున్నారు.

వోడ్కా తీసుకుందామని హార్కిన్స్ కోరితే నాదియా తనకు ఆల్కహాల్ వద్దని చెప్పి, డైట్ కోక్‌ స్వయంగా పోసుకున్నారు. అప్పుడే అక్కడ వాతావరణమంతా మారిపోయిందని ఆమె చెప్పారు.

"అతను లోలోపల కోపంతో రగిలిపోయినట్లు అనిపించింది'' అన్నారు.

'నీ గురించి నువ్వెమనుకుంటున్నావు. నీ అంతట నువ్వే డ్రింక్ పోసుకుంటున్నావు' అన్నట్టు తనవైపు చూశాడని చెప్పారు.

"నేను కొంచెం భయపడ్డాను. గ్లాస్ నిండా డ్రింక్ పోసుకోవడంతో కొంచెం నేలపై ఒలికింది''.

అప్పుడు అతడు చూసిన చూపు చాలా వింతగా అనిపించింది. ‘‘నువ్వు చాలా తొందరపాటు మనిషివి. నా వస్తువులంటే నీకు లెక్కలేదు. నువ్వో జోకర్‌వి''అని అతను ఏదేదో అన్నాడని నాదియా చెప్పారు.

దీంతో నేనతనిని ‘‘నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతోంది’’ అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాను.

తరువాత "నేవెళ్లిపోతున్నాను'' అన్నాను. దాంతో ఇక బయల్దేరు అన్నట్టుగా తలుపువైపు చూపించాడని నాదియా చెప్పారు.

"అతను నన్నెక్కడో ఫాలో అవుతాడోనని బాగా భయపడ్డాను. బయటకు రాగానే నా కారు ఎక్కి డోర్స్ లాక్ చేసుకున్నాను." అని అన్నారు.

"ఇక అతనితో వ్యవహారం అక్కడితో ముగిసిపోయిందనుకున్నాను కానీ, అది చాలా దారుణంగా మారింది."

"కేవలం 20 నిమిషాలు నేను ఆ వ్యక్తితో గడపడం వల్ల నా జీవితం అస్తవ్యస్తమైందని చెబితే మీరు నమ్మరు’’ అంటారు నాదియా.

నాదియా తిరస్కారంతో హార్కిన్స్ రగిలిపోయాడు. నాదియాకు వరుసగా ఫోన్ కాల్స్ చేయడం, మెస్సేజ్‌లతో వేధించడం మొదలుపెట్టాడు.

"నాలాంటివాడితో డేట్ మధ్యలోనే వదిలేసి వెళ్లడానికి నీకెంత ధైర్యం?" అని హార్కిన్స్ నుంచి తనకు మొదటి మెసేజ్ వచ్చిందని నాదియా గుర్తు చేసుకున్నారు.

ఇక అప్పటి నుంచి గంటల వ్యవధిలోనే అతడి వ్యవహారం క్రూరంగా మారిపోయిందన్నారు.

తన ఇంటిపై పెట్రోల్ బాంబ్ వేస్తానని, తనను, తన తండ్రిని చంపుతానని బెదిరించాడని ఆమె చెప్పారు.

తన రూపాన్ని, వస్త్రధారణను కించపరిచేలా అతను చాలా మెసేజ్‌లు పంపాడని గుర్తుచేసుకున్నారు.

ఈ పరిణామాలు నాదియా ఆత్మాభిమానాన్ని తీసేలా ప్రభావం చూపాయి. తన జీవితంలోని ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడ్డానికి ఆమె తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

"నేనో బలిసిన ఆవులా ఉంటానని మెసేజ్‌లు పంపేవాడు" అన్నారు.

"నేనొక క్యాట్‌ఫిష్ నని, పందిలా ఉంటానని, బాగా మేకప్ వేసుకుంటానని మెసేజ్‌లు పంపేవాడు. ఇవి రాత్రంగా కొనసాగేవి. వీటితో ఏడ్చి, ఏడ్చి నాకు తలనొప్పి వచ్చేది. ఉదయం 6గంటలకు కూడా అతను తిడుతూ మెసేజ్‌లు పంపేవాడు" అని నాదియా చెప్పారు.

"నేను అద్దంలో చూసుకున్నట్లు గుర్తుంది, నా మీద నాకే సిగ్గు అనిపించింది.''

"నేను బరువు తగ్గానని, జిమ్‌కు వెళ్తున్నాని కూడా అతనికి తెలుసు."

"నేను ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటానో , అప్పుడే అతను నా నుంచి ఆ సంతోషాన్ని లాక్కున్నాడు'' అని నాదియా చెప్పారు.

నాదియా

పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే...

డేటింగ్ ముగించిన మర్నాడే, హార్కిన్స్ బెదిరింపులు, వేధింపుల గురించి స్కాట్లాండ్‌ పోలీసులకు నాదియా ఫిర్యాదు చేశారు. హార్కిన్స్ ఫోన్ కాల్ రికార్డింగ్‌ను కూడా వారికి ఆమె వినిపించారు. అందులో నాదియా ఇంటికి వచ్చి, ఆమె తండ్రిని బయటకు ఈడ్చి కొడతానంటూ హార్కిన్స్ చెప్పినట్టుగా ఉంది.

‘‘ఇందులో చేయడానికి ఏమీలేదని’’ పోలీసులు చెప్పారని నాదియా తెలిపారు.

‘‘అతనేమీ ప్రత్యక్షంగా బెదిరించలేదు. అతను ఎప్పుడైనా ఏమైనా చేస్తే మా వద్దకు రండి’’ అని పోలీసులు తెలిపారని ఆమె చెప్పారు.

''నా వాంగ్మూలం కూడా తీసుకోలేదు. వాళ్లు నాకు సాయం చేయాలనుకోవట్లేదు. 'నేను దీన్ని భరించలేను, అతను నన్ను ఎలా బెదిరిస్తున్నాడో, అతను ఏం చేయగలడో మీకు తెలియట్లేదు'' అని తాను వారి వద్ద గట్టిగా అరిచానని చెప్పారు.

"వాళ్లు అప్పుడే స్పందించి ఏదైనా చేసి ఉంటే, నా తర్వాత చాలామంది అమ్మాయిలకు అతని వల్ల ఎలాంటి అపాయం జరిగి ఉండేది కాదు" అన్నారు.

తర్వాత చాలా రోజుల పాటు హార్కిన్స్ ఈ వేధింపులు కొనసాగించాడు.

హార్కిన్స్ ఫోన్ నంబర్‌ను నాదియా బ్లాక్ చేశారు. ఏడాదికిపైగా గడిచిన తర్వాత కూడా అతను సోషల్ మీడియాలో నాదియాకు తెలిసినవారిని సంప్రదిస్తూ ఆమెను వేధిస్తూనే ఉన్నాడు.

"అతను నన్ను ఎంతటి మానసిక క్షోభలోకు గురిచేశాడంటే , నాకే గనుక ఓ బిడ్డ లేకపోయి ఉంటే అప్పుడే నా జీవితాన్ని అర్ధంతరంగా ముగించేదాన్ని'' అని నాదియా చెప్పారు.

పది మంది మహిళలపై శారీరక, లైంగిక హింస సహా 19 నేరాలకు పాల్పడిన హార్కిన్స్ ప్రస్తుతం 12 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.

నాదియాకు బెదిరింపులు, వేధింపులు, ఆమె కుటుంబాన్ని బెదిరించడంపై పోలీసులు హార్కిన్స్‌పై మొదట అభియోగాలు నమోదు చేశారు.

మహిళలతో హాలీడే స్కామ్‌లు, నకిలీ పెట్టుబడి పథకాలు, వారి గుర్తింపును ఉపయోగించి బ్యాంకు లోన్లు తీసుకోవడం ద్వారా 2,14,000 పౌండ్లు (దాదాపు రూ.2.50 కోట్లు) దోచుకున్న వ్యవహారంలో హార్కిన్స్ నేరాన్ని అంగీకరించాడు.

హార్కిన్స్

ఫొటో సోర్స్, Police Scotland

ఫొటో క్యాప్షన్, హార్కిన్స్

హార్కిన్స్ నేరాల గుట్టు రట్టు...

హార్కిన్స్ నేరాల గురించి పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

గతంలో నాదియా సహా హార్కిన్స్ గురించి ఫిర్యాదులు చేసిన వారిని తిరిగి పోలీసులు సంప్రదించారు. ఈసారి వారి నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు.

హార్కిన్స్‌పై 2024లో విచారణ జరిగింది.

హార్కిన్స్‌తో డేట్ తర్వాత రెండు నెలలకే ఓ మహిళపై అతను అత్యాచారం చేశాడనే ఘటన గురించి చదివి, అతను ఎంతటి క్రూరుడో అర్థం చేసుకున్నానని నాదియా చెప్పారు.

హార్కిన్స్ దాదాపు 70,000 పౌండ్లు (సుమారు రూ.81 లక్షల) మేర మోసాలకు పాల్పడినట్లు బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది.

అతను కనీసం 30 మంది మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడని బీబీసీ తెలుసుకుంది.

ఈ ఆరోపణల గురించి వివరణ కోసం జైలులో ఉన్న హార్కిన్స్‌కు లేఖ రాశాం, అతని నుంచి స్పందన లేదు.

హార్కిన్స్ కేసు దర్యాప్తుకు స్కాట్లాండ్‌ పోలీసు డీసీఐ లిండ్సే లైర్డ్ నేతృత్వం వహించారు.

హార్కిన్స్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై ముందే ఎందుకు దర్యాప్తు చేపట్టలేదో చెప్పడం కష్టమని ఆమె అన్నారు.

హార్కిన్స్

'సమాధానం చెప్పలేని ప్రశ్న...'

పోలీసులు దర్యాప్తు ప్రారంభించడానికి సంవత్సరాల ముందే తాము భౌతిక దాడులు, లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేశామని పలువురు మహిళలు బీబీసీకి చెప్పారు.

హార్కిన్స్‌పై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన మహిళలకు స్కాట్లాండ్ పోలీసు శాఖ క్షమాపణలు చెబుతుందా? అన్న ప్రశ్నకు డీసై లైర్డ్ స్పందిస్తూ, సమాధానం చెప్పడానికి ఇది చాలా కష్టతరమైన ప్రశ్నగా తాను భావిస్తున్నానన్నారు.

పోలీసులు దర్యాప్తు ఆధారంగానే కోర్టులో విజయవంతమైన ఫలితాలు వచ్చాయని లైర్డ్ వ్యాఖ్యానించారు.

10 మంది మహిళలు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా హార్కిన్స్ ‌కు జైలుశిక్ష పడింది. అతన్ని తొలిసారి అరెస్టు చేసిన దాదాపు ఐదేళ్ల తర్వాత హార్కిన్స్ గత ఏడాది జైలుకు వెళ్లాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)